మొత్తానికి దేశంలో సాధారణ ఎన్నికలు పూర్తయి, ప్రభుత్వం ఏర్పాటయింది. ఈ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు పూర్తిచేసి, కొత్త ప్రభుత్వం వచ్చేసింది.
ఈ ఎన్నికల తరువాత గమనించిందేమిటంటే, అటు కేంద్రప్రభుత్వం లోనూ, ఇటు మన తెలుగురాష్ట్రాల్లోనూ , ఒక్క పార్టీకే అత్యధిక మెజారిటీ రావడం.. ఇలాటిసందర్భాలో మంచీ, చెడూ కూడా ఉంటాయి. కానీ మంచికంటే చెడుకే అవకాశాలున్నాయి… నామమాత్రానికి కూడా ప్రతిపక్షమనేది లేకపోవడం, ప్రజాస్వామ్యంలో , కొన్ని విపరీత ఫలితాలనుకూడా తెచ్చే అవకాశాలున్నాయి. మరీ 50 – 49 నిష్పత్తిలో కాకపోయినా, కనీసం 60-40…గా ఉండుండవలసింది. మరీ 50-49 లో ఉండుంటే గత ఏడాది ఎన్నికలు జరిగినప్పుడు, ఎంత గందరగోళం జరిగిందో… అదేదో Horse Trading అంటారుట.. కోటానుకోట్లు తీసుకుని, ఒకపార్టీ టికెట్ మీద నెగ్గినవాడు, అధికార పార్టీలోకి జంపైపోవడం.. పాపం కేంద్రంలో అధికారం ఉన్నవారు నియమించిన గవర్నర్లు కూడా, అదేదో శక్తి నిరూపించుకోవడానికి, ( అంటే ఈ horse trading పూర్తయేదాకా) టైముకూడా ఇస్తూంటారు. తుమ్మితే ఊడిపోయేలా ఉంటాయి ఆ ప్రభుత్వాలు.. అదీ కష్టమే కదా.. అదేదో రాష్ట్రపతి పాలనంటారు, మళ్ళీ ఎన్నికలూ..పైగా ఈ ఖర్చంతా భరించేదెవ్వరూ ప్రజలు కట్టిన పన్నులే కదా..
అలాగని 90-10 నిష్పత్తిలో అధికారం వస్తే, అస్సలు వాళ్ళని అడేగేవాళ్ళే ఉండరూ.. వాళ్ళుచెప్పిందే వేదం.. హాయిగా పార్లమెంటులో చట్టాలు పాసుచేసేసికోవచ్చు. ప్రతిపక్షం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.. మహా అయితే ఓటింగు టైములో వాకౌట్ ( walk out) చేసేసి, వాళ్ళని ఎన్నుకున్న ప్రజానీకానికి చెప్పుకోవచ్చు ..” చూసారా మేము ప్రభుత్వం చేసిన చట్టానికి ఆమోదం తెలపలేదూ..” అని…
60-40 నిష్పత్తిలో ఉంటే, కనీసం చర్చలైనా ఉంటాయి. వాటివల్ల ఏవో లాభాలుంటాయని కాదూ.. కనీసం నాణేనికి రెండోవైపు తెలుస్తుంది. పాతప్రభుత్వాలే తిరిగి అధికారంలోకి వస్తే కొన్ని కొన్ని disadvantages ఉంటాయి.. ప్రతీదానికీ వ్యవస్థలో ఉండే లోటుపాట్లు, పాతప్రభుత్వం మీద తోసేయడానికి అవకాశం ఉండదు.. కారణం, ప్రస్తుతలోటుపాట్లు, అంతకుముందు వీళ్ళు చేసిన నిర్వాకాలే… ప్రభుత్వం మారిందనుకోండి, మొట్టమొదట చెప్పేది ..” ప్రభుత్వ ఖజానా ఖాళీ “ అని, అంతేకదా మరి, తిరిగి అధికారంలోకి రావడానికి, ఎన్నికల కోడ్ వచ్చేలోపల ఎడాపెడా, so called “ సంక్షేమ పథకాలు” ప్రకటించడం, అమలుచేసేయడం కూడా.. ఏంలేదూ ఎన్నికల్లో తమకే అధికారం కట్టబెడతారనే భ్రమలో ఇచ్చే తాయిలాలు. ఇంక ఎన్నికల ప్రచారాల్లో, మన పార్టీల మానిఫెస్టోలు చూస్తే, కళ్ళు తిరుగుతాయి. ఏమిటేమిటో వాగ్దానాలు.. చిత్రం ఏమిటంటే, ఆ సంక్షేమపథకాల్లో లబ్దిదారులు, మధ్యతరగతి వారు కాకపోవడం.. ఏ లాభం వచ్చినా అదేదో BPL ( Below Poverty Line ) వాళ్ళకే.. ఆఖర్చులు భరించేదిమాత్రం మధ్యతరగతి ప్రజానీకం… మరో చిత్రం ఏమిటంటే, ఈ హడావిడిలో అత్యధిక కుబేరులూ, రాజకీయనాయకులూ, పెద్దపెద్ద వ్యాపారస్థుల కీ ఎటువంటి హానీ ఉండకపోవడం.
అదే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే జరిగే ఉపయోగం ఏమిటంటే, అంతకుముందర ప్రారంభించిన ప్రాజెక్టులు , ఆగిపోకుండా, పూర్తిచేయడం. అలాకాకుండా, ప్రభుత్వం మారిందంటే, మొట్టమొదట, పాతప్రభుత్వాలు మొదలెట్టిన ప్రాజెక్టులు, ఆపేయడమో ( ఏదో కారణం చూపించి ) ,మార్పులు చేయడమో ఖచ్చితంగా జరుగుతుందే… ఏమీలేకపోయినా పథకాల పేర్లు మాత్రం మారతాయి. అసలు పనంటూ జరిగితే పేరేదైతేనేమిటిలెండి… అసలుగొడవంతా ప్రచారంలో చేసిన హామీలు అమలుజరపడంలో… ఏదో అర్ధంలేని హామీలైతే ఇచ్చేసారు కానీ, implement చేయడానికి డబ్బులుండొద్దూ? ఆ డబ్బులెమో పన్నుల ద్వారా..వాటిని sincere గా కట్టేదేమో, మళ్ళీ మధ్యతరగతివాడే.. లాభాలు మాత్రం ప్రకటించిన సంక్షేమ పథకాలకోసం , (middle class not eligible ).. ఐశ్వర్యవంతులూ, బడా వ్యాపారస్థులూ, రాజకీయనాయకు లకీ ఈ గొడవలేదు.. ఏ బాంకులోనో కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టేయొచ్చు. ..అడిగేవాడెవడూ లేదు.
ఇదంతా మన కంఠశోషమాత్రమే.. వాళ్ళూ వాళ్ళూ బాగానే ఉంటారు.. ఏదో public consumption కోసం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నట్టు కనిపిస్తారే తప్ప, ఒకళ్ళంటే మరొకరికి ఎంత ప్రేమో.. ఈగవాలనియరు.. ఏదో SIT ( Special Investigation Team ), సింగినాదం అని ఒకటి నియమిస్తారంతే, ప్రజల కళ్ళు తుడవడానికి… జరిగేదేమీ లేదు…
సర్వేజనా సుఖినోభవంతూ…