కనకరాజు గారు మా బాసు. లంకంత కొంప, ఇద్దరు భార్యలు, మూడు బొచ్చు కుక్కలు, నాలుగు కార్లు, అయిదు వ్యాపారాలు ఉన్నాయి.
అందులో రియల్ ఎస్టేట్ ఒకటి. ఆ వ్యాపార సంబంధంగానే నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను. డబ్బు దండిగా వస్తోందంటే వ్యాపారంలో లొసుగుంటుంది. లొసుగున్నవాడికి భయం ఉంటుంది. భయం ఉన్నవాడికి భక్తి ఉంటుంది. మా బాసుకి దేవుడంటే అపారమైన భక్తి. ఆయన ఆదేశానుసారం ఉదయాన్నే నేను గుడి దగ్గర నిలబడి ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. ఆఫీసుకు రమ్మంటే ఆలస్యంగా వస్తానన్నఅనుమానంతో తెలివిగా ఉదయాన్నే గుడి దగ్గరికి రమ్మన్నాడు. అంచేత తెల్లవారే సమయానికే గుడి దగ్గరికి రావాల్సి వచ్చింది.
అలల్లా గాల్లో తేలుతూ గుండెను తాకుతున్న గుడి గంటల ధ్వని తరంగాలు... భక్తుల పారవశ్యపు కేకలు.... మంద్ర స్థాయిలో వీనుల
విందుజేస్తున్న సుప్రభాతం.... వెరసి ఓ పవిత్ర వాతావరణం నెలకొని ఉంది అక్కడ. మనసారా దాన్ని ఆస్వాదిస్తూ రోడ్డు వైపు చూస్తున్నాను. పడవంత కారొచ్చి గుడికి కాస్త దూరంలో ఆగింది. మా కనకరాజు గారు దిగారు. ఇస్త్రీ నలగని తెల్లటి బట్టలు. వేళ్లకి ఉంగరాలు. మండ గొలుసు.
మెడలో రుద్రాక్షలతో చేసిన బంగారు మాల. తిరుగాడే జ్యుయలరీ షాప్లా, కుబేరుడి గారాల కొడుకులా ఉన్నాడు. పల్చని లెనిన్ చొక్కా జేబులోంచి ఒత్తుగా పర్సు ఎత్తుగా కనబడుతోంది. హుందాగా గుడివైపు అడుగులు వేశారు. నేను వచ్చినట్టుగా తెలియడానికి విష్ చేద్దామని ఆయన వైపు నడిచాను.
అకస్మాత్తుగా ఓ అడుక్కుతినేవాడు అడ్డంగా వచ్చి మా బాసు ఎదురుగా నిలబడ్డాడు. చింపిరి జుత్తు, చిరుగుల చొక్కా, మాసిన పంచె, దరిద్ర దేవత ముద్దు బిడ్డలాగున్నాడు.
చేతి లోని సిల్వర్ బొచ్చెను మా బాసు కళ్ళముందు ఆడిస్తూ, "బాబ్బాబు దర్మం సెయ్యండి బాబు" అన్నాడు. బాసు చిరాగ్గా మొహం పెట్టి 'అడ్డులే' అని కసురుకున్నాడు. వాడు కదలకుండా "తవఁరు లాంటి దరమ పెబువులు కూడా దానం సెయ్యాపోతే ఎలా బాబు?" అన్నాడు. బాసు వాడి వైపు కోపంగా ఓ చూపు విసిరి పక్కకు తప్పుకుని ముందుకు వెళ్ళాడు. వాడు వదల్లేదు. వెనకాలే బొచ్చె ఆడిస్తూ "అలాగెలిపోతారేటి...? ఒక్క రూపాయి దర్మం సెయ్యండి బాబూ పున్నెం వుంటాది" అన్నాడు. బాసుకి సహనం నశించింది. "చెప్తుంటే నీక్కాదూ... ఉదయాన్నే ఏవిఁట్రా న్యూసెన్సు ...ఫో అవతలికి" గట్టిగా కసురుకుంటూ గుళ్ళోకి వెళ్లి పోయాడు.
నేనూ లోపలికి వెళ్ళాను. అభిషేకం చేయించుకుని బాసు గుడిలోంచి బయటకి వచ్చాడు. తన వ్యాపారాలు ఇంకా బాగా వృద్ధి చేయమని
బహుశా ఆ దేవుడికి మొరపెట్టుకొని ఉండొచ్చు.
పర్సు లోంచి రెండువేల నోటు తీసి కళ్ళకద్దుకుని హుండీలో వేశాడు. ప్రక్కకు తిరిగి చూసి తెల్లబోయాడు. పక్కనే ఆ బిచ్చగాడు నిలబడి ఉన్నాడు.
వీడు మా బాసుని ఇక్కడ కూడా వదల్లేదా అని ఆశ్చర్యపోయాను. మా బాసు చూస్తుండగానే వాడు దేవుడికి దండం పెట్టుకుని తన బొచ్చెలో చిల్లరంతా తీసి హుండీలో వేశాడు.
మా బాసు వ్యంగ్యంగా "అడుక్కుంటూ సంపాదించిందంతా హుండీలో వేశావు. ఏం తింటావురా..?" అని అడిగాడు.
"ఓ రోజు తినాపోతే సచ్చిపోను బాబు. మీలాంటోల్ల మనసు మార్చమని, మాలాంటోల్లకి దానం సేసీ గునం పెసాదించమని ఆ దేవుడ్ని మొక్కుకుని నా రెండ్రోజుల సంపాదన వుండీలో ఏసేను. మీ వల్లే మొదటిసారిగా గుడిలోకి అడుగుపెట్టీ బాగ్యం నాకు దక్కింది. వత్తాను బాబు" అంటూ ఓ నమస్కారం చేసి బయటికి నడిచాడు.
ఆ దెబ్బకి మా బాసుకి మాట పడిపోయి, ముఖం ఎర్రగా అయిపోయింది. వాడి పొగరుకు నేనూ ఆశ్చర్యపోయాను. ఆ టైం లో మా బాసు
కంటపడితే బావుండదని ప్రక్కకి తప్పుకున్నాను. దిగ్భ్రాంతి నుంచి తేరుకుని ఆయన బయటకు నడిచారు. నేనూ ఫాలో అయి ఏం తెలీనట్టు కారు దగ్గర కలుసుకున్నాను.
ఆయన కూడా మామూలుగానే "వచ్చావా... గుడ్. ఈరోజు సైట్ దగ్గరకెళ్లి పని ఎంతవరకు అయ్యిందో చూడు. సిమెంట్ డీలర్ తో మాట్లాడాను.
వెళ్లి కలుసుకో. ఆ బేంకు మేనేజరు వెళ్ళినప్పుడల్లా ఇకిలిస్తున్నాడు తప్ప పని చేయడం లేదు. దాణా ఎంత కావాలో క్లియర్ గా అడిగేయ్. ఆ ప్రహరీ గోడ విషయంలో ప్రక్కవాళ్ళు ఏదో ప్రోబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు. జాగ్రత్తగా డీల్ చెయ్యి. నేను ఇప్పుడు వైజాగ్ పోతున్నాను. ఈ పనులు చూసుకుని రాత్రికి నువ్వు వచ్చేయి . రేపు మనకి చాలా పనుంది" అంటూ కారెక్కారు మా బాసుగారు. "అలాగే సార్. ఉంటాను సార్" అనే లోపే కారు తుర్రుమంది. నేను నిట్టూరుస్తూ యధాలాపంగా గుడి వైపు చూశాను. బిచ్చగాడు మరో పెద్దమనిషి వెంట పడ్డాడు. ఆయన ఆగి జేబులోంచి చిల్లర తీసి వాడి బొచ్చెలో వేశాడు. వాడు వంగి దండం పెట్టాడు.
చిల్లర ఏరుకునే వీడు కోటీశ్వరుడైన మా బాసుని కొట్టకుండా, తిట్టకుండా ఎంత ఘోరంగా అవమానించాడు. నిజానికి నేను కూడా బెగ్గర్స్ ని
ఎంకరేజ్ చెయ్యను. కానీ వాడు నాకో కొత్త పాఠం నేర్పాడు. ఈ సంఘటన ఎందుకో నా మనసులో చోటు చేసుకుంది. చిత్రంగా ఇంతకంటే బలమైన సంఘటన కొద్ది గంటల్లోనే నాకు ఎదురవుతుందని నేనేమాత్రం ఊహించలేదు. ఊహించని సంఘటనల సమాహారమే కదా జీవితమంటే.
సాయంత్రం ఆరయ్యే సరికి ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా బాసు పనులన్నీ పూర్తి చేశాను. ఆ దెబ్బకి ఒళ్ళు నలిగి ఎండకి కమిలిపోయింది. అటుపై బస్సులో ప్రయాణం అంటే భయం వేసింది. ట్రయిన్ అయితే బెటరనుకుని స్టేషనుకొచ్చి టికెట్టు తీసుకున్నాను. పగలు పేల్చేసినా సాయంకాలానికి వాతావరణం మారింది.
ప్లాటుఫారం అంతా పరికించి ఓ బెంచీ మీద కూర్చున్నాను. చుట్టూ చెట్లు. ఆకుల గలగలల సంగీతంతో బాటు చల్లటి గాలిని పంపిస్తుంటే హాయిగా ఉండి శరీరం సేద తీరింది.
ట్రయినుకు టైం ఉండటంతో ప్రయాణీకులు పెద్దగా లేరు. నిశ్శబ్దంగా ఉంది. కాళ్ళు బార్లా చాపి బెంచీకి జారబడి ఆకాశం వైపు చూస్తూ ఆ రోజు చేసిన పనులు మననం చేసుకున్నాను. చాలా వరకు సాల్వ్ అయ్యాయి. తృప్తి పడ్డాను. నెమ్మదిగా చీకటి కమ్ముకుంది. లైట్లు వెలిగించారు. స్టేషనంతా వెన్నెల విచ్చుకుంది.
స్టేషన్ మాస్టారు జెండా పట్టుకొని ఫ్లాటుఫారం మీదకొచ్చాడు. గూడ్సుబండి దూసుకొచ్చి స్టేషన్ ని దడదడలాడిస్తూ వేగంగా వెళ్ళిపోయింది. గార్డు పెట్టి వెనుక ఉండే ఎర్ర లైటు కనుమరుగయ్యే వరకూ అలాచూస్తూ ఉండిపోయాను.
"ఒక్క రూపాయి ధర్మం చేయండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది." తుళ్లి పడ్డాను. ఇందాక గూడ్సు శబ్దంలో వినపడలేదు. ఇప్పుడు స్పష్టంగా వినిపించింది. " ఒక్క రూపాయి ధర్మం చెయ్యండి బాబు. ఆ భగవంతుడు రెట్టింపు పుణ్యం మీ ఖాతాలో జమ చేస్తాడు."
ఆ వైపు చూశాను. కాస్త దూరంలో ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అరవై పైబడి తెల్లటి శరీరచ్ఛాయతో పొడవుగా ఉన్నాడు. మెరిసే వెండి జుత్తు. తెల్లటి పంచె. భుజంపై కండువా. చొక్కా లేదు. జంధ్యం కనిపిస్తోంది. తిలకం బొట్టు. విశాలమైన నుదురు. మొహంలో తేజస్సు. బ్రతికి చెడ్డ మనిషి. కాని ఎందుకో ఇలా అడుక్కోవడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.
ఎవరో చిల్లర వేశారు. ఒక చేత్తో అందుకొని మరో చేత్తో వాళ్లని దీవించాడు. వెయ్యని వాళ్ళని పట్టించుకోలేదు. పనులు ముగించుకుని కొంతమంది ఆడ కూలీలు తట్టలు నెత్తిమీద పెట్టుకుని ప్లాటుఫారం మీదకొచ్చారు. అతన్ని చూడగానే వాళ్లంతా 'పంతులుగారూ' అంటూ తట్టలు నేలమీద పెట్టి గబగబా వెళ్లి చేతిలో చిల్లర వేసి కాళ్లకు దండాలు పెట్టి ఆశీర్వాదాలు అందుకున్నారు. బహుశా ఇతడు ఈ రైల్వే స్టేషన్ 'ఆస్థాన విద్వాంసుడి' లా ఉన్నాడు. ఎలాంటివాడైనా చేయిచాచి డబ్బులు అడిగే మనిషి కాళ్ల మీద పడ్డవేంటో? ఈ పల్లెటూరి
వాళ్లకి అధిక ఛాదస్తం అనుకున్నాను.
నా బెంచీకి కాస్త దూరంలో నున్నటి గుండుతో లావాటి శాల్తీ. నల్లటి చలిమిడితో చేసినట్టు, మర్రిమాను కు తెల్లటి లాల్చీ, చొక్కా తొడిగినట్టు... ఓ విగ్రహం కూర్చుని ఉంది. ఆ విగ్రహం ఓ అరచేతిలో ప్రసాదం పొట్లం పెట్టుకొని మరో చేత్తో ఆబగా తింటోంది. ప్రక్కనే మరో రెండు పొట్లాలు రెడీగా ఉన్నాయి. నాలుక చాపి చొంగ కారుస్తూ ఆశగా ఓ కుక్క అతని వైపు చూస్తోంది. పొరపాటున చెయ్యి విదిలిస్తాడేమోనని. కాకులు దూరంగా వాలి ఎదురుచూస్తున్నాయి. కానీ అతను దేన్నీ పట్టించుకోవడం లే దు. తన పనిలో తాను నిమగ్నమై మర ఆడిస్తున్నాడు.
పంతులు అడుగులో అడుగులేసుకుంటూ ఆ విగ్రహం వద్దకు వచ్చి ఎదురుగా నిలబడి "ఒక్క రూపాయి ధర్మం చెయ్యండి బాబు. మీకు పుణ్యం వుంటుంది" అంటూ వినయంగా అడిగాడు. ఉచ్చారణ చాలా స్వచ్ఛంగా ఉంది. జారబడ్డ వాడిని కాస్త సర్దుకున్నాను. ఆ విగ్రహంలో స్పందన లేదు. పంతులు మరలా అడిగాడు. విసుగు చెందకుండా ఆరోసారి అడిగాడు ఆ భారీ శాల్తీకి కోపం తన్నుకొచ్చింది. తలెత్తి తీక్షణంగా చూస్తూ "నీకు ధర్మం చేస్తే నాకు పుణ్యం వస్తాదా? ఆ పుణ్యం నాకక్కర్లేదు. వెళ్ళు వెళ్ళు. ఇలా అడుక్కుంటూ మా ప్రాణాలు తీసే బదులు....
దుక్కలా ఉన్నావు, పోయి పనీ పాటా చేసుకో పో ఫో" అన్నాడు.
ఆ అవమానం పంతుల్ని తాకలేదు. శాంతంగా జవాబిచ్చాడు. "బాబు మీరు మాటలు మీరు తున్నారు. నన్ను 'దుక్కలా ఉన్నావు' అన్నారు. ఎవరు దుక్కలా ఉన్నారో తమరు గ్రహిస్తే మంచిది. మీకు ఆ గ్రహింపు శక్తి లేకపోతే మీ ప్రక్క వారిని అడగండి. వారు వాస్తవం చెబుతారు" అన్నాడు.
నేను అవాక్కయ్యాను. అంత సూటిగా మాటకు మాట చెబుతాడని ఊహించలేదు. విగ్రహం వైపు చూశాను. కదలిక లేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు.
పంతులు స్వరం పెంచి కంటిన్యూ చేశాడు.
"తమరు పనీపాటా చేసుకో అన్నారు. మొన్నటి వరకూ పనీ పాటా చేసుకుంటూ దర్జాగా బ్రతికినవాడినే. అదిగో ఆ కొండమీద ఆ స్వామి పాదాల చెంత ప్రధాన పూజారి గా ఉండేవాడిని. భక్తులు పారవశ్యంతో భగవంతుని కొలుస్తుంటే, వారి కోర్కెలు తీర్చమని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పులకించేవాడిని. నా మనసంతా తృప్తిగా ఉండేది.
కొండ కింద రాజకీయాలు కొండ మీదకొచ్చి గర్భగుడిలోక్కూడా దూరాయి. భక్తులు వేసే డబ్బులు, కొబ్బరి కాయల విషయంలో మోసం జరుగుతుంటే తట్టుకోలేక నిగ్గదీశాను. దేవుడు అడగడు కదాని ఆయన సొమ్ముని కైంకర్యం చేస్తుంటే ఎలా ఊరుకుంటాను? నేను కాదు. ఆ స్వామే నా చేత అలా అడిగింపించేడు. ఫలితంగా అందరూ ఒక్కటయి నన్ను పీకి పారేశారు. ఇదిగో ఇలా రోడ్డు మీద పడ్డాను. కానీ కించిత్ కూడా నాకు బాధ లేదు. ఎప్పుడో ఏదో పాపం చేసుంటాను. అందుకే స్వామి అక్కడి నుంచి తప్పించాడు. 'అందరి దయా భిక్ష మీద బతుకు' అన్నాడు. 'సరే స్వామి' అని అలాగే బతుకుతున్నాను. అప్పుడు పొంగిపోలేదు. ఇప్పుడు కుంగిపోలేదు. నా పాప ప్రక్షాళనలో ఇదో భాగం అనుకున్నాను. అయ్యా నిప్పును తాకితే వెంటనే కాలుతుంది. జాగ్రత్త పడతాం. పాపం చేస్తే ఆలస్యంగా శిక్ష పడుతుంది. అంచేత నిర్లక్ష్యం వహిస్తాం. జీవితం అంటే చిన్న చిన్న ఉపకారాలు, చిరునవ్వులు, సహాయాలు, బాధ్యతలు, త్యాగాలు, దయ మొదలైన వాటి మేళవింపే. మనసు పెట్టి వాటిని ఆచరిస్తే చాలు. ఆ స్వామి సంతోషిస్తాడు. విలువలను జీర్ణించుకుని బ్రతికితేనే జీవిత పరమార్ధం తెలుస్తుంది".
ఆ మాటలు వినగానే తెలియకుండానే లేచి నిలబడ్డాను. ఈ పంతులు మాటల్లో నీతి, నిజాయితీ, ఆత్మస్థైర్యం కనిపించాయి. అవి ఉన్నప్పుడే ఏ వ్యక్తికయినా మానసిక శక్తి, ధైర్యం కలుగుతాయి. లేకపోతే ధర్మానికొచ్చి ఇతరులకు ధర్మం బోధిస్తాడా...? బహుశా జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తినుంటాడు. ఆ ఆవేదనలో ఇలా మాట్లాడుతున్నాడనిపించింది.
ఆ విగ్రహం టక్కున చెయ్యెత్తి "ఏయ్ పంతులూ, నాకిష్టమైతే డబ్బులేస్తాను. లేకపోతే లేదు. ఈ మెట్టవేదాంతం నాకూ తెల్సు. నువ్వు చెప్పక్కర్లేదు. అలా వెళ్ళవయ్యా. వింటున్నాను కదాని తెగ చెబుతున్నావు" అన్నాడు.
"అలాగే బాబు. మీరు ఇవ్వలేదని నాకే బాధా లేదు. చిన్న సాయం చేస్తే రెట్టింపు పుణ్యం మీ ఖాతాలో జమ చేస్తాడా స్వామి అని వివరిస్తున్నాను. మీరు తినేది మీలో ఎలా ఉండదో ..అలాగే మీరు సంపాదించేదేదీ మీతో రాదు. ముందు అది గ్రహించండి. మీతో వచ్చేవి మీరు చేసుకున్న పాప పుణ్యాలే . చివరికి అవే లెక్కించబడతాయి. ముందు అహాన్ని తొలగించుకోండి. ఇంటా బయటా మీకే మంచిది. మనకున్న అజ్ఞానం, సమయం మించి పోయేక పశ్చాత్తాప పడేలా చేస్తుంది. అంచేత ఒక్క రూపాయి ధర్మం చేయండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది".
పంతులు మాటలు పూర్తి కాకుండానే ఆ శాల్తీ దిగ్గున లేచి నుదురు కొట్టుకుంటూ బెంచీ మీద ఉన్న ప్రసాదం పొట్లాలు పట్టుకొని దూరంగా వెళ్ళి అక్కడ తినసాగాడు. పంతులు మీద నాకు గౌరవం తగ్గి, కాస్త చిరాకు కల్గింది. ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవడానికి తనకు తెలిసిన పాండిత్యం ప్రదర్శిస్తున్నాడా అనిపించింది. ఉదయం మా బాసుకి తగులుకున్న బిచ్చగాడిది మోటు. ఇతగాడిది నీటు. అంటే రాయల్ బెగ్గింగ్ అన్నమాట. ఎక్కడ నన్ను అడుగుతాడో అని పంతులు నా వైపు రాకముందే అక్కడినుంచి నిష్క్రమించాను.
వెళ్లి ఎంక్వైరీ చేస్తే ట్రయిను మరో గంట లేటు. బయటకు నడిచి మెయిన్ రోడ్డు ఎక్కాను. ఎదురుగా "వెల్కమ్ బార్ అండ్ రెస్టారెంట్" నాకు స్వాగతం పలుకుతోంది. లోపలకి దూరి తాపీగా మందేసి, కడుపారా బిర్యానీ తిని బయట పడ్డాను. బడలికంతా పోయి హుషారుగా ఉంది. స్టేషన్ లోపలికొచ్చాను. ఆ భారీ శాల్తీ ఓ బెంచీ మీద పడుకొని గుర్రుపెడుతోంది. పంతులు ఎక్కడా కనబడలేదు. రిలీఫ్ ఫీలయి అలా ఫ్లాటుఫారం చివరకి వచ్చి నిలబడ్డాను. చెట్లు పొదలతో అదంతా చిట్టడవిలా ఉంది. యధాలాపంగా తల తిప్పేను. ఒక చెట్టు క్రింద పంతులు కనిపించేడు. ఇక్కడేం చేస్తున్నాడా అనుకుంటూ అటు నడిచాను. అక్కడ కనిపించిన దృశ్యం నన్ను నిర్ఘాంతపోయేలా చేసింది. నా శరీరం జలదరించింది.
పంతులు ఎదురుగా చెట్టుకు జారబడి ఒక ముసలి కుష్టు వాడు కూర్చుని ఉన్నాడు. మొండి కాళ్ళు, చేతులు, ముడతలు పడ్డ శరీరంతో చూస్తూంటేనే అసహ్యం వేస్తోంది. అతని ఎదురుగ్గా బాసింపీట వేసుకుని ప్రశాంతంగా చిరునవ్వుతో, చిన్న పిల్లాడికి గోముగా గోరుముద్దలు పెడుతున్నట్టు అరటిపండు ఒలిచి వాడి చేతుల్లో పెడుతున్నాడు పంతులు.
"ఒరే దేవుడూ, ఇవ్వాళ ఎక్కువ డబ్బులు రాలేదురా. వచ్చినవి డజను అరటిపళ్ళకి సరిపోయాయి. ఫర్వాలేదు. ఈరోజు మనకి ఎంత ప్రాప్తమో అంతే దక్కింది. సంతృప్తి తోనేరా
కడుపు నిండేది. ఆశ పడితే నిరాశే మిగులుతుంది. ఉన్నదాంతో సరిపెట్టుకుంటే రేపటి గురించి బెంగుండదు. ఇవాళ చెరో ఆరు పళ్ళు తినేసి హాయిగా పడుకుందాం. రేపటి సంగతి ఆ స్వామే చూసుకుంటాడు".
ఆ కుష్టు వాడి కళ్ళల్లోంచి నీళ్లు బొటబొటా రాలాయి. "నేనా కొండ మీదకి ఏనాడూ ఎల్ల లేదు. దేవుడెలాగుంటాడో నాకు తెలీదు. ఇప్పుడు తెల్సినాది. మీరే ఆ దేవుడు. మాలాంటోల్లని సూత్తే జెనం పారిపోతారు. తవఁరు మట్టుకు నా కడుపు నింపి పేనం పోత్తన్నారు. ఇలాంటి పన్లు దేవుడు కాక ఇంకెవులు సేత్తారు. ఆ కొండ మీదున్నోడు కొండ దిగొచ్చి నాకాడ కూకుంటున్నాడు.
మీ కాల్లు పట్టుకోడానిక్కూడా నేను నోచుకోలేదు. ఎదవ జెనమ" మొండి చేతులు పైకెత్తి ఏడుస్తూ దండం పెడుతున్నాడు.
"ఒరే, రోజూ ఎందుకురా అదే చెబుతావు. నేను దేవుడ్ని కాదు. నీలాంటి మనిషినే. నువ్వు కదల్లేవు. నేను కాస్త మెరుగ్గా ఉన్నాను. అంతే తేడా. మనిషికి జంతువు సాయం చేయలేదు. మనిషికి మనిషే సాయం చేసుకోవాలి. అది మర్చిపోయిన మనిషి జంతువే. ఒరే, ఎంత వెతికినా చాలా మందిలో ఆధ్యాత్మిక భావనలు, మౌలిక విలువలు, ఆంతరంగిక ఔన్నత్యం కనబడ్డం లేదురా. చాలా సమస్యలకు అవే మూల కారణాలు. ఆ విషయమే వివరిస్తుంటే నన్ను పిచ్చివాడిలా భావిస్తున్నారు. కానీ నేను ఆపనురోయ్. మనకు తెలిసిన మంచి పదిమందికి తెలియజేయాలి. పక్షికింత ధాన్యం,
పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం.... ఇంతకంటే ఆ దేవుడికి ప్రీతికరమయినది మరొకటి లేదురా. అదే చేస్తున్నాను". చాలా సేపటికి గానీ తేరుకోలేక పోయాను. కనిపించే దృశ్యం నమ్మశక్యంగా లేదు. కానీ, నిజం కళ్లెదట కనిపిస్తోంది. ఈ పూజారి గురించి ఎంత అల్పంగా ఆలోచించాను. నిజమే స్వార్థం, హిపోక్రసీ, ఫాల్స్ ప్రిస్టేజ్ తో నిండిన ఈ రోజుల్లో "మంచిగా ఉండు, పక్క వాడికి సాయం చెయ్యి" అని చెబుతుంటే ఎవరు వింటారు? గంట క్రితం నా కోసం మూడొందలు ఖర్చు పెట్టుకున్నాను. ఈయనకి ఒక్క రూపాయి ధర్మం చేయకుండా ఉండడానికి వంద కారణాలు వెతుక్కున్నాను. మాటలు చెప్పడం కాదు, వాటిని ఆచరణలో పెట్టి చూపిస్తున్నాడీ పూజారి. నా గుండెలో ఎక్కడో చిన్న తడి. జేబులో నుంచి వంద నోటు తీసి మౌనంగా ఆయన పక్కన వదిలేను. మనసు తేలికయింది. వెనక్కి తిరిగి స్టేషన్ వైపు అడుగులు వేశాను. నాలో వచ్చిన మార్పు నాకే స్పష్టంగా తెలుస్తోంది....