మన ఘన సంస్కృతి..ఉగాది
మన గోతెలుగు బృందానికి, పాఠకగణానికి శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు!
మీరొకటి గమనించారో లేదో ఉగాది మనకు కొత్త సంవత్సర ప్రారంభం కదా! ఇంగ్లీషు సంవత్సరారంభానికి మనం కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటారు, మరి మన ఉగాదికి అలా అనుకోరెందుకు? ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడే అంకురార్పణ జరిగిపోతుంది. మనమనుకున్నపుడే మంచి సమయం కాబట్టి సంకల్పబలానికి దైవ బలం తోడై సత్ఫలితాలు సాధిస్తాం.
అలాగే ఆంగ్ల సంవత్సరాదికి ముందురోజు అర్థరాత్రి కేక్ కట్ చేసి కూల్ డ్రింక్ లు తాగుతూ కేరింతలు కొడతారు. కొండొకచో వీరంగాలు చేస్తూ, వెర్రిమొర్రి వేషాలూ వేస్తారు. పోలీసులు, జనం రోడ్ల మీద హద్దుమీరకుండా హెచ్చరికలు జారీ చేస్తారు.
మన ఉగాది అలా కాదు ఘనమైన మన సంస్కృతికి, విలువైన సంప్రదాయానికి ప్రతీక. తెల్లవారుఝామునే లేచి తలంటుకుని కొత్తబట్టలు వేసుకుని గుడికెళ్లి స్వామి దర్శనం చేసుకుని, ఉగాదిపచ్చడి ప్రసాదం (కేక్ ఒక్క తీపే, ఉగాది పచ్చడి జీవితంలోని అన్ని రుచుల మేళవింపు. మనం సుఖానికి పొంగిపోం. దుఖానికి కుంగిపోం. అన్నింటిని సమాదరిస్తాం. ఎంతగొప్ప జీవిత సత్యాన్ని పండగపేర ఆకళింపు చేసుకున్నామో కద) తిని, పంచాంగ శ్రవణం విని రాబోయే జీవిత ప్రయాణంలోని ఒడిదుడుకులను ముందుగానే తెలుసుకుని ఎదుర్కోడానికి సన్నద్ధులమవుతాం.
హాయ్..హలోలతో సాగే పాశ్చాత్య అనుకరణ జీవన విధానం అరువుతెచ్చుకున్నది. అది ఎప్పుడైనా చేటే! మన సంప్రదాయంలోని ఔన్నత్యాన్ని గనక అర్థమయ్యేలా చెబితే, దాన్ని ఎవరైనా ఆపోశన పట్టడం ఖాయం. అంత గొప్ప విలువలు, మూలాలు కలిగిన సంస్కృతి మనది.
అన్ని కాలాళ్ళాంటిదే చైత్రం అనుకోం. ప్రకృతి జీవం పోసుకుని కళ కళ్ళాడుతోందని కవితలు రాసుకుంటాం, పాటలు పాడుకుంటాం. కోకిల కూజితాన్ని కేవలం పక్షి అరుపని సరిపుచ్చుకోం, అది చైత్రమాస స్వాగతగీతిక అనుకుంటాం. మామిడాకులు అన్ని ఆకుల్లాంటివికావు, గుమ్మాలకి కడితే శుభానికి ఆహ్వానం అని నమ్ముతాం. చెట్లకి గుత్తులుగుత్తులుగా వేళ్లాడే మామిడి పిందెలను చూసి, అన్ని చెట్లకి కాచినట్టె ఆ చెట్టుకీ కాయ కాచిందని సరిపెట్టుకోం, మురిసిపోతాం. ఉగాది పచ్చడిలో వేసుకుని రుచికి మైమరచిపోతాం. మన జీవితానికి యాంత్రిక జీవన విధానం ఒక పార్శ్వమైతే, జీవం పోసుకున్న జీవన విధానం మరో పార్శ్వం. దాన్ని పునశ్చరణ గావిస్తుంటాయి మన పండగలు.
మన నడవడిక, ప్రవర్తన మనను లోకానికి మంచిగానో చెడ్డగానో మనల్నిపరిచయం చేస్తుంది. మన ప్రతి పండగకు మనను తీర్చి దిద్దడమే లక్ష్యం. అందుకే పెద్దలను గౌరవించి, ఒంగి పాద నమస్కారాలు చేసి ఆశీర్వాదాలు పొందుతాం.
మన దేశంలో పుట్టడం కేవలం యాదృచ్ఛికం కాదు. అది గత జన్మలో మనం ప్రోది చేసుకున్న పుణ్య ఫలం. మంచి సంప్రదాయంలో ఉంటే మంచిగానే ఉంటాం. మనీషిగా మన్ననలందుతాం. గంగలో ఏ నీరు కలిసినా గంగనీరే! తప్పుడు మార్గం పట్టకుండా, శ్రేయోమార్గంలో సంచరిస్తూ, ఈ జన్మలో మరింత పుణ్యం సంపాదించుకుని మోక్షమార్గంలో భగవంతుణ్ని చేరతాం. ఇది సత్యం.
***