( మధురై తిరుమల నాయకర్ భవనం )
మధురైలో మీనాక్షి అమ్మవారి మందిరం యెంత ప్రసిధ్ది పొందిందో , తిరుమల నాయకర్ రాజభవనం కూడా అంతే పేరుపొందింది .మీనాక్షిదేవి మందిరానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో వుంటుందీ రాజభవనం , ప్రస్తుతం మనం చూస్తున్నది అసలు రాజభవనంలో మూడోవంతుట , ఈ భవనం ద్రావిడ , రాజస్థానీ శిల్పకళల మేళవింపుతో కట్టబడింది . రాజస్థాన్ లో రాజభవనాలు యెంతపేరుపొందేయో అంతగొప్ప భవనాలు దక్షిణాదిన కనబడవు , తిరుమలనాయకర్ భవనం ఆ కొరతను తీరుస్తున్నట్లుగా వుంటుంది .
ఈ భవనం 1623 -59 వరకు పరిపాలన చేసిన నాయకర్ వంశానికి చెందిన తిరుమల నాయకర్ చే నిర్మింపబడింది , ప్రస్తుతం మనం చూస్తున్న భవనం తిరుమలనాయకరు నివశించిన భవనం , ప్రస్తుతం యీ భవనం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ యిండియ వారి సంరక్షణలో వుంది . 17వ శతాబ్దంలో మధురై పోర్చుగీసువారి పరిపాలనలోకి వచ్చింది , ఆ తరువాతి నాలుగు శతాబ్దాలలో విదేశీ పాలకుల నిరాదరణ , యుధ్దాలవలన కలిగిన క్షతి లతో చాలా భాగం నేలమట్టమైంది . తిరుమల నాయకరు మనుమడు తిరుచరాపల్లిలో కట్టించుకున్న భవనానికి యీ మందిరంలో వున్న కర్రనగషీలను , రత్నాలను తొలగించి తీసుకు పోవడం కూడా యీ భవన నిరాదరణకు ఒక కారణంగా చెప్తారు .
ఈ భవనంలో మఖ్యంగా తిరుమల నాయకరు కాలానికి చెందిన పైంటింగ్స్ , యిప్పటికీ చెక్కుచెదరని పెద్దపెద్ద రాతి స్థంబాలు , రాణిమందిరంలో ద్వారాలకు వుపయోగించిన నగిషీలు , గోడలకు పైకప్పులకు వుపయోగించిన రంగులు , నగిషీలు చూడదగినవి .
ప్రతీరోజూ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరచివుంటుంది . ఈ భవనం చూడాలంటే ప్రవేశరుసుము చెల్లించాలి . ప్రతీరోజూ సాయంత్రం 6-45 నిముషాలకి లైట్స్ అండ్ సౌండ్ షొ యింగ్లీషు లో వుంటుంది , 8 గంటలకు తమిళంలో వుంటుంది .
ఈ భవనాన్ని చాలా సినిమాలలో వుపయోగించుకున్నారు . అందులో కొన్ని మణిరత్నం ‘ బొంబె ‘ , ‘ గురు ‘ సినిమాలు . ఈ భవనం లో యెన్నో తమిళ శాసనాలని కూడా చూడొచ్చు .
తిరుమల నాయకర్ భవనం చూసేక మధురై నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో వున్న ‘శ్రీవిల్లు పుత్తూరు ‘ గురించి తెలుసుకుందాం . సాధారణంగా పర్యాటకులు మధురై కోవెల చూసి వచ్చేస్తూ వుంటారు , యిక్కడ యాత్రలకి వెళ్లేవారికి నా సలహా యేమిటంటే ముందుగా మీరు వెళ్లే ప్రదేశాన్ని యెంచు కొనేటప్పుడు ఆ చుట్టుపక్కల వున్న ముఖ్య ప్రదేశాలగురించి గూగుల్ చేసుకొని చూడండి , ఆ ప్రదేశాల ప్రాముఖ్యతను తెలుసుకోండి అప్పుడు మీ ప్రోగ్రాం యెన్నిరోజులో నిర్ణయించుకొని తిరుగు రిజర్వేషను చేయించుకొని అన్నీ సావకాశంగా చూసుకొని రండి . రామేశ్వరం వెళ్లే యాత్రీకులు సాధరణంగా ఓ అరపూట మధురై మీనాక్షిని దర్శించుకోడానికి కేటాయిస్తారు , అరపూటలో మీనాక్షి కోవెల మొత్తం చూడ్డానికే సరిపోదు , తిరుపనకుండ్రం , తిరుమల నాయకరు భవనం , శ్రీవిల్లుపుత్తూరు యివన్నీ యెక్కడ చూడగలరు ? . రామేశ్వరం యాత్రలు పదేసిమార్లు చేసినవారు లేరుకదా ? యేదో చేసేయాత్రలు తీరుబాటుగా అన్నీ ఒకేసారి లేదా ఓ రెండు సార్లలో పూర్తి చేసుకునేటట్లుగా ప్లాను చేసుకుంటే బాగుంటుందనేది నా సూచన .
