చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

ఒకానొకప్పుడు , వివిధరంగాల్లో జరుగుతూన్న అభ్యంతరకరమైన విషయాల గురించి, మరీ బహిరంగంగా చెప్పుకునేవారు కారు. ఆడవారిమీద జరిగే అత్యాచారాలైతే మరీనూ..   అంతదాకా ఎందుకూ, పోలీసులకి కూడా తెలియనిచ్చేవారు కాదు..కారణాలు అనేకం. కేసువిషయంలో  చాలామందికి చేదు అనుభవాలుకూడా ఉండేవి. ఏదో చేతులో డబ్బున్నవారి విషయం వేరు. వారికున్న పలుకుబడితో విషయం చక్కబరుచుకునేవారు. పైగా సంఘంలో ఉన్న పెద్దపేరు పాడవుతుంది. వచ్చిన సమస్య,  సామాన్య ప్రజానీకానికే. మరో విషయం—స్త్రీమీద అత్యాచారం సాధారణంగా, ఏ తెలిసినవారో, లేక ఏ కుటుంబసభ్యుల ద్వారానో జరగడానికే ఎక్కువ అవకాశాలు. ఇంటిగుట్టు రచ్చకెక్కించడమెందుకూ అనో ఫీలింగ్ కూడా ఓ కారణ విషయం  బయటకు రాకపోవడానికి..  అందౌకనే ఏమో, పోలీసు రికార్డుల్లో ప్రతీ ఏడాదీ, స్త్రీలమీద అత్యాచారాల గణాంకాలు తగ్గుతున్నాయీ అని పేపర్లలో చూస్తూంటాము. చెప్పొచ్చేదేమిటంటే, నేరాలు తగ్గలేదు, జరిగినా వాటిని నమోదుచేయడం తగ్గిందంతే.

ఈ అత్యాచారాలకి కారణాలు అనేకం ఉన్నాయి.. కొంతమంది మేధావులు.. అసలు ఇవన్నీ సెక్స్ గురించి తెలికపోవడమే ముఖ్యకారణ మంటారు.. దానితో స్కూళ్ళలో పాఠాలద్వారా విషయాన్ని సమగ్రంగా తెలియచేయడానికి ప్రయత్నాలు మొదలెట్టేసారు కూడా.. అయినా ఓవైపు అంతర్జాలంలో అన్నివిషయాలూ కూలంకషంగా తెలుస్తూన్నప్పుడు, స్కూళ్ళలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల కలిగే ప్రయోజనమేమిటో ? ఇదివరకటి రోజుల్లో, పరిస్థితులు మరీ ఇంత దిగజారిపోయి ఉండేవి కావు. అలాగని ఆరోజుల్లో మగపిల్లల్లో ఆ హార్మోనులేవో లేనట్టూ కాదు,  ఇంట్లో పెంపకం ప్రభావం ఎక్కువగా ఉండేది…  విషయాలు తెలుసుకోడానికి, సాధనాలూ తక్కువే.. పెద్దవారు చెప్పిందేదో వినడమే. ఒకలా చెప్పాలంటే, ఆరోజుల్లో మగపిల్లలు, ఎక్కడో  ఒకటీ అరా తప్పించి, “ రాముడు మంచిబాలుడు “ లాగానే పెరిగారు. అలాగని ఈ రోజుల్లో మరీ బరితెగించారని కాదూ, కానీ నూటిలో ఓ అయిదారుగురు చేసే దరిద్రప్పనుల ధర్మమా అని, వయసులో ఉన్న మగపిల్లలందరూ అలాగే ఉంటారనుకోవడమూ భావ్యం కాదుగా…

పూర్వపురోజుల్లో సినిమా రంగంలో జరిగే కొన్ని   నటీనటుల మధ్య కొనసాగే సంబంధాలు, ప్రత్యేకంగా అనైతికమైనవి, ప్రజలకి తెలిసే అవకాశాలు బహుతక్కువగా ఉండేవి. కారణం—ఆరోజుల్లో ప్రసారమాధ్యమాలు తక్కువగా ఉండడం. అయినప్పటికీ, కొందరు జర్నలిస్టులు మరీ పేర్లు  బహిరంగంగా వెల్లడించకపోయినా, సమాచారం మాత్రం రాసేవారు. ఆరోజుల్లో “ హిందూనేసన్” అని ఓ పత్రిక ఉండేది..ప్రత్యేకంగా సినిమారంగంలో జరిగేవిషయాలు, అంటే ఎవరెవరితో తిరుగుతున్నారో వగైరా రాసేవారు. తరవాతి కాలంలో ప్రముఖపత్రికలు కూడా  Gossip Column  అనే పేరుతో రాసేవారు. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే  ఇలాటి వ్యవహారాలు ఆరోజుల్లోనూ ఉండేవి, కానీ  publicity  తక్కువ.

 21 వ శతాబ్దం వచ్చేసరికి, పారదర్శకం (  Transparency)  పేరుతో విషయాలన్నీ బయట పడుతున్నాయి. ఎవరి పలుకుబడినిబట్టి వారివీ. ఉదాహరణకి ఫలానా నటి/నటుడు మీదో ఏ పత్రికలోనైనా రాయడం జరిగితే, “ పరువునష్టం దావా “ వేస్తామని బెదిరించడం. రెండు పార్టీలకీ తెలుసు , కోర్టుల్లో వ్యవహారాలు తేలేసరికి, ఇద్దరూ బతికుండరని. ఏదో కాలక్షేపానికి బురద జల్లుకోవడం అంతే.

 ఎలాగూ వాక్సాతంత్రం ఉండనే ఉంది, ఆమధ్యనెప్పుడో, ఓ తెలుగు సినిమానటి, బహిరంగంగా నిరసనవ్రతం పట్టేసింది. విషయమేమిటని విచారించగా తేలిందేమిటంటే, తనకు సినిమాల్లో ఛాన్సులివ్వడానికి, సినిమారంగంలో ఉండే పెద్దలు తనని ఎలా వాడుకున్నారో వగైరాలన్నీ చెప్పింది.  ఏ ఒక్క ప్రముఖుడినీ వదల్లేదు.. కావాల్సొస్తే  విడియో ఋజువులుకూడా చూపిస్తాననడంతో మీడియాలో ఓ పేద్ద హడావిడి అయింది.. చివరకి తేలిందేమీలేదు…  ఈ అమ్మాయిని చూసి మరికొందరుకూడా ..” అవునూ మాకూ అలాగే అయిందీ… “ అన్నారు. నిజానిజాలు వాళ్ళకే తెలియాలి…

సరే ఎవరో మొదలెట్టారు కదా అని, కొంచం గ్లామరస్ గా ఉండాలని కొందరైతే  Twitter  బాట పట్టి  అదేదో  # Me Too  అని మొదలెట్టారు.  పత్రిక, సినిమా రంగాల్లో ఉండే కొంతమంది ప్రముఖులని వీధిన పెట్టారు. అంతర్జాలమంతా వీటితోనే నిండిపోయింది. నూటికి 90 పాళ్ళు, స్త్రీలే తమకి వివిధసందర్భాల్లో అదీ రెండు మూడేళ్ళక్రితం జరిగిన harassment  ల గురించి రాసారు. మీడియాలో ఒక్కోసారి ఒక్కో రకమైన “ హవా” నడుస్తూంటుంది, ఇదీ అలాటిదే అని కొట్టిపారేసారు. అలాగని  ఈ ఆరోపణల్లో నిజం లేదనడానికీ లేదూ…అప్పుడెప్పుడో ఓ సినిమా వచ్చింది, అందులో ఒక స్త్రీ పగబట్టి, ఓ పురుషుడిని కోర్టుకి ఈడుస్తుంది, చివరకి ఈ మొగాడి భార్యే ఇతన్ని రక్షిస్తుంది. పోదురూ అది సినిమా, ఎలాటికథలైనా రాస్తారూ అంటారు. అలాగని కొట్టిపారేస్తే ఎలా కుదురుతుందీ? ఏమో స్త్రీలలో కూడా ఉండొచ్చేమో… ఇప్పటిదాకా ఏ పురుషుడూ  # METOO  లో మాత్రం  వచ్చినట్టులేదు….

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు