అద్వంద్వం పుస్తక సమీక్ష...!! - మంజు యనమదల

advandam book review

"ద్వైతానికి అద్వైతానికి నడుమదే ఈ అద్వంద్వం.."

కొందరి కవిత్వం చదువుతుంటే అన్ని తెలిసిన పదబంధాలే ఉంటాయి కాని ఓ పట్టాన అర్థం కావు. ఈనాడు వస్తున్న యువ కవుల్లో వచన కవిత్వంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సొంతం చేసుకున్న కవి పుప్పాల శ్రీరామ్. సమాజానికి, వ్యక్తిగతానికి నడుమ మనసు ఊగిసలాటను తాత్విక కోణంలో " నిస్సంగుడు " గా నిలిచి తన భావాలకు సదృశ్య రూపాన్నిచ్చిన తత్వజ్ఞుడు ఈ శ్రీరామ్ పుప్పాల.

మొదటి కవిత రెక్కలు తెగిన దారి ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యపు చదువులు లోహాపంజరాలై వేళ్ళాడుతూ, "చదువిప్పుదు ఒత్తిడికి పగిలిన నల్ల పలక మీద బుద్దిగా ఓనమాలు దిద్దమంటుంది" అంటూ చేజారుతున్న బాల్యాన్ని తనదైన అభివ్యక్తితో అందంగా చెప్తూ చురక వేశారు. మతం పోరాటం నేర్పిన గురువని చెప్తూ కూటి కోసం పరాయి దేశాలు వలసలు పోయి అక్కడ అష్టకష్టాలు పడుతూ అసువులు బాసిన ఎందరో భారతీయుల ఆత్మఘోషను మెహ్ రూమ్-కా-మొహబ్బత్ నామా కవితలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. నేను పుట్టిన ఇల్లు కవిత అవసరాల కోసం తను పుట్టిన ఇల్లు వదలి వెళ్తున్నప్పుడు, తిరిగి ఏ పరిస్థితిలో ఆ ఇంటికి  వచ్చినా తన దేహానికి చోటిచ్చిన తీరుని హృద్యంగా చెప్పడం బావుంది. "పంట పాద ముద్రలు పట్నం కూడలిలో నిలబడ్డాయి" , "నాగళ్ళు నడచిన దూరమంతా భూమిని ముద్దాడే పెదాలకున్న దగ్గరితనంలా కనిపించింది"  అంటూ వలస బతుకుల దైన్య స్థితిని నాసిక్ - ముంబై కవితలో చదువుతుంటే మనసు చెమ్మగిల్లక మానదు. "నా దేశపు  ఏకత్వం అన్నీ తెలిసిన పసితనంలా ఆడుకుంటున్న మా సందులో మతమంటే అమ్మ చెప్పిన నీతి కథలా ఉంటుందంటూ" రంజాన్ మాసపు చిన్నతనపు జ్ఞాపకాలను, రాకియపు ఆటను, మత సామరస్యాన్ని చక్కని భావాలతో దేవుడి సందు కవితలో చెప్పారు. అన్యాయాన్ని ఎదిరించలేని మన అసహాయతను ఎత్తి చూపారు ఆచూకీ కవితలో. దోపిడీకి గురౌతున్న జీవితాలను నల్ల జెండాలు కవితలో, గిరిజనుల పోరాట జీవితాలకి మనస్సాక్షిగా ఇచ్చిన అక్షర రూపం ఆ గిరిజనోడికి నేనేమౌతాను..? అన్న ప్రశ్న మనలో కూడా ఉదయించేటట్లుగా రాయడం అభినందించదగ్గ విషయం. మనిషిలో మనసు యుద్ధ విన్యాసాలను యుద్ధనౌకలో చూపించారు.

