మనిషి శరీరాన్ని సంగీతంతో ఉత్తేజితం చేయటం ఎలా - ..

How to activate man's body with music

ఈ విశ్వమంతా శక్తి తరంగాల ప్రకంపనలే అనే విషయం ఈ రోజు అందరూ అంగీకరించిన శాస్త్రీయ సత్యం. ఈ విశ్వంలో భౌతికమైన విషయాలన్నింటికీ ప్రకంపనలూ, తరంగాలే ఆధారం. మరి ప్రకంపనం ఉన్న ప్రతి చోటా శబ్దం ఉండి తీరుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ విశ్వం (Existence) అంతా ఒక సంక్లిష్టమైన శబ్ద తరంగ సముదాయం. యోగ శాస్త్రాలు ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే గుర్తించాయి. మనం దీన్ని 'నాద బ్రహ్మ' అంటాం. సృష్టి, సృష్టికర్తా ఒక్కటేనని దీని భావం.

'అంతా శబ్దమే అయినట్లయితే, మరి దాన్ని నేను ఎందుకు వినలేకపోతున్నాను?' అని ప్రశ్న వస్తుంది. సృష్టిలో ప్రకంపనల వలన కలిగే శబ్ద తరంగాలన్నీ మనిషి శ్రవణ శక్తి పరిధిలోకి రాకపోవచ్చు. శబ్దాల ఫ్రీక్వెన్సీలు ఒక పరిమితమైన మేరలో ఉంటేనే అవి మనిషి శ్రవణ శక్తి పరిధిలోకి వస్తాయి. ఈ మేరను దాటిపోయే ఫ్రీక్వెన్సీ గల శబ్దతరంగాలు 'అల్ట్రాసోనిక్' తరంగాలు అంటారు. ఈ మేరకంటే తక్కువ ఫ్రీక్వెన్సీలతో ఉండే తరంగాలు 'సబ్ సోనిక్' తరంగాలు. అల్ట్రాసోనిక్ శబ్దాలూ, సబ్ సోనిక్ శబ్దాలు మనిషికి సాధారణంగా ఉండే వినికిడిశక్తి పరిధికి బయట ఉంటాయి కనుక అవి మనకు వినబడవు.

అయితే , మనం 'ఋతంభర ప్రజ్ఞ' అనే (ధ్యాన) స్థితిలోకి వెళ్లగలిగితే, మన మామూలు వినికిడి శక్తి పరిధిని దాటి ఉండే శబ్దాలను కూడా వినవచ్చు. ఆ స్థితిలో ఉన్నప్పుడు, మీరు ఏ రూపాన్ని చూసినా, ఆ రూపానికి అనుసంధానమై ఉన్న శబ్దాన్ని కూడా మీరు గ్రహించవచ్చు. అప్పుడు ఈ విశ్వచైతన్య మంతా శబ్ద రూపంగానే అనుభవంలోకి వస్తుంది.

చాలా సంవత్సరాల క్రితం, నేను ప్రతి ఏడూ ఒకటి రెండు నెలలన్నా హిమాలయ పర్వతాలలో ఒంటరిగా ప్రయాణాలు చేసేవాడిని. ఒక సారి నేను కేదారనాథ్ వెళ్ళాను. కేదారనాథ్ చాలా శక్తిమంతమైన అద్భుతమైన ప్రదేశం. కేదారనాథ్ కు కొంచెం పైన 'కాంతి సరోవర్' అనే ప్రదేశం ఉంది. అక్కడికి ఎక్కటం కాస్త ప్రమాదకరమైన వ్యవహారం. కనక అక్కడికి ఎక్కువమంది వెళ్లరు. నేను ఆ కాంతి సరోవర్ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడి కొండ రాళ్ళ మీద కొంతసేపు కూర్చొన్నాను.

అక్కడ నాకు కలిగిన అనుభవాన్ని మాటలలో చెప్పటం చాలా కష్టం. కొంతసేపు అక్కడ కూర్చొన్న తరవాత నాకు అక్కడ ప్రతీదీ శబ్దరూపంగానే అనుభూతి కాసాగింది. నా శరీరమేమిటి, ఆ పర్వతమేమిటి, ఎదురుగుండా ఉన్న సరస్సేమిటి - అన్నీ శబ్దరూపంగానే అనిపించాయి. అంతా శబ్దరూపం ధరించింది. నాలో ఏదో చాలా విచిత్రమైన అనుభూతి కలగసాగింది. నేనయితే నోరు తెరవలేదు, అందులో సందేహమే లేదు. కానీ నా గొంతులో నుంచి మాత్రం బిగ్గరగా శబ్దం వస్తుంది. నేనేదో ఒక మైకు పుచ్చుకొని పాట పాడుతున్నట్టు, పెద్దగా శబ్దం వస్తుంది. ఆపాట సంస్కృతం పాట.

నాద బ్రహ్మ

నాద బ్రహ్మ విశ్వస్వరూపా

నాద హి సకల జీవ రూపా

నాద హి కర్మ నాద హి ధర్మ

నాద హి బంధన నాద హి ముక్తి

నాద హి శంకర నాద హి శక్తి

నాదం నాదం సర్వం నాదం

నాదం నాదం నాదం నాదం

(అనువాదం: నాదమే బ్రహ్మాండం, అదే ఈ విశ్వ చైతన్య స్వరూపం. నాదమే అన్నీ విధాలైన జీవరాశుల రూపంలోనూ ప్రకటితమౌతుంది. నాదమే బంధనం. నాదమే మోక్ష సాధనం. బంధించేదీ నాదమే, విముక్తినిచ్చేదీ నాదమే. సర్వమూ నాద ప్రసాదమే. ప్రతి విషయం వెనుక ఉన్న శక్తి నాదమే. నాదమే సర్వస్వం.)

మీరు ఈ పాటలో పూర్తిగా నిమగ్నం అయిపోగలిగితే ఇందులో ఉన్న విశేషమైన శక్తిని గమనించగలుగుతారు. ఈ పాటతో తాదాత్మ్యత పొందగలిగితే, అది మనిషిని కరిగించి వేయగలదు.

మంత్రాలు

మీరు శబ్దాలను ఒక ప్రత్యేకమైన క్రమంలో అమర్చగలిగితే, అవి ఒక రకమైన విశేష ప్రభావం చూపించగలుగుతాయి. మన సంస్కృతిలో, మనం ఇలాంటి శబ్దాల కూర్పులతో రకరకాల పరిశోధనలు చేసి మంత్రాలను ఆవిష్కరించగలిగాము. మంత్రం అంటే ఒక సాంకేతిక ప్రణాళికను సరిగ్గా అనుసరిస్తూ క్రమం ప్రకారం కూర్చబడిన నాదమే. అయితే ఈ మంత్రాలన్నీ వినసొంపుగా ఉండాలని ఏమీ లేదు. మంత్రాల ముఖ్యోద్దేశ్యం విన సొంపుగా ఉండటం కాదు. ఒకానొక సాంకేతిక ప్రణాళికను అనుసరించి ఉండటం. మంత్రాలు ఒక మతానికో, వర్గానికో చెందినవి కాదు. పూజలకూ పునస్కారాలకూ సంబంధించినవి అసలు కాదు. అవి సృష్టిలోని అన్ని విధాలైన రహస్యాలనూ ఛేదించగల విశిష్టమైన శబ్దాల కూర్పులు. యోగ శాస్త్రం లో మీరు ఒక మంత్రాన్ని మీలోనే నిక్షిప్తం చేసుకొని, సంవత్సరాల తరబడి దానిని మీలో 'పొదిగి', మరింత శక్తిమంతం చేసే మార్గాలు చెప్పారు. చాలా మంది యోగులు ఒకే ఒక్క మంత్రాన్ని తమలో నిక్షిప్తం చేసుకొని, తమ జీవిత కాలమంతా దానినే 'పొదిగి' వృద్ధి చేసుకొంటూ ఉంటారు. కాబట్టి, మంత్రం అంటే మీరు జపించే ఒకానొక మామూలు శబ్దం కాదు. మిమ్మల్ని మీరు ఏ శబ్ద సముదాయంగా పరిణమింపజేసుకోవాలని భావిస్తున్నారో, అది మంత్రం. మీకు మీరే ఒక తాళంచెవిగా మారి, జీవితంలో నూతన రహస్యాలను ఆవిష్కరించుకొని ఒక కొత్త అనుభూతిని పొందేందుకు వీలు కల్పించే సాధనం మంత్రం.

శాస్త్రీయ సంగీతం

భారతీయ శాస్త్రీయ సంగీతమంతా మంత్రాలకు రూపాంతరమే. ఇందులో శబ్దాల కూర్పులో ప్రణాళికా బద్ధతతో పాటు సౌందర్యానికీ, శ్రవణ సుఖానికీ కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది. సంగీతం అంటే చక్కని పొందిక గల సుసంస్కృతమైన, నాజూకైన స్వరాల అమరిక. అద్భుతమైన సంగీతాన్ని వింటుంటే మీ శరీరమంతా పులకించి ప్రకంపిస్తుంది. శివుడి చేతిలో డమరుకం అనే చిన్న భేరీ వాద్యం ఉంటుంది. అది జీవంలోని లయాత్మకతకు ఒక ప్రతీక. ఎక్కడినుంచి ఎలాంటి శబ్దాలు వెలువడినా వాటికొక లయ బద్ధత ఉంటుంది. మరి శబ్దాలకు లయ బద్ధత ఉన్నదంటే, వాటికి ఆధారమైన ప్రకంపనలలో కూడా అలాంటి లయాత్మకతే ఉండితీరాల్సిందే కదా!

 

భారతీయ శాస్త్రీయ సంగీతం మానవుడి భౌతికాతీతమైన వ్యవస్థ (system) గురించిన సమగ్రమైన అవగాహనతో రూపొందించబడింది. జీవితంలో మన అనుభూతులలో చాలా భాగం అంతర్గతమైనవే. వెలుగు నీడలూ, శబ్ద నిశ్శబ్దాలూ, సుఖ దుఃఖాలూ ఇవన్నీ మనకు అంతర్గతంగా అనుభవమయ్యేవే. మనిషి అనుభవించే అనుభూతులేవీ బయటినుంచి వచ్చేవి కాదు. మన అనుభూతులన్నిటికీ మూలం మనమే. మనవాళ్లు మన శరీరంలో శబ్దంచేత ప్రభావితమయ్యే కొన్నివిశేషాలను గుర్తించారు. శబ్దాలను ఎలా వాడాలో మీకు తెలిసి ఉంటే, వాటితో మీరు నమ్మశక్యంగాని అద్భుతాలు సాధించగలరు.

మనిషి శరీరాన్ని సంగీతంతో ప్రభావితం చేయటం ఎలా?

యోగ శాస్త్రం మానవ శరీరాన్ని అయిదు కోశాల (లేక, పొరల) సముదాయంగా పరిగణిస్తుంది: అన్నమయ కోశం (ఆహారమయమైన శరీరం), మనోమయ కోశం (మనసుకు సంబంధించిన పొర), ప్రాణమయ కోశం (శక్తి రూపమైన శరీరం - energy body), విజ్ఞానమయ కోశం (సూక్ష్మ (etheric) శరీరం), ఆనందమయ కోశం (బ్రహ్మానందమయమైన శరీరం).

ప్రాణమయ కోశం అంటే శక్తిరూపమైన శక్తిమయ శరీరం (energy body). ఇది చాలా ముఖ్యమైంది. ఇందులో 72000 నాడులు ఉంటాయి. ఇవి శక్తి వాహక నాళాలు. వీటి ద్వారానే శరీరంలో శక్తి ప్రవాహం జరుగుతుంది. మానవ వ్యవస్థలో ఈ నాడులకు 114 కూడలి స్థలాలు ఉంటాయి. వీటిని 'చక్రాలు' అంటారు. ఈ చక్రాల దగ్గర నాడులు కలుస్తాయి. శక్తి ప్రవాహాలను నియంత్రించుకొంటాయి. ఈ నూట పధ్నాలుగు చక్రాలలో, రెండు భౌతిక శరీరానికి బాహ్యంగా ఉంటాయి. 112 చక్రాలు అంతర్గతంగా ఉంటాయి. ఈ నూట పన్నెండింటిలో కూడా, నాలుగు చక్రాలు దాదాపు ఎప్పుడూ నిద్రాణంగానే ఉంటాయి.

అంటే శరీరంలో క్రియాశీలత గల శక్తి కేంద్రాలు నూట ఎనిమిది మిగులుతాయన్న మాట. ఇవి కుడి పక్కన యాభయి నాలుగు, ఎడమ పక్కన యాభయి నాలుగుగా ఏర్పడి ఉంటాయి. వీటిని ఈడ, పింగళ అంటారు. వీటిని ఆధారం చేసుకొనే సంస్కృత భాషలో 54 అక్షరాలు ఏర్పరచుకొన్నాం. అన్ని అక్షరాలకూ ఒక స్త్రీ రూపం, ఒక పురుష రూపం ఉంటాయి.

భారతీయ శాస్త్రీయ సంగీతం, మనలో ఉన్న ఈ 108 చక్రాలను జాగృతం చేయగల వివిధ శబ్దాలను కచ్చితంగా గుర్తించగలిగింది. ఇలా జాగృతం చేయటం వల్ల, మనిషిలో కొన్ని పరిణామాలు కలిగి, మనిషి ఒక ఉన్నతమైన చేతనావస్థను (Higher consciousness) చేరగలుగుతాడు. ఏ కాలంలోనూ, భారతీయ శాస్త్రీయ సంగీతం కేవలం వినోదానికి మాత్రమే ఉద్దేశించబడి ఉండలేదు. అది ఒక వ్యక్తిని విశ్వాత్మగా పరిణమింపజేసేందుకు ఉపకరించే సాధన ప్రక్రియ. మన సంస్కృతిలో సంగీతం గానీ, నృత్యం గానీ, మరొకటి కానీ, కేవలం వినోదం కోసం కాదు. అవి ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియలు కూడా. కేవలం వినోదం పొందాలి అన్న ధోరణి ఇక్కడి జీవన విధానంలో లేదు. చేసే ప్రతి పనీ వ్యక్తిని ఒక ఉన్నత చేతనావస్థకు చేర్చే సాధనం గానే భావించబడేది.

108 శబ్దాల ద్వారా మనిషి అనే వ్యవస్థనంతటినీ జాగృతం చేసి, దాన్ని ఒక ఉత్తమ చేతనావస్థ వైపు నడిపే ప్రక్రియను నాదయోగం అంటారు. ఈ నాద యోగం అనే మౌలిక ప్రక్రియ నుంచి ఉద్భవించిందే భారతీయ శాస్త్రీయ సంగీతం అంతా. ఈ సంగీతాన్ని తగినంత శ్రద్ధతో విని చూడండి. శాస్త్రీయ సంగీతమనే ఈ ప్రక్రియను తగినంత శ్రద్ధతో పరిశీలించి చూడండి. ఇది కేవలం చెవులకు ఇంపుగా ఉండటానికో, సౌఖ్య ప్రదమైన భావోద్రేకాన్ని (emotion) కలిగించటానికో మాత్రమే ఉద్దేశించిన విషయం కాదు. జీవితంలో ఎదురయ్యే నిర్బంధ చక్ర భ్రమణాలనుంచి (compulsive cycles) నుంచి విముక్తి కలిగించే ప్రక్రియ ఇది. ఈ చక్రాలకు అతీతమైన స్వేచ్ఛనూ, ముక్తినీ సాధించే మార్గం.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు