అకడమిక్ ఇయర్ ముగిసింది. ఉన్నత చదువుల వైపు ఆశగా పరుగులు పెడుతోంది యువత. ఈ క్రమంలో ఉద్యోగాల వేటలో తలమునకలైనవారు కొందరైతే, ఉన్నత చదువుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వారు ఇంకొందరు. మరికొందరు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు. ఇలా ఇది చాలా కీలకమైన సమయం. సరిగ్గా ఈ తరుణంలోనే పేరెంట్స్ తమ పిల్లల్ని కరెక్ట్‌గా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త ఉత్సాహంతో ఉరకలు వేసే యువత జోరుకు ఎక్కడ బ్రేకులు వేయాలి, ఎక్కడ జోరందించాలనే ప్రామాణిక బ్యాలెన్స్ పేరెంట్స్‌కే తెలియాలి. తమ అబ్బాయి, లేదా అమ్మాయి నచ్చిన రంగం వైపు ఆకర్షితులవుతున్నారు అంటే, అందులోని తప్పు ఒప్పులను, మంచి చెడులను విడమరిచి చెప్పగలిగేలా పేరెంట్స్ ఆలోచన చేయాలి.
ఉరకలేసే ఉత్సాహంతో సమాజాన్ని చదివేందుకు సిద్ధమవుతారు ఈ తరుణంలో యువత. స్వదేశీ విద్యతో పాటు, విదేశాల్లో ఉన్నత విధ్యను అభ్యసించాలనీ, తమకు ఇష్టమైన రంగంలో ఉద్యోగాలు సంపాదించాలనీ అనుకుంటారు. ఆ దిశగా యువత కోసం కొత్త కొత్త ఆవిష్కరణలూ, వ్యాపారాలు, వ్యాపకాలూ మరింత కొత్త కొత్తగా ఎదురు చూస్తుంటాయి. నచ్చిన కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించాలా.? లేక తమదైన టాలెంట్‌తో నూతన ఆవిష్కరణలకు తెర లేపాలా.? అనే ఆలోచనలతో సతమతమవుతారు. వారి ఊహలకు, ఆలోచనలకు ఫ్రెండ్లీ వెర్షన్‌లో సజిషన్స్ ఇచ్చేలా తమదైన బాధ్యత తీసుకోవాలి తల్లితండ్రులు.
నాణానికి రెండు వైపులున్నట్లుగా, ఈ సీజన్‌కీ మంచీ చెడూ ఉంది. యువత ఎక్కువగా పక్కదార్లు పట్టే అవకాశాలున్న సీజన్ కూడా ఇదే. ఉద్యోగాల పేరు చెప్పి కొన్ని నకిలీ సంస్థలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తుంటాయి. తమదైన ఆఫర్స్‌తో ఆ నకిలీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసేందుకు కొందరు దళారీలు కాచుకుని కూర్చుంటారు. అందుకే కొత్త ఉద్యోగాల వేటలో యువత కాస్త ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులు, తల్లితండ్రులు, గురువుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తుకు బంగారు బాట వేసే క్రమంలో ఎటువంటి తప్పులూ దొర్లకుండా యువతను చెడుదారి పట్టకుండా మంచి మార్గం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రతీ పేరెంట్‌కీ, ఆ మాటకొస్తే, సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరిపైనా ఉందని గ్రహించాలి.