వేసవి ముదిరి పాకాన పడిందంటే, కాలు బయట పెట్టడానికి భయపడతాం. కానీ ఉడుకు రక్తం ఈ ఎండలకు భయపడే ప్రసక్తే లేదంటోంది. సాహసం చేయరా ఢింభకా అంటూ యువతరం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఎండా లేదు.. ఇబ్బందీ లేదూ.. లాంగ్ డ్రైవ్‌కి వెళ్లొచ్చేద్దాం. అది బైక్ మీదైనా, కార్లో అయినా.. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఈ విషయంలో మేమేం తక్కువ కాదని అంటున్నారు. పోటీ పరీక్షలు కొందరి కాళ్లకు బంధం వేస్తుంటే, మిగిలిన వారు మాత్రం ప్రకృతిని ఆస్వాదించాలని సమ్మర్ సీజన్‌ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు.
బీచ్‌లూ, పర్వతాలూ, ఎడారులూ.. ఇలా ఒక్కటేమిటీ దేన్నీ వదిలిపెట్టడం లేదు. ఓపిక ఉన్నోళ్లకి ఓపిక ఉన్నంత అన్నట్లుగా సాహస యాత్రల తీరు ఉంటోంది.
కొంతమంది భద్రతా చర్యల్ని గాలికొదిలేస్తుంటే, మరికొందరు మాత్రం పక్కా ప్లాన్డ్‌గా సాహసయాత్రను డిజైన్ చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రత్యేకంగా కొన్ని సంస్థలు అందుబాటులో ఉన్నాయి. 'మీ సాహసం మా సాయం' అంటూ నినదిస్తున్నాయి ఆయా సంస్థలు. ట్రెక్కింగ్, డ్రైవింగ్, స్విమ్మింగ్, ఫ్లైయింగ్.. ఇలా వివిధ అంశాల్ని రకరకాల ప్యాకేజీలతో యువతను ఊరిస్తున్నాయి. ఎప్పుడూ చదువు మాత్రమేనా.? అనుకునే వారికీ, ఏడాది అంతా తీరిక లేకుండా ఉద్యోగ విధుల్లో బిజీగా ఉండి కొంత వెసులుబాటు కోరుకునే వారికి ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటున్నాయి.
ఫన్ మాత్రమే కాదు, ఈ సమ్మర్ సాహసం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తోంది. ఏ సీజన్‌లో అయినా, కొంచెం తీరిక చేసుకుంటే, జీవితాన్ని ఎవరైనా హాయిగా ఆస్వాదించొచ్చు. ఈ విషయంలో యువత ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. యువతే కాదు, పెదవారు కూడా ఈ ఎంజాయ్‌మెంట్‌ని కాస్త సీరియస్‌గానే తీసుకుంటున్నారు. దాంతో సాహసయాత్రలకు సంబంధించిన ఆయా సంస్థలు బాగానే కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి. మండే ఎండలనే కాదు, జేబులో డబ్బుల్ని కూడా లెక్క చేయడం లేదు. దాంతో కోరుకునే వారికి ఎంజాయ్‌మెంట్, ఆ ఎంజాయ్‌మెంట్‌ని అందించేవారికి మనీ ఎర్న్‌మెంట్ ఎట్ ఏ టైమ్.. అందుతున్నాయి. ఏది ఏమైనా మన పెద్దలు ఊరకే అనలేదండోయ్ 'సాహసం చేయరా ఢింభకా..' అని.