తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

( మధురై )|

కిందటివారం చెప్పినట్లుగా మనం మధరై నగరం గురించి తెలుసుకుందాం , మథరై నగరం చెన్నైకి సుమారు 480 కిలోమీటర్ల దూరంలో వుంది .

మథురై చేరుకోడానికి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలనుంచి రైలు , విమాన సౌకర్యాలు వున్నాయి .

మధురై నగరం విద్యా వ్యాపార రంగాలలో తమిళనాడులో మూడోస్థానాన్ని పొందింది . మధురై లో రబ్బరు , ఆటో మొబైల్ , కెమికల్ , గ్రానైట్ ఇండస్ట్రీస్ వున్నాయి .

మధురై నగరం యిక్కడ వున్న మీనాక్షిమందిరం , తిరుమలై నాయకర్ రాజభవనం వల్ల దేశవిదేశాలలో పేరుపొందింది .

వాగై నదీ తీరాన వున్న యీ నగరం మధురై నాయకర్ల కాలంలో నిర్మింపబడింది అని అనికుంటే పొరపాటే , క్రీస్తుపూర్వం నుంచి వున్నది అనే దానికి చంద్రగుప్త మౌర్యుని కాలంలో గ్రీకు రాయభారి అయిన మెగస్థనీసు పుస్తకం ఆధారం . దాని ప్రకారం మధురై మౌర్య సామ్రాజ్యం లో వుండేది . మౌర్యసామ్రాజ్యం అంటే క్రీస్తు పూర్వానికి సుమారు 300 సంవత్సరాలకి చెందినదన్నమాట .

తరవాత పాండ్యు , చోళు , పల్లవులు , మధురై సుల్తానులు , విజయనగర చక్రవర్తులు , మధురై నాయకర్లు , కర్నాటక రాజుల పరిపాలనలో వుండి బ్రిటిష్ పాలనలోకి వచ్చింది .

మధురై నాయకర్లు సుమారు 17 వ శతాబ్దంలో మధురైని పరిపాలించేరు .

మధురై అని యీ నగరానికి పేరు రావడానికి రెండు కారణాలు చెప్తారు , పరమశివుడు ఆనందతాండవం ఆడుతున్నప్పుడు శివుని జడల నుంచి అమృతం చెమటరూపంలో బయటకు వచ్చి యీ ప్రాంతం లో చిందిందట , మధురం అంటే తియ్యనైన మరియు అమృతం అనే అర్దాలు వుండడం వల్ల  యీ నగరానికి మధురై అనే పేరు వచ్చిందనేది ఒక వాదనకాగా మధురై అంటే అందమైన అని అర్దమని యీ నగర పరిసరాలు అందంగా వుండడం వల్ల యీనగరానికి మధురై అనే పేరు వచ్చిందనేది మరో కథనం .

మధురై పేరు వినగానే మనకి గుర్తొచ్చేది మీనాక్షి కోవెల , ఆలశ్యం యెందుకు మనం కూడా మీనాక్షి కోవెల దర్శిద్దాం రండి .

మధుర మీనాక్షి కోవెల ఓ అద్భుతమే , కొన్ని శతాబ్దాల కృషి యిప్పుడు మనం చూస్తున్న యీ మందిరం . ప్రతీ శిల్పం శిల్పి యొక్క పనితనాన్ని చూపిస్తుంది . ప్రతీ శిల్పాన్ని తనివి తీరా చూడాలంటే యీ కోవెలలో ఒకనెలరోజులైనా గడపాలి అన్ని శిల్పాలు వున్నాయి , ప్రతీ శిల్పం కాలి అందెల నుంచి చీరకట్టు , కుచ్చెళ్ల , నగలు , శిల్పం నిలబడిన తీరు , ముఖంలో కనిపించే హావభావాలు యివన్నీ కూడా చిన్న సుత్తి ఉలి సహాయంతో నిర్మించేరంటే శిల్పికి చేతులెత్తి నమస్కరించక తప్పదు .

అలాగే యీ మందిర మంటప స్థంబాలకు వున్న విచిత్రమైన జంతువులు కృతయుగంలో వుండేవట , సగం యేనుగు  సగం సింహం , మొసలి యేనుగు యిలా రకరకాలు వాటిని మలచిన తీరు అద్భుతం , పెద్దపెద్ద మంటపాలు మంటపాలలో నిర్మించిన విగ్రహాలు కళ్లు తిప్పుకోనివ్వవు .

దేవీ దేవతల విగ్రహాలు వాటిని మలచిన తీరు చూసితీరాలి .చాలా పెద్ద కోవెల , మొత్తం కోవెలని చూడాలంటే అదీ గబగబా కొన్ని గంటలు పడపతుంది , అంతపెద్ద కోవెల కాళ్లు నొప్పులు పుట్టడం ఖాయం , అమ్మవారిని మాత్రమే చూసుకు రావడానికి ఖచ్చితంగా రెండుగంటల సమయం పడుతుంది .

ప్రస్తుతం మనం చూస్తున్న మందిరం 16వ శతాబ్దం లో మరమ్మత్తులు చేయబడినది , చరిత్రకందిన ఆధారాల ప్రకారం ఆరవశతాబ్దంలో నిర్మింపబడినట్లుగా తెలుస్తోంది . మౌర్యుల సామ్రాజ్యానికి గ్రీకు రాయభారిగా  వచ్చిన మెగస్తనీసు పుస్తకాలలో యీ మందిరం గురించిన వివరంలేదు , కాబట్టి యీ మందిరం అప్పట్లో లేదని కూడా చెప్పలేం .

6 శతాబ్దంలో నిర్మింపబడ్డ యీ మందిరం సుల్తానుల పరిపాలనలో చాలా మటికి కూల్చవేయబడింది . విజయనగర సామ్రాజ్యంలో యీ మందిరం యెన్నో మంటపాలతో మరమ్మత్తులు చేయబడింది . 14 శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు యీ మందిరం లోని నిధులకొరకు మందిరాన్ని కూల్చివేసేరు . 16 వ శతాబ్దంలో తిరిగి మరమ్మత్తులు చేసేరు . మధురై నాయకర్ల పరిపాలనలో విశ్వనాథనాయకరు యెక్కువగా మంటపాల నిర్మాణం చేసేడు .

ఈ సందర్భంలో ఓ చిన్న కధ చెప్పుకుందాం .

మధురవిజయం అనే గ్రంధం ప్రకారం మధురై ఢిల్లీ సుల్తానుల పరిపాలనలో వున్నప్పుడు వారి సర్దారు మాలిక్ కాఫిర్ ధనరాశులకోసం యీ మందిరాన్ని నేలమట్టం గావించగా విజయగరాజు  ‘ కుమారకంపన ‘ యొక్క రాణి ‘ గంగాదేవి ‘ కత్తి రాజు చేతికిచ్చి మాలిక్ కాఫిర్ ను ఓడించి మీనాక్షీ మందిరాన్ని పునఃనిర్మాణం చెయ్యవలసినదిగా కోరుతుంది . కుమారకంపన రాజు సర్దారుని ఓడించి మీనాక్షి మందిరాన్ని పునఃనిర్మాణం గావించేడు .

ఈ మందిరం సుమారు 14 ఎకరాలలో నిర్మింపబడింది , మొత్తం 12 గోపురాలతో యెత్తు సుమారు 40 నుంచి 52 మీటర్ల యెత్తులో వుంటాయి , యీ గోపురాలు తొమ్మిది అంతస్థులనుంచి  మూడు అంతస్థుల వరకు వుంటాయి , మీనాక్షి దేవి , సుందరేశ్వరుల గర్భగుడులకు బంగారు తాపడం చెయ్యబడ్డాయి . కోవెల మథ్యభాగంలో పుష్కరిణి పుష్కరిణి చుట్టూరా పొడవైన మంటపాలు . పుష్కరిణి మధ్యలో బంగారు కమలం వుంటుంది . ఈ పుష్కరిణిని ‘ పోర్తమారై కుళం ‘ అని అంటారు . తీర్థం మధ్యలో శిల్పకళతో వున్న చిన్న మంటపం వుంటుంది . అమ్మవారి తెప్పోత్సవ సమయంలో మీనాక్షి సుందరేశ్వరులు యీ మంటపంలో విశ్రాంతి తీసుకుంటారు . ఈ పుష్కరిణి సుమారు 165 అడుగుల పొడవు 120 అడుగుల వెడల్పు వుంటుంది . దీనిని ఆదితీర్థం , ఉత్తమ తీర్థం , శివగంగై తీర్థం అని కూడా అంటారు .

మంటపాల గురించి చెప్పుకోవాలంటే యీ కోవెలలో చాలా మంటపాలున్నాయి . కళ్యాణ మంటపం , వెయ్యి స్థంబాల మంటపం , కిళి కూండల్ మండపం , గొలుమండపం , వసంతమంటపం , పర్యాటకులు సేదతీరే మండపం మొదలయినవి చాలా కళాత్మకంగా వుంటాయి . ఏనుగులను వుంచే మంటపం , కొత్తమంటపం యివన్నీ దాటుకొని గర్భ గుడిలోకి ప్రవేశిస్తాము . చిన్నగా వుండే గర్భగుడిలో మీనాక్షిదేవి , పెద్దగా వుండే గర్భగుడిలో సుందరేశ్వరుడు కొలువై వుంటారు . అమ్మవారు సర్వాలంకారాలతో చేతిలో చిలుకతో చాలా అందంగా వుంటుంది . సుందరేశ్వరుని మందిరం పెద్దదయినా యిక్కడ అమ్మవారికే ప్రాధాన్యత యెక్కువ . కుమారస్వామి , వినాయకుడు , నంది , దుర్గాదేవి మొదలయిన విగ్రహాలతో పాటు గోపాలకృష్ణుడు , లక్ష్మి , రుక్మిణి మొదలయిన విగ్రహాలను కూడా చూడొచ్చు . కోవెల పై భాగంలో విష్ణుమూర్తి మీనాక్షి చేతిని సుందరేశ్వరుని చేతిలో పెడుతున్న విగ్రహం చూడొచ్చు .

శైవమందిరంలో వైష్ణవ విగ్రహాలు వుండడానికి కారణం విష్ణుమూర్తి మీనాక్షిదేవికి సోదరునిగా శివునితో వివాహం చెయ్యడం వలనే ,  యీ కోవెలలో శివకేశవులు యిద్దరకూ ప్రాధాన్యతవున్నది అని చెప్పవచ్చు .

274 పాతాళపేత్ర స్థలాలలో యీ మందిరం వొకటి .

ప్రతీ శక్రవారం మీనాక్షిదేవి , సుందరేశ్వరులకు ఉయ్యాల మండపంలో వుయ్యాల సేవ జరుగుతుంది .

చైత్రమాసంలో జరిగే పదిరోజుల కళ్యాణోత్సవానికి సుమారు పదిలక్షలమంది భక్తులు హాజరవుతారు .

ఈ మందిరం గురించి యెన్ని పేజీలు రాసినా తక్కువే  యీ మందిరాన్ని చూడని వారు తప్పక ఒక్కమారైనా చూడండి అని మాత్రం చెప్పగలను .

ఇంత అద్భుతమైన కోవెల యొక్క స్థలపురాణం తెలుసుకుందాం .

6 వ శతాబ్దంలో మధపరైని పాలించిన పాండ్యరాజైన మలయద్వజుడు మగ సంతానంకొరకై తపస్సు చేయగా వారికి ఆడపిల్ల కలుగుతుంది , ఆపాపకు మూడు స్థనాలు వుండడం చూచి ఆ పాప పాండ్యరాజ్యానికి కీడు కలుగజేస్తుందని ఆమెను వధించమని మంత్రులు సలహా యిస్తారు , రాజు యెటూ తేల్చుకోలేని స్థితిలో వుండగా ఓ నాడు రాజు కలలో శివుడు కనిపించి ఆమె సాక్షాత్తు పార్వతీదేవి అవతారమని , తాను ఆమెని వివాహమాడుతానని , వివాహానంతరం మూడోస్థనం మాయమౌతుందని ఆమెవల్ల పాండ్యవంశం ఆచంద్రార్కం కీర్తి గడిస్తుందని చెప్తాడు . రాజు మీనాక్షిని మగపిల్లాడిగా పెంచి అన్ని శస్త్రవిద్యలూ నేర్పుతాడు . యుక్తవయస్కురాలైన మీనాక్షి రాజుద్వారా శివుడే స్వయంగా వచ్చి వివాహమాడుతాడని విని కదంబవనంలో శివుని గురించి తపస్సు చేసుకుంటూవుంటుంది . సుందరేశ్వరుడు పాండ్యరాజు కి మీనాక్షిని వివాహమాడాలే కోరికని తెలియజేస్తాడు . సుందరేశ్వరుడు శివుడు కాదేమో అనే సందేహంలో వున్న మీనాక్షి విష్ణుమూర్తి ని సహాయం కోరుతుంది . విష్ణుమూర్తి సుందరేశ్వరునికి మీనాక్షికి వివాహం చేస్తాడు . చాలా సంవత్సరాలు మీనాక్షీదేవి సుందరేశ్వరులు రాజ్యపాలనచేసి కైలాశానికి మరలిపోతారు .

అందుకే మీనాక్షిని పాండ్యరాజుపుత్రి అని కదంబవనవాసిని అని అంటారు .

ఉత్సవాలలో వుపయోగించే రకరకాల వాహనాలు కూడా చూడొచ్చు .

మందిరానికి సంబంధించిన యేనుగులను యేనుగు మండపంలో చూడొచ్చు . కిళికూండల్ మండపం లో చిలుకలు వుండేవట , మొత్తం యీ మండపం పంజరం ఆకారంలో వుంటుంది . వెయ్యి స్థంబాలమండపానికి యెదురుగా వున్న మంటపంలో స్థంబాలు సరిగమలు పలుకుతాయి , గొలు మండపంలో శారద నవరాత్రులలో బొమ్మల కొలువు పెడతారు . ప్రతీసంవత్సరం  రధాయాత్రలో వుపయోగించే రథాన్ని కూడా చూడొచ్చు .

వచ్చేవారం మధరైలోని మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు