అన్నవరం సత్యదేవుడు - ఆదూరి.హైమావతి

annavaram satyadevudu

అన్నవరం సత్యదేవుడు .
మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ

త్య్రైక్య రూపాయతేనమః " ఇది సత్యదేవుని స్తుతి.


హిందువులకంతా సత్యనారాయణ స్వామి అంటే అమిత భక్తి. చాలా కుటుంబాల వారు ప్రతి పౌర్ణమికీ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోడం ఆనవాయితీ. సత్యదేవుడంటే సత్యం పాటించే వారికి రక్షణగా ఉండేవాడు. అమిత ప్రభావం కల దేవుని గా ఈ స్వామి ని కొలుస్తారు.

అన్నవరం  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లా లో ఉంది. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం  రత్నగిరి కొండమీద ఉంది.ఈ ఆలయ నిర్మాణం జరిగి ఒక శతాబ్దం  మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్తి  పొందింది.దీనికి కారణం ఈస్వామివారి మహిమే.

ఖరనామ సం.శ్రావణ శుక్ల విదియ నాడు అనగా 1891ఆగస్ట్ 6న. మఖా నక్షత్రంలో అన్నవరం లోని  పంపానదీ తీరాన రత్నగిరిపై అంకుడు చెట్టుక్రింద స్వయంభూ గా వెలిశారు ఈ దైవం. .

వైశాఖ శుధ్ధ  ఏకాదశిన ప్రతి ఏడాదీ కళ్యాణం జరుపుతారు .పంపానది  జీవనదిలా పారుతుంటుంది.  కొండపైన ఉన్న ఈ దేవాలయంలో  శ్రీ సత్యనారాయణ స్వామి ని దర్శించేందుకు గుడి వరకు ఘాట్ రోడ్డు ఉంది. మెట్లు కూడా ఉన్నాయి.ఇక్కడ వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొంటూ ఉంటారు.

ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం =  అన్నవరం) గామారింది అంటారు.  
ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు స్వామి ని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం ఉచితమే.
స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక  శ్రీమహా విష్ణువు గురించి తపస్సు చేసి , ఆయ న అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. 

ఒకరు భద్రుడు, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రా చలంగా మారుతాడు.రత్నకుడు  కూడా విష్ణువు గురించి తపస్సుచేసి ఆయన్ను మెప్పిం చి మహావిష్ణువు రానున్నకాలంలో  వెలసే  శ్రీ వీర వేంకట సత్యనారా యణ స్వామిగా ,ఆయన నివసించే  రత్నగిరి, లేదా రత్నాచలం కొండ గా మారుతాడు.

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవం  ప్రతి ఏడాది  వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహు ళ పాడ్యమి వరకు  మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్య దేవుని బ్రహ్మోత్సవాలు అంటారు.

క్రీ.శ. 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామా నారాయణిం బహద్దూరువారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరి మీద వెలుస్తున్నాను. శాస్త్ర ప్రకారం ప్రతిష్టించి పూజించమని చెప్పాడుట. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంట బెట్టుకుని వెళ్ళి వెతికి, ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి ఆనం దించి, తెచ్చి, కాశీనుండి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి 1891, ఆగస్టు 6 వ తేదీన ప్రతిష్టించి, ఆ యంత్రంపై స్వామి ని దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా ప్రతిష్టించారు.

ఆలయ నిర్మాణం 1934 లో  రెండు అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతా మూర్తులు. ప్రధాన ఆలయం రధాకారంలో నాలుగువైపులా చక్రాలతో నిర్మింప బడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తుంటుంది. ఈ స్వామిని మూలం బ్రహ్మ, మధ్య భాగం ఈశ్వరుడు, పై భాగం మహ విష్ణువుగా, త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు.

ఆంధ్రులు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యన్నారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో తప్పకచేస్తారు. వివాహా నంతరం, పుట్టు పండుగలకూ, గృహప్రవేశాల సమయంలో నూ, ఇంకా అనేక  సందర్భాలలో హిందువులు,ముఖ్యంగా ఆంధ్రులు ఈ సత్యదేవుని వ్రతం తప్పక చేస్తారు.   చాలా మంది  ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవడం కోసం అన్నవరం వస్తారు. హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం లో ఎంతోమంది భక్తులుస్వామి దర్శనం కోసం  వస్తుంటారు.  రత్న గిరి పై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు