యూత్ అంటే ఏంటీ.? యూత్ అంటే పార్టీలూ, యూత్ అంటే పబ్‌లూ.. ఆకతాయిగా బాధ్యత లేకుండా తిరిగే కుర్రాళ్లు ఇంతేనా.? అస్సలేమాత్రం కాదండోయ్. యూత్ అంటే చాలా ఉంది. చాలా కొద్ది మంది మాత్రమే ఆకతాయిల్లా తిరుగుతున్నారేమో కానీ, చాలా ఎక్కువ మంది సమాజం పట్ల తమ వంతు బాధ్యతతో మెలుగుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ రోజు మనం చర్చిద్దాం. కాలుష్యం కోరలు తెరుచుకుని చూస్తోంది. మానవాళిని నిలువునా కబళించి వేస్తోంది. ఈ నేపథ్యంలో మన సిటీలోని యువత ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పెరిగిపోయిన కాలుష్యాన్ని పూర్తిగా నాశనం చేయలేం కానీ, ఒకింత బాధ్యతతో వ్యవహరిస్తే, చుట్టూ ఉన్న పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవచ్చునని భావించింది.
ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఇన్సిప్రేషన్‌తోనే యువత కొన్ని గ్రూపులుగా విడిపోయి, పెద్ద పెద్ద నగరాల్లోని పాపులర్ పబ్లిక్ ప్లేసెస్‌ని శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టింది. ఉదాహరణకు వైజాగ్‌లోని ఆర్.కె.బీచ్ నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆహ్లాదమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్ ఆ బీచ్. అయితే, బీచ్‌లో ఎక్కడ చూసినా చెత్త, చెదారం, వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్.. తిని పారేసిన తినుబండారాల వ్యర్ధాలతో దుర్ఘంధం వెదజల్లుతూ ఆహ్లాదాన్ని దెబ్బ తీస్తోంది. సరిగ్గా ఇదే పాయింట్‌ని కొందరు యువత తమ వినూత్న ఆలోచనకు ఆయుధంగా మార్చుకున్నారు. బీచ్‌ని శుభ్రం చేసే పనిని ఓ యజ్ఞంలా మొదలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే వారు అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలిగారు. ఒకరిద్దరి కుర్రాళ్లతో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు వందలు వేల సంఖ్యలో యువతను ఇన్‌స్పైర్ చేసింది.
తమ పని తాము చేసుకోవడం తప్పేముంది.? అంటూ ఉద్యోగులు, విద్యార్ధులు ఈ కార్యక్రమంలో విసృతంగా పాల్గొంటున్నారు.
ఒక్క వైజాగ్‌లోనే కాదు, హైద్రాబాద్, బెంగుళూర్, తిరుపతి.. పలు నగరాల్లో యువత తమ వంతు బాధ్యత నిర్వహిస్తోంది. ఇది కేవలం స్వచ్ఛ భారత్‌కి సంబంధించిన అంశమే కాదు, పలు కీలక సామాజిక అంశాల్లో యువత యాక్టివ్‌గా ఉంటోంది. ఊరు కోసం ఏదో ఒకటి చేయాలి లేదంటే లావైపోతాం అంటూ గతంలో ఓ హీరో చెప్పాడు. ఆ సూత్రాన్ని ఇప్పుడు మన యువత బాగానే ఫాలో అవుతోంది. ఇటీవల విడుదలైన 'మహర్షి' సినిమా కూడా యూత్‌లో ఎంతో కొంత ఆదర్శం నింపింది. వీకెండ్‌ని కొత్తగా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్స్‌లో నగర శివార్లలో సేద్యం చేసే యువ రైతులు కూడా ఎక్కువయిపోయారు ఈ మధ్య. ఈ రైతులు కేవలం మొబైల్ ఫోన్‌లో స్టేటస్ కోసమో, లేక ఇంకేమైనా గొప్పల డప్పులు కోసమో చేసే రైతులే అనుకుంటే పొరపాటే. అలాంటి వారు 10 శాతం మంది ఉంటే, హార్ట్‌ఫుల్‌గా వ్యవసాయం చేసే యువ రైతులు కూడా లేకపోలేదండోయ్ వీరిలో. వీకెండ్స్‌లో నగర శివార్లకు వెళ్లి, అక్కడి పొలాల్లో రైతులకు ఉచితంగా వ్యవసాయంలో సాయమందిస్తోంది యువత.
నేటి యువతే రేపటి భవిత అంటే ఇదేనేమో. అందరూ ఉద్యోగాలంటూ దేశాలు పట్టి పోతే, అందరికీ అన్నం పెట్టే రైతు పరిస్థితేంటీ.? అందుకే జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. వ్యవసాయంపై కూడా యువత ఆశక్తి చూపుతోంది. వీకెండ్ వ్యవసాయాలే కాదు, ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ ఫార్మింగ్ కోసం కూడా యువత వడి వడిగా ఆడుగులు వేస్తోంది. సాంకేతికతతో కూడిన వ్యవసాయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు వినూత్న ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే కొందరు ఇంజనీరింగ్ విద్యార్ధులు తమ బుర్రకు పదును పెట్టి, సాంకేతికతతో కూడిన మెరుగైన వ్యవసాయ పరికరాలను కనిపెట్టి అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.