ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

ఈ వారం  ( 14/6 – 20/6 ) మహానుభావులు

జయంతులు

 జూన్ 14

శ్రీ  శివరాజు వెంకట సుబ్బారావు  : బుచ్చిబాబు గా ప్రసిధ్ధి చెందిన వీరు, జూన్ 14, 1916 న  ఏలూరు లో జన్మించారు.  ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. ఈయన తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' అన్న పేరుతోనూ రచనలు చేశారు. వీరు  మొత్తం మీద సుమారు 82 కథలు, నవల, వచన కావ్యం, 40 వ్యాసాలు, 40 నాటిక-నాటకాలు రాసారు. అతికొద్దిమంది ఆధునిక అభ్యుదయ రచయితల్లో వీరు ఒకరు..

జూన్  15

శ్రీ ద్వారం  భావన్నారాయణ  : వీరు జూన్ 15,  1924 న బాపట్లలో జన్మించారు. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు  శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. స్వయంగా కూడా గొప్ప వయొలిన్ విద్వాంసుడు. వీరు  మాతంగముని రచించిన బృహద్దేశి, పండిత వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక, మరియు దత్తిలముని రచించిన దత్తిళమును తెలుగులోకి అనువదించి ప్రచురించారు.

 

జూన్ 16

శ్రీ  ఆచంట జానకీరాం :  వీరు జూన్ 16, 1903 న మద్రాస్ లో జన్మించారు. సుప్రసిధ్ధ ప్రసార ప్రముఖులు,  చిత్రకారుడు.  ఆంధ్రదేశం నలుమూలల నుండి పండితులను పిలిపించి తెలుగు ప్రసంగాలు ఏర్పాటు చేశారు. 21 సంవత్సరాలు ఆకాశవాణిలో ప్రముఖ పదవులు నిర్వహించారు. సున్నితమైన ఆధునిక చిత్రకళ లో ప్రావీణ్యం సంపాదించారు.

 

జూన్ 17

శ్రీ తిరుమల  రామచంద్ర  :  వీరు జూన్ 17, 1913 న , రేగటిపల్లె లో జన్మించారు. వీరు ప్రముఖ భాషావేత్త, సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ , సంస్కృత భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించారు. ఆనాటి ఎందరో ప్రముఖుల వద్ద శిష్యరికం చేసారు. ప్రముఖ పాత్రికేయునిగా పేరు తెచ్చుకున్నారు.

 

జూన్  19

శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి : వీరు, జూన్ 19, 1928 న ఒంగోలు లో జన్మించారు. భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న ప్రజ్ఞాశాలి. వీరు ద్రావిడభాషాశాస్త్ర విజ్ఞానిగా ప్రపంచ ప్రసిధ్ధి పొందారు.  ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంథాలువ్యాసాలు రచించారు.

 

వర్ధంతులు

జూన్ 14

శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు :   ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ వీరి రచనలలో కనిపించే ప్రధానాంశాలు. వీరు ఐదు సంప్రదాయ ఛందోబద్ధమైన కావ్యాలు.కాని స్వేచ్ఛా కవిత్వంలోనూ రచనలు చేశారు. నవలలు, నాటకాలు కూడా రచించారు.

 వీరు జూన్ 14, 2008 న స్వర్గస్థులయారు.

జూన్ 15

శ్రీ మైనంపాటి వెంకట సుబ్రహ్మణ్యం :  కడప జిల్లా కలెక్టరుగా పనిచేస్తూ, తెలుగు భాషకి సేవ చేసిన, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్  దొరగారి,  తండ్రిగారి  ఫొటోలోని పోలికలతోమ్ ఒక అద్భుతమైన ఛాయాచిత్రాన్ని సృష్టించింది శ్రీ సుబ్రహ్మణ్యం గారే. వీరు ఎన్నో  నాటకములు, నవలలు, శతకములు, ఖండికలు రాసారు. “ ఆకులు చెప్పిన అరవైనాలుగు కథలు “ వీరి రచనే.

వీరు జూన్ 15, 2010 న స్వర్గస్థులయారు..

జూన్ 18

శ్రీ  వేదం వెంకటరాయ శాస్త్రి :  సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు మరియు నాటకకర్త… సూర్యారాయాంధ్ర నిఘంటువు కి ప్రధాన సంపాదకుడుగా పనిచేసారు. ఆంగ్ల, సంస్కృత భాషాకోవిదుడు. వీరు గ్రాంధిక భాషావాది. వ్యావహారికభాషా ప్రయోగం వీరికి నచ్చేది కాదు. 1897 లో వీరు “ ప్రతాప రుద్రీయం “ నాటకం రాసారు. అనేక సంస్కృత నాటకాలను అనువదించారు.

వీరు జూన్ 18, 1929 న స్వర్గస్థులయారు.

జూన్  19

  1. శ్రీ జంధ్యాల వీర వెంకట దుర్గా సుబ్రహ్మణ్య శాస్త్రి.:  “ జంధ్యాల “ గా ప్రసిధ్ధి చెందారు. వీరు ప్రముఖ సినిమా రచయిత, దర్శకుడు. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం- వీరు తీసిన సినిమాలకి ఎన్నో ఎవార్డులు లభించాయి. ఎందరో నూతన నటులను వెండితెరకు పరిచయం చేసారు.

    వీరు  జూన్ 19, 2001 న స్వర్గస్థులయారు.

 

  1.  శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ :    తెలుగువారు గర్వంగా చెప్పుకోదగ్గ  “ మిమిక్రీ “ కళాకారుడు.. వీరు అనుకరించని తెలుగు ప్రముఖుల గొంతుక లేదంటే  ఆశ్చర్యం లేదు. శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, శ్రీ సినారె వారి గ్రంధాలను వీరికి అంకితమిచ్చారంటేనే, వీరి ఘనత తెలుస్తుంది.

    వీరు జూన్ 19, 2018 న స్వర్గస్థులయారు.

 

 

 

 

మరిన్ని వ్యాసాలు