చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

పురాణ కాలంలో, గురుకులాలని ఉండేవి. మహారాజు పుత్రుడైనా, సాధారణ పౌరుడైనా, విద్య నేర్చుకోవడానికి, అక్కడకే వెళ్ళి, సకల శాస్త్రాలూ నేర్చుకునేవారు… గురువుగారి ఆశ్రమంలోనే , అందరితోపాటూ జీవిస్తూ, విద్య పూర్తిచేసుకునేవారు.  విద్యతో పాటు, సత్ప్రవర్తన కూడా గురువులు నేర్పేవారు… బరువు బాధ్యతల గురించి గురువుల దగ్గరే నేర్చుకునేవారు. వీటితోపాటు నేర్చుకునేదేమైనా ఉందా అంటే, తోటి విద్యార్ధులతో జీవించడం వలన, అవతలివారితో ఎలా ప్రవర్తించాలో, ఒకరికొకరు ఎలా పంచుకోవాలో మొదలైనవి కూడా నేర్చేసుకోగలిగేవారు..

కాలక్రమేణా నాగరికత పెరగడంతో పాటు, స్కూళ్ళూ, కాలేజీలూ కూడా వచ్చాయి.  మరీ అస్త్రశస్త్ర విద్యలు కాకపోయినా, మిగిలిన శాస్త్రాలు నేర్పేవారు. ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలూ, ఆ తరవాత డిగ్రీ కళాశాలలో చదువు పూర్తి చేసుకుని, ఓపికుంటే ఆ పై విద్య, ఇంకా ఓపికుంటే విదేశాలకీ వెళ్ళి చదువు పూర్తిచేసుకోవడం.

 మొదట్లో  స్కూళ్ళూ, కాలేజీలూ దేశంలో పరిమిత సంఖ్యలోనే ఉండేవి. దేశం మాట తరవాత చూసుకోవచ్చు, మన తెలుగు ప్రాంతాలగురించి చూద్దాం… ఆరోజుల్లో గ్రామాల్లో ప్రాధమిక పాఠశాలలు, తాలూకా హెడ్ క్వార్టర్స్ లో  మాధ్యమిక, ఉన్నత పాఠశాలలూ ఉండేవి. కాలేజీల విషయానికొస్తే జిల్లా మొత్తానికి  ఓ మూడో, నాలుగో కాలేజీలు డిగ్రీ స్థాయి దాకా ఉండేవి, ఆపైన పోస్ట్ గ్రాడ్యుఏషన్ చేయాలంటే, యూనివర్సిటీ ఉన్న పెద్ద పట్టణానికో, లేదా పక్క రాష్ట్రాల్లో ఉండే ఏ మద్రాసుకో వెళ్ళేవారు. రాష్ట్రం మొత్తానికి ఓ మూడో నాలుగో ఉండేవి.. ఆయాప్రాంతాలను బట్టి,  ఓ యూనివర్శుటీ కి అనుసంధానం చేసేవారు. అంటే డిగ్రీలకీ, పోస్ట్ గ్రాడ్యుఏషన్ కీ , ఆయా యూనివర్శిటీలు డిగ్రీ కి పరీక్షలు నిర్వహించడం, డిగ్రీ ప్రదానమూ చేసేవారు. ఇంక ప్రొఫెషనల్ డిగ్రీలు—ఇంజనీరింగ్, మెడిచిన్ లకి కాలేజీలు, ఓ అరడజను దాకా ఉండేవి.  ఇంజనీరింగు చదివే స్తోమత లేని వారికి,  Polytechnic College  అని ఉండేవి, అందులో డిగ్రీ బదులు డిప్లొమా ఇచ్చేవారు. తరవాత్తరవాత  పారిశ్రాఇకాభివృధ్ధి ధర్మమా అని, అందులో పనిచేయడానికి కావాల్సిన  Training  కోసం,   ITI ( Industrial Training Institute )   అని ప్రారంభించారు. అలాగే, ఇంజనీరింగ్ కోసం   I I T ( Indian Institute of Technology ) లు దేశంలో ఓ అరడజను దాకా ప్రారంభించారు. వీటిలో ప్రవేశానికి   అఖిల భారతీయ స్తాయిలోEntrance Test  లు నిర్వహించి ప్రవేశం ఇచ్చేవారు. అలాగే కేంద్రప్రభుత్వోద్యోగులు, సైనిక దళాలలో పనిచేసేవారి పిల్లల చదువుకోసం కేంద్రీయ విద్యాలయాలూ… వీటన్నిటిమీదా అజ్మాయిషీ కేంద్రప్రభుత్వం  HRD  శాఖ చూసుకుంటుంది.

