ఒకానొక సమయంలో వైకుంఠంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి తీరిగ్గా హాస్య సంభాషణ చేసుకుంటున్న సందర్భంలో అక్కడికి వారి దర్శనార్ధం నారద మహర్షి వస్తాడు.
" నారాయణాయ! నారాయణ! " అని నమస్కరిస్తాడు.
" ఏం నారదా! ఊరకరారు మహాత్ములని నీ దర్శనానికి ఏదో ఉద్దేశ్యం ఉండే ఉంటుంది.చెప్పు మరి " అంటాడు విష్ణుమూర్తి.
"స్వామీ ! అదేంలేదు, తమ దర్శనం కోసం మాత్రమే వచ్చాను, తమర్ని దర్శించి చాలాకాల మైంది కదా " అని చెప్తాడు.
"ఔను నీకెప్పుడూ ఆయన స్మరణే కదా!సరే ఎటూవచ్చావు గనుక మహర్షీ! ఈ కలియుగంలో మా ఇద్దరిలో 'ఎవరు గొప్ప' అని భూలోక వాసులు అనుకుంటున్నారో చెప్పు." అని అడుగుతుంది లక్ష్మీదేవి.
" తల్లీ! మన్నించండి, విడవమంటే పాముకు కోపం, మింగమంటే కప్పకు కోప మని, మీ ఇద్దరి లో ఎవరు గొప్పో చెప్పడం నావల్లేమవుతుంది తల్లీ !" అంటాడు.
"కాదు నారదా! ఈ విషయం స్పష్టంగా తేలాలి. ఎప్పుడు చూసినా 'నారాయణ! నారాయణ!' అంటూ నిరంతరం ఈయన స్మరణ చేస్తుంటావ్ తప్ప,ఏనాడైనా 'నమో లక్ష్మీ మాతా ! ' అన్నావా! " అంటుంది కోపంగా.దానికి నారదుడు గడగడా వణుకుతూ
"తల్లి! మన్నించండి ! ఏదో అలా అలవా టైంది.తమ అనుగ్రహం లేందే లోకంలో ఆ కైనా కదలదు కదమ్మా! తమ దయ తోనే కదా మానవులకంతా తిండి,బట్ట,నీరు లభిస్తూ జీవిస్తున్నారు. తమరు క్రీయా శక్తి స్వరూపిణి కదమ్మా!తల్లీ!" అని ప్రార్ధిస్తాడు.
"ఏమైనా నారదా ! ఈ రోజు మా ఇద్దరిలో ఎవరు గొప్పో తేలి పోవాల్సిందే! " అంది మాత పట్టుదలగా.
"సరే !నారదా! ఈమె మాట ఎందుకు కాదనాలి? నానామస్మరణ వలన స్వర్గలోక ప్రాప్తి తప్పకలభిస్తుందని భూలోకంలో నేనే స్వయంగా వెళ్ళి ప్రచారం చేసి నిరూ పిస్తాను. దీనికి నీవే సాక్షి."అంటాడు.
" నారాయణ నారాయణ ! స్వామీ! అర్భకుడ్ని నన్ను మీ మధ్య ఇరికించకండి పసి వాడ్ని."అంటాడు నారదుడు భయంతో.
"నారదా! దీన్లో నీవు చేసేదేం లేదు. కేవలం ఒక సాక్షిగా మాత్రమే ఉంటావు. ముందుగా నేను భూలోకం లో కర్ణాటక రాజ్యంలోకి వెళ్ళి అక్కడి పల్లె ప్రాంతాల్లో తూర్పు వైపునుంచీ సంచరిస్తాను.దేవిలక్ష్మి నేను వెళ్ళాక కొంతకాలం ఆగి పడ మర పల్లెల నుంచీ సంచరిస్తుంది. నీవు ఇరువైపులా తిరుగుతూ మా ఇద్దరి గురించీ ఎవరెలా చెప్పుకుంటున్నారో చెప్తేచాలు. "అంటూ లేచి వేషం మార్చు కుని ఒక సాధారణ హరికధలు చెప్పే పండితునిలా బయల్దేరి వెళతాడు.నారదుడూ అనుసరిస్తాడు.కొద్ది సమయం తర్వాత లక్ష్మీమాత కూడా లేచి ఒక వృధ్ధ ముత్తై దువులా తయారై వెళుతుంది.నారప్ప అనే పేరుతో విష్ణుమూర్తి పల్లెల్లో సత్సంగాలుచేస్తూ , ఉపన్యాసాలు చెప్తూ, భక్తిగీతాలు పాడుతూ ఒక్కో గ్రామం లో ఒక్కోరోజు ఉంటూ తిరుగు తుంటా డు.గ్రామ ప్రజలంతా ఆయన నామామృతాన్ని వింటూ ఆనందంతో సంపూ ర్ణ భక్తి భావం తో ఆయన పాదాక్రాంతులై పోయి, ఆయనకు కమ్మని భోజన, వసతి సదుపాయాలు చేస్తూ ,ఆయన మాటలను అనుసరించి పేదలకు అన్నదానాలు చేస్తూ భక్తి భావనలో మునిగి పోయారు.
ఇహ లక్ష్మీమాత 'మంగళా దేవి' అనేపేరుతో ఒక గ్రామంలోని ఒక ఇంటి ముందు నిల్చి లోపలి వారిని పిలుస్తుంది .ఆ ఇంటి గృహిణి బయటికి రాగానే మాత ఆమెతో " ఈరోజు నాకు బిక్ష ఏర్పాటు చేస్తారా? " అని అడుగుతుంది.ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మీ కళతో మెరిసిపోతున్న ఆమెను లోనికి ఆహ్వానిస్తుంది. మాత " అమ్మా! నాకో నియమం ఉంది నేను ఇతరులు భుజించిన పాత్రల్లో భుజించను.అందువల్ల నా భోజనపాత్ర , దాహం కోసం గ్లాసు నేనే తెచ్చుకు న్నాను.వీటిలోనే నేను భుజిస్తాను.దీనికి అభ్యంతరం లేక పోతేనే మీ ఇంట భుజిస్తాను " అంటుంది. దానికా గృహిణి " తల్లీ! మీ ఇష్టం. మేము పేదలం ,మా ఇంట కొత్త పాత్రలేవీ లేవు.రండి తల్లీ!" అంటూ లోనికి తీసుకెళ్ళి పీట వేసి కూర్చో బెడుతుంది.మాత తన భుజాని కున్నసంచీలోంచీ ఒక బంగారు భోజన పళ్ళెరము, ఒక బంగారు మరచెంబు, గ్లాసు తీసుకుని వాటిల్లోనే భోజనం చేసి , వాటి నక్కడే వదలి వెళ్ళిపోతుంది.
అలా మాత ఒక్కోరోజు ఒక్కో ఊర్లో సంచరిస్తూ భుజిస్తూ , తను భుజించిన పాత్రలను ఆ ఇంట అక్కడే వదలి వెళుతుంటుంది .ఈ విషయం అలా అలా రాజ్యమంతా వ్యాపించి అంతా ఆతల్లి రాక కోసం ఎదురుచూస్తూ ,ఆమె ఎక్కడుందో విచారించి తెల్సుకుని ఆమె ఉన్న పల్లెకు వచ్చి ఆమెను ఆహ్వా నించి తీసుకెళ్ళసాగారు.తమ గ్రామానికి రమ్మని అమ్మను ఆహ్వానించిన వారికి ఆమె " అయ్యలారా!మీ గ్రామాల్లో ఒక పండితుల వారు తిరుగుతున్నారని వినికిడి, ఆయన్ను మీగ్రామం లోంచీ పంపేస్తేనే నేను మీగ్రామానికి వస్తాను. మరొకపురుషుడు తిరిగే గ్రామాలకు నేను రాను. ఇది నా నియమం. "అంటుంది. దాంతో క్రమేపీ నారప్ప సంచరిస్తున్న గ్రామాల్లో వారంతా నారాప్ప వచ్చినా చూడనట్లు పలకరించకుండా ఉంటూ, వారంతా మాతకు ఇచ్చిన మాటకోసం నారప్పను తమ గ్రామాల వైపైనా రానివ్వక తరిమేస్తూ , మాతను ఆహ్వానించ సాగారు. అలా ఆ పల్లెల్లో సంచరించి ,కొద్దికాల మయ్యాక మాత వైకుంఠం చేరుతుంది. అప్పటికే విష్ణుమూర్తి అక్కడ శేష శయనుడై చిద్విలాసంగా విశ్రాంతి పొందు తుంటాడు. మాత నవ్వి " ఏం స్వామీ ! ఎవరు గొప్పో తెలిసిందికదా! " అంటుంది. నారదుడు వచ్చి " తల్లీ ! తమరే గొప్ప . స్త్రీ శక్తి మోఘం తల్లీ ! స్త్రీ శక్తి ముందు, ధనదేవత ముందూ ఏశక్తీ సరి కాదమ్మా !" అంటాడు. లోకంలో అంతా ధనాన్ని అభిమానించినట్లు పుణ్యసంపాదన వైపు మనస్సు పెట్టరు కదా!