సరే యిక అసలు కథలోకి వస్తే శ్రీవిల్లు పుత్తూరు లో అడుగుపెడుతూనే అదొక చిన్న సాంప్రదాయ గ్రామం అని అర్దమౌతుంది . పొడవైన నాలుగు వీధులున్న గ్రామం , చాలా యెత్తుగా అంటే సుమారు 192 అడుగుల యెత్తైన పదకొండు అంతస్థులలో నిర్మితమైన రాజగోపురం గ్రామంలో యే మూలనవున్నా కనిపిస్తూ వుంటుంది . ఈ మందిరాన్ని ‘ పెరియ ఆళ్వారు ‘ తనకు రాజుల ద్వారా వచ్చిన కనకరాశులను వెచ్చించి నిర్మించి వటపత్రశాయికి అంకితమిచ్చినట్లు చెప్తారు .
వైష్ణవ మందిరాలను గురించి చెప్పినప్పుడు ఆళ్వారుల గురించి చెప్పేను , అవి చదవని వారికోసం మరొక్కమారు చెప్తాను ఆళ్వారులు అంటే విష్ణుమూర్తిని గురించి యెన్నో గ్రంథరచనలు చేసి విష్ణు చింతనలోనే గడిపి విష్ణు సాన్నిధ్యం పొందిన పరమ భక్తులు . మొత్తం 12 ఆళ్వారులలో ఆధ్యుడు పెరియ ఆళ్వారు అని కొందరు , 8 వ ఆళ్వారు అని కొందరు అంటారు . ఇతను 9 వ శతాబ్దానికి చెందిన వాడు , విష్ణుమూర్తిని ఆశీర్వదించి విష్ణుమూర్తికన్నా పెద్ద అని నిరూపించుకున్న వాడు కాబట్టి యితనికి పెరియ ఆళ్వారు అనే పేరు వచ్చింది . ఈ కోవెలలో మూడు పుష్కరిణిలు , బృగు , మార్కండేయ ఋషులు , ఆళ్వారుల విగ్రహాలువుంటాయి , లోపల ఒక కోవెల గోదాదేవి ది రెండవది వటపత్రసాయిది .
కోవెలలో వున్న ఒక పుష్కరిణికి యెదురుగా తులసి వనం , అక్కడ గోదాదేవి పసిపిల్లగా పెరియ ఆళ్వారుకి దొరకిన ప్రదేశం ( చిన్న గుంత ) వుంటాయి , గోదాదేవిని 12 ఆళ్వారులలో ఒక ఆళ్వారుగా లెక్కిస్తారు . చాలా పెద్ద కోవెల , కోవెలలో అద్దాలగది , పల్లకి వుంటాయి , ఓ పక్క కోవెలకి చెందిన బావి , ఈబావి నీటినే పెరియ ఆళ్వారు స్నానానికి వుపయోగించేవారట , కోవెలలోనే అతను నివసించేవారట .
ఈ కోవెల వైష్ణవ 108 దివ్యదేశాలలో అత్యంత ముఖ్యమైనది కూడా .
ఈ మందిరంలో రోజూ ఆరుపూజలు ‘ తెంకాలై ‘ పధ్దతిలో జరుగుతాయి , ధనుర్మాసంలో ‘ తిరుప్పావై ‘ పూజలు జరుపుతారు . ప్రతీ సంవత్సరం ‘ ఆఢిపూరం ‘ పూజ ( ఆషాఢ మాసంలో జరిపే పూజలు ) , గోదాదేవి జన్మదిన వేడుకలు ఆషాఢమాసంలో జరుపుతారు . ప్రతీరోజూ గోదాదేవి ( ఆండాళ్లు ) ని పల్లకిలో మందిరమంతా వూరేగిస్తారు . గోదాదేవికి అలంకారం అంటే యిష్టమట , అలంకారం తరువాత అమ్మవారిని అద్దాల మందిరంలోకి తీసుకు వెళ్లి అక్కడనుంచి వటపత్రశాయి మందిరం యెదుట కొద్దిసేపు వుంచి అప్పుడు అమ్మవారిని ఆమె మందిరానికి తీసుకు వెళతారు . ప్రతీరోజూ స్వామిని అలంకరించే తులసిమాలలు అమ్మవారికి అలంకరించేక వాటిని తీసి స్వామికి సమర్పిస్తారు . అలా చేస్తేనే స్వామి మాలను స్వీకరిస్తాడట .
గోదాదేవికి పరమాణ్ణం నైవేద్యంగా సమర్పిస్తారు . ఆషాఢమాసంలో గోదా కళ్యాణం మూడురోజుల వేడుకగా జరుపుతారు . ఆ సమయంలోనే గర్భగుడిలో ఓ గదిని తెరిచి అందులోని పెరియ ఆళ్వారు స్వామికి సమర్పించిన పంచపాత్ర మొదలయిన వస్తువులతో స్వామికి పూజలు జరిపి తీర్ధం యిచ్చి శఠగోపం పెడతారు , మేము వెళ్లినప్పుడు అనుకోకుండా ఆ రోజే ఆ పండగ రోజు కావడంతో ఆ తీర్ధం పుచ్చుకొని శఠగోపం పెట్టించుకునే అదృష్టం కలిగింది . ఒక్క అరగంటమాత్రమే (11-30 నుంచి 12 వరకు ) ఆ వేడుక జరుపుతారు .
ఆ మందిరం లో తిరుగుతున్నంత సేపూ ఒక అనుభూతిని పొందేను , అలా కొన్ని మందిరాలలోనే జరుగుతుంది .ఇక స్థలపురాణానికి వస్తే గోదాదేవి గురించిన కధ మనకి తెలిసినదే , కాని తెలియని వారి కోసం మరోసారి చెప్తాను . మాకు చిన్నప్పుడు తెలుగు లో పాఠ్యాంశం గా వుండేది . ఆరు యేడు తరగతులకు అనుకుంటాను . అప్పుడు చదివిన కథ యిప్పటికీ గుర్తేనాకు , యెందుకో ఆవయసులో గోదాదేవి , ఆమె భక్తి గురించి చదువుతూ వుంటే చాలా బాగుండేది .
ఒక వూరిలో ‘ విష్ణుచిత్తుడు ‘ అనే బ్రాహ్మణుడు పరమ విష్ణు భక్తుడు వుండేవాడు . ఒకసారి పాండ్యరాజైన వల్లభదేవుని సభలో పరమపదం చేరుకొనేమార్గం గురించి జరిపిన వాదనలో విష్ణు చిత్తుడు గెలుపొందగా వచ్చిన బంగారు రాశులను వెచ్చించి వటపత్రశాయికి మందిరం నిర్మించి ఆమందిరంలోనే నివసించేవాడు , ఆమందిరంలోనే తులసివనాన్ని పెంచి రోజూ తులసిమాలలను కూర్చి స్వామిని అలంకరించేవాడు . సంతానములేని విష్ణుచిత్తుడు రోజూ స్వామిని సంతానం కొరకు వేడుకుంటూ వుంటాడు . ఒకరోజు తులసి వనంలో తులసి దళాలు యేరుతున్న విష్ణు చిత్తునకు పసిపాప దొరుకగా ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకునేవాడు . గోదాదేవి తులసివనంలో తిరుగుతూ తులసిమాలలు అల్లుతూ పెరగసాగింది . భక్తిగా తులసిమాలలు అల్లి స్వామివారి కైంకర్యానికి సమర్పించేది . కాని ముందుగా తాను అలంకరించుకొని అద్దంలో చూసుకొని అప్పుడు స్వామికి అర్పించేది . ఒకనాడు స్వామికి తులసిమాలను అర్పిస్తున్న విష్ణుచిత్తుడు తలవెంట్రుక తులసిమాలలో వుండడం చూసి మరునాడు మాల అల్లుతున్న గోదాదేవిని చాటునుంచి గమనించగా స్వామివారిమాలను ముందుగా గోదాదేవి అలంకరించుకోడం చూస్తాడు . గోదాదేవిని దండించి మరునాటినుంచి తానే మాలలు అల్లి స్వామికి సమర్పించగా స్వామి స్వీకరించడు , స్వామి పూజ పూర్తికాక విష్ణుచిత్తుడు ఆహారం త్యజించి మందిరంలోనే వుండి స్వామివారిని పరిపరి విధాల వేడుకొనగా స్వామి గోదాదేవి అలంకరించుకునే మాలే తనకు ప్రియం అని చెప్తాడు . అప్పటినుంచి గోదాదేవి అలంకరించుకున్నమాలనే స్వామికి అలంకరిస్తారు .
యుక్తవయస్కురాలైన గోదాదేవి కొరకై వరుని వెతుకుతున్న విష్ణుచిత్తునితో తాను విష్ణుమూర్తిని తప్ప వేరొకరిని వివాహమాడనని చెప్తుంది . విష్ణు సన్నిధిలో అతనిని సేవించుకుంటూ వుండిపోతుంది . ఎన్నివిధాలుగా చెప్పినా వినని గోదాదేవి మార్గశిరమాసంలో ( ధనుర్మాసం లో ) ప్రతీరోజూ తులసి కి పూజాదికాలు నిర్వహించగా ధనుర్మాసాంతంలో శ్రీరంగం లో కొలువై వున్న శ్రీరంగనాధుడు స్వయంగా వచ్చి ఆమెను వివాహమాడి వటపత్రశాయిలో ఐక్యం అయేడట , గోదాదేవి లక్మీదేవిలో ఐక్యం అయిందట . విష్ణు చిత్తుడు గోదాదేవిని వివాహమాడిన విష్ణుమూర్తిని మామగారి హోదాలో ఆశీర్వదించేడట , అప్పటినుండి విష్ణుచిత్తుడు ‘ పెరియ ఆళ్వారు ‘ గా పిలువబడసాగేడు . రంగనాధస్వామి వివాహం చేసుకుంటాడని విన్న గోదాదేవి సంతోషం పట్టలేక శ్రీరంగనాధుని పరుగెత్తుకొని వెళ్లి శ్రీరంగనాధునిలో ఐక్యం అయినట్లుగా కొందరు చెప్తారు .
ఏదియేమైనా గోదాదేవి ఆండాళ్లుగా ప్రతీ విష్ణుకోవెలలోనూ పూజలందుకుంటోంది .ఉత్సవ సమయాలలో వేంకటేశ్వరునికి పూల మాలలు శ్రీవిల్లుపుత్తూరులో ఆండాళ్లుని అలంకరించిన వాటిని తెచ్చి అలంకరిస్తారు .ధనుర్మాసంలో ‘ తిరుప్పావై ‘ చదివితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని , తులసి కోటలో దీపం వెలిగిస్తే కోరినకోర్కెలు తీరుతాయని అంటారు .
కొన్ని శతాబ్దాల తరువాత ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకు యిద్దరు కుమార్లు , వారి పేర్లు విల్లి , కందన్ ఓనాడు వారు వేటకు వెళ్లి యిద్దరూ చెరోవైపు అడవిలో వేటాడుతూ వుండగా కందన్ పులివాతపడి మరణిస్తాడు , విల్లి కందన్ ను వెతుకుతూ కందన్ కానరాక విసిగి ఓ చెట్టుకింద విశ్రమించగా కలలో అశరీరవాణి కందన్ వున్న ప్రదేశం గురించి తెలియజేస్తుంది .
కందన్ శరీరం కొరకు వెళ్లిన విల్లి యీ మందిరాలను కనుగొంటాడు . అందుకు ఆప్రదేశానికి ఆ రాజకుమారుని పేరుమీదుగా ‘ శ్రీవిల్లి పుత్తూరు ‘ గా పిలువబడసాగింది . రాజకుమారుడు విల్లి యీ మందిరాన్ని పునరుద్దరించేడు . తరువాత రాజ్యాన్ని పరిపాలించిన విజయనగరరాజులు , నాయకర్లు మందిరానికి మంటపాలను , ప్రహారీల నిర్మాణం చేసేరు .
వచ్చేవారం మరో ప్రదేశాన్ని సందర్శిద్దాం , అంతవరకు శలవు .