యవ్వన దశలో చాలా రకాల హార్మోన్ల సమస్యలు అమ్మాయిల్ని వేధిస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది పింపుల్స్. ఈ సమస్య కేవలం అమ్మాయిలదే కాదు, అబ్బాలయిది కూడా. అయితే అందం కోసం ఎక్కువగా తాపత్రయపడేది అమ్మాయిలే కనుక ఈ సమస్య కేవలం అమ్మాయిల సమస్యగానే పరిగణించాల్సి వస్తోంది. పింపుల్ వచ్చిందంటే చాలు, అందం చెడిపోతుంది.. అని బాధపడే అమ్మాయిలకు అఫ్‌కోర్స్ అబ్బాయిలకు కూడా ఈ వారం గో తెలుగు డాట్ కామ్ కొన్ని చిట్కాలు అందిస్తోంది.
పింపుల్స్‌ని దాదాపు రాకుండా ఆపలేం. అయితే, వచ్చాక ఏం చేయాలి.? అనేదే ప్రశ్న. ఈ ప్రశ్నకు మా దగ్గర ఆన్సర్ ఉంది. లేదు మా దగ్గర ఆన్సర్ ఉంది అంటూ పలు రకాల పింపుల్ క్రీమ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ, అవి ఎంతవరకూ మీ స్కిన్‌ని సేఫ్‌గా ఉంచుతున్నాయి.? అనేది ఆలోచించాలి. అబ్బాయిల స్కిన్‌తో పోల్చితే, అమ్మాయిల స్కిన్ కాస్త సెన్సిటివ్‌గా ఉంటుంది. మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అని ఏది పడితే అది తెచ్చి ముఖానికి పూస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులు ఎవరు.? పోనీ అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పినట్లుగా ఇంటి చిట్కాలు వాడదామా.. అంటే అవి ఎంత వరకూ ప్యూర్. పసుపు కల్తీ. సున్నిపిండి కల్లీ. ఇక నేచురల్ ఫేషియల్స్‌గా భావించే పుదీనా పేస్టులు, టమోటా పేస్టులు వగైనా వగైనా అన్నీ కల్తీనే. విత్తన దశలోనే వాటిని కల్తీ చేసి పడేస్తున్నారు. మరి ఈ పింపుల్స్‌ని ఎదుర్కొనే దారే లేదా.? అంటే ఓ చక్కని దారి ఉంది. శ్రద్దగా పాఠిస్తే.
అదే యోగాసనాల ప్రక్రియ. ఇవేమంత కష్టం కాదనుకోండి. అయితే, కాస్త దృష్టి పెట్టాలంతే. సింపుల్‌గా వేసేయొచ్చు. సూర్య నమస్కారం చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని అనుసరిస్తే, శరీరంలోని హార్మోన్లు సమతుల స్థాయిలో ఉంటాయి. ప్రతీ రోజూ ఉదయం కొద్దిగా గోరు వెచ్చని నీటిలో చిటికెడు సాల్ట్ వేసుకుని, రెండు చుక్కల నిమ్మరసం చేర్చి తీసుకోవాలి. దీంతో పాటు రోజులో నాలుగు లీటర్ల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే మరికొన్ని ఆసనాలను పరిశీలిస్తే, చిన్నతనంలో కాలి వేళ్ల మీద నడుస్తూ సరదాగా ఆటలాడుకునేవాళ్లం కదా. అలాంటిదే ఓ ఆసనముంది. అయితే బ్రీత్ కంట్రోల్ చేసుకుంటూ ఈ ప్రక్రియను ఫాలో చేయడమే. శ్వాస తీసుకుంటూ కాలి వేళ్లపై పైకి సాగాలి. వదులుతూ కిందకి రావాలి.. అంతే. అలాగే ఇంకోటి.. స్ట్రెయిట్‌గా నిలబడి శ్వాస తీసుకుంటూ ఒక చేతిని వెనక వైపు నడుంపై ఆనించి, మరో చేతిని క్రాస్‌గా ముందు వైపు భుజానికి ఆనించి శ్వాస తీసుకుంటూ తలను వెనక్కి తిప్పడం శ్వాస వదులుతూ తలను స్ట్రెయిట్‌గా తీసుకోవడం.. వంటి సింపుల్ ఆసనాలు వేస్తూ, టైమ్‌కి భోజనం తీసుకుని, మెనూలో పండ్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే, మొటిమల నుండి కాస్త ఉపశమనం పొందవచ్చు.
అలాగే జంక్ ఫుడ్స్ జోలికి వీలైనంత తక్కువగా పోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా చెప్పుకునేది కంటి నిండా నిద్ర. నేటి యువతను వేధిస్తోన్న ఫస్ట్ మోస్ట్ ప్రాబ్లమ్ ఇదే. సాంకేతికత పేరు చెప్పి వాట్సాప్‌లు, ఫేస్ బుక్స్ పేరు చెప్పి, నిద్రలో మూడు వంతులు ఇవే తినేస్తున్నాయి. ఒక వంతు నిద్ర మాత్రమే ఉపయోగించుకుంటోంది. చర్మం అందవిహీనంగా మారేందుకు హార్మోన్స్ అసమతుల్యతకు ఇదే ముఖ్య కారణం. సో పైన చెప్పిన చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అందమైన కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.