సాధారణంగా గమనించేదేమిటంటే, చేతిలో చాలా డబ్బులుంటే, జీవితం సాఫీగా వెళ్ళిపోతుందని, అన్నిరకాల లగ్జరీలూ అనుభవించొచ్చనీ… ఆ డబ్బు ఎలాగోలా సంపాదించడానికి, చాలామంది శ్రమ పడుతూంటారు.. కొంతమందైతే, అవతలివాడికి టోపీ పెట్టయినా, సంపాదించడానికి వెనుకాడరు… కొంతమంది, లాటరీల్లోనూ, గుర్రప్పందాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కూడా చూసాము. ఎంత నష్టం వచ్చినా, ఎప్పుడోఒకప్పుడు ఆ లక్ష్మీదేవి కనికరించకపోతుందా అనుకుని , ఆ రంధిలోనే ఉంటారు.
అసలు గొడవంతా ఎక్కడొచ్చిందంటే, మనం అవతలివాడికంటే ఓ మెట్టు పైనే ఉండాలనే యావ. కొన్ని సంవత్సరాలక్రితం వరకూ, ఇలాటి ఆలోచనలు తక్కువే.. ఏదో ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే, జీవితం సాఫీగా గడిచిపోతే చాలూ అనుకునేవారు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవుగా.. కాలంతోపాటు మనుషులూ, వారి మనస్థత్వాలూ మారిపోయాయి. దేశంలో ఉండే అత్యంత ధనవంతుల మాటవదిలేద్దాం….వంశపారంపర్యంగా వచ్చిన ఆస్థిపాస్తులుంటాయ్. ఆ ఉన్న ఆస్థిని వృధ్ధి చేసుకోడానికి నానా పాట్లూ పడతారు. కొంతమంది పన్నులు ఎగ్గొట్టేవారూ, కొంతమంది అధికార దుర్వినియోగం చేసేవారూ, మరికొంతమంది, పలుకుబడి ఉపయోగించి, బ్యాంకుల్లో అప్పులు సంపాదించి, ఆడబ్బు ఎక్కడెక్కడో పెట్టుబడిపెట్టడాలూ, మరికొందరు ఏవేవో ఫైనాన్స్ కంపెనీలు ప్రారంభించి, సామాన్య ప్రజల డబ్బులు దోచేసి, కంపెనీలు మూసేయడం. అలాటివి ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి… చిత్రం ఏమిటంటే, అధికారంలో ఉండే పాలకులకీ వీటిలో వాటాలుండడం…దీనితో ప్రభుత్వ యంత్రాంగం కూడా, డబ్బు నష్టపోయిన సామాన్యప్రజల ఫిర్యాదులు, అంతగా పట్టించుకోరు… అసలు అటువంటి బెల్ట్ కంపెనీల్లో డబ్బులు ఎందుకు పెట్టినట్టూ? వడ్డీలు భారీగా వస్తాయనేకదా.. వడ్డీ మాట దేవుడెరుగు అసలుకే మోసం వచ్చేస్తుంది… అయినా గ్రామీణ ప్రజలు మాత్రం మారరు కారణం డబ్బులుంటే చాలు జీవితం సాఫీగా వెళ్ళిపోతుందనే ఓ భ్రమ. సాధారణంగా మధ్యతరగతి వారిలోనే కనిపిస్తూంటుంది. అప్పుచేసైనా, ఇలాటి బెల్ట్ కంపెనీల్లో డబ్బు పెడతాడు.
అసలు సంతోషంగా ఉండడమంటే ఏమిటని చాలామంది ఆలోచించరు. చిన్న చిన్న పూరిళ్ళల్లో ఉంటూ, భార్యాభర్తా ఇద్దరూ ఏదో ఒక పనిచేసుకుంటూ, ఓ ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా పోషించుకుంటూ, హాయిగా నవ్వుతూ ఉండగలిగేవాళ్ళను చూస్తే తెలుస్తుంది, అసలు సిసలు సంతోషమేమిటో. వాళ్ళేమీ, పెద్ద పెద్ద ఎపార్ట్ మెంట్లలో ఉండరూ, వాతావరణానికి అనుకూలంగా ఏసీ లూ అవీలేవూ, నెలసరికి సరిపడే సరుకులా కొనుక్కోలేరూ, పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో చదివించరూ, ఎండనకా, వాననకా పనులకి వెళ్తూనే ఉంటారూ, మనకైతే వేసవి శలవలు, పండగలకీ పబ్బాలకీ మనకి శలవలు కానీ, వీళ్ళకి మహా అయితే నెలలో రెండు మూడు శలవలు.. అయినా ఎక్కడో తప్ప, చాలామంది సంతోషంగానే కనిపిస్తారు. మనలాగ “ రేపటి “ గురించి అస్సలు ఆలోచించరు… చేతులో నాలుగు డబ్బులొస్తే చాలు, ఖర్చుపెట్టేదాకా ఉండలేరు. వాళ్ళేమీ మనలాగ, మినరల్ వాటరు తాగరు, వాళ్ళుండే గుడెశల పక్కనే మురిక్కాలవలున్నా, ఓ వరసా వావీ లేని తిండి తింటున్నా, వారికి రోగాలన్నవి ఎక్కడో తప్ప ఉండవు… మహా అయితే ప్రభుత్వాలు ఇస్తున్న “ ఆరోగ్య శ్రీ “ పథకాలే వాళ్ళకి దిక్కు.. ఇంట్లో ఆడపిల్ల ఉంటే, తల్లి తనతోపాటే తీసికెళ్ళి పనులు చేయడం నేర్పుతుంది. ఒకలా చెప్పాలంటే, ఈరోజుల్లో నగరాల్లో పనిమనుషులు స్కూటర్లమీదే పనికి రావడం. అలాగని ఏదో లగ్జరీ కోసంకూడా కాదు, నాలుగైదిళ్ళలో పనికి ఒప్పుకున్నప్పుడు, స్కూటరు మీదైతే టైము కలిసొస్తుందని.
మధ్యతరగతి వారిలో ఉండే బలహీనత ఏమిటంటే, స్వంత బండి కాకుండా, బస్సుల్లోనో , సైకిలుమీదో వెళ్తే చూసినవాళ్ళేమనుకుంటారో అని భయం… మరీ గుడెసెల్లోనూ పాకల్లోనూ ఉండమంటే ఎలాగా, మరీ అంతంత చదువులు చదువుకునీ అని అడగొచ్చు. జీవితం సుఖమయం చేసుకోవాలంటే, ముందుగా రోజూ జరిగే కొన్ని కొన్ని బుల్లిబుల్లి సంతోషాలు ఆస్వాదించడం నేర్చుకుంటే చాలు. వాటికోసం ఏమీ వెతుక్కోనక్కర్లేదు కూడా, మనసుని ఆహ్లాద పరిచేదేదైనా సరే, అది ఇంటావిడ చేసే వంటలో చూడొచ్చు, ఆఫీసుకెళ్ళడానికి బస్సు దొరికి , టైముకివెళ్ళగలిగితే అదో సంతోషం… అప్పుడప్పుడు పిల్లల బాగోగులు కనుక్కుంటూ, కుటుంబంతో ఓ పార్కుకికానీ, ఓ సినిమాకి కానీ వెళ్ళి వారితో క్వాలిటీ టైము గడపగలిగితే వాళ్ళెంతసంతోషిస్తారో?
మనమనసు ఆహ్లాదంగా ఉంచుకోగలిగితే, రోగాలు రమ్మన్నా రావు. ఇంతకన్నా ఐశ్వర్యం ఎక్కడుంటుందీ?
సర్వేజనా సుఖినోభవంతూ…