అడుగడుగున గుడి ఉంది. అందరిలో గుడి ఉంది.ఈ వాక్యం శ్తీ సీతారామచంద్రస్వామి విషయంలో వాస్తవం. ఇంటికి ఏ ఇలవేలుపు అన్నా ఉండొచ్చుకాని అందరికీ ఆరాధ్య దైవం మాత్రం శ్రీరామచంద్రుడే! ఆయన నడిచిన బాట 'రామాయణం'. ఏ క్షణాన వాల్మీకి మహర్షి ఆ ఉత్కృష్ట రచనకు పూనుకున్నాడో గాని ఆబాలగోపాలం మనసులో చెరగని ముద్రవేసింది.
శ్రీ సీతారామ కల్యాణం అంటే మనకు మొన్నటి దాకా భద్రచల స్వాములవారి కల్యాణమే గుర్తుకొచ్చేది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా నలుమూలనుంచీ భక్త జనులంతా తరలివచ్చి, ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసి, చూచు వారలకు చూడ ముచ్చటగా, అంగరంగ వైభవంగా ఆ ఇద్దరికీ పెళ్లి చేసి ఓ పెద్ద బాధ్యత తీరిందని మురిసిపోయేవారు. కల్యాణాక్షతలు ఆ దంపతుల మీద జల్లి, ఇంటికి వస్తూ వస్తూ స్వామివారి అక్షతలు తెచ్చుకునేవారు.
రాష్ట్రాలు విడిపోయినప్పుడు భద్రాచలం తెలంగాణకి వెళ్లిపోతే ఒంటిమిట్ట ఆంధ్రకు చేరువయింది. అప్పటిదాకా ఆలయ ఉద్ధరణకు చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఎంతో కృషి చేశారు కాని తర్వాత అంత ప్రాధాన్యత పొందలేదనే చెప్పాలి. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రానికి చారిత్రక ప్రాధాణ్యత ఉన్న ఒంటిమిట్ట కల్యాణానికి వేదికైందో ఇహ అందరి చూపుల్లో, నోళ్ళలో ఆలయం పేరు మారుమోగిపోయింది.
కడపకి 25 కి.మీ.దూరంలో ఉండే ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు. స్థల పురాణంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ, విశ్వామిత్రునితో శ్రీ రామచంద్రులవారు యజ్ఞ సంరక్షణార్థం ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నదే ప్రముఖమైనది. ఇందులోని శ్రీ సీతా రామ లక్ష్మణ మూర్తులను జాంబవంతుడు ఏకశిలపై చెక్కించి ప్రతిష్టించాడని ఒక కథనం. పోతనామాత్యుడు భగవతాన్ని రచించింది ఇక్కడే! ఆయన విగ్రహాన్ని కూడా మనం నిజమూర్తులను చూడడానికి వెళ్ళే ముందు చూడొచ్చు.
శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయుడి పరిచయం జరగక మునుపే ఇక్కడ నిజమూర్తుల ప్రతిష్ట జరిగినందువల్ల ఇక్కడ ఆంజనేయుడికి చోటు దక్కలేదు.
అప్పటి శిల్ప నిర్మాణ ఛాతుర్యం మనల్ని ఔరా అనిపించక మనదు. లోపలి విగ్రహలను చూస్తే తనువూ మనసూ పులకించిపోవడం ఖాయం. ఇక్కడ భద్రాచలంలోలా కల్యాణం మధ్యాహ్నం అభిజిత్ లగ్న సమయంలో కాకుండా పౌర్ణమి నాటి రాత్రి జరుపుతారు. శ్రీసీతాసమేత రామచంద్రుణ్ని హాయిగా చల్లని వెన్నెల వేళ దర్శనం చేసుకోవచ్చు. ప్రతినెలా పౌర్ణమి రోజున కూడా కల్యాణం నిర్వహిస్తారు.
ఒంటిమిట్టలోని మహిమాన్విత కోదండరాముణ్ని దర్శించడం అంటే, జన్మ చరితార్థమే!
పాఠకులకు శ్రీరామనవమి శుభకాంక్షలు!
***