'సిరి' సాప్ట్‌వేర్ ఇంజనీర్.. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదా.. అవును అదేదో సినిమాలో హీరోయిన్ తెగ చెప్పుకునే డైలాగ్ ఇది. నిజానికి ఆమె చేసే ఉద్యోగం అది కాదు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనే మాటలో ఉన్న వైబ్రేషన్ అలాంటిది. ఆ మాటలోనే ఏదో మత్తుంది. గమ్మత్తుంది. అందుకే డిగ్రీ చేపట్టిన ప్రతీ ఒక్కరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిపించుకోవాలనే పరుగులు తీస్తున్నారు. పరుగు బాగుంది కానీ, ఆ పరుగుతో తెచ్చుకుంటున్న తలనొప్పి 'సాఫ్ట్' బాధితులయ్యాక కానీ తెలియడం లేదు. 'దిగితే కానీ లోతు తెలీదు..' అంటారు మన పెద్దలు. అచ్చు అలానే ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ అయిన వాళ్లని చూసి, మనం కూడా అలాగే అనిపించుకోవాలనే తపనతో అందులోకి దిగిపోతున్నారు. దిగినాక ఇంకేముంది లోతు తెలుస్తుంది కదా.. తర్వాత 'సాఫ్ట్' బాధితులే. ఇదీ నేటి పరిస్థితి.
పేరుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కానీ చేసే పని ఆ పని చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది. చదివిన చదువుకీ, చేసే పనికీ అస్సలు పొంతనే ఉండదు. లేనిపోని పని ఒత్తిడి. వర్క్ మోడ్‌లో పడి, ఎన్ని రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారో ఆ లోతులో ఉన్నవాళ్లకి తప్ప, మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కీ, ఓ సాధారణ ఎంప్లాయ్‌కీ మధ్య మెంటల్ ఒత్తిడికి సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో నివురు గప్పిన నిజాలెన్నో బయటపడ్డాయి. మామూలు వర్క్‌లో ఉన్న ఏ ఎంప్లాయ్‌కీ లేనంత ఒత్తిడి ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్స్‌కి ఉంటోందని ఈ సర్వేలో తేలింది. మరో నిజం ఏంటంటే, మిగిలిన దేశాలతో పోల్చితే, మన ఇండియాలోనే ఈ సాఫ్ట్‌వేర్ బాధితులు ఎక్కువగా ప్రభావితులు అవుతున్నారట.
అవసరానికి మించిన మెంటల్ టెన్షన్‌తో అనేక రకాల ఆరోగ్య సమస్యలు.. కొన్ని బయటికి చెప్పుకోగలిగేవి అయితే, మరికొన్ని బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఉద్యోగులు బాధపడుతున్నారు. వయసు రాకుండానే జుట్టు రాలిపోవడం, తెల్ల జుట్టు రావడం, స్కిన్ పాడైపోవడం, కంటిచూపు మందగించడం, వెన్ను నొప్పి తదితర దీర్ఘకాలిక నొప్పులు బాధించడం, నిద్రలేమి, సంతానలేమి.. ఇలా ఒక్కటేమిటి అనేక రకాల సమస్యలు బాధిస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలోనే ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉడ్యోగులు ఈ రకమైన ఒత్తిడికి లోనవుతున్నారట. ఈ ఒత్తిడికి కారణం కమిట్‌మెంట్.
మన ఇండియన్స్‌కి కాస్త కమిట్‌మెంట్ ఎక్కువే. అయితే దాన్ని కమిట్‌మెంట్ అనాలా.? లేక సంపాదన మీద యావ అనాలో తెలియని పరిస్థితి. ఇతర దేశాలకు చెందిన వారు వర్క్‌పై పూర్తి అవగాహనతో దిగుతున్నారు. పనినీ, మానసిక ఒత్తిడినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నిర్ధిష్టమైన అవగాహన ఉంటుంది వారికి. దాంతో ఎంత టైం పని చేయాలి.? ఎంత టైం రెస్ట్ తీసుకోవాలి అనే బ్యాలెన్స్‌ని పని చేస్తున్నారు. అయితే, మన ఇండియన్స్‌లోనూ అందరూ ఇలాగే ఉంటున్నారనలేం. కానీ, ఎక్కువ మంది బాధితులుగానే ఉంటున్నారు. ఈ పని ఒత్తిడి కారణంగా కుటుంబ సంబంధాలు దెబ్బ తింటున్నాయి. వైవాహిక జీవితాలు నాశనమవుతున్నాయి. కారణాలు చాలా సిల్లీగా ఉండొచ్చు. కానీ, బాధితుల వైపు నుండి ఆలోచిస్తే, సమస్య పెద్దగానే కనిపిస్తుంది. దీని నుండి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం. బ్యాలెన్సింగ్ అంతే. ఈ చిన్న లాజిక్ తెలుసుకుంటే, 'సాఫ్ట్‌వేర్ ఇంజనీర్'నిజంగానే ఈ పేరుకు మ్యాజిక్ ఉందనీ, వైబ్రేషన్ ఉందనీ నమ్మేయొచ్చు పక్కా.!