 అటూ ఇటూ కొద్దిగా మార్పులతో మన విద్యా వ్యవస్థ పైన చెప్పినట్టుగా ఉంటూ వచ్చింది. ఇదివరకటి రోజుల్లో ఏ కారణం చేతైనా  S S L C  పాసవకలేకపోతే, మెట్రిక్యులేషన్ అని ఒకటుండేది,  దీనికి స్కూళ్ళకి వెళ్ళనవసరం లేకుండా ప్రెవేటుగా కూడా చదివి, పాస్ అయి డిగ్రీలో చేరే సదుపాయం ఉండేది.  ఒకానొకప్పుడు పరిక్షలో 60+ వస్తే ఫస్ట్ క్లాసూ, 50+ వస్తే సెకండు, 35+ వస్తే పాసుమార్కూగా ఉండేవి. అలటిది, ఈరోజుల్లో 99 % అనేది మామూలైపోయింది. పైగా అంత పెర్సెంటేజ్ వచ్చినా ప్రవేశం దైవాధీనం, కారణం – 100% కూడా వస్తోంది.

ఈరోజుల్లో విద్యార్ధుల పై వస్తున్న ఒత్తిడి ఎలా ఉంటుందో చూసాము, ఆమధ్యన జరిగిన ఆత్మహత్యలే వాటికి ఉదాహరణ. ఈరోజుల్లో గల్లీ గల్లీకీ కాలేజీలు, ప్రతీచోటా  Deemed Universities  వచ్చేసాయి.. విద్యార్ధుల్లోనూ, తల్లితండ్రుల్లోనూ   కూడా ఓ రకమైన  Killer instinct  లాటిది వచ్చేసింది. అవతలివాడికంటే మనం పైనే ఉండాలి అనే భావం. పోటీ ఉండడంలో తప్పులేదు, కానీ అది ఆరోగ్యకరంగా ఉంటేనే బావుంటుంది. విద్య వ్యాపారంగా మారిన తరవాతే, ఈ దౌర్భాగ్యాలన్నీ చోటు చేసుకున్నాయి. రాజకీయనాయకులు విద్యావ్యాపార్లుగా మారడంతో, ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలూ పట్టించుకునే నాధుడే లేడు.  దానికి సాయం, ప్రభుత్వాలూ, కార్పొరేట్ యాజమాన్యాలకీ విద్యలో 100% ,     Result Oriented  చేసేయడంతో , విద్యార్ధులమీద ఒత్తిడి ఎక్కువయింది… తల్లితండ్రులకి అంతా అగమ్యగోచరంగా తయారవడం. స్కూలు/ కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే, పిల్లాడి భవిష్యత్తు మీద ప్రభావం.

 చివరకి ఏమవుతోందంటే, 1989 లో  కేంద్రప్రభుత్వం ప్రారంభించిన,  NATIONAL INSTITUTE of OPEN SCHOOL   వైపు మొగ్గుచూపుతున్నారు. స్కూలుకి వెళ్ళక్కర్లేదు , ఇంట్లోనే చదువుకుని పరీక్షలు రాసి పాసవొచ్చు.. అలాగే ఏ  IGNOU  లోనో చేరి డిగ్రీ సంపాదించుకోవచ్చు…

 కానీ ఈ పధ్ధతిలో చదివి,  డబ్బు సంపాదించొచ్చు కానీ, లోక జ్ఞానం మాటేమిటీ? నలుగురితో కలిస్తేనే కదా మంచీ చెడూ తెలిసేదీ?

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు