తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణాలో లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరగగా, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభకూ, అసెంబ్లీకీ ఒకేసారి పోలింగ్ జరిగింది. తెలంగాణాతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ హీట్ ఎక్కువగా కనిపించింది. ప్రధానంగా ఈ సారి కుర్రాళ్ల సందడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీల తరపున యాక్టివ్‌గా ఉండడమే కాకుండా, ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలోనూ యువత తమ సత్తా చాటింది. రాజకీయ వ్యూహాలు రచించడంలో తల పండిన రాజకీయ నాయకుల్ని మించి యువత తమ పదునైన వ్యూహాలతో ప్రచారాన్ని రక్తి కట్టించడం చూశాం. సరికొత్త పద్దతుల్లో యువత నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఆయా రాజకీయ పార్టీలకు బాగానే కలిసొచ్చింది.
ఒకప్పుడు ఎన్నికలంటే తమకేమీ సంబంధం లేదనుకునే యువత ఇప్పుడు మాత్రం అది మా బాధ్యత అని ముందుకొచ్చింది. రాజకీయ పార్టీల తరపున ప్రచారానికి మాత్రమే పరిమితమవ్వలేదు యువత. పోలింగ్ విషయంలోనూ యువత చూపించిన శ్రద్ధకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పోలింగ్ కోసం హైద్రాబాద్, బెంగుళూర్, చెన్నై తదితర పొరుగు రాష్ట్రాల రాజధాని నుండే కాక, విదేశాల నుండి కూడా యువత స్వరాష్ట్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందించదగ్గ విషయం. ఇంతలా యువత ఎన్నికల పట్ల ఆశక్తి చూపడానికి చాలా కారణాలున్నాయి. 'భవిష్యత్తు మాదే' అన్న భావన ఈ సారి యువతలో ప్రస్ఫుటంగా కనిపించింది. సరదాగా ఫ్రెండ్స్ మధ్య కూర్చొని రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం, ప్రస్తుత రాజకీయాలపై అసహనం వ్యక్తం చేయడం.. ఇంతేనా.? అన్న ఆలోచన యువతను రాజకీయాల వైపు కదిలించింది.
సమాజంలో తామూ భాగమని మాత్రమే కాకుండా రేపటి భవిష్యత్ భారతాన్ని నడిపించాల్సింది తామే కనుక ఇప్పుడే బాధ్యత భుజాన వేసుకోవాలని యువత అనుకోవడం శుభపరిణామం. సోషల్ మీడియా వేదికగా చిల్లరగాళ్లు చేసే వల్గర్ కామెంట్స్‌ని పక్కన పెడితే, బూతు లెవల్ నుండి పరిస్థితుల్ని అంచనా వేసి రాజకీయా పార్టీలకు సహాయ సహకారాల్ని అందించడం ఓటర్లలో చైతన్యాన్ని పెంచడం ఒకటేమిటి.. ఈ సారి ఎన్నికల సందర్భంగా యువత పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఇదివరకూ యువత భాగస్వామ్యం పోలింగ్‌లో చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడది ఆహ్వానించదగ్గ రీతిలో పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఆకాశంలో సగం అన్నింటా సగం అవును.. అమ్మాయిలం మేముందులోనూ తక్కువ కాదంటూ అబ్బాయిలతో సమానంగా, ఆ మాటకొస్తే, ఇంకాస్త ఎక్కువగానే అమ్మాయిలు ఎన్నికల్లో సత్తా చాటారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన రాజకీయ పార్టీలు ఈ సారి యువతకు చెప్పుకోదగ్గ రీతిలోనే టికెట్టు కూడా కేటాయించడం గమనార్హం.