తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

( ఉదకమండలం / ఊటీ )

భారతదేశంలో పర్యాటకుల మొప్పుపొందిన వేసవి విడుదలలో ఊటీ ఒకటి , ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వున్న ప్రసిద్ద వేసవి విడిది అని కూడా చెప్పుకోవచ్చు . ఇది తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో నీలగిరి కొండలలో వున్న వేసవి విడిది . సతతహరితాలతో యీకొండలు నీలంగా కనబడతాయి కాబట్టి వీటికి నీలగిరులు అనే పేరొచ్చిందని కొందరంటే మరికొందరు యూకలిప్టస్ వృక్షాలతో నిండినకొండలు యూకలిప్టస్ ని నీలగిరి అని అంటారు కాబట్టి యీ కొండలని నీలగిరులని పిలువబడుతున్నాయని అంటారు .

తమిళులు ఊటీని ఉదకమండలం అని పిలుస్తారు , యెప్పుడూ యీ ప్రాంతం నీటి మేఘాలతో కూడుకొని వుంటుందికాబట్టి ఉదకమండలంగా వ్యవహరించ సాగేరు . ఆంగ్లేయులు ఆ పేరుని షార్ట్ చేసి ఊటీగా వ్యవహరించసాగేరు , ప్రస్తుతం యిది ఊటీగానే ప్రసిద్ది పొందింది .

సముద్ర మట్టానికి సుమారు 7వేల అడుగుల యెత్తులోవుండి సాధారణంగా 14 డిగ్రీల సెల్సియెస్ వేడిని కలిగి వుండే ప్రదేశం . నీలగిరి కొండలలో వుండడం వల్ల వర్షపాతం యెక్కువ , యీ కొండలలో వున్న అడవులు సతతహరితాలు కాబట్టి యే కాలంలో అయినా మనం ఊటీ వెళ్లొచ్చు , యే కాలమైనా మనకి అహ్లాదకరంగానే వుంటుంది .

ఊటీకి అందాలనిచ్చేవి ముఖ్యంగా కొండవాలులలో పెంచే టీ తోటలు , అడవులలో పెరుగుతున్న పనస , అరటి , నాష్పతి లాంటి పండ్లజాతులు , తెల్లటినురుగుతో కొండలపై జారుతున్న జలపాతాలు , మనశరీరాలను తాకుతూవుండే చల్లని మేఘాలు , ఈ కొండలను కలుపుకొని వున్న అభయారణ్యాలు .

ఊటీ తమిళనాడులోని కోయంబత్తూరుకి సుమారు 86 కిలోమీటర్ల దూరంలోను , కర్ణాటక లోని మైసూర్కి సుమారు 128 కిలోమీటర్ల దూరంలోనూ వుంది , ఊటీ వెళ్లదల్చుకున్నవాళ్లు యీరెండు దారులను వుపయోగించుకోవచ్చు , కొందరు కోయంబత్తూరు

మీదుగా వెళ్లి మైసూరుమీదుగా రావడం లేదా మైసూరు మీదుగా వెళ్లి కోయంబత్తూరు మీదుగా రావడం కూడా చేస్తూవుంటారు . ఎటువైపు నుంచి వెళ్లినా ప్రకృతిని పూర్తిగా అనుభవించవచ్చు .

ఉదకమండలం మొదటినుంచీకూడా కొండరాజ్యంగానే వుండేది , అయితే యీ రాజులు యెప్పుడూ సామంతరాజులుగానే వున్నారు . చరిత్రలో యీ రాజ్యం శాతవాహనుల కాలం నుంచి వున్నట్లుగా  గుర్తించబడింది , కందంబ , హోసల , గాంగేయ , జయనగరరాజులపాలనలో వుండి టిప్పుసుల్తాను కాలంలో ఆంగ్లేయులతో చేసుకున్న శ్రీరంగపట్నం ఒప్పందం ప్రకారం యిది ఆంగ్లేయుల పాలనలోకి వచ్చింది . మద్రాసు ప్రెసిడెన్సి కి వేసవి ముఖ్యపట్టణంగా కూడా వుండేది . ఆంగ్లేయుల కాలంలో దీనిని ఆసియా ఖండపు స్విట్జర్ లేండుగా వర్ణించేరు . స్విట్జర్ లేండు అన్నారుకదా ? హిమపాతం అవుతుందని మాత్రం అనుకోవద్దు . హిమపాతం కాకపోయినా చాలా చల్లగా వుంటుంది .

అయితే అన్ని వేసవి విడుదలలో వున్నట్లే పర్యాటకుల కొరకు బోటింగి , హేంగ్ గ్లైడింగు లాంటివి వున్నాయి . బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది  బోటనీ విద్యార్ధులకు కావలసిన చాలా రకాల మొక్కలు యిక్కడ లభ్యమౌతాయి . చుట్టూ వున్న గ్రామాలలో యెన్నో కొండజాతులవారు నివసిస్తున్నారు , ప్రధానంగా వీరు వ్యవసాయం చేయడంలో ఆరితేరినవారు , ఇక్కడి వాతావరణం కొన్ని ముఖ్యమైన మందులతయారీకి అనువుగా వుండటం వల్ల వాటి తయారీలకుగాను కంపెనీలు నడుపబడుతున్నాయి , ముఖ్యంగా మనుషులకు వాడే రేబీసు మందుని యిక్కడ తయారు చేస్తారు . ఫొటో ఫిల్మ తయారవుతుంది , కెట్టిలో సూదులతయారీకూడా వుంది . ముఖ్యంగా టీ తోటల గురించి చెప్పుకోవాలి , యిక్కడి తేయాకుకి నీలగిరికొండల యెత్తు ( సుమారు 7 వేల అడుగులు) , నీలగిరి చెట్ల మధ్యన , సారవంతమైన నేల కావడం మొదలయిన కారణాలవల్ల యిక్కడ టీ కి ప్రత్యేకమైన రుచి వుంటుందని టీ ప్రియులు అంటారు . ఇక్కడకు వచ్చే పర్యాటకులలో అధికశాతం టీ కొనుక్కువెళతారు .

తమిళనాడులోని మెట్టుపాలెం నుంచి ఉదకమండలం రైల్వే స్టేషనువరకు మీటర్ గేజ్ రైలు నడుస్తోంది , యీ రైల్వే  స్విస్ యింజనీరుచే సుమారు 1,32 వేల పౌండ్ల వ్యయంతో 1891 లో నిర్మింపబడింది . అయితే అప్పట్లో యిది కూనూరు వరకు నడపబడేది , 1908 లో మద్రాసు రైల్వే దీనిని కొని కూనూరు నుంచి  ఉదకమండలం వరకు పెంచేరు . చాలా మెల్లగా నడుస్తుంది కాని యిందులో వెళుతూ లోయలను చూడ్డం ఒక అనుభూతి , దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 2005 లో గుర్తించేరు .

7 వేల అడుగుల యెత్తులో వున్న గోల్ఫ్ కోర్స్ ఒక ఆకర్షణ యిక్కడ , యిది సుమారు 200 హెక్టారులలో నిర్మించేరు . ఇది జింఖానా క్లబ్ వారిచే నడుపబడుతోంది . ఎత్తైన వృక్షాల మధ్యవున్న సరస్సులో బోటింగు కూడా చాలా బాగుంటుంది .ఊటీ కి దగ్గరగా వున్న ‘ ముదుమలై నేషనల్  సేంచురీ ‘ తప్పకుండా చూడాలి .కోయంబత్తూరు కి సుమారు 150 కిలోమీటర్లదూరంలో వుంది , కేరళ కర్నాటక , తమిళనాడులలో విస్తరించి వుంది . పులి సంరక్షణా కేంద్రం గా  దీనిని గుర్తించేరు .

ఈ సేంచురీని అయిదు విభాగాలగా విభజించేరు వీటిని ‘ మసినగుడి , తెప్పకాడు , ముదుమలై , కకార్ గుడి , నెల్లకోట లుగా పిలుస్తారు . ఇది సుమారు 321 స్వేరు కిలోమీటర్లలో వ్యాపించి వుంది . ఇక్కడ బెంగాలు పులి తో బాటు చిరుతపులి , అడవిదున్నలు , యేనుగులకు నివాసం , ఈ అడవిలో సుమారు 266 వివిధ పక్షిజాతులు వున్నట్లు గుర్తించేరు . ఇక్కడ ప్రకృతిలో లుప్తమైతున్న తెల్లరాబందులు , పొడుగుముక్కు రాబందులు వున్నట్లు గుర్తించేరు . ఈ అభయారణ్యంలో సుమారు 40 పెద్దపులులున్నట్లు గుర్తించేరు .

అలాగని మనం వెళుతూ వుంటే యెదురొస్తాని అనుకుంటే పొరపాటే , కాకపోతే మనం ఆ అడవులలో తిరుగుతూ వుంటే వినపడే పక్షికూతలు , చుట్టుపక్కల మాంసాహార జంతువుంటే కొమ్మలపై తిరిగే కోతులు మిగతా జంతువులను హెచ్చరించడం , అడవిలో కలిగే అలజడి మొదలయినవి అనుభవించాలి తప్ప వర్ణించలేము . సాధారణంగా కృారజంతువులు మనుషసంచారానికి దూరంగా వుంటాయి , మరీ మన అదృష్టం బాగుంటే దూరంనుంచి వెళ్తున్న జంతువు కనిపిస్తుంది , దున్నలు జింకలు మాత్రం మనకు యెదురు పడుతూనే వుంటాయి . జంతువులు కనబడకపోయినా దట్టమైన అడవులలో తిరిగే అనుభవం చాలా బాగుంటుంది .

పల్లెలలో ఊరి అమ్మవారి కోవెలలు , వారి ఆచారవ్యవహారాలను చూడొచ్చు . ఊటీలో కేరట్ , క్యాబేజి , క్యాలిఫ్లవరుమొదలైన విదేశీ కూరగాయలు , పియరు , ప్లమ్ , స్ట్రాబెరీ లాంటి విదేశీ పండ్లతో పాటు దేశీ కూరగాయలు , పండ్లు కూడా పండిస్తున్నారు .

కార్పెట తయారీ , ఇంటితయీరీ చాక్లెట్ లలో కూడా ముందున్నారు , ఇక్కడకొచ్చే పర్యాటకులు ఇంటి తయారీ చాక్లెట్లను యెంతో యిష్టంగా కొనుక్కుంటున్నారు .మన టాలీవుడ్ , కోలీవుడ్ సినిమాలు తరచూ యిక్కడ షూటింగ్ జరుపుకుంటూవుంటారు , బాలీవుడ్ బంపర్ హిట్ సినిమా ‘ కుఛ్ కుఛ్ హోతాహై ‘ కూడా యిక్కడ నిర్మింపబడింది .ఏదో హడావిడిగా కాకుండా ఊటీలో రిలాక్స్డ్ గా వుండి వస్తే మన శరీరం మనసు తాజాగా అవుతుంది అనడంలో యెంతమాత్రం అతిశయోక్తి లేదు . శరీరాన్ని తాజాగా చేసుకోవాలనుకుంటే యిలాంటి విహారయాత్రలు చెయ్యాలి .

పై వారం మరికొన్ని కొత్తప్రదేశాల వివరాలతో మీముందుంటానని తెలియజేస్తూ శలవు .    

 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు