* మండుటెండల్లో తను వేడికి మాడుతూ సైకిల్ బండి మీద
చల్లని రంగుల ఐస్ క్రీములు అమ్మే యువకుడి పాట్లు
పొట్ట కోసమేగా
* భగ భగలాడే ఎండలో రెక్కలు ముక్కలు చేస్తూ చెరకు మిషనులో
తనూ ముక్కగా మారి చెరకుగెడల తియ్యని రసాన్ని
చల్లని ఐసుతో కలిపి అమ్మే బడుగు జీవి ప్రయాస
బతుకు కోసమేగా
* తన గొంతు తడారినా రోడ్డున పోయే దొరలకు
చల్లని తియ్యని కొబ్బరి బోండాలు తాగించే దెవరి కోసం
కూటి కోసేమేగా
* మండే ఎండలో నెత్తిన తట్ట బరువుతో చెమటలు చిందే తనువుతో
తనకి గూడు లేకపోయినా పరులకు గూటిని కట్టే శ్రమజీవి
జీవన పోరాటం జానెడు పొట్ట కోసమేగా
* వడదెబ్బకు తట్టుకుని చెట్ల నీడలో చల్లని కుండల్లో
పుదీనా, నిమ్మ షర్బత్ అమ్మే యువత పాట్లు పొట్ట కోసమే
* సుదూర ప్రయాణంలో ప్రయాసల కోర్చి చల్లని తియ్యని
తాటి ముంజల్ని తెచ్చి పట్టణ ప్రజల నోరు తడుపుతున్న
పల్లె తమ్ముడి పాట్లు పట్టెడు మెతుకుల కోసమేగా
* చెరకు రసాలు , బంగిన పల్లి , సువర్ణరేఖ , అల్ఫన్సా
పేరు వింటేనే నోట్లో రసం ఉబికి వస్తుంది
వాటిని దొరలకమ్మే బడుగులకు దక్కేది చెమటేగా
* వేసంగి ఉక్కపోతలో సాయం సంధ్యలో మరులుగొలిపే
తెల్లని మల్లెలు , సువాసనల సంపెంగలు , విరజాజి , మరువం
మగువల ముంగిటకు తెచ్చే మనిషికి మిగిలేది మానస వేదనే!