మనసు ఆలోచనలకు ఓ రూపాన్నివ్వడానికి పై కప్పులేని నాలుగు స్తంభాల ఇంటిని అస్తిత్వ వేదనగా చెప్పడం చాలా బావుంది. ప్రేమ మైకంలో పడి, కాంక్షల వలయంలో చిక్కుకున్న మనసు కోపాన్ని " నేనెప్పుడూ అస్తిత్వ చీకటి రతిలోని ఎంగిల్నే కాదు నగ్న చైతన్య రహస్యాన్ని కూడా " అనడంలోనే కవి తన మనసు స్పందన వైఖరి గురించి, సదృశం లేనివాడని చెప్పకనే చెప్పడం, ఈ కవితా సంపుటికి " అద్వంద్వం" అని పేరు పెట్టడం సమంజసంగా అనిపిస్తుంది. ధిక్కార, అధికార నియంత్రణ నాటకాన్ని, దాచుకున్న నెమలీక అందం మన రాజ్యాంగం అంటూ వ్యవస్థలో లోపాల్ని ఎట్టి చూపడం అమ్మ పేరేంటి..? కవితలో కనిపిస్తుంది. "శిక్ష పడ్డ నడిరోడ్డు ఎర్రటి ఎండని మోస్తున్నట్టు " అన్న భావాల్లో ఎంత నిగూఢత దాగివుందో అన్నట్టు ఆమె యాంత్రిక ఙివితం యంత్రంగా మారడాన్ని, "మర్మాంగాలు తయారవని పిండం చుట్టూ  మళ్ళీ ఆబగా ప్రదక్షిణం మొదలెడుతుంది " అంటూ పిండం నుండి పెద్దతనం వరకు ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలకు నేనెక్సూ.. నువ్వయ్యీ..!! అన్న అద్ధం పడుతుంది. అట్రాసిటీ కవితలో వెట్టివాడొకడు రాజు కావాలన్న తన కోరికను చెప్తూ, కులాల కుళ్ళును, అంటరానితనాన్ని అక్షరీకరిస్తారు. " గోడలెప్పుడూ కూలిపోయిన కలల్నే గూళ్ళు కట్టుకున్నాయి " అంటూ యంత్రాల్లా బతికేస్తున్న ఎన్నో జీవితాలను గోడకుర్చీ కవితలో చెప్తారు.

" నాకో ఉత్తరం రాయవూ " అంటూ ఆ లేఖ తన మనసుకు ఎలా హత్తుకోవాలో, ఎంత ప్రేమను పంచాలో చెప్పడం ఈ సరికొత్త ప్రేమలేఖ కవిత సారాంశం. " చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన పలక మీద బతుకు సాక్షి సంతకం పెట్టలేక అరిగిపోయిన వేలిముద్రల్లా వణికిపోతారు " అంటూ మలి వయసు పెన్షన్ జీవితాలను లైఫ్ సర్టిఫికెట్ కవితలో చాలా బాగా చెప్పారు. " నది దుక్ఖం నదిది మాత్రమే కాడు నీలో నాలో ఎండిన మోళ్ళది. కుండపోతగా కురవని వానది. " అని నది మనసుని కూడా మన కళ్ళ ముందుకు దుఃఖ నది గా తెచ్చారు. రైతు వ్యధని ఒక మాఫీ కథలో చెప్తారు. అప్పుల జాతి కవితలో వడ్డీలకు బలైపోతున్న బతుకుల్ని, పేదరికం పై గెలుపు కవితలో సమాజపు తీరుతెన్నుల్ని, నెల్లి నరమేధం గురించి పౌరసత్వం పురిటి నొప్పులు కవితలో, మత వైషమ్యాలను పండగెప్పుడొస్తుంది కవితలో, ఖాళీ గిన్నె కవితలో ఆకలి, అమ్మదనం, కోల్పోయిన స్వాతంత్య్రం గురించి చెప్పడం, విలీనంలోంచి  విలీనంలోకి అంటూ వెర్రితలల ఆధునికతను, బహిరంగ మల విసర్జన రహితమైన సమాజం కోసం కోరుకుంటూ మహిళల అవస్థలను ఏ బీ సీ డీ ఎప్ఫూ మా ఊరిప్పుడు ఓడీ  ఎప్ఫూ అన్న కవితలో వివరించారు. చిన్ననాడు పంచుకున్న స్నేహ జ్ఞాపకాలను నేను, ఒక చెట్టూ కవితలో అందంగా చెప్తూ అందరి జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. ఈ యాత్ర ఒక అనాది ఆకలి అంటూ ఙివిత సముద్రంలో వేటపడవల రహస్యాన్ని విప్పుతారు. తనకున్న పుస్తకాల సాంగత్యాన్ని మూగ విపంచిక కవితలో చెప్తారు.

" శరీరమే జీవన్మరణాల్ని నిప్పులతో కడిగే అభ్యంగన స్నానం " అని చెప్తూ శరీరం ఇప్పుడొక మారక వస్తువుని, రోగాలు, అంగట్లో అమ్మకానికాని.. ఇలా ఇప్పటి సమాజపు లోపాలను ఎత్తి చూపుతారు ఇదం శరీరం కవితలో. " తాకేందుకు గుళ్ళోకి రానివ్వని దేవత మడి గడప దాటి వచ్చి పూజగదిలోని ఒక మరణం గురించి ఎప్పటికీ వాంగ్మూలమివ్వదు " అంటారు పూజ గది కవితలో. " సంభాషణ మాత్రం ఇప్పుడొక అనివార్య ప్రథమ చికిత్స " అంటూ ఎమర్జెన్సీ కొత్త కాదని, తిరగబడటం నేర్చుకోవాలని చెప్పడం బావుంది. ఆమె నా దేవత సొంత ఊరు కవితలో వర్ణన బావుంది. " గాలాడని గాజు గదిలోంచి బయటకొచ్చాక నల్లటి కలువ పూల రేకుల్లోంచి తెల్లటి చంద్రుళ్ళానే నిద్రపోతున్నాడు " అంటూ పార్థివ శరీరం చాలా బాగా చెప్పారు. వైద్య ప్రయోగాల్లో వాడే చుంచు ఎలుక గురించి "గినియా పంది" కవితలో కవితా వస్తువుగా తీసుకోవడం  ఇప్పటి వరకు నేను చదవని సరికొత్త కవితా వస్తువు, నాకు బాగా నచ్చిన కవిత కూడాను. కట్టుబాట్లను, ఛాందస భావాల లోపాలను చెప్పిన కవిత మాకు మేమే మీకు మీరే. మామిడికాయ పాకలు కవిత తమ బజారులో  మామిడికాయల గురించి, " ఊరెళ్ళిరావడమంటే  వున్నచోట నుండి మరెక్కడో రెక్కలు కట్టుకుని వాలడమే కాదు ఒక్కోసారి చలి ఆకులు రాల్చిన కాలం చెట్టు ఒంటరి వేసవిలోకి ధైర్యంగా వెళ్లినట్టు వెళ్ళాలి " అంటూ తను రాధేయ పురస్కారం తీసుకోవడానికి రాజమండ్రి నుండి అనంతపురంకు వెళ్లి వచ్చాక రాసిన నిజాయితీ నిండిన మనసు స్పందన వెళ్లొచ్చాక కవిత.

చివరిగా మోహన్ గారి గురించి తన భావాలను స్వచంగా రాయడం...

అనుబంధాలకు సున్నితమనస్కులు అందరు దాసోహమే... శ్రీరామ్ పుప్పాల కూడా సమాజంలోని  అసమానతలను, ప్రపంచ కాలమాన పరిస్థితులను, వ్యవస్థలోని లోపాలను,రాజకీయ మోసాలను, మహిళల పట్ల వివక్షను ఇలా ప్రతి  సమస్యను అక్షరీకరించారు. కొన్ని కొత్త కవితా వస్తువులను తీసుకుని చాలా సమర్ధవంతంగా కవితలల్లారు. తేలిక పదాలతో చిక్కని భావాలు చెప్పిన అద్వంద్వం కవితా సంపుటి అందరు చదవాల్సిన పుస్తకం. ఇంట చక్కని కవిత్వం రాసిన శ్రీరామ్ పుప్పాలకు మనఃపూర్వక అభినందనలు.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు