ఆధ్యాత్మికత!
ఆధ్యాత్మికత అంటే ఆత్మవల్ల కలిగినది అని నిఘంటువు అర్థం. జ్ఞానోదయం!
దేవుళ్లను నమ్మేవాళ్లు, పూజలు చేసేవాళ్లు సాధారణంగా అవి ఎవరికోసమో చేస్తున్నట్టు భావిస్తుంటారు. ‘ఇవాళ మా ఇంట్లో పూజుందండి ఆఫీసుకు రావడం కుదరదు’. ‘నేను జన్మ శని/ గురు వారాలు మొక్కుకున్నాను రాత్రి పూట భోజనం చేయకూడదు’. ఇహ శివరాత్రి లాంటి పర్వదినాలు వచ్చాయంటే, ‘ఏంటి మీరు ఉపవాసం, జాగరణ చేస్తున్నారా? మేమైతే చేస్తున్నాం’ ‘రాత్రికి ప్రోగ్రాం ఏంటి?’ ‘ఉపవాసం కదా పళ్లు తెచ్చుకున్నాం’ ఇవీ మామూలే. హనుమాన్ జయంతి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ రామ నవమి, శివరాత్రి వచ్చిందంటే గుళ్ల ముందు చాంతాడంత క్యూలను చూసి తీరాలి. అక్కడ లైన్లో నుంచుని "అబ్బో ఎంత లైనో, ఎప్పటికవుతుందో?’అంటూ నిట్టూర్పులు విడుస్తారు. దైవ దర్శనం కోసం లైనులో నుంచుని కూడా సాధారణ మాటలు, జోక్స్, వెటకారాలు..అసలు అన్ని ఇన్ని కావు.
ఇహ దేవాలయ ప్రాంగణం అంటే వాణిజ్య సముదాయమే! అమ్మేవాళ్లకి, కొనేవాళ్లకి మధ్య వాగ్వివాదాలు..గొడవలు. ప్రశాంతతకొరవడిన ప్రదేశం. కొన్ని దేవాలయాల్లో లోపల పూజారులు కూడా ధనమూలం ఇదం జగత్ అన్నట్టు ప్రవర్తిస్తారు.
అన్నీ/ అంతా తెలుసనుకున్న(?) స్వాములు, సన్యాసులు, తాము సన్యాసం తీసుకోవడం జగతికి ఉపకారం అన్నట్టు ఒకింత గర్వం ప్రదర్శిస్తారు. ఎత్తైన పీఠం మీద కూచుని సుందరమైన ప్రవచనాలు చెబుతుంటారు. పొరబాట్న ఎవరన్నా ఒక ప్రశ్న అడిగారా? ఇహ తాము దేవుడి రిప్రజెంటిటీవుల్లా వింత వింత భంగిమలు ప్రదర్శిస్తూ పురాణాల్లోని విషయాలను సమయస్ఫూర్తిగా ఉదహరిస్తారు. సమానత్వం, సమాదరం తెలియని వాళ్లు స్వాములే కాదు. మతమన్నది భగవంతుడికి దగ్గరయ్యేందుకు కొందరు పెద్దలు కొన్ని నియమ నిబంధనలతో సూచించిన మార్గం. అంతేకాని అదే భగవంతుడు కాదు. ముందు ఇది తెలుసుకోవాలి. మతం లేని వాళ్లు భగవంతుడి ఆదరణకు నోచుకోరా? మతం కాదు మనీషి తత్వం ముఖ్యం.
దైవం అంటే రాగ ద్వేషాలకు అతీతుడు అన్న భావన కలగాలి. భగవానుడికి మన వికారాలు అంటగట్టి, డబ్బులిస్తేనో, ఘనంగా కార్యక్రమాలు చేస్తేనో పొంగిపోయి మన కోర్కెలు తీరుస్తాడనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఆధ్యాత్మికతలో ఆత్మ పరిశుద్ధత/ ప్రక్షాళన జరగాలి. భగవంతుణ్ని కొలవడానికి మనకు కృష్ణా, రామా అనుకునే వయసు రానక్కర్లేదు. అసలు ఆయన ఎప్పుడు దూరంగా ఉన్నాడని? మన మనసులో ఆత్మ రూపంలో కొలువై ఉన్నాడు. ఆయణ్ని దర్శించగలిగితే మనిషిగా మోక్షం పొందినట్టే.
ఆత్మ ప్రమాణంగా చెప్పండి. మనం ఎలా ఉండాలో మనకు తెలీదు. నిజాయితీగా, నిజం చెప్పడం, ఇచ్చిన మాటమీద నిలబడడం, అన్యాయం చేయక పోవడం, అబద్ధం ఆడకపోవడం, మరొకరి సొత్తుకు ఆశ పడడం, స్వార్థం, లంచాలు తీసుకోకపోవడం, సాటి మనిషిపట్ల ఉదారంగా వ్యవహరించడం, సకల జీవరాశిని కనిపెట్టుకుని ఉండడం, మనకు జీవికనిచ్చే ప్రకృతికి చేటు చేయకపోవడం, పెద్దలను గౌరవించడం, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం, దానం చేయడం..ఇవి పాటిస్తే దైవం మానుష రూపం ధరించినట్టేనని పురాణాలు చెబుతాయి. అంతేగాని గుళ్లోకెళ్లిన కాసేపు, ప్రవచనాలు వినే కాసేపు బుద్ధిగా ఉండి బోలెడంత పుణ్యం మన అకౌంట్ లో జమ అయిందని పొంగిపోతే అది ఆధ్యాత్మిక ఆత్మవంచన.
వేలకొద్దీ ధనం హుండీలో వేయడం కాదు దాహార్తులకిన్ని మంచి నీళ్లు, అన్నార్తులకు పిడికెడన్నం పెట్టగలిగితే మనిషి ధన్యజీవే!
తులసి ఆకుతో కృష్ణున్ని సొంతం చేసుకున్న రుక్మిణి, బిలవపత్రంతో శివుడి మనసు దోచుకున్న దొంగ పురాణముఖంగా దైవత్వం అంటే ఏంటో తెలియజేస్తారు. ఆడంబరాలకు ఆధ్యాత్మికతలో చోటులేదు. పటాటోప ప్రదర్శనకు దైవారాధన వేదిక కాదు. అసలు భక్తి అన్నది వ్యక్తిగతమే కాని బహిర్గతం చేసుకుని మురిసిపోయే విషయం కాదని గ్రహించాలి.
***