కేరళ విహారయాత్రలు / తీర్ధయాత్రలు - కర్రా నాగలక్ష్మి

( కాలడి )

ఈ వారంతో తమిళనాడులోని పర్యాటక స్థలాలు. మేం చూసినవి పూర్తయినట్లే , అయితే యిన్ని తిరిగినా యింకా చాలా ప్రదేశాలు మిగిలే వున్నాయని మాత్రం చెప్పగలను . అవి కూడా చూడాలని ఆశ , భగవంతుని దయవల్ల ఆకోరిక తీరుతే  ఆప్రదేశాలను గురించి మీకు తెలియజేస్తాను .


ఈ వారం తమిళనాడుకి ఆనుకొని వున్న కేరళ రాష్ట్రం లోని కొన్ని ముఖ్య ప్రదేశాలను దర్శించుకుందాం .

కేరళని ‘ దేవుని సొంత ఇల్లు ( గాడ్ ఓన్డ లేండ్ ) అని అంటారు . మొదటినుండి కూడా మనకి కేరళ అనగానే బేక్ వాటర్స్ , సుగంధ ద్రవ్యాలు పండుతాయని , సముద్రతీరాన వుండడం వల్ల యెక్కువగా వానలు పడుతూ వుంటాయని తెలుసు . అందుకే కేరళ ప్రయాణం అనగానే చాలా వుత్సాహంగా అనిపించింది . ఎప్పుడో 35 ఏళ్ల క్రిందట ముఖ్య నగరాలనుంచి మాత్రం ఒకటో రెండో రైళ్లు ట్రివేండ్రం వరకు వుండేవి . కేరళలోకి రైలు ప్రవేశించిన దగ్గరనుంచి బండీ చాలా నెమ్మదిగా నడిచి సహనాన్ని పరీక్షించేది . సన్నని కాలువలు , చెరువులు వాటిని ఆనుకొని వేలల్లో కొబ్బరిచెట్లు , యిక పంటపొలాలలో పోకచెట్లు , వాటికి అల్లుకొని ఆకుపచ్చని మిరియం గెలలు , కిందన వరిపంట , అంటే వారు ఒకేమారు మూడు పంటలను సాగుచేస్తున్నారన్నమాట . కొబ్బరిచెట్లకు అల్లుకున్న మిరియం లతలు కొన్నిచోట్ల బీర , పొట్ల , దొండ లాంటి పాదులు నేలన పసుపు వరి యిలా వ్యవసాయం చేస్తున్నారు . ఇంటిముందర లవంగం చెట్లు , ఏలకుల పాదులు యేవో క్రోటన్స్ ను పెంచినట్లు పెంచుతున్నారు . అయితే యిప్పటి కేరళ రాష్ట్రం బాగా అభివృద్ది చెందింది ముఖ్యంగా పర్యాటకరంగంలో మొదటి స్థానంలో వుంది , దీనివల్ల దేశం నలుమూలలనుంచి కేరళ రావడానికి రైలు విమాన సైకర్యాలు యేర్పడ్డాయి , అయితే అప్పటికీ యిప్పటికీ కొండలూ నదులూ సెలయేళ్లూ అన్నీ వున్నాయి కాని చాలా చోట్ల కాంక్రీటు జంగల్ లను చూస్తే మాత్రం యీ అందాలను చాలా త్వరగా కోల్పోతామనే బాధ కూడా వేస్తోంది .

 కేరళ రాష్ట్రం గురించిన పురాణకధ ఒకటి వుంది , దాని ప్రకారం విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు అవతార సపాప్తి తరువాత వైకుంఠానికి వెళ్లగా వైకుంఠం తలుపులు మూసి వుంటాయి , ఎంత ప్రయత్నించినా తలుపులు తెరచుకోవు , అశరీరవాణి పరశురాముుడు తండ్రి కొరకు కావించిన క్షాత్ర హత్యల పాతకం అతనితో వున్నంతకాలం అతనికి వైకుంఠ ప్రవేశం లేదని చెప్తుంది , క్షాత్రహత్యాపాతకం పోగొట్టుకునే విధానం అడుగగా మునులు అతను స్వశక్తితో సంపాదించిన భూమిని బ్రాహ్మణులకు దానమిచ్చి వారు తృప్తి పడితే వారి దీవెల వల్ల పాపం పోతుందని చెప్తారు . పరశురాముడు భరతఖండం లో అరేబియా సముద్రతీరంలో తన బాణాలతో సముద్రుని వెనుకకు పంపి ఆ భూమిని బ్రాహ్మణులకు దానమిచ్చి వైకుంఠానికి వెళతాడు , కాని వైకుంఠం తలుపులు మూసే వుంటాయి . అశరీరవాణి అతను దానమిచ్చిన భూమి నివాసయోగ్యం కాకపోవడంతో బ్రాహ్మణులు చాలా బాధలు పడుతున్నారని అందువల్ల అతని పాపం మరింతపెరిగి పోయిందని చెప్తుంది , పరశురాముడు ఆ ప్రదేశానికి వెళ్లిచూడగా నేల పంటలకు అనువుగా లేకపోగా అనేకమైన విష క్రిమికీటకాలతో నిండి బ్రాహ్మణులను కుట్టి బాధపెట్టగా బ్రాహ్మణులు ఆ ప్రాంతాన్ని కన్నీళ్లతో వదిలిపోయినట్లు తెలుస్తుంది . పరశురాముడు నాగరాజైన వాసుకి కొరకు తపస్సు చేసి  ప్రసన్నుని చేసుకొని ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చెయ్యమని కోరుతాడు , నాగరాజు నాగులను పంపి విషకీటకాలను సంహరించి ఆ ప్రదేశాన్ని సస్యశ్యామలంగా మారుస్తాడు , ఆభూమిని పరశురాముడు బ్రాహ్మణులను తిరిగి ఆహ్వానించి వారికి యిస్తాడు . మంచిపంటలు పండడం వల్ల పశువులు , బ్రాహ్మణులూ సంతోషించి పరశురాముని ఆశీర్వదిస్తారు . క్షాత్ర సంహరపాపం నశించడంతో పరశురాముడు వైకుంఠానికి వెళ్లి అవతారం చాలిస్తాడు . పరశురాముడు బ్రాహ్మణులకు దానమిచ్చిన ప్రదేశమే నేటి కేరళ .అందుకే కేరళాలో పరశురామునికి మందిరాలు వుండడం చూస్తాం .

కేరళవారు అనగానే మనకి నర్సులు గుర్తుకు వస్తారు , సేవచెయ్యడంలో వారికి ఓపిక శ్రద్ద యెక్కువేమో అని నా కనిపిస్తూ వుంటుంది . ఈ రాష్ట్రానికి తీరం పెద్దది కావడంతో బీచులు యెక్కువే , సముద్రానికి దగ్గరగా వుండడం వల్ల వానలూ యెక్కువే , వానలు యెక్కువవడం వల్ల అడవులూ యెక్కువే .

కేరళ లో యెక్కువగా క్రైస్తవులు , దానితరువాత ముస్లింలు ఆ తరువాతే హిందువులేమో అని నా అనుమానం . అలాగే యిక్కడ ఆర్ధిక అసమానతలు చాలా యెక్కువగా వున్నట్లు అనిపించింది . చాలా గొప్పవారు , చాలా బీదవారు , ప్రస్తుతం కేరళలో చాలా మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేరు . ఇక్కడ వున్న వారు మాత్రం పాశ్చాత్యత సోకకుండా సాంప్రదాయకంగా వుండడం కనబడుతుంది . తలస్నానం చేసి పాలనురుగులాంటి తెల్లని దుస్తులు ధరించి నుదుట గంధం బొట్టు పెట్టుకొని చిన్నాపెద్దా తిరుగుతూ వుంటారు .

ఇవాళ కేరళలోని ‘ కాలడి ‘ గ్రామం గురించి చెప్పుకుందాం .

ఈ గ్రామం కొచ్చిన్ విమానాశ్రయానికి సుమారు యెనిమిది కిలోమీటర్ల దూరంలో వుంది . కాలడి గ్రామ విశిష్టత యేమిటీ అంటే యీ గ్రామంలోనే అధ్వైత గురువైన శంకర భగవత్పాదులు జన్మించేరు , ఆ వివరాలు తెలుసుకుందాం .

బౌద్ద , జైన , క్రైస్తవ , ముస్లిం , మతాలు ప్రాచుర్యం లో ఉండి హైదవమతం మరుగున పడుతున్న సమయంలో సాక్షాత్తు పరమశివుడు  హైందవ మతాన్ని రక్షించే ఉద్దేశంతో కేరళ లోని ఓ అగ్రహారంలో " శివగురు ఆర్యాంబ " అనే దంపతులకు క్రీస్తు శకము 788 లో జన్మించేరు . లేక లేక కలిగిన సంతానానికి శివగురు ఆర్యాంబ దంపతులు శంకర అని నామకరణం చేసుకొని అల్లాను ముద్దుగా పెంచుకో సాగేరు . శంకరుడు యేడవ యేట తండ్రిన పోగొట్టుకొని ఎనిమిదవ  యేడు రాకముందే వేదాలను,ఉపనిషత్తులను వ్యాఖ్యానించ సాగేరు .

తన పదహారవ యేట  ఒకనాడు పూర్ణా  నదిలో స్నానం చేస్తున్న శంకరుని మొసలి పట్టుకొనగా శంకరుడు మృత్యువు ఆసన్నమైనది కావున సన్యసించుటకు అనుమతిని యిమ్మని కోరగా ఆమె అనుమతించెను . వెంటనే మొసలి శంకరుని విడిచిపెట్టెనట .

ముసలి తల్లిని బంధువుల సహాయమున విడిచిపెట్టి ,ఆమె శంకరా అని పిలిచినంతనే వస్తాననే వాగ్దానము చేసి కాశి కి వెళ్లిపోయేడు. అక్కడనుంచి బద్రినాధ్ లో స్వామిగోవిందపాద ఆచార్య దగ్గర సన్యాసం పుచ్చుకొని అనేక శాత్రాలు అభ్యసించి , అద్వైతమును బోధిస్తూ భాగవతం , వేదాలు , ఉపనిషత్తులను వ్యాఖ్యానిస్తూ తన తర్కశాస్త్రం తో ఎందరో పండితులను వోడించేరు .

అదే క్రమములో మండన మిశ్రుని ఓడించి, అతని భార్య భారతి వేసిన కామశాస్త్రమునకు సంభందించిన ప్రశ్నకు జవాబు కొరకై పరకాయ ప్రవేశ విద్య నుపయోగించుకొని ఆ ప్రశ్నకు కుడా సరియైన సమాధానము నిచ్చి ఆ పందెము నెగ్గెను. ఒప్పందము ప్రకారము మండన మిశ్రుడు శంకరాచార్యుని గురువుగా స్వీకరించి సన్యాసము స్వీకరించి సురేశ్వర ఆచార్యుడయ్యెను. మహా ఇల్లాలైన భారతియును భర్తను అనుసరించెను. శంకరాచార్యులు శ్రింగేరిలో మొదటి పీఠమును స్తాపించి దానికి సురేశ్వర ఆచార్యుని పీఠాధిపతిని చేసెను.

దుర్వాసుని శాపగ్రస్తులైన బ్రహ్మ , సరస్వతులే మండనమిశ్రుడు, భారతి అని ఎరిగిన శంకర భగవద్పాదులు శారదాదేవి పీఠమ్ స్తాపించేరని చెప్తారు. 

తల్లి వయసు భారంతో నూతిలో నీరు తోడుకొనుటకు ఆశక్తురాలై ,మూడు మైళ్ళ దూరంలో ఉన్న పూర్ణా నది వరకు నడువలేక శంకరుని ప్రార్ధించగా శంకరులవారు ప్రత్యక్షమై తన కాలితో పూర్ణా నదీ గమనాన్ని నిర్దేశిస్తూ తమ పెరటిలోనుంచి వెళ్ళునట్లు చేసేనట .

కాలితో నదీ గమనాన్ని నిర్దేశించిన ప్రదేశం కావడంతో ఈ ఊరికి "కాలడి  (కాలు ఇడి )"అనే పేరు వచ్చింది.

ఆ తరువాత శంకరాచార్యులు పూరి , ద్వారక , బదరి పీఠాలను , ద్వాదశ జ్యోతిర్లింగములను అష్టాదశ శక్తి పీఠాలను స్థాపించేరు 

శంకరులు ఆర్యాంబ అవసాన దశలో వచ్చి ఆమెకు అంత్యక్రియ చేయుటకు నంభూద్రి  బ్రాహ్మణులు సన్యాసి అంత్యక్రియలు చెయ్యరాదని వ్యతిరేకించి సహాయ పడుటకు నిరాకరించగా ,ఇద్దరు బ్రాహ్మణులు శంకరుల సహాయమై వచ్చి ఒకరు తలను వేరొకరు కాళ్ళను పట్టుకొని ఆమెను చితి పైన పెట్టి అగ్ని దొరకక శంకరులు తన అరచేతులను మధించి అగ్నిని పుట్టించి దహన సంస్కారమును కావించేరు . శంకరులను వ్యతిరేకించిన కాలడి గ్రామము లోని నంబూద్రి కుటుంబములు వంశం నశించెనని , శంకరులకు సహాయపడిన రెండు బ్రాహ్మణ కుటుంబాల వంశజులు యిప్పటికినీ శంకరుల జన్మస్థల ప్రాకారంలోనే వుంటున్నారని పూజారులు చెప్పేరు . అలాగే శంకరులు కనక ధారా స్తోత్రం పఠించి

బంగారు ఉసిరికల వర్షం యే యింట్లో కురిపించేరో ఆ వంశస్తులు యిప్పటికి అదే ఇంట్లో వుంటున్నారని ఆగ్రామం కాలడి కి ముప్పై కిలోమీటర్ల దూరంలో వుందని చెప్పేరు.

శంకరులు తన ముపైరెండవయేట జోషి అనే గ్రామం లో మఠం స్థాపించి (అదే నేటి జోషి మఠ్ )బదరి మీదుగా కేదార్ చేరుకొని అక్కడి శివలింగంలో ఐక్యంఅయ్యేరని భక్తుల నమ్మిక.ఐతే ఇప్పుడు ఈకాలడి గ్రామం చిన్న పట్నంగా మారింది . కొచ్చిన్  -- శోరనుర్ రైలు మార్గంలో కాలడి రైలు స్టేషను వుంది . కొచ్చిన్ నుంచి సుమారు ఇరవై , ఇరవైరెండు కిలోమీటర్ల దూరంలో వుంది . కొచ్చిన్ నుంచి రాష్ట్రరోడ్డురవాణా వారి బస్సు సౌలభ్యం వుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కి ఎనిమిది కిమీ. . దూరం . ఆటో వాళ్ళు  నూరు లేక నూటయిరవై రూపాయలు తీసుకుంటారు. 

చూడవలసిన ప్రదేశాలు అన్ని ఒకే చోట ఉన్నాయి. మందార,సంపెంగ , పారిజాత , దేవకాంచన , నూరువరహాలు , నందివర్ధనం , పొగడ మొదలైన పూలచెట్లు, కొబ్బరి, మామిడి, బొప్పాయి , జామ , పోక మొదలయిన పండ్ల చెట్లతో స్వాగతం పలుకుతూవుంటాయి . సుస్వరాల వేద విద్యార్ధుల వేదోఛ్చారణ కి రకరకాలైన పక్షి కూతలు పక్క వాద్యాలు కాగా మన వీనులకి విందై మన మనస్సులకి ఆహ్లాదకరంగా ఉంటుంది.

ముఖ్య ద్వారానికి ఒక వైపు కనకధార స్తోత్ర మహిమా రెండవ వైపు మొసలి శంకరులని పట్టుకొనడం చిత్రికరించబడి ఉన్నాయి          నాలగాడుగులు ముందుకి వెళ్తే ఎదురుగా ముఖ్యద్వారం.ఎడమ వైపు వేదపాఠశాల కుడి వైపు కృష్ణ మందిరం దాని పక్కనే వేద విద్యార్ధుల వసతి గదులు ఇంకా కొంచం ముందుకి వెళితే మెట్లు పూర్ణా నది స్నాన ఘాట్ . నిర్మలంగా నిశ్చలంగా కొబ్బరి మామిడి వనాల మధ్య నుంచి ప్రవహిస్తున్న పూర్ణా నది కనులకు విందు చేస్తుంది . మనసుకి సేద దీరుస్తుంది.

అక్కడ నుంచి వెనక్కి వచ్చి ముఖ్య ద్వారం లోపలి ప్రవేశిస్తే ఎడమ వైపు అష్టదళ పద్మం ఆకారంలో శారదా దేవి మందిరం చుట్టూ అమ్మవారి యొక్క అవతారాలైన మహేశ్వరీ , కౌమారి , వైష్ణవి , వారాహి , ఇంద్రాణి మరియు చాముండా దేవిలు చుట్టూరా వుండగా శారదాదేవి బ్రాహ్మి గా ఇక్కడ పూజలందు కుంటోంది.రోజు ఈ దేవికి కుంకుమార్చన శంకరుల కాలం నాటి నుంచి జరుగు తోంది . నిత్య అన్నదానం జరుగు తోంది. ఆ పక్కనే ఒక దీపస్థంభం ఉంది అదే శంకరుల జన్మించిన స్తలమని  కోవెల పుజారి చెప్పేరు. ఆ స్థాభానికి ఎదురుగా ఉన్న బృందావనమే ఆర్యాంబ పార్ధివ శరీరమునకు చితి పెట్టిన స్తలం. ఆ పక్కనే హోమకుండం. ముఖ్య మైన పర్వ దినాలలోను నవరాత్రులలోను హోమం జరుగు తుంది. వైశాఖ శుక్ల తదియనాడు ముపైయారు రుత్వికులతో ఒక వెయ్యిఎనిమిది మార్లు కనకధార స్తోత్ర పఠన  జరుగుతుంది .ఆ పూజకై ఉపయోగించిన బంగారు,వెండి అమలకములు ( ఉసిరిక) ,కనకధారా యంత్రములను భక్తులకు విక్రయించడం జరుగు తోంది. బృందావనానికి ఎదురుగా సాక్షి గణపతి మందిరం వుంది వినాయక చవితికి, సంకష్ట చతుర్దశి గణపతి హోమం కుడుములతో జరుగుతుంది. సాక్షి గణపతి కోవేలకి ఎడమ వైపున అంటే శారదాదేవి కొవెలకిఎడమ వైపున  షోడశదళ పద్మం ఆకారంలో శంకరులవారి మందిరం ఉంది. అక్కడ ఓ అరగంట సేపు కూర్చొని నాకు వచ్చిన అన్ని స్తోత్రాలు చదువుకొని ప్రశాంతమైన మనస్సుతో ఆప్రదేశాన్ని విడిచి పెట్టి రాలేక రాక తప్పక బయటికి వచ్చేం .

బయట నున్న కృష్ణుని కోవెలలో renovation పని జరుగు తోంది .ఆ కృష్ణుని విగ్రహం గురువాయుర్ మందిరం లో ఉన్న విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఈ విగ్రహాన్ని తల్లి పూజ కోసమై కృష్ణ విగ్రహం కావాలని శంకరులని కోరగా శంకరులు తన స్వహస్తాలతో తయారు చేసి ప్రతిష్టించిన విగ్రహం.ఇక్కడ నిత్యం పురుషసూక్త అర్చన మొదలైన పూజలు కృష్ణాష్టమి మెదలయి పర్వదినాలలో విశేష పూజలు జరుగు తన్నాయి .

కాలడి బస్సు స్టాండు కి ఎదురుగా పెద్ద స్తూపం ఉంది అందులో శంకరా చార్య వారి జీవిత కధలని చిత్రాలలో పామరులకి కుడా అర్ధమయే తీరులో చిత్రికరించేరు.దాని పక్కనే సంస్కృత విద్యాపీఠమ్ ఉంది అందులో M.A వరుకు బోధన జరుగుతోంది.

భోజన సదుపాయాలు, రవాణా సౌకర్యాలు బాగున్నాయి .హిందువు అని చెప్పుకొనే ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాన్ని దర్శించుకుని  మన మతాన్ని మరుగై పోకుండా రెండు చేతులు అడ్డు పెట్టి కాపాడిన సాక్షాత్తు శిపస్వరూపమైన ఆది గురువు  శంకర భగవద్పాదులకు మన కృతఙ్ఞతలు తెలుపుకునే బాధ్యత మనపైన వుంది , అలాగే హిందుత్వాన్ని రక్షించుకొనే బాధ్యతకూడా మనమీదే వుంది. 

వచ్చేవారం కొచ్చిన్ లోని పర్యాటక స్థలాల గురించి చదువుదాం అంత వరకు శలవు .

 

మరిన్ని వ్యాసాలు