సూది, పిన్నీసుల తో మన అనుబంధం - భమిడిపాటి ఫణిబాబు

our relation with pins

అవడానికి పెద్ద ఖరీదైన వస్తువులోకి రాదుకానీ, సూది పిన్నీసు మన జీవితాల్లో చిన్నప్పటినుంచీ ఓ ప్రముఖ స్థానంలో చోటు సంపాదించుకుంది. ఎవరు దీనిని కనిపెట్టారో కానీ, నోబెల్ బహుమతి కి అర్హుడంటాను. ఆ పిన్నీసే లేని మన జీవితాన్ని ఊహించుకోడానికే భయంకరంగా ఉంటుంది. ఎలాటెలాటి క్లిష్ట పరిస్థితుల్లో మన rescue కి వచ్చిందో అసలు గుర్తుందా మీకు? చిన్నప్పుడు గుర్తుండేఉంటుంది, కాళ్ళకి చెప్పులుండేవి కావు, పొలాల్లో వెళ్తూన్నప్పుడో, ఎప్పుడో ఓ తుమ్మ ముల్లులాటిది గుచ్చుకుందనుకోండి, ఇంటికి కుంటుతూ వస్తూనే తెలిసిపోయేది అమ్మకి. "అయ్యో కన్నా.. కుంటుతున్నావేమిటీ ముల్లు దిగిందా... ఏదీ ఆ కాలిలా ఇయ్యి." అంటూ, మన కాలు తన తొడమీద పెట్టేసికుని ఉమ్మిలాటిది రాసి, తన మెళ్ళో గొలుసుకి తగిలించుకున్న ఓ సూది పిన్నీసు తో ఆ ముల్లు గుచ్చుకున్న చోట అటూ ఇటూ కెలికి, ఎంత లోతుగా దిగినా టక్కున తీసేసేది. అప్పటిదాకా విపరీతమైన సలుపు పెట్టిందల్లా హూష్ కాకీ అయిపోయేది. అలా మొదలైన అనుబంధం ఇప్పటికీ అందరి జీవితాలతోనూ పెనవేసుకుపోయింది.

అబ్బ..బ్బ..బ్బ.. ఎన్నెన్ని ఉపయోగాలండి బాబూ, చూడ్డానికి మాత్రం ఏమీ తెలియనిదానిలా అమాయకంగా కనబడుతుంది. ఈ సూది పిన్నీసులకి multi purpose utility ఉంది. పైజమా ల నుంచి పరికిణీలదాకా బొందు ఎక్కించాలంటే ఇవే కావాలి. మళ్ళీ వీటిల్లో వివిధరకాల సైజులొకటీ . చీర పమిటైనా, ఓణీ అయినా జారిపోకుండా ఈ సూదిపిన్నీసులే వాడతారు. ఈ ఆధునిక రోజుల్లో శారీ పిన్నులని ఎన్ని రకాల మాచింగు పిన్నులు వచ్చినా, ఆ good old సూది పిన్నీసుల స్థానం వాటిదే. ఇప్పుడంటే పళ్ళు కుట్టుకోడానికి సుతారంగా ఓ డబ్బాలో వేసే టూత్ పిక్కులూ సింగినాదాలూ కానీ, ఇదివరకటి రోజుల్లో ఏ శనగబద్దో పళ్ళల్లో ఇరుక్కుంటే ఆ సూదిపిన్నీసే గతి ! చెవుల్లో దురద పెట్టిందనుకోండి, ఇప్పుడంటే అవేవో ear buds అని వచ్చాయి కానీ, పాతకాలంలో హాయిగా ఈ పిన్నీసు పెట్టి ఓ తిప్పు తిప్పితే శవనగా ఉండేది మరి! చెవిలో పిన్నీసులు పెట్టుకోవడం తప్పే మరి, కానీ పూర్వపు రోజుల్లో వైద్య సలహాలెవడు పాటించాడూ? పనైపోవడం ముఖ్యం కానీ, రూల్సూ , రెగ్యులేషన్సూ, ఎథిక్సూ మాట్టాడుతూ కూర్చుంటే దురద ఎక్కడ తగ్గుతుందీ?

పైగా ఎక్కడైనా బయట ఈ సూదిపిన్నీసు కనిపించందంటే చాలు, గప్ చుప్పుగా తీసి దాచేసికుంటారు. మరి దాని విలువ అంతటిదీ. ఇప్పటికీ పెళ్ళిళ్ళయినప్పుడు, విడిది ఇంట్లో ఏది ఉంచినా ఉంచకపోయినా పరవాలేదు కానీ, ఓ అరడజను సూదిపిన్నీసుల ప్యాకెట్లుమాత్రం మర్చిపోకూడదు. ఆడవారు కొప్పులో పువ్వులు పెట్టుకోవాలంటే ఈ పిన్నులు ముఖ్యం. రిపబ్లిక్కు, స్వాతంత్ర దినోత్సవం లాటి పర్వదినాల్లో చిన్నపిల్లలు చొక్కా జేబులమీద జాతీయ జెండా అలంకరించుకోవాలంటే ఈ పిన్నీసులేదిక్కాయె. పర్వ దినాలమాట దేవుడెరుగు, ప్రతీరోజూ పిల్లల్ని స్కూళ్ళకీ, అంతకంటె పసిపిల్లలని డే కేర్ సెంటర్లకి పంపేటప్పుడు కూడా వారి ఐడి కార్డులు ఎలా తగిలిస్తారూ, ఈ పిన్నులతోనే కదా ! ఇప్పుడంటే ప్రతీవాళ్ళూ ఓ తాడోటి మెడలోవేసికుని ఓ ఐడి కార్డు తగిలించుకుంటున్నారు కానీ, ఇదివరకటి రోజుల్లో ఈ పిన్నీసులే మరి!

అన్నిటిలోకీ ముఖ్యమైనది ప్రయాణాల్లో సూట్ కేసులకి వేసే బుల్లిబుల్లి తాళంచెవులు, ఓ సూదిపిన్నీసుకి తగిలించి మొగాళ్ళైతే ఏ జంధ్యానికో, లేక ఆడవాళ్ళైతే ఏ మంగళసూత్రం గొలుసుకో తగిలించేస్తే క్షేమంగా పడుండేవి ఆ తాళాలూ, పిన్నూనూ. ఈ పిన్నీసుల మరో ముఖ్యమైన ఉపయోగం, ఏ రోడ్డుమీదైనా వెళ్తూన్నప్పుడు, కర్మం చాలక ఏ హవాయి చెప్పో తెగితే ఈ పిన్నీసుతోనే రిపేరీ చేసి, పని కానిచ్చేసేవారు. ఇవేకాకుండా, మొగాళ్ళ మానం కాపాడడంలో కూడా వీటిది చాలా ఉదాత్తమైన పాత్ర. పాంట్లకి జిప్పులొచ్చిన కొత్తలో అదృష్టం బాగోక, ఆ జిప్పు కాస్తా బెట్టుసరి చేసి సరీగ్గా పట్టలేదనుకోండి, ఎలాగోలాగ ఈ సూదిపిన్నీసుతోనే కానిచ్చేసేవారు. అంతదాకా ఎందుకూ మనం పెట్టుకునే వాచీ క్రిందిభాగం అంతా మట్టి పేరుకుని పోతూంటుంది. హాయిగా ఓ సూదిపిన్నీసు తీసికుని ఆ మట్టిని సునాయాసంగా శుభ్రం చేసేసికోవచ్చు.

ఇప్పటికీ ఆడవారు ఏ జాకెట్టైనా టైట్టు అయితే కొద్దిగా కుట్లు విప్పుకుని లూజు చేసికోవాలంటే ఈ సూదిపిన్నీసే కనిపిస్తుంది. అంతదాకా ఎందుకూ, దువ్వెన్నలు శుభ్రం చేసికోవాలంటే హాయిగా ఓ సూదిపిన్నీసుతో చేసేసికోవచ్చు. పౌడరు డబ్బాలకీ, పేస్టులుండే ట్యూబ్బులకీ బుల్లి బుల్లి చిల్లులు దేనితో పెడతారమ్మా?

ఈ పిన్నీసుల వంశంలోవే సూదులూ, కంఠాణీలూ, గుండుసూదులూ, దబ్బనాలూనూ. దేని ప్రత్యేకత దానిదే. ఈరోజుల్లో అవేవో stapplers అనేవి వచ్చినా, బ్యాంకుల్లో చెక్కులు వేసేటప్పుడు మాత్రం గుండుసూదే పెట్టాలని ఓ నీమం కూడానూ. విడిగా ఓ షెల్ఫ్ లో పెడతారుకూడానూ. బట్టలకి ఉత్తరేణి కుట్లు వేసికోడానికి సూదీ దారం, బొంతల్లాటివి కుట్టుకోడానికి బొంతసూదులూ, పుస్తకాలు కుట్టుకోడానికి కంఠాణీ ట్వైనుదారమూ, కొబ్బరికాయలు పీచు తీసినతరువాత ఓ గుత్తిలా తయారుచేయడానికి ఓ దబ్బనమూ, పురికోసా, బస్తాలు కుట్టుకోడానికి సరేసరి... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సూదుల వంశంలోని ప్రతీ నమూనాతోనూ, మనందరిదీ జన్మజన్మల సంబంధం.

చెప్పొచ్చేదేమిటంటే ఈ పిన్నీసులకి Hall of Fame లో అత్యున్నతస్థానం...

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు