హ్యూమరసం - వారణాసి రామకృష్ణ

 

ఫలితాలు! 

ప్రతి మనిషి పని చేసేది ఫలితాల కోసమే! ఏప్రిల్ మే మాసాలు అంటేనే ఫలితాలు చవి చూసే మాసాలు! విద్యార్ధులు పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తారు.విద్యావ్యవస్థ లో ఫలితాలు భలే అవస్థలతో ఉంటాయి. కొంపదీసి టెన్త్ క్లాసులో ఎవడయిన కాస్త మంచి మార్కులు తెచ్చుకున్నాడో వాడి పని మటాష్, నేరస్తుడ్నిబుక్ చేసి పట్టుకుపోయినట్టు పట్టుకుపోయి సమ్మర్ సెలవుల్లోనే కాలేజీ అనే బందిఖానాలో వేస్తారు.పిల్లడు ఆకలేస్తోందిఅంటే నోర్ముయ్! ముందు చదువు ఆనక తిండి అంటారు. రెండు ముద్దలు ఎక్కువతింటే నిద్ర పోతాడని, టాయిలెట్ కి వెళ్తే 5 నిమిషాలు వేస్ట్ అవుతుందని ఐఐటీలో చేరేక తినొచ్చులేరాఅంటారు!  అంతే కాదు ఎక్కువసార్లు పాస్ కెళ్తే పరీక్షలు పాస్ కాడని అసలు మంచినీళ్ళు తాగనివ్వరు. ఎక్కువ ఫలితాలు పొందాలని ముందు మెదడు తొలిచి మొత్తం గుజ్జు తీసేస్తారు! అందులో ప్రశ్న-జవాబు మాత్రమే కూరి రుబ్బుతారు. ప్రశ్నకొంచెం మారితే కుక్కిన సమాచారం సరిగ్గా కక్క లేడు. తర్ఫీదు ఆ టైపులో ఉంటుంది. ఇట్లాకుర్రాడు‘చైతన్యం’ కోల్పోయి రోబోలాతయారై ‘నారాయణ,నారాయణ’ అని జీవితంలో వుస్సురుమoటూనీరసంగా వాపోతుంటాడు. మరో ప్రక్క ప్రతి కాలేజీ యాజమాన్యం అద్భుత ఫలితాలు అంటూ పత్రికల్లో పేజీ నిండా ప్రకటనలు గుప్పించి 1 st ర్యాంక్ మాదంటే మాదని బూతద్దాల కళ్ళజోడున్న పిల్లల ఫోటోలు వేస్తారు. ఫలితాల కోసం యువత భవిత తో ఆడుకుంటారు!

****    ****     ****

విదేశీ సంస్కృతి కాపి కొడితే ఫలితాలు గమ్మత్తుగా ఉంటాయి. ఓ కుర్రాడు జుట్టు పెంచి చక్కగా జారుముడి వేస్కుని చెవిపోగు కమ్మలతో పెళ్లి చూపులకెళ్తే పెళ్ళి కూతురు తరపు వాళ్ళకి పిల్లాడ్ని తీసుకురాకుండా పెళ్లి చూపులకొచ్చేరెంటి? అర్ధం కాక బుగ్గలు నొక్కుకుని సరే ఈ పిల్ల బావుంది,పోనీ మన పిల్లాడికి చేసుకుందాం అనుకుని పిల్లాడికి బొట్టుపెట్టి మల్లె పూలు తురిమి ‘మా పిల్లాడికి మీ పిల్లని ఇస్తారా’ అడిగేరట! 
వైద్య రంగం లో వచ్చిన అడ్వాన్సెడ్ టెక్నాలజీ తో ఫలితాలు ఇంకో షాకిస్తాయి!

ఓ కుర్రాడు మాంచి ఎర్రగా బుర్ర్రగా వుందని ఓ పిల్లని పెళ్ళాడి తర్వాతో రోజు పెళ్ళాం ఫోటో ఆల్బం తిరగేస్తుంటే రక రకాల ఫోజుల్లో అందమైన అబ్బాయి ఫోటోలు కనిపించాయి. ఎవరీ అబ్బాయి అడిగితే పెళ్ళాం జవాబివ్వక ముసిముసి నవ్వులు నవ్వుతుంటే మీ పక్కింటి కుర్రాడా?అంటే ఊహు అంది!ఓహో! నీ క్లాసుమేటా? అంటే.. ఉ ఊ! అంది దీర్ఘం తీసి!కుర్రాడు బుర్రగోక్కుని నీ లవరా?! డైరెట్టుగా అడిగేశాడు. దానికీ గోముగా కాదని చెప్పింది. కుర్రాడు ఉత్కంట తట్టుకోలేక ఇంకెవరు అయితే? గట్టిగా అడిగితే ‘నేనే! సర్జరీ కిముందు అట్లా వుండేవాడ్ని’ అందిట! దెబ్బకి కుర్రాడు కళ్ళు తిరిగి స్పృహ తప్పేడు! ఇటీవల ఇలాంటి ‘ఫలితాలు’ కొందరు చవి చూస్తున్నారని వినికిడి! ఇదేకాక ఇంకో టైపు లో శీను అనే కుర్రాడు తన క్లాసుమేటు ప్లస్ గ్లాసుమేటు అయిన గోపి తో ‘ఒరే గోపి ఐ లవ్ యు రా!అంటే ‘ఐ టూ లవ్ యు రా శీను’ అని ఎంచక్కా ఇద్దరూ మ్యారేజీ హాల్ బుక్ చేస్కుని జీలకర్ర బెల్లం నాక్కుంటూనెత్తిమీద తలంబ్రాలు పోసుకునిఊటికి హనీమూన్ పోతున్నారు!ఈ మగ–మగ ప్రేమల మెగా గోల ఇలాఉంటే వీళ్ళకి మేమేమి తీసిపోమంటూ ఆడ- ఆడ ప్రేమలు, పెళ్ళిళ్ళు  కూడా జరుగుతున్నాయి. దారుణమైన ‘ఫలితం’ ఏంటి అంటే కొన్నాళ్ళు  ప్రేమించి ఆనక నిర్లక్ష్యం చేస్తోందని మొన్నొక అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుంది. 

రాబోయే రోజుల్లో వ్యక్తి స్వాత్ర్యంత్రం మరింత పెరిగిపోయి మగ అవసరానికి ఆడ రోబో ఆడ వాళ్ళ కోరికలకి మగ రోబోలు తయారవుతున్నాయి.అప్పుడు ‘ఫలితాలు’ ఏ లెవిల్ లో ఉంటాయో ఎవరికీ వారు ఊహించుకోవచ్చు!

****    ******

మనిషి తన జాతక ఫలితాలు తెలుసుకునే కుతూహలo ప్రదర్సిస్తాడు.జ్యోతిష్యం పేరిట చెప్పే ఫలితాలుయమారంజుగా వుంటాయి.నీకుఎదురు లేదు.బోలెడంత బంగారు,డబ్బుచూస్తావు అని మా కాలనీ పాల్ కి జోతిష్యుడు చెప్పేడట. ఫలితంగా పాల్ కి బ్యాంకు లో నైట్ వాచ్ మెన్ వుద్యోగం వచ్చింది. పాల్ బుర్ర గోక్కుని ఈ సారి చిలక జోస్యం చెప్పించుకుంటే మొత్తం దేశం చుట్టి అన్ని ఊళ్ళు చూస్తావు నీకు తిరుగులేదు అని చిలక చెప్పిందట తీరా ఫలితాలు చూస్తె పాల్ లారీడ్రైవర్ అయ్యాడు.మనమేంటోమనశక్తీ ఏంటో తెలుసుకోకుండా అన్నీకావాలి అనుకుంటే ‘ఫలితాలు’ ఇలానే ఉంటాయి.

****     ****   **** 

వైద్య రంగంలో ఫలితాలు చూస్తె మా కాలనీ డాక్టరు ఏక లింగం గారు ఎవరు ఏ రోగం తో వెళ్ళినా , కర్రీ ,వర్రీ, హర్రీ! ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోoడి,ఫలితాలు అద్భుతంగా వుంటాయని చెప్తాడు. మా అప్పారావు కొడుకు బబ్లుగాడు ముక్కులో పెన్సిల్ ముక్క దూర్చుకున్నాడని పరుగులు పెట్టి వెళ్తే ఇట్టాగే కర్రి వర్రీ హర్రీ అనే  త్రి సూత్ర సుత్తిముక్తావళి వల్లించాడు.అయ్యా డాక్టర్ గారు బబ్లుగాడి ముక్కులోపెన్సిల్ ముక్క..అప్పా రావుచెప్పబోతే చూడు అప్పారావ్, మీ అబ్బాయికి నూనెలో వేయించిన కర్రిలు పెట్టకండి ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది.వాడు సరిగ్గా చదువుకోవటంలేదని వర్రీ అవకండి ఫలితం గా రోగంమీకు  వస్తుంది, ఏ పని అయినా హర్రీ గా చేస్తే ఫ్యామ్లి మొత్తం మంచాన పడుతుందన్నాడు. దాంతో మా అయోమయం అప్పారావు లాభం లేదని పాపం నెత్తి నోరు బాదుకుని ఇంకో డాక్టర్ని చూసుకున్నాడు!

ఇంకో అతి తెలివి డాక్టరున్నాడు.తన దగ్గరికి వచ్చిన పేషంట్లు మళ్ళీ మళ్ళీ రావాలని పెద్ద ప్లాన్ చేసి మందుల చీటీ ని ఒక ప్రత్యక మైన పెన్ తో రాస్తాడు. ఆ చీటీ పెద్ద చీటింగ్ చీటీ! అందులో రాసిన మందుల వివరాలు కేవలం వారం రోజులు మాత్రమె కనిపిస్తాయి ప్రత్యెక మైన ఇంకు తో రాయటం వల్ల అక్షరాలు వారం అయ్యాక మాయం అవుతాయి కనుక మళ్ళీ చచ్చినట్టు ఆయన దగ్గరికెళ్ళాల్సిందే, అదీ ఆయన ఎత్తు!ఇలా బోలెడు డబ్బు గడించాక దాక్టరు గారి కే రోగం వచ్చి మంచం మీద ఉండగాపెళ్ళాన్ని పిలిచి మనకి రావలిసినఅప్పులు  చెప్తాను రాయి అన్నాడు.ఆవిడ అదే ‘పెన్తో’ రాసింది. డాక్టరు గారు వారం తిరగ్గానే బాల్చి తన్నేసారు, ఇంకేముంది ఎక్కడెక్కడి వాళ్ళో ఇంటి మీద పడి డాక్టరు గారు బోలెడంత అప్పు ఎగ్గొట్టి పుటుక్కుమన్నారంటూ ఎదురు కేసులు పెట్టి ఫ్యామ్లీని కోర్టు కీడ్చారు. అతి తెలివులకి పోయి డబ్బు ఎక్కువ సంపాదిస్తే ‘ఫలితాలు’ ఇలాగే వుంటాయి!

***     ****    ****

ఉగ్ర వాదం ‘ఫలితాలు’ ఊహించనలవి లేకుండా ఉంటాయి! “ఉత్తెదిల్  రసూల్ అహ్మద్ నూర్  ఉస్మాన్ ముఫ్తీ ఇక్బాల్ అలీ హసన్ జమానుల్లాఖాన్” అనే పేరు గలవాడు అమెర్కా లోకి దూరి నానా బీభత్సం సృష్టిస్తాడు. దీoతో ‘ఫలితాలు’ ఎలా వుంటాయి అంటే ఇమ్మిగ్రే షన్ అధికారులకి ఉగ్రవాది పేరు చదివలేక ముందు పిచ్చెక్కుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అసలు ఆ పేరు నోరు తిరగదు! బట్టి కొడదామన్నాగుర్తుండి చావదు! దాంతో బుర్ర గోక్కుని కోపంతో పళ్ళు నూరుతూ కేవలం హసన్, ఖాన్ అన్నవి మాత్రమేగుర్తుoడి అమెర్కాకి ఎవరొచ్చినా పాస్ పోర్టు, వీసాలో హసన్, ఖాన్ అన్న పేర్లుకనిపిస్తేచాలువాళ్ళబట్టలుమొత్తం ఊడదీసి పేగుల్లో పేలుడు పద్దార్ధాలు ఉన్నాయా అని చెక్ చేస్తారు. దీని ‘ఫలితాలు’ ఏంటి అంటే మన కమల హాసన్,షారూక్ ఖాన్ లాంటి వాళ్ళకి ఉక్రోషం పొడుచుకొచ్చి మేమేమన్నా ఉగ్రవాదులమా?సెక్యురిటిచెకింగ్ పేరుతోబెల్టు లాగాడు,చెయ్యిదూర్చాడు,తొడలుతడిమాడు  ఇంకోడు వీపు గోకి వాసన చూశాడు అని వాపోతారు కానీ అమెర్కా వాడికి ఎవడు తమిళ అయ్యంగారో ఎవడు కరుడు గట్టిన హిందీ బాజీఘరో ఎలా తెలుస్తుంది? వాళ్ళు కేవలం ‘ఫలితాల’ ఆధారoగా చెకింగ్ చేసుకుపోతారు. ఫలితాల లాజిక్ అర్ధం చేసుకోక ఎయిర్ పోర్టుల్లో చిందులేసి ఉపయోగం ఉండదు లేదా ఇలాంటి ఫలితాలు వద్దనుకుంటే అమెర్కాకే వెళ్ళటం మానుకుని అన్ని మూసుకుని ఇక్కడే నటించాలి!

*****    *****   ****

మరో పక్క రాజకీయ నాయకులు ఎన్నికల పరీక్షలు ఎదుర్కొని ఫలితాల కోసం చూస్తారు. ఈ ఫలితాలు కొందరికి మోదం కొందరికి ఖేదం చవి చూపుతాయి!ఫలితాలు రాకుండానే కొందరు ధీమా వ్యక్తం చేస్తారు.ఆ ధీమా చూస్తే మతి పోయేలా ఉంటుంది. బాబు గారికి పర్సెంటేజీ లెక్కలు బాగా తెలుసు, నూటికి వెయ్యి శాతం గెలుస్తాం అని కొత్త పర్సెంటేజీ ఫలితాలు చెప్పారు. పైగా ఏ మూడ్ లో వుండి అన్నారో కానీ ఈ సారి శాసన సభ లో మనకి 25 స్థానాలు రావాలి అన్నారు. పాపం ఆయన లోక్ సభ అనబోయి శాసన సభ అన్నారు కానీ ఓహో!25 వస్తే చాలని ఆయనే అనుకుంటూన్నారని జనం ఓ రెండు తగ్గించి ఫలితాలు నిజం చేశారు. ఆ రకంగా చంద్ర బాబుగారు ఓడి పోలేదు తను చెప్పినట్టె’ఫలితాలు’పొందారు! అట్లాగే పవన్ ఓటమి భయం లేదు అని ముందే తెలివిగా ఫలితాల తెల్లజెండా ఎగరేశాడు దాంతో పవర్ పోయి స్టార్ ఒక్కటి మిగిలింది! అది ఇంకే రకమైన ఫలితాలు ఇస్తుందో వెండితెర మీద చూడాలి! ఇక మా కాలనీ లో పేరు బట్టి జాతకం చెప్పే పిచ్చేశ్వర్రావు గారు జగన్ పేరు లో గన్ ఉంది ఫలితంగా ఎప్పటికైనా గన్ తో ప్రమాదం వుంది అన్నప్పుడు మరి మీ పేరులో పిచ్చిఉందిఎప్పటికైనామీపిచ్చితో ప్రమాదం ఉందా అని మా అయోమయం అప్పారావు అమాయకం గా అడిగితే తోక ముడిచాడు.

***   ****    ****

ప్రతి మనిషి ఫలితాల గురించే ఆలోచిస్తాడు.తప్పులేదు.ఎటొచ్చి తను చెయ్యాల్సిన క్రియ చెయ్యక ఫలితం మాత్రం ఎక్కువ ఆశిస్తే భంగపాటు మాత్రం తప్పదు. ఫలితం అనేది ప్రకృతి సిద్దం! దాన్ని మార్చలేం,కేవలం మనకి అనుకూలం దక్కేలాకృషి చెయ్యగలం అంతే! మానవాళి ఇవాళ పొందుతున్న సకల సౌకర్యాలు,సుఖాలు లోగడ ఎందరో మహానుభావుల కృషి ఫలితం! ఎడిసన్ తనజీవితాన్నినిరర్ధకంగా బద్దకంగా గడిపివుంటే ఇవాళమనకి కాంతి లేదు. చీకట్లోనే వుండేవాళ్ళం. తనకి ట్రైన్ లోజరిగిన అవమానం గాంధీమర్నాడేమర్చిపోయి వుంటే భారత దేశ స్వాతంత్ర్య గాధ ఇంకోలా ఉండేది.ఇన్ని ఫలితాలు చదివాక అసలు మన దేశం లో అత్యధ్బుతంగా మంచి ఫలితాలు ఇస్తున్న/ఇచ్చిన రంగం ఏది? చెప్పండి, షేర్ చెయ్యండి! ఆ ‘ఫలితాల’ని చూసి అందరం గర్వంగా ఫీల్ అవుదాం!

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు