తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

( కొడైకెనాలు , పెరియార్ అభయారణ్యం )

తమిళనాడు , కేరళ రెండు రాష్ట్రాలలోనూ కలసి సుమారు 925 చదరపు కిలో మీటర్లలో విస్తరించి వుంది యీ అభయారణ్యం .           తేక్కడి గ్రామం పడమటి కనుమలలో వుంది , తేక్కడికి సుమారు ఓ కిలో మీటరు దూరం లో వుంది. ‘ పెరియార్ నేషనల్ పార్కు ‘ . పెరియార్ నేషనల్ పార్కు ‘ పడమటి కనమలలో దక్షిణాన వున్న ‘ కార్డమమ్ మరియు పండలం ‘ కొండల మధ్యన విస్తరించి వుంది . ఈ ప్రదేశం కొడైకెనాల్ నుంచి సుమారు 100 కిలో మీటర్ల దూరంలో వుంది . కొచ్చిన్ నుంచి సుమారు 120 కిలోమీటర్లు , మధురైనుంచి 110 కిలోమీటర్ల దూరం లోనూ వుంది .

ఇది సముద్ర మట్టానికి సుమారు 3000 నుంచి 6000 అడుగుల యెత్తున వుండడం వల్ల ఎండాకాలంలో కూడా చల్లగా వుంటుంది .        పెరియార్ నదీ పరివాహక ప్రాంతంలో యీ అభయారణ్యం వుండటం వల్ల దీనికి పెరియార్ అభయారణ్యంగా నామకరణం చేసేరు . 1930 లో యీ ప్రాంతాన్ని అప్పటి ‘ ట్రేవన్ కోర్ ‘ రాజు తేయాకు పంటను అరికట్టడానికి గాను  ‘ నిజ ఆట స్థలంగా ‘ నిర్ధారించడం జరిగింది . 1950 లో దీనిని జంతు సంరక్షణా కేంద్రంగా నిర్ధారించడం జరిగింది 1978 ప్రాంతాలలో దీనిని అభయారణ్యంగా గుర్తించేరు .

ఈ అరణ్యం తేయాకు , కాఫీ , సుగంధ ద్రవ్యాల పంటకు అనుకూలంగా వుండడంతో యిక్కడ చిన్నచిన్న పల్లెలలో వీటి అమ్మకాలు చాలా యెక్కువగా కనిపిస్తాయి , అలాగే మోసాలు కూడా యెక్కువే . పెరియార్ అభయారణ్యాలు చూడాలంటే ‘ తేక్కడి ‘ గ్రామంలో ప్రవేశించాలి . కొడైకెనాల్ మీదుగా అయితే తమిళనాడులోని ‘ కుమిలి ‘ గ్రామం నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు . కొడైకెనాల్ నుంచి ప్రయాణం అంతా పడమటి కనుమలలో జరుగుతుంది కాబట్టి దారంతా పచ్చటి ఆకులతో సూర్యరశ్మి ప్రవేశించలేంత దట్టమైన అడవి , వర్షాధారమైన సెలయేళ్లు , మధ్య మధ్యలో వచ్చే చిన్నచిన్న పల్లెటూళ్ల మీదుగా సాగుతుంది , అదే కేరళ వైపునుంచి అయితే ఓ పక్క దట్టంగా వున్న అడవి , మరో పక్క టీతోటలు , పోక , వాటికి అల్లుకొని వున్న మిరియం తోటలు , ఏలకుల పంట , లేతనీలంరంగులో వున్న లవంగా మొగ్గలతో నిండివున్న లవంగా చెట్ల మధ్యనుంచి సాగుతుంది ప్రయాణం . ఏవైపునుంచయినా ప్రయాణం చాలా అహ్లాదకరంగా వుంటుందేనది కాదనలేని నిజం . తేక్కడి కొండలలో వున్న చిన్న గ్రామమనే చెప్పుకోవాలి , ఐతే యిప్పుడు పెరిగిన పర్యాటకుల రద్దీ వల్ల హోటల్స్ అవీ ముందుగా బుక్ చేసుకోవాలి , లేకపోతే యిబ్బందులు తప్పవు .

ఈ ప్రయాణం పెట్టుకొనే ముందర ఆన్లైనులో పెరియార్ బోటు ప్రయాణం , హోటలు బుకింగులు చేయించుకుంటే మంచిది . ప్రతీ పర్యాటకుడూ పెరియార్ సరస్సు లో బోటు ప్రయాణం చేసితీరాలనేది నా సలహా . ఇది గంటలలెక్కలో ప్రభుత్వం వారిచే నడపబడుతోంది . ఎందుకంటే మరే మాధ్యమాలలో వెళ్లినా మనం జంతువులను చూడలేం , బోటులో అయితే నీటికోసం యీ సరస్సుకి వచ్చే జంతువులను చూడగలం . మనం నీటి మధ్య బోటులో వుంటాం , జంతువులు ఒడ్డున విహరిస్తూ మనకి కనిపిస్తాయి . మేం వెళ్లినప్పుడు ఎలుగుబంట్లు , కోతులు , యేనుగుల గుంపులు , నీటి పక్షులు , సరస్సులోని నీటి పాములను చూసేం . అడవి యేనుగుల గుంపులను వాటి అలవాట్లను పరిశీలించగలిగేంత సమయం అవి సరస్సుకి దగ్గరగా విహరించడం వల్ల కలిగింది . ఏనుగుల జలకాలాటలు చాలా ముచ్చటగా అనిపించేయి . జింకలు గుంపులు గుంపులుగా వచ్చి బెదురుగా నీళ్లను తాగి అడవిలోకి పారిపోవడం చూసి చాలా ఆనందం పొందేం , అవతల ఒడ్డున అడవిలో అడవి దున్నలు గుంపులుగా గడ్డి మేస్తున్న దృష్యం యిప్పటికీ చాలా తాజా జ్ఞాపకం.

తరవాత జీపులో వెళ్లేంగాని యిలాంటి దృష్యాలు యేవీ యెదురవలేదు . ఎక్కడో చెట్లమీద గంతులేస్తున్న నల్లమూతికోతులు మాత్రం కనిపించేయి .

జీపులో యీకొండలను చూడడం ఓ అనుభూతని మాత్రం చెప్పగలను , చాలా కొండలు పొడవాటి గడ్డి దుబ్బులతో నిండివుండడం ఆశ్చర్యాన్ని కలిగించింది , ఓపెన్ జీపులో వెడుతుంటే ఆఅడవిలో యేదో మత్తైన వాసన , ఆ పొడవుగా వున్నది నిమ్మగడ్డి అని తెలియగానే చాలా అనందం కలిగింది . ఎక్కడపడితే అక్కడ రోడ్డుమీద పెట్టి అమ్ముతున్న వట్టివేళ్లు , అలాంటి యింకా యెన్నెన్నో మూలికలు , కొన్ని మూలికలకు నీటిని శుభ్రపరిచే గుణం వుందట , కేరళ వైపున వున్న యీ అడవిలోనూ అలాగే మున్నారు ప్రాంతపు అడవులలోనూ లభ్యమయే వేరు నీటిలో వేసుకొంటే నీరు లేత రాణిరంగులోకి మారుతాయి , వాటిని తాగడం చాలా ఆరోగ్యకరం అంటారు . ఆ నీరు బాటిళ్లలో అమ్మడం కనిపిస్తుంది .

పెరియార్ సరస్సు మానవనిర్మితమైన సరస్సు . పెరియార్ నదిపైన కట్టిన ముల్లపెరియార్ ఆనకట్ట వల్ల యేర్పడ్డ సరస్సు . ఈ సరస్సులో స్పీడుబోటు పైన ప్రయాణం , రాఫ్టింగు లాంటి ఎడ్వంచరస్ వాటర్ సోర్ట్స్ కూడా వున్నాయి .

అలాగే తేక్కడినుంచి చుట్టుపక్కల వున్న సైస్ గార్డెన్ , కాఫీ , టీ తోటల టూర్లు కూడా వున్నాయి , అలాగే ‘ పట్టుమలై ‘ కొండల టూరు కూడా వుంది . పట్టుమలై అంటే పట్టుకొండలు అని అర్దం . వీటిపైన వుండే టీ తోటలపెంపకం యిక్కడ పేరుపొందింది . టీ తయారీ కంపెనీలుకూడా వున్నాయి . ఇక్కడ పండే టీ చాలా మంచిదని అంటారు , నీలగిరి చెట్లమధ్యలో పెంచిన టీ తోటలు కాబట్టి నీలగిరిలో వుండే వ్యాధినిరోధక తత్వాలు యిందులోకూడా వుంటాయని అంటారు .

తేక్కడిలో ‘ పెరియార్ సరస్సులో బోటు షికారు యెంతముఖ్యమో జీపు సఫారి కూడా అంతే ముఖ్యం . ఇదీ గంటల లెక్కలోనే మాట్లాడుకోవాలి . ప్రొద్దుట ఆరుగంటలలోపున బయలు దేరితే ప్రకృతిలోని తాజా దనాన్ని ఆస్వాదించవచ్చు . అలాగే లేత సూర్యకిరణాలలోని వెచ్చదనం గాలిలో తేలివచ్చే పరిమళం , కేరళ పల్లెలో జలపాతం వొడ్డున మొగ్గలతో నిండిన లవంగ చెట్టుకింద తాగే టీ లేక కాఫీ , ఓహ్ అదో మాటలకందని అనిభూతి . ఆ కొండలమీద యెన్నో ఫొటో పాయింట్లు , అక్కడ తీసుకొనే ఫొటోలు అధ్బుతమే . ఏ కాలంలో వెళ్లినా ఓ స్వెటరో , షాలో బేగులో వేసుకోడం మరచిపోకండి .

తేక్కడిలో కేరళ నాట్యమైన ‘ కధాకళి ‘ ని ప్రదర్శించే థియేటర్లు అలాగే కేరళ మార్షల్ ఆర్టు ప్రదర్శించే థియేటర్లు కూడా వున్నాయి . అయితే ప్రతీచోటా బేరాలు తప్పనిసరి .కొడైకెనాలు వెళ్లే పర్యాటకులు యీ తేక్కడి కూడా కలిపి పెట్టుకుంటే ఓ మంచి జ్ఞాపకాన్ని వెంటబెట్టుకు వస్తారనేది నిజం .కొడైకెనాలు నుండి వెళ్లగలిగే మరో ప్రదేశం పళని .పళని మనదేశంలో వున్న ముఖ్యమైన ఆరు కుమారస్వామి మందిరాలలో ఒకటి . ఈ మందిరం కొండమీద వుండడం తో పైకి చేరేందుకు నడకదారి మరియు రోప్ వే వున్నాయి . మేం 2009 లో వెళ్లినప్పుడు కొండపైకి వెళ్లడానికి కొండరైలు అని పిలువబడుతూ రెండు కంపార్టుమెంట్స్ పుల్లీలతో లాగబడేవి వుండేవి , ఆ ప్రయాణం అదో సరదాగా వుండేది . అప్పట్లో వేచివుండే సమయం యెక్కువగా వుండేది .

రోప్ వే వచ్చిన తరువాత పైకి చేరుకోడం చాలా సులువైంది .ఇప్పుడు పళని వూరు బాగా పెరిగింది సర్వసదుపాయాలూ అందుబాటులోకి వచ్చేయి . 20 ఏళ్ల కిందట మధురై లో వుండి పళని వెళ్లి దర్శనం చేసుకొని వచ్చేవారం , ఇప్పుడు వూరంతా చాలా కొత్తగా హోటల్స్ అవీ చాలా వచ్చేయి . అలాగే కోవెలలో కూడా చాలా మార్పులు చేర్పులు వచ్చేయి . రోప్ వే దిగిన తరువాత కోవెలలో పై అంతస్థులు చేరుకోడానికి లిఫ్టు సౌకర్యం కూడా వచ్చింది . ముఖ్య మందిరం లో మురుగన్ , ఉప మందిరాలలో వినాయకుడు , పార్వతీ పరమేశ్వరులను చూడొచ్చు . మందిరం నేలంతా పాలరాతి తాపడం చేయించేరు . రంగురంగుల గోపురాలు చూడచక్కగా వున్నాయి . తైపూసం లో జరిగే జాతర చూడదగ్గది . తైపూసం అప్పుడు భక్తులు ఓ ప్రవాహం లా వస్తారు .

పళని కుమారస్వామి యొక్క ఆరు  ‘ అరుప్పడి వీడు ‘ లలో యిదొకటి . అరుప్పడి వీడు అంటే యుద్దసమయంలో వేసుకెనే గుడారం అన్నమాట , తారకాసురుని సంహరించేటప్పుడు కుమారస్వామి ఆరు ప్రదేశాలలో గుడారాలు వేసుకొని తారకాసురునితో యుధ్దం చేసేడట , అందులో పళని ఒకటి అని అంటారు . స్కంధపురాణం లో యీ విషయం వుంది .

పశని గురించిన మరో కథకూడా వుంది అదేంటో తెలుసుకుందాం .

ఓ రోజు కైలాశ పర్వతం మీద శివుడు తనపరివారంతో కొలువైవుండగా నారద మహర్షి ఓ ఫలాన్ని తీసుకొని వచ్చి అది జ్ఞాన ఫలమని దానిని అతని పుతృలకి యివ్వమని , కాని దానిని ఖండించరాదనే షరతుతో శివునికి యిస్తాడు . శివుడు వినాయకుడు , కుమారస్వాములలో యెవరు అర్హతగలవారో నిర్ణయించుకోలేక యెవరైతే ముందుగా ముల్లోకాలను చుట్టి వస్తారో వారికే ఆఫలం యివ్వబడుతుందని చెప్తాడు . కుమారస్వామి తన నెమలి వాహనం పై ముల్లోకాలను చుట్టబెట్టిరాగా అప్పటికే తల్లితండ్రులనే ముల్లోకాలుగా భావించుకొని వారికి ప్రదక్షిణ చేసుకుని వినాయకుడు వస్తాడు . తల్లితండ్రుల ప్రదక్షిణ చేసుకున్న వినాయకునే విజేతగా ప్రకటిస్తారు దేవతలు , వినాయకునకు జ్ఞానఫలం దక్కుతుంది . దానికి కోపించిన కార్తికేయుడు అలిగి పళని చేరుకుంటాడు . కోపం తీరిన తరువాత తన అజ్ఞానానికి చింతించి జ్ఞానంకోసం తపస్సు చేసుకుంటాడు .

పళని గురించిన మిగతా వివరాలు వచ్చే సంచికలో చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు