ఒకప్పుడు యువత తీరు వేరు. ఇప్పుడు వేరు. థింక్ బిగ్ అంటూ పెద్ద ఆలోచనలు చేస్తున్నారు. ఓ వైపు చెడు అలవాట్లు పట్టి చెడు తిరుగుళ్లు తిరుగుతున్నా, మరోవైపు మంచి ఆలోచనలు చేస్తూ, పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఆ కోవలో కొందరు యువత గ్రూపులుగా మారి, తమదైన శైలిలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. పేదలకు సాయం చేయడమనే సేవా దృక్పథానికి కొత్త రంగులు అద్దుతున్నారు. అందులో ముఖ్యమైనది పేద పిల్లలకు ఉచితంగా విద్యనందించడం. ఇందుకు వారేం ఖర్చు చేయాల్సిన పని లేదు. తమకు తెలిసిన విద్యను నలుగురు పేద పిల్లలకు పంచడం ద్వారా తమలోని సేవా దృక్పథాన్ని బయటికి తీస్తున్నారంతే. తద్వారా స్తోమత లేక, చదువుకోలేని పిల్లల్లో జ్ఞాన వికాసాన్ని వృద్ధి చేసినవారవుతారు. అదే చేస్తోంది నేటి యువత.
బర్త్‌డేల పేరు చెప్పి ఇంటికి బంధువుల్ని పిలిచి, గ్రాండ్‌గా కేక్ కట్ చేసి, రిటర్న్ గిఫ్టుల ద్వారా వచ్చిన బంధువుల్ని ఆనందం పరచడంలో ఏముంది కిక్కు.? లేదంటే, పది మంది ఫ్రెండ్స్‌తో స్టార్ హోటల్స్‌లోనో, పబ్బుల్లోనో, పార్టీలు చేసుకుంటే ఏముంది మజా.? ఇంకేదైనా కొత్తగా చేయాలి. అనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ వికాసం. పేదలకు సాయం చేయాలనే సేవా దృక్పథం. సమాజంలో ఉన్న పేదరికాన్ని పూర్తిగా మాపలేం. కానీ, యువతలో మెరిసిన ఈ చిన్న ఆలోచనతో కొంతవరకూ అయినా పేదల ఇళ్లలో విద్యా కుసుమాలు వికసించేలా చేయొచ్చు. అందుకే, యువత ఈ దారి వైపు ఆశక్తి చూపుతోంది. తమతో పాటు, తమ చుట్టూ ఉన్నవారిని కూడా ఈ దారివైపు మళ్లించడంలో కొంతవరకూ సక్సెస్ అయ్యింది. చాలా మంది ఇప్పటికే తమ పిల్లల బర్త్‌డే పార్టీలు అనాధాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో జరుపుకుంటున్నారు. ఒక్కరోజైనా అక్కడి వారి కళ్లలో ఆనందం నింపుతున్నారు.
ఇక చదువు విషయానికి వస్తే, డిగ్రీలు చేసి, ఇంజనీరింగ్‌లు కంప్లీట్ చేసేసి సరైన ఉద్యోగాలు రాక, ఏ పని చేయాలో తెలియక, ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నావనీ, ఇంట్లో వారితోనే కాక, చుట్టూ ఉన్న వారితో కూడా పడరాని మాటలు పడడం ఇష్టం లేని యువత కొందరు పెడదోవ పడుతుంటే, మరికొందరు సమాజం పట్ల బాధ్యతతో కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తాము చదివిన చదువును నలుగురికి పంచాలనే యోచనతో పేద పిల్లలకు ఉచితంగా చదువులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇంగ్లీష్ భాష పట్ల అవగాహన పెంచుతున్నారు. రోడ్లపై ఖాళీగా తిరిగే పిల్లలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి చదువు చెప్పిస్తున్నారు.
ఇలాంటి సేవా దృక్పధం ఉన్న యువతలో మరింత స్ఫూర్తి నింపేందుకు, వారిని మరింత ఉత్తేజం చేసేందుకు 'టీచ్ ఫర్ ఛేంజ్' అనే పేరుతో పలు ఉచిత విద్యా సేవా సంస్థలు అంకురిస్తున్నాయి. ఆయా సంస్థల ద్వారా ఉన్నత చదువులు అభ్యసించి, నిరుద్యోగులుగా జీవనం గడుపుతున్న యువతను గేదర్ చేసి, వాలంటీర్లుగా వారిని నియమించుకుని పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడమెలా.? అనే వాటిపై అవగాహన కల్పించేందుకు తమకు తోచిన రీతిలో ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరితో మొదలైన ఈ స్ఫూర్తి మరింత మంది అంది పుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కొంచెం కొత్తగా ఆలోచించే యువతలో చిగురించిన ఈ కొత్త ఆలోచన ఎంతో మంది పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఉపకరిస్తుంది.