ప్రాణ వాయువు - ఆర్.సి. కృష్ణస్వామి రాజు

pranavayuvu

ఆనగొంది  రాజ్యానికి   రాజు ఐన ఆనంద వర్మకు వింత సమస్య ఎదురైయింది.తమ రాజ్యంలో పుట్టిన బిడ్డలు పుట్టినట్లే చనిపోవడం రాజుగారికి తీవ్ర సమస్యగా తయారైయింది .కొందరు పుట్టి చని పోతుండగా, మరి కొందరు తల్లి కడుపులోనే చనిపోసాగారు. ప్రజల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి.ఎప్పుడూ ఇండ్లు వదిలి బయటికి రాని మహిళలు సైతం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు.

గర్భిణీ స్త్రీలకు బలవర్ధకమైన ఆహారం లేక ఇలా జరుగుతోందేమోనని పచ్చి బాలింతలకు పౌష్టికాహారం పంపిణి చేసారు.అయినా సమస్య పరిష్కరింపబడ లేదు.

విషయాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక రాజు తమ ఆస్థాన జ్యోతిష్కుడిని   సంప్రదించినాడు. ఆస్థాన జ్యోతిష్కుడు రాజు అనుమతితో రెండు వారాల పాటు రాజ్యమంతా తిరిగి రాజుకు ఇలా విన్నవించాడు. “గర్భవతులైన స్త్రీలు గర్భ రక్షంబికా దేవి కి పూజలు చేయాలి. వారు ప్రతీ నెలా ఒక చెట్టును నాటాలి. నాటే చెట్టు ప్రాణ వాయువును అందించే  రావి ,కానుగ,వేప,మేడి చెట్టు అయితే  మంచిది.   వారు సుఖ ప్రసవం జరిగే వరకు ఇలా చేయడం ద్వారా తల్లికీ, పుట్టబోయే బిడ్డకీ మంచి జరుగుతుంది” అని  సెలవిచ్చాడు .

కొన్ని నెలల తర్వాత చక్కటి ఆరోగ్యవంతమైన శిశు జననాలు  మొదలయ్యాయి. రాజు పరమానందభరితుడయ్యాడు. ప్రజల సమక్షంలో రాజు ఆస్థాన జ్యోతిష్కుడికి సన్మానం చేశాడు . సన్మాన సభలో జ్యోతిష్కుడు "రాజా ! పట్టణీ కరణ మాయలో పడిన రైతులు పల్లెల్ని విడిచి వెళ్తున్నారు. యాంత్రీకరణ మోజులో పడిన రైతులు వృక్ష జాతి అభివృద్ధిని విస్మరించినారు. చెట్లను నాటడం, పెంచడం తగ్గించినారు. పెద్ద పెద్ద చెట్లను చిన్న చిన్న  అవసరాలకు నరికేశారు. చెట్లనునాటి  పెంచి పెద్ద చేయడం ఎంత కష్టమో మరచినారు. పచ్చటి చెట్లు పెరికేస్తే పచ్చటి తమ జీవితాలు పాడైపోతాయని  గుర్తించలేక పోయారు.  'చెట్టు లేని చేను, చుట్టం లేని ఊరు' ఎలా ఉంటాయో మీకు తెలిసిందే కదా. అందుకు ప్రతిఫలంగా ఇన్నాళ్లూ  శిశు మరణాల ద్వారా భారీ మూల్యం చెల్లించినారు. చెట్ల లేమి వల్ల ప్రకృతిలో ప్రాణ వాయువు కరువైయ్యింది.అందుకే గర్భిణీ స్త్రీలకు మంచి ప్రాణ వాయువు లభించక పుట్టిన బిడ్డలు పుట్టినట్లే మరణించినారు. వంశాల అభివృద్ధి కుంటుపడింది.

ఈ మధ్య కాలంలో  గర్భిణీ స్త్రీలు పచ్చటి చెట్లను నాటడం ప్రారంభించాక రాజ్యంలో వృక్ష సంపద పెరిగింది.ప్రజలకు పోగొట్టుకున్న ప్రాణవాయువు పొందినట్లైయింది.  చెట్లు నాటే కార్యక్రమానికి ముందు పూజ చేయడం ద్వారా స్త్రీలు శుభ సంకల్పానికి సిద్దమైనారు. కార్యం మీద వారికి కన్ను పడినట్లైయింది. వారు  సంకల్ప  బలంతో చెట్లు నాటడం వల్ల చెట్లు చక్కగా ఎదిగాయి. అంతేకాక శుభ  సంకల్పంతో వున్నారు కాబట్టి వారిలో మంచి ఆలోచనలు మొదలయ్యాయి. మంచి ఆలోచనల వల్ల వారి శరీరం ఆరోగ్యవంతంగా తయారైయింది. మంచి ప్రాణవాయువును పీల్చడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి శిశువులకు మంచి పోషకాలు లభించాయి. శిశు జననాలు జరిగాయి.

వృక్షో రక్షతి రక్షితః అని పెద్దలు చెప్పినారు కదా. వృక్షాన్ని మనం కాపాడితే వృక్షం మనల్ని కాపాడుతుందని మనకు తెలిసిందే కదా” అని వివరించాడు.

ప్రజలు చేతులారా చేసుకున్న తప్పు  తెలుసుకున్నారు.అప్పటినించి భావితరం బాగు కోసం చెట్లు  నాటడం, పెంచడం ప్రారంభించారు. వంశాభివృద్ధి జరిగింది. ఆనగొంది రాజ్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వెలుగొందింది.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు