ఒకానొకప్పుడు, ఇంటిపేరు చెప్పగానే, వారి వంశవృక్షం గురించి చెప్పగలిగేవారు. సంబంధ బాంధవ్యాలు అలాగ ఉండేవి. వాటికి కారణం, రాకపోకలూ, అభిమాన ఆత్మీయతలూనూ.. ఉద్యోగాలకి దూరప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండేది కాదు… దీనికి కారణం మనుషుల్లో , ఏదో డబ్బుసంపాదించేసి, దేశాన్నీ, తమనీ ఉధ్ధరించేద్దామనే కోరికకూడా ఉండేది కాదు. ఏదో ఉన్నఊళ్ళోనే, కడుపులో నీళ్ళు కదలకుండా, పెళ్ళాం పిల్లల్ని పోషించే ఓపికుంటే చాలనుకునేవారు. దీనికి సాయం, ఖర్చులుకూడా అంత ఎక్కువగా ఉండేవి కాదు, ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బతికితే చాలనుకునేవారు.. నలుగురైదురు పిల్లల్ని కని, వారి చదువు సంధ్యా, పెళ్ళిళ్ళు చేసేసి, వారి కాళ్ళమీద వాళ్ళు బతికేలా చేయడమే ధ్యేయంగా ఉండేది. నూటికి తొంభైమంది చేయగలిగేవారు కూడా..” నారుపోసినవాడు నీరుపోయడా “ అనే నమ్మకంతోనే రోజులు గడిచేవి…
ఆర్ధిక స్థాయి గురించి అంత పెద్ద పట్టింపుకూడా ఉండేది కాదు. అవసరానికి, ఎటువంటి ఆలోచనా లేకుండా, ఆర్ధికసహాయం, మాటసహాయం చేయడానికి వెనుకాడేవారు కాదు. ఒకరిమీద మరొకరికి ఉండే నమ్మకమే దీనికి కారణం. శలవులొచ్చేసరికి, కుటుంబంలో ఉండే సభ్యులందరూ , ప్రతీ ఏడాదీ, తలోచోటా కలుసుకోవడాలుండడంతో, ఒకరి విషయాలొకరికి తెలిసేవి. ఇంక పెళ్ళిళ్ళైతే అడగక్కర్లేదు. సాధారణంగా , తమకుటుంబంలోనే ఎవరో వరసైనవారికి కట్టబెట్టేసేవారు. ముందుతరం వారికి ముఖ్య ఆదాయం వ్యవసాయమే.. అక్కడక్కడ తప్పించి, చాలామంది మధ్యతరగతి కుటుంబాలలో, ఏడాదికి సరిపడే ధాన్యం వచ్చేదికాబట్టి, తిండికి లోటుండేది కాదు. ఉన్నఊళ్ళోనే చదువూ సంధ్యా అవడంతో, పెద్ద ఖర్చుకూడా ఉండేది కాదు. ఆరోజుల్లో, ఎంత డబ్బుందీ అనేది కాదు ముఖ్యం, కలకలలాడుతూ ఎంత సంతోషంగా ఉన్నారూ అన్నదే ముఖ్యం.
రోజులన్నీ ఒకేలా ఉండవుగా… ఆనాటి ఉమ్మడికుటుంబాలూ లేవు, అభిమానాల మాటైతే, ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాగని ఒక్కసారే మనుషులంతా రాత్రికి రాత్రి చెడ్డవాళ్ళయారని కాదు. పరిస్థితుల ప్రభావం… ఎక్కడచూసినా materialism, commercialism చొచ్చుకుపోయాయి.. ఈ రోజుల్లో బంధువైనా, స్నేహితుడైనా , అవతలివారివలన ఏదో లాభం ఉంటే తప్ప, ఒకరినొకరు పట్టించుకోవడమే అనేదే లేదు. ఈరోజుల్లో ఎక్కడచూసినా, “ ఎవరికి వారే యమునా తీరే “ అన్నట్టుగా మారిపోయింది వాతావరణం…ఒకానొకప్పుడు ఇంటిపేరుచెప్పగానే వంశవృక్షం చెప్పగలిగేవారు, ఈరోజుల్లో వంశవృక్షం మాట దేవుడెరుగు, తనకే ఏదో దగ్గర బంధువయుండొచ్చేమో అనే ఆలోచన కూడా రావడం లేదు… దీనికి ముఖ్యకారణం, పొట్టపోసుకోవడానికి, ఉన్న ఊళ్ళు వదిలి దేశాలు పట్టిపోవడం. దీనితో రాకపోకలూ తక్కువయాయి, పైగా తన కుటుంబం నడపడానికే, టైము లేని ఈరోజుల్లో, ఎవడో చుట్టం ( దగ్గరవాడైనా, వేలువిడిచిన వాడైనా ) గురించి ఎవడు పట్టించుకుంటాడూ? ఈరోజుల్లో ప్రసిధ్ధి చెందిన Social media ( Facebook etc..) ధర్మమా అని , ఏదో కొంత బాగుపడింది పరిస్థితి. స్నేహితులు ఎంతమందుంటే అంత గొప్ప కదా… దానితో కనిపించినవాళ్ళందరికీ ఓ friend request పంపేయడం, వారు అదృష్టవశాత్తూ confirm చేస్తే, వారితో చాటింగ్ లో తెలుస్తుంది, ఆ అవతలి వ్యక్తి తనకు దగ్గర బంధువేనని. అదైనా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే… ఈరోజుల్లో ఫాషనేమిటంటే, చాలామంది తమ ఇంటిపేరుతో సహా Profile తయారుచేసుకోవడం.. దీనివలన జరుగుతున్నదేమిటంటే, కనీసం ఒకే ఇంటిపేరున్నవారు, ఒకరికొకరు request పంపుకోవడం. పోనిద్దురూ ఎక్కడికక్కడే.. అనుకుని సంతోషించడం…
అక్కడితో ఎక్కడయిందీ? దేశవిదేశాల్లో ఉండే , తమ ఇంటిపేరున్నవాడు, ఏదో రంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించడం తరవాయి, అతనితోనో, ఆమెతోనో సంబంధం ( friendship) కలిపేసుకుంటే, అందరికీ చెప్పికోవచ్చు… ఫలానా వాడు “ మావాడేనండీ ..” అంటూ.. పరపతి పెరిగిపోతుందిగా…. మనవాళ్ళలో ఉండే మరో చిత్రం ఏమిటంటే, పేరుప్రతిష్టలు పొందిన , ఏ తెలుగువాడిపేరో వచ్చిందనుకోండి, మన మీడియా ముందుంటుంది—“ తెలుగు తేజం..ఫలానా ..” అంటూ.. ఆ పేరుతెచ్చుకోడానికి ఆ వ్యక్తి ఎంత శ్రమ పడ్డాడూ అన్నదానితో సంబంధం లేదు, పైగా ఆటైములో ఎవ్వరూ పట్టించుకున్నట్టుగా కూడా ఎప్పుడూ వినలేదన్నది వేరేవిషయం.
మన తెలుగు సినిమానిర్మాతలు మాత్రం, ఉమ్మడికుటుంబాలు, ఆత్మీయతలూ ఇతివృత్తంగా అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాలు నిర్మించి డబ్బులు చేసుకుంటూంటారు…
సర్వేజనా సుఖినోభవంతూ…