హ్యూమరసం - వారణాసి రామకృష్ణ

 

ధర్నా

మా దోస్తు అయోమయం అప్పారావు నడి రోడ్డు మీద నిలబడి ధర్నా చేస్తూ కనిపిస్తే ‘ఏంట్రా ధర్నా చేస్తున్నావ్?’ అడిగా.’ధర్నానా పాడా!నా మొహానికి అదోక్కటీ తక్కువ! రోడ్డు దాటు తున్నా!’ అన్నాడు. రోడ్డు దాటేవాడివి ఒక చివర్లో నిలబడి చూసుకుని రోడ్డు దాటాలి కానీ అడ్డం పడి ధర్నా చేస్తున్నట్టు దాటితే ఎట్లారా బాబూ?!అని కారు ఎక్కించుకుని ‘ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా పద’ అంటే ‘అమ్మో! ఇంట్లోకి వెళ్లనీకుండా మా ఆవిడా ధర్నా చేస్తోంది’భయంగా అన్నాడు. ఆశ్చర్యoగా అనిపించి విషయం ఏంట్రా అడిగితే ‘పొద్దున్నే సరుకులలిస్టు ఇచ్చి తెమ్మని చెప్పింది. బైటికి వచ్చి చూస్తే రోడ్డు మీద ధర్నాలే ధర్నాలు!దాంతో అప్పారావు రోడ్డున పడ్డాడు’ చెప్పి నవ్వాడు. ధర్నాగురించి రోడ్డు మీద ధర్నా చేస్తున్నట్టు ఎందుకూ? కూచుని డీటైల్డ్ గా మాట్లాడుకుందాం, పద అని కారు హోటల్ ముందు పార్క్ చేశాను,చేసిన చోట పార్కింగ్ ‘ఈజ్ అట్ ఓనర్స్ రిస్క్’ అని రాసుంది. చదివి నవ్వుకుని ‘పద!ఇవాళ నువ్వు చూసిన ధర్నాల ముచ్చట్లు చెప్పుకుందాం’ అంటూ లోపలికి దారి తీశాను.

అక్కడ అప్పారావు పొద్దునించి చూసిన ’ ధర్నా’ కత లిలా  చెప్పుకొచ్చాడు ...

 

***    *****    ******

ఇసిత్రమైన కంట్రీ ఏంది అంటే ఇండియానే! అప్పుడెప్పుడో బ్రిటీషోడ్ని లొంగదీసుకున్దామని కనిపెట్టిన ధర్నాఅయిడియా ఇప్పుడు మన కాళ్ళకే అడ్డం పడుతోంది! ముందుకుపోకుండా మనకి మనమే తాళ్ళు కట్టుకునేలా ధర్నాలు మారిపోయాయి! ప్రతి చిన్నపెద్ద విషయానికీ రోడ్డెక్కిధర్నాచెయ్యటం ట్రాఫిక్కు జాంచేసి జనాన్నిఏడిపించటం! పొద్దున్నసరుకులు తెద్దా మని బైటికొచ్చిఆటోకోసం చూస్తే బోలెడన్నిఆటోలు వరుసగా రోడ్డుకు అడ్డం పెట్టిఉన్నాయి. ఏమయ్యాబాబూసంగతిఅంటేమాడిమాండ్స్ నెరవేరాలంటే ధర్నాతప్పటం లేద్సార్ అన్నారు. ఏంటయ్యా మీ డిమాండ్స్ అంటే ‘ఆటోలకి మీటర్లు తొలగించాలి!మేము వెళ్తున్నచోటుకి ప్రయాణీకులు రావాలి తప్ప వాళ్ళు కోరుకునే చోటుకి మేము వెళ్ళం! ఒకేలా అలా వెళ్ళాలి అంటే మేము అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.ఇది కార్యరూపం దాల్చేవరకు ఆటోల ధర్నా కొనసాగుతుంది’ అన్నారు ఆటోలు అడ్డంపెట్టి! పెజాసామ్యం లో ఎవుడికీ ఏమీ సెప్పలెం కనక వాళ్ళని తప్పుకుని బస్సు లో పోదామని ముందుకు పోతే మరో పెద్ద గుంపు బస్టాపు కి కొంచెం దూరం లో ఎదురైంది. ఖాళీగా వున్న నా చేతిలో జెండా పెట్టి ‘మీరూ వచ్చిపోయే వాహనాలని ఆపండిసార్’ అన్నారు. ఎందుకూ అంటే ఆర్టీసి బస్సులు బస్టాపులోనే ఆపాలని ధర్నా చేస్తున్నాం! చెప్తే ఉలిక్కిపడి అదేంటి?బస్సులు బస్టాపులోనే కదా ఆపేది! ఆశ్చర్యంగా అంటే ఎర్ర బస్సు దిగి య్యాడ్నించి వచ్చారు సార్? బస్టాపులలో బస్సులు ఆగక పుష్కర కాలం దాటింది అన్నారు నవ్వుతూ. బస్సులు ఆగుతాయి కాబట్టె దానికి బస్టాపు అన్న పేరు వచ్చింది.అవికాక మరిoకేం ఆగుతాయి అంటే అటుచూడండి అన్నారు.అక్కడ బస్టాపులోఒకడు వేడి వేడి ఇడ్లీలుదోసెలు వేస్తున్నాడు. ఇంకోడు నోరు మూతి కడిగి పుక్కిలించి వుమ్మేస్తున్నాడు.ఒక పెద్దావిడ ప్లేట్లు గిన్నెలు బరబరా తోమేస్తోంది! ఇంకో ఇద్దరు డార్మెట్రి లో పడుకున్నట్టు అడ్డంగా ఇనుపబెంచీ మీద టవల్ పరిచి గుర్రులు పెడుతూ నిద్రపోతున్నారు.మరో ఇద్దరు నింపాదిగా సీసా ఎత్తి కబుర్లాడుతున్నారు. పక్కనే ఒక స్త్రీ నిలబడి ఉంది నన్ను చూడగానే నవ్వుతూ కను సైగలు చేసింది. ఉలిక్కిపడి ప్రక్కకి చూపు మరలిస్తే వాళ్ళ జాతే ఇంకొందరు మహిళలు ధర్నాచేస్తూ మా వృత్తి మేము స్వేచ్చగా చేసుకునేలా లైసెన్సు లివ్వాలి. బస్టాపుల్లో బేరసారాలు జరుపుకునే సౌకర్యాలు కల్పించాలి!అంతవరకు బస్టాపుల్లోనే ధర్నాకొనసాగిస్తాం! గట్టిగా అరుస్తున్నారు. ఇంతలో బోలెడుమంది విద్యార్ధులు ధర్నాచేస్తూ వచ్చారు. చేతిలో ప్లకార్డులు ఉన్నాయి వాటి మీద ‘న్యాయం జరగాలి! పరీక్షల్లో మేము రాసిన ఆన్సర్లకి మార్కులు వెయ్యాలి. సమాధాన పత్రాల్ని అధ్యాపకులచేతే దిద్దించాలి’ అన్నఅక్షరాలూ కనిపించాయి. గోలగోలగా అరుస్తూ వాహనాల్ని ఆపేస్తున్నారు! ఒక కుర్రాడ్ని పట్టుకుని ఇదేం ధర్నాబాబూ అడిగితే ‘ఏం చెప్పమంటారు సార్ మా బాధలు! ఒక కిచెన్ ఎక్సట్రా టాయిలెట్ వుంటే చాలు ఇంట్లోనే కాలేజీ ఒపిన్ చేసేస్తున్నారు. అప్లయి చేసుకుంటే దానికి యూనివర్సిటీ గుర్తింపూ ఇచ్చేసి అడ్మిషన్లు కానిస్తున్నారు. క్లాసు రూములు ల్యాబు ఫెసిలిటీలు ఉండవు. లెక్చరర్లు ఉండరు. సాంఘిక శాస్త్రం పరీక్షలో ఆల్జీబ్రా ప్రశ్నలు ఉంటాయి.  సైన్స్ పేపర్ లో బీర్బల్ మీసాలకి ఏ నూనె పెట్టాడు అని అడుగుతారు.లెక్కల పేపర్ లో అశోకుడు నాటిన చెట్టుకొమ్మతో నాలుగు పీకితే వీపు మీద ఎన్నివాతలు తేలుతాయని ప్రశ్నిస్తారు! ఇంగ్లీషు పేపర్లో మ్యాపు ఇచ్చి నల్లపోచమ్మ దేవాలయాన్నిగుర్తింపుడు అంటారు.సరే ఏదోలా ఏదోనేర్చుకుని రాస్తామా జవాబు పత్రాలు పోగొడతారు. అధికారి బామర్ది’ఖాళీగా వున్నాను బావా అంటే’ ఐతే పేపర్లు దిద్దు పైసలోస్తాయి అని అతనిచేత దిద్దిస్తారు. కష్టపడి చదివి సమాధానాలు రాసిన వాడికి జీరో వస్తుంది,పిచ్చిగీతాలు హీరొయిన్ బొమ్మలుగీసినవాళ్ళకి వందమార్కులువస్తున్నాయి. అసలు పరీక్షకే అటెండ్ అవనివాడూ ప్యాస్ అయినట్టు వస్తోంది! ఇన్ని సమస్యలతో ఎట్లా చావాలి సార్?అందుకే ధర్నా చేస్తున్నాం’ అన్నాడు.

రోడ్డుకు అవతల మరో గుంపు తమాషాగా అందరూ వెనక్కి నడుస్తు కనిపించారు. రోడ్డుకు అడ్డంగా అటు ఇటు వెనక్కి నడుస్తుంటే చూట్టానికి వింతగా భలే ఉంది. ఏంటి విషయం అంటే ‘ఇదో వినూత్న ధర్నా’ అన్నారు. మీ ధర్నాకి ఏమిటయ్యా కారణం అంటే జిందగీలో మేమూ వెనక పడ్డాం.ముందుపడే ఆలోచనలో మమ్మల్నీవెనక బడ్డ జాబితాలో చేర్చాలని ధర్నాచేస్తున్నాం. చేర్చేవరకూ ఇలాగె వెనక్కి నడుస్తూ ధర్నాచేస్తాం! అన్నారు.

ఇంకొందరు అర్ధ నగ్నంగా ధర్నా చేస్తున్నారు. ఎందుకూ అంటే మేము ఆఫీసు లో పనిచెయ్యక పోయినా హాజరు కాకపోయినా జీతం ఇవ్వాలి ప్రమోషన్లు ఇవ్వాలి అన్నారు. 

ఇంతలో జనం ఒక హారం లా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ధర్నాచేస్తూ నిలబడ్డారు ఎవరు వీళ్ళు అనుకునే లోపలే ‘ధర్నా చేస్తున్నాం ఎయిడ్స్ మానవహారం సార్! రండి మీరూ భాగస్వాములుకండి’ అని చెయ్యి సాచాడు! భాగస్యామ్యం ఎందులో కావాలి అంటే ఎయిడ్స్ లో సార్! చెప్తే ఉలిక్కిపడి చెయ్యి వెనక్కి లాక్కుని  ఎయిడ్స్ లో భాగస్యామ్యమా అంటే అదేసార్ ఎయిడ్స్ నిర్మూలనా అవగాహనా కార్యక్రమo ధర్నాలో పాల్గొనండి అంటూ కండోం ప్యాకెట్ చేతిలో పెట్టారు. ఇంతకీ దీంతో నేనేం చెయ్యాలి అంటే పాల్గొన్న ప్రతిసారి ఉపయోగించండి సార్ చెప్పారు. అయ్యా!నేను పాలు కొన్నా పెరుగు కొన్నా మా షాపులోనే తప్ప మరెక్కడా కొనను! చెప్పినా, ‘ఎయిడ్స్ నిర్మూలన కార్యక్రమం విజవంతంగా జయప్రదా జయసుధని చేయ్యాలంటే మీరు పాల్ గొని పడగ్గదిలో వుపయోగించి మరింత మందిని కార్యోన్ముఖం చెయ్యాలి’ అన్నారు. అయ్యా బాబోయ్! దండం పెట్టి పక్కకి జరిగాను. ఈ టైపులో ఇంకా బోలెడు ధర్నాలు పొద్దునించి సాయంత్రం దాకా ఎదుర్కుని సివరాఖరికి నడిచి సామాన్లదుకాణం దగ్గరికి ఆయాసంగా చేరేసరికి షాపు ముందు బోలెడు మంది అక్కడా ధర్నా చేస్తూకనిపించారు. వీళ్ళు ఎవరని కనుక్కుంటే షాపు యజమానులట,వాళ్ళ షాపుముందు వాళ్ళే అడ్డంగా నిలబడి రాళ్ళేస్తూ ధర్నా చేస్తున్నారు. ‘యూ టూ బ్రూటస్’ అన్న టైపు లో ఫేసుపెట్టి ధర్నా దేనికీ అడిగితే పది పైసల వస్తువు కి పావలా GST కట్టమంటే ఎట్లా సార్? అందుకే ఈ పన్నులు తన్నులు ఎత్తేయ్యాలని ధర్నాచేస్తున్నాం అన్నారు. ఒరినాయనోయ్! దేశం నిండా వింత వింత ధర్నాలే ధర్నాలు అనుకుని ఖాళీ సంచితో ఇంటికెళ్తే గుమ్మంలో మా ఆవిడా ధర్నాచేస్తూ లోనికి వెళ్ళే వీల్లేదు అంది! అదేంటి?నివ్వెరబోతే ‘మార్కెట్లో ధరలు ఎండల్లా మండిపోతున్నాయి. చుక్కల్లా ఆకాశంలో అందకుండా అయ్యాయి! మీరిచ్చే జీతం డబ్బులు సెల్, టీవీల రీఛార్జింగులకి సరిపోట్లేదు ఈ నెల నుంచి బడ్జెట్ పెంచాల్సిందే అందుకే ధర్నా!’ అంది.

దాంతో రోడ్డున పడి తిరుగుతుంటే నువ్వు కనిపించావు. క్లుప్తంగా అదీ ధర్నాల సెరిత్ర!

***    ***

ధర్నాకత విని ఆలోచనలో పడ్డాను. చందనా సిస్టర్స్ లో బట్టలు కొని వెలిసిపోతే  వాపసు తీసుకోమని డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి ఇవ్వమని బిల్లు మీద ముద్రిస్తారు! పైసావసూల్ సినిమా చూద్దామని ధియేటర్ కెళ్తే టికెట్ ధర కాలర్ పట్టుకుని మరీ వసూల్ చేస్తారు. ఏ కారణంచేతనైనా సినిమా చూపించక పోతే వసూలు చేసిన పైసలు మాత్రం వాపసు ఇవ్వను పొమ్మంటారు! ఆ ముక్క చింపిన టికెట్ వెనకే ముద్రిస్తారు! పార్కింగ్ ఫీజు ముక్కు పిండి లాగుతారు గానీ బండిలో పెట్రోల్ పోయినా, అసలు బండే పోయినా బాధ్యత వాళ్ళకి ఉండదని రసీదులో స్పష్టం చేస్తారు.

అందరి తలలకి అధికారం కావాలి గానీ ఎవడి నెత్తిమీద బాధ్యతలు వద్దు!అందుకే శాసన సభలలో చేసే చట్టాలు సైతం హక్కులకే గానీ బాధ్యతల పట్ల బాదర్ కావడం లేదు. సముద్రం లో అలలు ఒడ్డును డీ కొంటున్నట్టు సమస్యలు ప్రతి రోజు ధర్నాల రూపoలో రోడ్లను డీ కొడుతున్నాయి. ‘సరే పద మాఇంటికి పోదాం’ అని కారుకోసం పార్కింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ ధర్నా చేస్తున్న జనం ‘పార్కింగ్ ప్లేస్ లో బండి దొంగతనానికి గురయితే హోటల్ ఓనర్ పరిహారం చెల్లించాలి’ అంటూ అరుస్తు కనిపించారు! అయోమయం అప్పారావు అదేంటి గురూ ప్రతి చిన్న విషయానికి ధర్నాలు చేస్తున్నారు! మన బండి హోటల్ పార్కింగ్ లో దొంగతనానికి గురయితే అది హోటల్ ఓనర్ బాధ్యతే! పైగా పార్కింగ్ ఈజ్ అట్ ఓనర్స్ రిస్క్ అని రాశాక కూడా మనకేంటి భయo?’ అన్నాడు. చూడు అప్పారావు, పార్కింగ్ చేశాక ఓనర్స్ రిస్క్ అంటే హోటల్ ఓనరు కాదు బండి ఓనరు రిస్కే అని! చెప్తే ‘అవునా?!నేను ఇంత కాలం దైర్యంగా స్కూటర్ పార్క్ చేసి ఏమన్నాఅయితే బాధ్యత హోటల్ ఓనర్దే అనుకున్నానే! అమ్మో! కాదా?’ అంటూ కళ్ళు తేలేసి అయోమయంఫేసు పెట్టి ‘ఇన్నిసమస్యల పరిష్కారాల కోసం ధర్నాలు మొదలెడితే ఎట్లాగురూ బతకడం?’భయంగా అడిగితే, ఓరి అయోమయం అప్పారావు! ధర్నాలకి అంత భయపడితే ఎట్లారా? అసలు ధర్నాని ఆంగ్లంలో Dar..naa అనిరాసి హిందీలో డర్..నా అని అర్ధం చేసుకుంటే పెళ్ళాలకే కాదు ఎంత పెద్ద ధర్నాలకీ భయపడవు అని అర్జునుడికి కృష్ణుడి లెవల్ లో గీతో పదేశం చేశాను. ధర్నాఅంటే ఇప్పుడు మీకూ అర్ధమైందిఅనుకుంటా!అర్ధమైందికదానని‘ధర్నా’ని తేలిగ్గాతీసుకోకండి, ధర్నాచదివాక పక్కపేజీకి వెళ్లిపోతారేమో, కుదరదు.‘ధర్నా’చదివాక లైక్ కొట్టనివాళ్ళనిషేర్ చెయ్యనివాళ్ళని ‘ధర్నా’చేసేoదుకుకిరాయిమనుషుల్నిమాట్లాడుకున్నాం,‘ధర్నా’నిఎదుర్కుంటారా‘డర్..నా’అంటారా చూసుకుందాం! బస్తీ మే సవాల్!!  

    

 

 

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు