ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
(మొదటి సంచిక తరువాయి)
గురు మూర్తానికి తరలించుట:
1897లో స్వామిని గురుమూర్తానికి తరలించారు. ఊరి చివర వున్న అది ఒక మఠం. ఆ రోజుల్లో పళని స్వామి అనే మళయాళీ స్వామికి సేవ చేయుచుండెను.
1898 మే నెలలో స్వామి వారి పినతండ్రి వచ్చి ఇంటికి రమ్మని అడిగినా ఫలితం లేకపోయింది. అక్కడ నుండి 'పవళ కుండ్రి' కి బస మార్చారు. అక్కడికి స్వామి వారి తల్లి గారు వచ్చి, మాతృ సహజమైన ప్రేమతో పుత్రుని చూచి దుఖించి తిరిగి ఇంటికి రమ్మని శత విధాలా వేడుకుంది. కాని స్వామి చలించలేదు. వేంకట రామన్ పెన్సిల్ తో కాగితం మీద ఇలా వ్రాసారు . "సృష్టి కర్త జీవులని వారి వారి ప్రారబ్ద కర్మానుసారం నడిపిస్తాడు. జరగబోనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. కాబట్టి మౌనంగా ఉండటమే శ్రేష్టం" ఇదే భగవానుని మొట్టమొదటి భోధ.
విరూపాక్ష గుహ నివాసం
విరూపాక్ష గుహ ఓంకార ఆకారంలో వుంటుంది. ఈ గుహలో స్వామి దాదాపు 17 సం॥లు గడిపారు. ఇక్కడ నుండే భగవాన్ దేశ, విదేశాల నుండి భక్తులను ఆకర్షించారు.
భగవాన్ ని సందర్శించిన వారిలో మొదటి వారు శివ ప్రకాష్ పిళ్ళై (1875-1948) ఫిలాసఫి పట్ట భద్రుడు. రెవిన్యూ శాఖ లో పని చేసేవారు . శ్రీ రమణులు 1902 లో ఆత్మ విచార పద్ధతిని లిఖించేటట్టు చేసారాయన. ఇదే "నేను ఎవడను" అన్న పుస్తకంగా వెలువడింది. సంస్కృత విద్వాంసుడూ, అసుకవీ, గణపతి మహా ముని మరొక భక్తుడు. ఈయన స్వామిని 1903 నుండి దర్శిoచుకుంటున్నా 1907లోనే ఆయనని తన గురువుగా స్వీకరించారు. ఈయనే స్వామికి 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అని నామకరణం చేసారు. గణపతి మహాముని, ఆయన శిష్యులు మహర్షిని అడిగిన ప్రశ్నలన్నింటిని కలిపి "రమణ గీత" అనే గ్రంధంగా రూపొందించారు.
1911 లో స్వామి ప్రభావం లోకి వచ్చిన మొదటి విదేశీయుడు ఎఫ్ . హెచ్ . హంప్రీస్, లోకానికి తానెట్లా ఉపయుక్తం కాగలడో తెలుపమని శ్రీ రమణులని అడిగినప్పుడు "నీకు నువ్వు ముందు సహాయపడు, అది లోకానికి సహాయ పడినట్లే. నీవు లోకానికి భిన్నుడవు కావు. లోకం నీకన్నా భిన్నం కాదు." అని సెలవిచ్చారు.
(తరువాయి భాగం వచ్చే సంచికలో...)
భగవాన్ శ్రీ రమణ మహర్షి (మొదటి భాగం)
శ్రీ రమణార్పణమస్తు