నిద్ర .. - వారణాసి రామకృష్ణ

సమస్త జీవ రాశుల్లో నిద్ర పోని జీవంటూ ఉండదు. నిద్రపోవటం ఓ కళ! 64 కళల్లో దీన్ని చేర్చారో లేదో తెలీదు,లేకపోతే మాత్రం వెంటనే చేర్చాలని ఇందుమూలంగా నిద్ర మానుకుని మరీ తెలియజేసుకుంటున్నాను. కారణం ఏంటీ అంటే ఆపీసులో అందరికళ్ళు గప్పి నిద్రపోవటం గొప్ప టెక్నిక్కు! దానికి గొప్ప ఉదారణ మానిద్రనారాయణ! తెలివిగా ఆపీసులో ఎట్లా నిద్దర పోవాలో అతన్ని చూసి కూడా నేర్చుకోలేము! అంత గొప్ప గా నిద్దర పోగలడు!                                                                                                      

లంచ్ లో సుబ్బరంగా మఠం వేసుకుని సుష్టిగా లాగించి నోట్లో కిళ్ళీ బిగించి కళ్ళద్దాలు ముక్కు మీద ఫిక్స్ చేసి నిద్దరలోకి వెళ్ళే ప్రక్రియ ని చూడాలే గాని వర్ణించటం చాలా కష్టం! బహుముచ్చటగా నిద్రిస్తాడు! ఫైల్స్ ఓపెన్ చేసి చేతివేళ్ళ మధ్య పెన్ను బిగించి బల్ల మీద బోలెడన్ని కాగితాలు పరిచి పెట్టి తల పైకెత్తి సీరియస్సు గా చూస్తూ క్యాబిన్ లో కూచున్న బాసుకి ఇతగాడు కష్ట్టప్పడి శ్రమప్పడి పడిపడీ బోలెడంత పని లో పడి తల మునకలై ఉన్నాడన్న ఫీలింగ్ తెప్పిస్తాడు! కళ్ళు సగం పైన తెరిచే ఉండేవి కానయితే సుబ్బరంగా నిదరోయేవాడు! “నారాయణ” అని పిలిస్తే చాలు టక్కున కళ్ళెత్తి చూసేవాడు. ఇది గమనించి బోలెడుమంది నిద్రపోదామని  ట్రయల్స్ వేసారు కానీ ప్రతిసారీ బాసుకి దొరికిపోయే వారు. ఎందుకూ అంటే కళాత్మకంగా నిద్రపోవటం చేత కాక పోవటం చేతే! అన్నీ సరిగ్గా మేనేజ్ చేసేవారు కానీ గురకలు పెట్టేసరికి గుట్టు రట్టు అయ్యేది! అంచేతే ఆపీసుల్లో “సౌండు స్లీపు” లు పనికిరావని ఈ సందర్భంగా మీ అందరికి తెలియ జేసుకుంటున్నాను.

**      ***      ***

ఇంకొందరు నిద్ర మబ్బు గాళ్ళు ఉంటారు!వీళ్ళు ఏ బండి ఎక్కినా వెంటనే నిద్రలోకి జారు కుంటారు. బహుశా కుదుపులకి కామోసు హాయిగా అనిపించి పక్క వాళ్ళ భుజాన్ని మెత్తటిదిండు చేసుకుని గురకలు తీస్తారు. గమ్యస్థానంవచ్చినానిద్దర్లో తూగుతూ అలాగే ప్రయాణంకొనసాగించి ఎప్పుడో ఉలిక్కిపడి లేచి వాళ్ళు కంగారు పడి పక్కవాళ్ళని కంగారు పెట్టి నానా హడావిడి చేస్తారు. మొన్నోకాయన ఇట్లాగే మలక్ పేట లో బస్సెక్కి నిద్ర పోయి తర్వాత కళ్ళు విప్పి పక్కన కూచున్న సుబ్బారావు తో “సార్ కోటి వచ్చిందా”అన్నాడు “కోటినా ? అదెప్పుడో పోయింది వస్తున్నది సికింద్రాబాద్” అన్నాడు.అయితే నిద్ర మబ్బు కిటికీ బైట తల పెట్టి “కాదు సార్ బస్సు అమీర్ పేట మీద వెళ్తోంది”చెప్పగానే సుబ్బారావు తను దిగాల్సిన స్టాపు పోయిందేనని కంగారుగా లేచి బస్సు ఆపమని  కేకలు పెట్టాడు. తీరా చూస్తే బస్సు సికింద్రాబాద్ దగ్గరే వుంది. దాంతో అందరూ నవ్వేరు. మీకు ఈసారి మెట్రోలో ఇలాంటి నిద్దర మొహాలు కనిపిస్తే నిద్ర లేపి మరీ పుణ్యం మూటగట్టుకోండి! లేకపోతే మిమ్మల్ని కన్ఫ్యుస్ చేసే అవకాశం ఉంది! ఓకేనా?!

***     ***   ****

అదేంటో గానీ కొందరి నిద్ర దిన పత్రికల్లో పతాక శీర్షికల కెక్కుతుంది.మాజీ ప్రధానిదేవేగౌడ గారి నిద్ర ఈ కోవలోకే వస్తుంది.పాపం ఆయన పార్లమెంట్లో కొంచెం తూగితే చాలు వెంటనే కెమెరాలు క్లిక్కు మంటాయి! అరమూతలు పడ్డ కళ్ళతో హాయిగా నిద్రిస్తున్న ఫోటో మర్నాటి పేపర్లో వచ్చేసేది! పోనీ ఎవరికీ కనిపించకుండా ఓ మూల దాక్కుని బబ్బుo దామనుకున్నా సీ సీ కేమేరాలు పెట్టారు. సీ.. సీ అంటేనే చూడమని రెండుసార్లు ఆంగ్లంలోచెప్పటం! దాంతోఆయన ఇంకేం నిద్రపోగలడు? నిద్రపోయాడో.. జాతి మొత్తం సీ సీ అంటోంది ! దాంతో విరక్తి పుట్టి పార్లమెంటుకి వెళ్ళటమే మానేసాడు! అసలు నా అనుమానం ఏంటంటే పార్లమెంటు అసెంబ్లీలల్లో కుర్చీలు కావాలనే మెత్తగా సుఖంగా నిద్రకి అనువుగా చేయించారని! ఇందులో విదేశీ కుట్ర కూడా ఉండొచ్చు లేపోతే సీట్లో కూచోగానే ఆవలిస్తూ తూగుతూ కళ్ళు అర మూతలు పడుతూ పాపం ఎప్పుడూ నిద్ర ఆపుకుంటూ ఆపసోపాలు పడుతుంటారు! ఎలచ్చన్లప్పుడు నేతలకి సరిగ్గా నిద్ర ఉండదు.అందుకనే వాళ్ళంతా ఎన్నికయ్యాక ఒకేసారి ఐదేళ్ళ దాకా నిద్రపోతారు. తప్పు ప్రజలదే కానీ నేతలది ఎంతమాత్రం కాదు! 

****     ****     **** 

డ్యూటీ ఎగ్గొట్టి మరీ నిద్ర పోయే కొందరు శాల్తీలతో భలే తమాషాఎదురవుతుంది! కొన్ని ఆపీసు డ్యూటీ లలో నయితే అస్సలు నిద్ర పోకూడదు.ముఖ్యoగా రైల్వేడ్యూటీ! అప్పట్లో దత్తాత్రేయ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పటి నిద్ర ముచ్చటిది! మంత్రి గారు రైల్వే పని తీరు చూద్దామని గుంటూరు వెళ్తుండగా అద్దరాత్రి ఉన్నట్టుంది ట్రైన్ ఆగిపోయింది.దాంతో డ్రైవర్ని వాకబుచేస్తే సమీప స్టేషన్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంచేత ముందుకు పోవటంకుదరదని సెలవిచ్చాడు.చూస్తే సమీప రైల్వే స్టేషన్ లో లైట్లు కూడా లేవు అంతా చిమ్మ చీకటి! అరగంట. . గంటన్నర వేచి చూసినా సిగ్నల్ పడలేదు . అందరికి భయం పట్టుకుంది. కొంపదీసి నక్సలైట్లు లైట్లు ఆర్పెసారాని?! ఇద్దరు టీటీఈ లు రెండు స్ట్రాంగ్ టీ లు తాగి ఆంజనేయ దండకంవల్లిస్తూ వెళ్లి చూస్తే సదరు స్టేషన్ మాస్టారు తో సహా మొత్తం సిబ్బంది ఫుల్లు నిద్దర్లో ఉన్నారు. టీటీఈలు కోపంగా నిద్ర లేపితే అప్పుడే తెల్లవారిందా అంటూ ఆవలించారట!  

***      ****      *****

ఇంకొన్ని అతి తెలివి నిద్దర కేసులుంటాయి! వీళ్ళని ఎవరు నిద్ర లేపినా వాళ్ళకి మూడిందనే!

ఆ మజ్జిన ఓ ఆపీసులో సదరు బాసు క్లర్కు కనిపించక ఎక్కడున్నాడా అని ఆఫీసంతా వెతికి సివరాఖరికి ఫైళ్ల గుట్టల నడుమ సుబ్బరంగా నిద్ర బోతున్న కామేశాన్ని లేపితే అతగాడు చిర్రుబుర్రులాడుతూ లేచి”ఏంటి సార్?నిద్దర లేపేరు?అసలుఅబ్దుల్ కలాం గారుఏoచెప్పారు? హాయిగా కలలు కనండిఅని! మరి నిద్దర పోకుండా కలలు ఎలావస్తాయి? బంగారం లాంటి నిద్ర చెడగొట్టారు!”  అని రుసరుసలాడి ‘ఇకపై ఎప్పుడూ మధ్యలో లేపమాకండి’ కళ్ళెర్రజేసి మళ్ళీ నిద్రలోకి జారు కున్నాడట! అసలు నిద్ర అంటే గుర్తుకు రావాల్సింది రామాయణం!
మొగుడ్ని ఆపీసులకి పంపించి ఇప్పటి కాలం ఆడవారు 8గంటలు టీవీ ముందు నిద్రపోతే ఊర్మిళ మాత్రం మొగుడ్ని అడవికి సాగనంపి సుబ్బరంగా పద్నాలుగేళ్ళు గుర్రు పెట్టి నిద్రపోయింది! ఇక రావణుడు రాముడితో యుద్ధం చేసే రోజుల్లో తమ్ముడు కుంభకర్ణుడ్ని
నిద్రలేపటానికి ఎన్ని ప్రయాసలు పడ్డాడో బాపు సంపూర్ణ రామాయణం చూస్తే తెలుస్తుంది! అదో మహత్తర సన్నివేశం! ఏనుగుల చేత తొక్కించి మరీ నిద్ర లేపితే గానీ మెలకువ రాలేదు!

***    ***   **** 

ఇంకోదరుంటారు వీళ్ళకి ఎంతకీ నిద్ర పట్టి చావదు! సరిగ్గా ఇట్టాంటి వాళ్ళ కోసం తమాషా పరుపులు మార్కెట్లోకి వచ్చేయి!పడుకోగానే ఇవి చక్కటి జోకులు చెప్తాయి.ఆనక పాటలు వినిపిస్తాయి. నిద్రలోకి జారుకోగానే ఆగిపోతాయి. గురక పెడితే కొంచెం కుదిపి ‘అటు తిరిగి పడుకో’అంటాయి. పోద్దున్నేఆరు కొట్టగానే ‘తెల్లారింది నిద్దరలెగు’ అంటాయి లేవక పోతే సున్నితంగా చెప్తాయి.ఇంకా బద్ధకం పడితే “వొరే వెర్రి పీనుగా! లే.. లేచి పళ్ళు తోము, ఆఫీసుకు వెళ్ళు” హెచ్చరికలు జారిచేస్తాయి!అక్కడికీ లేవక పోతే”ఏరా ఎదవా! ఎదవన్నర ఎదవా! ఇంకా ఎంత సేపునిద్రపోతావ్?దున్నపోతా?నాశనమైపోతావ్, భ్రస్టుపట్టిపోతావ్!” బండ బూతులు తిడతాయిట!అప్పటికీ లేవకపోతే పరుపు లోంచి ఫౌంటెన్ లా నీళ్ళు ఎగచిమ్మి నిద్రారాయడ్ని తడిపి పరుపు స్ప్రింగు లా చుట్టచుట్టుకుని ఎగిరితంతుందట!

దెబ్బకి నిద్రా రాయుడు లేచి నించోవాల్సిందే తప్పదు! మొత్తానికి భలే పరుపులు కదా మాయ బజార్ లో గిల్పం టైపు పరుపులు!

***      ****    ****

అదేం ఆనందమో గానీ కొందరునేతలకి వాళ్ళ బెడ్రూం లో వాళ్ళ మంచంమీద హాయిగా నిద్రపోటానికి ఇష్ట పడరు. పద్దాకులు ప్రతిపక్ష నేతని పట్టుకుని నేనునిద్ర పోను, నిన్నునిద్ర పోనీయను అంటు కేకలు పెడతారు!ఇంకా విచిత్రంగా ప్రేమగా వాళ్ళ ఆవిడ పక్కన హాయిగా నిద్ర పోకుండా ప్రత్యర్థిని పట్టుకుని’నీ ఇంటికొస్తా, నీ గుండెల్లో నిద్రపోతా’ అంటూ చిందులు తొక్కుతారు! మంచాల మీద కాక ఇట్లా గుండెల్లో నిద్రపోవటం లో ఏమి ఆనందం దొరుకుతుందో మనకర్ధం కాదు!ఇట్లా అనేవాళ్ళు ఎవరో ఎప్పుడూ నిద్ర పోయేవాళ్లనిలేపి చెప్పొచ్చు గానీ ఆల్వేస్ అలెర్ట్ గా ఉండే మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు! అవునా?!

ఏ మనిషికయినా నిద్ర వరం!కానయితే అతి నిద్ర దరిద్రం! పెను నిద్ర శాపం! అతి నిద్రా లోలుడు తెలివిలేని మూర్ఖుడు అనిమనకేనాడో కృష్ణపాండవీయం లోకృష్ణుడుసెలవిచ్చాడు. కునుకు ఆరోగ్యానికి మంచిదేనని శాస్త్రవేత్తలు అంటారు. అదేంటో విచిత్రం మనలాంటి సామాన్యులకి ఈ నిద్రా రాజకీయాలు కొరుకుడుపడవు! పట్టించుకున్నామో మనకి నిద్దర పట్టదు! ఎందుకొచ్చిన గోల? మనం మాత్రం అతి నిద్రకి పోకుండా పెను నిద్దర్లోకిజారిపోకుండా మంచినిద్ర అలవాటు చేసుకుని కునుకు తీసినప్పుడల్లా నిద్ర గురించి లుక్కేసుకుందాం!  హేవంటారూ?!

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు