ప్రకటనలు - వికటనలు
సినీమా అవకాశాల ‘ప్రకటన’లు మోజుతో ప్రారంభమయ్యి మోసంతో వికటిస్తాయి!
‘మా దగ్గర శిక్షణ పొందండి, మీ ప్రతిభకి పదును పెట్టి సినీ వినీలాకాశంలో మిలమిలా మెరిసే సినీ స్టార్ ను చేస్తాం’ అని ప్రకటనలు వెలువడుతాయి.నన్నుమించిన అందగత్తే లేదని తెగ పోజులు కొట్టే ఫోజుల మంజులలు ఊళ్ళల్లో బోలెడు మంది ఉంటారు. ప్రకటన చూడగానే, శిక్షణ పూర్తవటం ఆలీసం వరసగా సినీమాలకి సంతకాలు చెయ్యటమే అని ఫ్రెండ్స్ దగ్గర గర్వంగా ప్రకటన చేసి ఇంట్లో చెప్పకుండా ఎర్ర బస్సు ఎక్కుతుంది !
హైడ్రా బ్యాడ్లో దిగి సిటీ బస్సెక్కి కృష్ణా నగర్ లో కాలు పెడుతుంది. సదరు శిక్షణా సంస్థ నడిపే మాయదారి సిన్నోడు ‘సినీ ఇండస్ట్రీ కి కొత్త స్టార్ వచ్చింది’ అని ఫోజుల మంజులతో చెప్తే మురిసి ముక్కలయి వొళ్ళు మరిచి పోతుంది. అది గమనించి మాయదారి సిన్నోడు చున్నీ లాగి డ్రెస్ ఎందుకూ అసియ్యంగా, తీసెయ్యి సూపరుంటవు అంటాడు. ఫోజుల మంజుల కోపంగా నో చెప్తే ’సినీమా అన్నాక బోల్డు మంది ముందు బోల్డుగా నటించాలి. ఇప్పుడు నా ఒక్కడి ముందే బట్టలు తీలేక పోతే షూటింగ్ లో రేపు అందరి ముందు అర్ధ నగ్నంగా ఎలా నటిస్తావు’ సూపర్ లాజికల్ కొచ్చిన్ కొడతాడు.దెబ్బకి సరే బట్టలే కదా తియ్యమంటున్నాడు అని తీసేస్తుంది. కెమెరా పెట్టి క్లిక్కు క్లిక్కు మనిపించి రేపు పొద్దునే విజయ్ దేవరకొండతో షూటింగ్! లిప్ లాకు సీన్లు బెడ్రూమ్ లో రోమాన్స్ సీన్లు ఎలా నటించాలో నేర్చుకో అంటూ తన ప్రతిభ కి పదును పెడతాడు. ఫోజుల మంజుల విజయ్ దేవరకొండని ఊహించుకుంటుండగా మాయదారి సిన్నోడు శిక్షణ కంప్లీట్ చేసి రెడీగా ఉండు రేపొత్తా అని తుర్రుమంటాడు. తర్వాత ఫోజుల మంజులకి అసలిసియం అర్ధమయ్యి నెత్తి నోరు బాదుకుని ‘కడుపు’ తరుక్కు పోతుంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తుంది. సిన్మా వేషాల పేరుతో యువతికి జరిగిన మోసం అంటూ దిన పత్రికల్లో వార్త వెలువడ్తుంది. ఎంకటేశ్వర మహత్యం సిన్మా టైపులో ఇవన్నీ మాయదారి సిన్నోళ్ళ సినీ మాయా ’ప్రకటన’ ల మహత్యం!
*** **** ****
రోడ్ల మీద ప్రకటనలు బహు పసందుగా వుండి నవ్వు తెప్పిస్తాయి. అప్పట్లో గోడలమీద ఇద్దరు లేక ముగ్గురు (పిల్లలు) చాలు అన్న ప్రకటనలు కనిపించేవి. కానీ ఆర్ధిక పరిస్థితులకి జనం తట్టుకోలేక ‘నో త్రీ ఓన్లీ టూ’ అని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత గోడల మీద విచ్చలవిడిగా కండోం ప్రకటనలు చోటు చేసుకున్నాయి. మా అయోమయం అప్పారావు సుపుత్రుడు బబ్లు వాటిని చూసి ’డాడీ! అవేంటి? కొత్త రకం బెలూన్లా?’అడిగితే దిక్కు తోచక అవునన్నాట్ట. ఇక అప్పట్నించి బబ్లు నేనా బెలూన్ల తో ఆడుకుంటా, ఆ బెలూన్లే కావాలి అంటూ ఒకటే ఏడుపు! ఇక ఆర్ధిక సామాజిక పరిస్థితులు ఇంకా దిగజారి ‘నో వన్ ఓన్లీ ఫన్’ అనే అవగాహనకి జనం వచ్చి ఆ మధ్య రోడ్డు మీద పెద్ద ప్రకటన తాలూకు హోర్డింగ్ కనిపించిదిలా - ‘మీకు పిల్లలు లేరా? చింతించకండి మా కంప్యుటర్ ద్వారా ఓ బిడ్డని కనండి!’ తాటి కాయలంతేసి అక్షరాలలో రాశారు.
లారీల వెనక ప్రకటనలు విచిత్రంగా ఉంటాయి మనం బండి మీద వెళ్తుండగా ముందు లారీ వుంటే గమనించండి, దాని మీద ‘నన్ను ముద్దు పెట్టుకోకురా’ అని ఒకడు రాయిస్తే ఇంకో లారీ మీద ‘నన్నుచూసి ఎడవకురా, నన్నుదాటి పోవాలని చూసావో చస్తావు’ ఇలా చిత్ర విచిత్రమైన ‘ప్రకటన’లు కనిపిస్తాయి.
*** ***** ****
మిస్సిండియా పోటీలు ఇండియాలో జరగవు. ఎక్కడో దుబాయ్ హోటల్లో జరుగుతాయి. టీవీ లో గంట సేపు ప్రకటనలు గుప్పి౦చాక లైవ్ షో మొదలు, బికినీల్లో వరుసగా నిలబడి ముద్దు గుమ్మలు హి హి మంటూ పళ్ళికిలిస్తూ ర్యాంపు మీద పడుతూ లేస్తూ సొట్ట నడకలు నడుస్తారు. అంతే! మళ్ళీ అరగంట వరుస ప్రకటనలు వస్తాయి. తర్వాత విన్నర్ ని ప్రకటించటానికి నిర్వాహకుడు ప్రశ్నలు సంధిస్తాడు. జవాబు చెప్పమని మూతి దగ్గర మైక్ పెడతాడు. అప్పుడు ఓ సుందరి జారి పోతున్న మిడ్డి పైకి లాగుతూ తడుముకోకుండా ప్రకటన ఇస్తుంది, ఏమనీ –నేను మా దేశం విమానం దిగీ దిగ్గానే స్లం ఏరియా సందర్శిస్తాను. స్లం ఏరియా అంటే నా కెంతో ఇష్టం.అక్కడి మరుగు దొడ్లు శుభ్రం చేస్తాను.సేవ, సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని నిద్రపోయే వాళ్ళని లేపి ‘టోల్గేటు పేస్టు’ వేసి పళ్ళు తోమిస్తాను. చీమిడి ముక్కుల్ని ’బొంబే డైయింగ్‘ కర్చీఫ్ తో తుడిచి ‘లక్స్’ సబ్బుతో వొళ్ళు రుద్ది ‘వెల్ స్పన్’ తువ్వాలు పెట్టి తుడుస్తాను! ఆడపిల్లల వాలు జడ విప్పేసి ‘కేశనాసిని’ హెయిర్ ఆయిల్ దట్టంగా పట్టించి దెయ్యంలా చింపిరి జుట్టు చేసి పెదాలకి “లాక్మే “ లిప్ స్టిక్ ముద్ద ముద్దగా పట్టిస్తాను. మగ పిల్లలకి ’డిగ్ జాక్’ చెడ్డీలు పెద్ద వాళ్ళకి ‘డినం’ చొక్కాలు తొడుగుతాను. స్లం ఏరియా లో అందరికి ’నోకియా’ సెల్ ఫోన్లు ఇచ్చి మేడం తుం అచ్చా కియా అనేలా జీవితాలు మార్చేస్తాను!’ గంభీరంగా ‘ప్రకటన’ ఇస్తుంది. చప్పట్లు అదిరి పోతాయి. బ్రేక్ తర్వాత ఫలితాల ‘ప్రకటన’ వెలువడుతుంది అంటారు. వెంటనే వరుసగా ప్రకటనలు వస్తుంటాయి. ఈ లోగా మనం బ్రేక్ అయిపోకుండా కిరీటం ఎవర్ని వరిస్తుందా అప్పుడు ఆ సుందరి మొహం ఎంత ఆనందంతో వెలిగి పోతుందో అని అమాయకంగా ఊహలు అల్లుకుంటూ టీవీ ముందు బైటాయిస్తాం ! ప్రకటనల పరంపర అయ్యాక మళ్ళీ లైవ్ షో మొదలయి ఇండియాలో మిస్సయి గ్రేట్ బ్రిటన్ లో సెటిలయిన అమ్మాయే మిస్సిండియాకి అర్హురాలు అని ప్రకటిస్తారు. మాజీ మిస్సిండియా ఇకిలిస్తూ తాజా మిస్సిండియా నెత్తి మీద కిరీటం పెట్టగానే నవ్వదు! ఏడుస్తూ జలజలా కన్నీరు కారుస్తూ (వీటిని ఆనంద బాష్పాలు అంటారు) కళ్ళు తేలేసి సంభ్రమాశ్చర్యాలతో రెండు చేతులతో నోరు, మూతి నొక్కుకుని వెంటనే చేతులు రెండూ గాల్లోకి సాచి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తుంది. ఈ ప్రకటన తంతుకి ముందు అక్కడ జరిగేది సామాజిక కార్యకర్తలు ఇక్కడ కూచుని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరై మిస్సిండియా ఫ్లైట్ దిగీ దిగగానే చీపురుకట్ట ఫినాయిల్ బాటిల్ చేతిలో పెడదామని ఎయిర్ పోర్ట్ లో కాచుకు కూచ్చుంటారు! ఐతే సదరు మిస్సిండియా వెనక ద్వారం గుండా బహుళ జాతి కంపెనీ మేనేజర్లతో కలిసి ఎప్పుడో బైటికి చెక్కేసిందని తెలుసుకుని నోరెళ్ళ బెడతారు. తర్వాత మిస్సిండియా సుందరి ప్రకటనలో చెప్పిన అన్నివినియోగ వస్తువుల్ని టీవీలోఆకర్షణీయంగా చూపి అన్నీఅవే ప్రకటనల్లో కళ్ళు చికిలిస్తూ పళ్ళు బైట పెట్టి నవ్వుతూ కనిపిస్తుంది. ఈ తంతు అయ్యాక ఓ శుభ ముహూర్తాన బాలీవుడ్ హాలీవుడ్ లాంటి అన్ని వుడ్ల ల్లో బుక్ అయ్యిందన్న ప్రకటన వెలువడుతుంది.అప్పటికి గానీ మనందరికీ ప్రకటనల పస ‘ఓహో ఇదా’ అన్న ఇసియం అత్తం కాదు!
“ప్రకటన” లు అంటే అంత లోతుగా ఉంటాయి!
ఈ ప్రకటనల ప్రభావంతో ఇండియాలో ఎక్కడ చూసినా ఆడ పిల్లలు మిస్సిండియా కి ఆనవాళ్ళు గా కనిపిస్తారే తప్ప ఎవరూ వాళ్ళలాగా వాళ్ళు ఉండరు. పైగా అందరూ ఒకేలా వుంటారు. పోల్చుకోవటం కష్టం అవుతుంది. అనగా ఒరిజినాలిటి పోతుంది. బొట్టు లేని నుదురుతో జుట్టు విరబోసుకుని హై హిల్స్ చెప్పులేసుకుని అయ్యో పడిపోతారేమో అని మనం కంగారు పడేలా కుంటి నడకలు నడుస్తూ ఛీఛీ! బట్టలు కూడా కొనుక్కోలేని దౌర్భాగ్య స్థితి లో ఉన్నారే అనుకునేట్టు చింకి గుడ్డలు వేసుకుని తుంటి భాగాలు బైటికి కనిపిస్తూ రోడ్ల మీద తిరుగుతుంటారు. ఇదంతా టీవీలో మిస్సిండియా సుందరి ఇచ్చిన ‘ ప్రకటన’ ల తాలూకు ‘వికటన’ ల మహత్యం!
**** ***** ****
ప్రకటనలు కొన్ని బోల్తా కొట్టిస్తాయి. కొన్ని గమ్మత్తు గా వుంటాయి. టీవీ ప్రకటనలో అమ్మాయి ‘ఈ-ఈ’ మని నవ్వి పళ్ళు బైట పెట్టిందీ అంటే అది డెఫినిట్ గా టూత్ పేస్టూ ప్రకటనే అయ్యివుంటుంది. పళ్ళు కాంతి వంతంగా మెరవటానికి ‘టోల్గేటు’ టూత్ పేస్ట్ కారణం అంటుంది.పళ్ళు LED బల్బుల్లా అసలు ఎందుకు ఎలగాలి అన్న బేసిక్ కొచ్చిన్ మన బ్రెయిన్లో ఎలక్క నోరు ఎల్లబెట్టి ప్రకటన చూస్తాం! ఛానల్ తిప్పితే మరో ప్రకటనలో ఇదే అమ్మాయి ‘పేస్టు వట్టి వేస్టూ’..పాపాల్ వారి పళ్ళ పొడిని వాడండి! మీ చిగుళ్లని రక్షించుకోండి! హి హి హీ మని నవ్వుతుంది.కొన్నాళ్లయాక ఇంకో ఛానల్ లో ఇదే అమ్మాయి కాస్మాటిక్ సర్జెరీ ప్రకటనలో కనిపించి పెద్దావిడలా తెల్ల జుట్టు సవరించుకుంటూ మళ్ళీ హిహి నవ్వుతుంది. అపుడు పళ్ళు LED బల్బుల్లా జిగేల్మంటాయి. వెంటనే నోట్లోంచి పళ్ళు లాగేసి పళ్ళు ఊడి పోయాయా? ఏం వర్రీ కాకండి ‘గిల్పిట్’ బ్రాండ్ కట్టుడు పళ్ళు కట్టించుకోండి! అని బోసి నోరుతో నవ్వి ‘కట్టు’డు పళ్ళ ‘కట్టుకత’ వినిపిస్తుంది.
** **** ****
‘ప్రకటన’ లు ఇంత అంతా కాదు. ఎంత మోసం అయినా చేస్తాయి కానీ మనం వాటిని గమనించం, పట్టించుకోం! ఒక ప్రకటనలో ఒక గుండోడు గుండు గోక్కుంటూపైసల్ ఖమాయించాలంటే బోలెడంత కష్ట పడాలి అంటాడు. ఆ పోవయ్యా పెద్ద చెప్పొచ్చావు అనుకుంటాం. నువ్వు కొనే డైమండ్ రింగ్ నా దగ్గర దొరికినoత చవగ్గా భూమండలం లో మరెక్కడా దొరకదని కావాలంటే మీ పక్కింటి పిన్ని గారిని కనుక్కుని అనక నా దగ్గర కొనమని ప్రకటనలో చెప్తాడు. పొలోమని అక్కడికే వెళ్లి కొంటాo. కొన్నాళ్ళయ్యాక ఇంకో బండోడు అది దొంగ బంగారం అని ఇంకో ప్రకటనలో చెప్పి అక్కడ కాకుండా నా దగ్గరే కొనమని చెప్పి చవగ్గా వస్తోందని తాజ్ మహల్ కొంటారా అని జోకేస్తాడు! కొన్నాళ్ళకి ఈ గుండోడు ఆ బండోడు ఇద్దరూ కనిపించరు, దాంతో గగ్గోలు పెడితే మరో బక్కోడు ‘ఎప్పుడో గుండోడు చెప్పాడు పైసల్ ఖమాయించాలి అంటే బోలెడంత కష్ట పడాలీ అని! పాపం కష్టపడి సంపాయించాడు’ అంటూ గుండు శాల్తీ మీదే సానుభూతి కురిపిస్తు ‘ప్రకటన’ చేసి నవ్వు తుంటాడు!
*** **** ****
మాయా దర్పణం (అనగా టీవీ) లో వచ్చే చాలా ప్రకటనలు చాలా వరకు మాయతో నిండినవే! పెద్ద పెద్ద సినీ స్టార్లకి కూడా కొన్ని ప్రకటనలు వికటించి, వికటనల ప్రకటనలు అనుకునేలా చేస్తాయి.డబ్బులు బాగా ముట్టచెపుతాం అనే సరికి సినీ స్టార్లు కొన్ని ప్రకటనల్లో గంతులేస్తూ కనిపిస్తారు. తీరా సదరు ప్రకటనలో చూపిన వస్తువు వాడిన వాళ్లకి వాంతులు విరేచనాలు పట్టుకుని ఆస్పత్రుల పాలయ్యే సరికి తయారీ సంస్థతో పాటు వస్తువుకి బ్రాండ్ అంబాసిడర్ గా వున్న సినీ హీరో మీదా కోర్టు కేసులు బుక్కవుతాయి. దాంతో హీరో అల్లా జీరో అయి దెబ్బకి మళ్ళీ ప్రకటనల జోలికి చస్తే వెళ్ళడు! అందుకే ఇప్పుడు చాలా మంది సూపరు స్టార్లు ప్రకటన అనే సరికి మొహం అటు తిప్పి పక్కకి జారుకుంటున్నారట.
**** ***** ****
కూల్ డ్రింక్ కంపెనీల ప్రకటనలు మహత్తరంగా వుంటాయి ఒకడు కొండలు కొనలు దాటుతూ బైక్ మీద రయ్యి రయ్యిన వెళ్తుంటే మనం అది బైక్ ప్రకటన అనుకుంటాం. తీరా చూస్తే కాకులు దూరని కారడవులలో ఏమీ దొరకని చోట కూల్ డ్రింక్ దొరుకుతుంది అనేది ప్రకటన సారాంశం! ఇక కొన్ని హాట్ డ్రింకు కంపెనీలు తెలివిగా బ్రాందీ విస్కీ ల బ్రాండ్ పేరుతొనే కూల్ డ్రింకులు తయారు చేసి ‘ప్రకటన’లు ఇస్తాయి! మా దోస్తు అయోమయం అప్పారావు ఓ రోజున కడుపులో కాస్త గుడుగుడుగుంటే చప్పున టీవీలో చూసిన మ్యాకడోలు సోడా ప్రకటన గుర్తొచ్చి సోడా తాగి ఇంటికెళ్ళాడు.సరిగ్గా వాళ్ళావిడ అప్పుడు టీవీలో అదే ప్రకటన చూస్తోంది నోరు ఊరుకోక అప్పారావు ఇప్పుడే ఇదే సోడా తాగెను అని వాగేడట.ఆవిడ అనుమానంగా చూసి సోడానేనా విస్కీ కాస్త కలిపి తాగెరా? నిలదీస్తే అబ్బే మ్యకడోలు సోడానే చెప్పే సరికి ఆవిడ సివాలెత్తి సోడా పేరుతో వాళ్ళు బ్రాందీ కలిపి అమ్ముతారు.నువ్వెందుకు తాగేవు అది? తాగొచ్చి పైగా సోడా తాగేనని అబద్దాలు చెప్తున్నావు అంటూ ఇంట్లోకి రానీక పోతే రాత్రంతా దోమలు కొడుతూ నిద్దర లేక ఇంటి గేటు ముందు నిలబడ్డాడట. అంచేత పెళ్ళాల దగ్గర సోడాలు కూల్ డ్రింకులు మాత్రమే తాగొచ్చా అని బడాయికి పోయే ముందు ఆయా కంపెనీల ప్రకటనలు జార్తగా గమనిoచుకోవాలని ‘ప్రకటన’ చేస్తున్నాను!