సమ్మర్ వచ్చేసింది. స్కూళ్లకు సెలవులొచ్చేశాయి. ఇక పిల్లలకు పండగే పండగ.. అంటే పొరపాటే. వేసవి సెలవులను హాయిగా ఎంజాయ్ చేసే రోజులు కావివి. గతంలో అలా వేసవి సెలవులంటే చక్కగా అమ్మమ్మగారింటికో, నాన్నమ్మగారింటికో వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఎంజాయ్ చేసేవారు పిల్లలు. కానీ ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులు మారాయి. ఉన్న ఊళ్లోనే ఇలా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, అలా సమ్మర్ క్యాంప్స్‌కి అడ్మిషన్లు స్టార్ట్ కావడం ఒకేసారి జరిగిపోతోంది. దాంతో సమ్మర్ అంతా సమ్మర్ క్యాంప్స్ పేరుతో ఉన్న చోటనే గడిచిపోతోందిది.
ఇదే అదనుగా తీసుకుని సమ్మర్ క్యాంప్స్ కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చేస్తున్నాయి. మీ పిల్లలకు అది నేర్పిస్తాం. ఇది నేర్పిస్తామంటూ ప్రకటనలతో హోరెత్తించేస్తూ, పిల్లల్ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. తల్లితండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడం, పిల్లలకు టైం పాస్ అవుతుందని భావించి ఈ సమ్మర్ క్యాంప్స్‌ని బాగానే ప్రోత్సహిస్తున్నాయి. దాంతో సాంప్రదాయ పద్ధతిలో సెలవులకు గ్రాండ్ పేరెంట్స్‌తో ఎంజాయ్ చేయడమనే ఆలోచన పక్కకి పోయి, ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌కే పిల్లలూ, తల్లితండ్రులూ కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఒక రకంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. పిల్లల్లో దాగున్న ఇంటర్నెల్ టాలెంట్స్ ఈ సమ్మర్ క్యాంప్స్ ద్వారా బయటికొస్తున్నాయి. తద్వారా తమ ఛైల్డ్‌కి ఏ రంగంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనే విషయం పేరెంట్స్‌కి తెలిసే అవకాశం కలుగుతోంది.
అయితే ఈ సమ్మర్ క్యాంప్స్ పేరుతో పేరెంట్స్ దగ్గర డబ్బులు గుంజడమే పనిగా పెట్టుకుంటున్నాయి కొన్ని సంస్థలు. లాభాల ఆర్జన తప్ప, పిల్లల కనీస బాధ్యతను మర్చిపోతున్నాయి. అసలే సమ్మర్, ముక్కుపచ్చలారని పసి పిల్లలు. ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల్ని పక్కన పెట్టేస్తున్నారు. పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి పెంచేస్తున్నారు. ఈ తరహా సంస్థలపై తల్లితండ్రులు కాస్త ఆప్రమత్తంగా ఉండాలి. ఓ సర్వే ప్రకారం కొన్ని సమ్మర్ క్యాంప్స్ పిల్లల్లో రిలీఫ్ కంటే తీవ్రమైన మానసిక ఒత్తిడికే కారణమవుతున్నాయని తేల్చింది. అవును నిజమే.. వేసవి అంటే నీడ పట్టున ఉంచి, పిల్లల మనో ఉల్లాసానికి తోడ్పడాల్సింది పోయి, సమ్మర్ క్యాంప్స్ పేరుతో పిల్లల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారనీ మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల మానసిక ఉల్లాసాన్ని సమ్మర్ క్యాంప్స్‌లో ఒత్తిడి డామినేట్ చేయకూడదనేది నిపుణుల సలహా. ఈ చిన్నపాటి సలహా పాఠించి, హాట్ సమ్మర్‌ని కూల్ కూల్‌గా నచ్చినట్లు ఎంజాయ్ చేసేయండి మరి.