భాష –సమస్యలు
రాహుల్ గాంధీకి అరవం లో అరవటం రాదు. తమిళనాడు లో చాలా మందికి హిందీరాదు. కానీ తమిళనాడు లో ఎన్నికల ప్రచారం సాగాలి!ఎట్లా? అనువాదకుడుగా ఓ మధ్యవర్తి తమిళ తంబిని మధ్యలో నిలబెడతారు.సభలో రాహుల్ ఇద్దరికీ సరిగ్గా రాని ఆంగ్లభాషలో ‘మోడీ గుజరాత్ సిఎం గా ఉన్నప్పుడు చాయ్ వాలానని చెప్పారు. ప్రధాని అయ్యాక వారానికోసారి విదేశాలు వెళ్ళి వస్తూ చౌకీదార్ ని అన్నాడు! రేపు ఎన్నికల్లో గెలిస్తే ఇంకేమంటాడో?’ అని విమర్శిoచి తమిళ తంబి వంక చూస్తాడు. రాహుల్ చెప్పినదాన్ని అరవం లో అనువాదం చేయటం చేతకాక ‘మోడీ గుజరాత్లో వున్నప్పుడు చాయ్ తాగేడు.ప్రధాని అయ్యాక విదేశాలు వెళ్లి రసo తాగాడు ఐతే ఎన్నికల్లోగెలిచాక సాంబార్ తాగుతాడా?’ చెప్పి రాహుల్ వంక చూస్తూ ఆగిపోతాడు. దాంతో సభలో నవ్వులే నవ్వులు! వేదిక మీద నుదురుబాదుకోలేక రాహుల్ సన్నగానవ్వి చెప్పిందే మళ్ళీ అతని చెవుల్లో ఊదుతూ నానా తంటాలు పడతాడు! ఈ భాష- సమస్యల్ని ఎన్నికల టైం లో మనం చూశాం!ఇదంతా ఎందుకు జరిగిందీ అంటే ఇద్దరికీ ‘ఒక’ భాష రాక పోవటంచేత!
‘భాష- సమస్యల’కి ఇదో గొప్ప ఉదాహరణ!
*** *** ****
చంటి బిడ్డ వున్న తల్లికి శిశుసంరక్షణ తోనే టైం సరిపోయి సరైన తిండి నిద్ర ఉండదు! ఒక్కోసారి పిల్లాడు నిద్దరోతుంటాడు! ఇదే అవకాశమని తల్లి గబగబా స్నానం చేసి రెండు ముద్దలు ఎంగిలిపడదామని పరుగెత్తుతుంది! సరిగ్గా ఆవిడ బాత్రూం తలుపు వేసుకోగానే బిడ్డ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అమ్మమ్మ తాతయ్య మేనత్త ఇలా ఇంటిల్లిపాది ఒకపక్క సముదాయించే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా బిడ్డ ఇల్లెగిరి పోయే లేవిల్ లో ఏడుస్తుం టుంది! ఎంతకీ ఆపదు. ఆఖరికి తల్లి ఆదరాబాదరగా తడి తల నీళ్ళు కారుతుండగా కడుపులో ఆకలికి పేగులు అరుస్తుండగా వచ్చి బిడ్డని పొత్తిళ్ళలోకి తీసుకోగానే స్విచ్చి ఆపినట్టు ఏడుపు ఆపేస్తుంది! ఎందుకూ అంటే బిడ్డ తన ‘సమస్య’ ని ఏడుపు ద్వారా ప్రకటించి తల్లి స్పర్శ లో ‘భాష’ ని అర్ధం చేసుకుంటుంది!
**** ***** ****
తెల్గు సిన్మా ల్లో భాష –సమస్యలు నవ్వొచ్చే తీరులో ఉంటాయి. షరా మాములుగా బొంబాయి హీరోయిన్ కి అసలు నటన రాదు.తెలుగు అమ్మాయి కాకపోవటం చేత తెలుగుభాష రాదు.పోనీ డబ్బింగ్ చెప్పిద్దామను కుంటే హీరొయిన్ నిర్మాతని వాటేసుకుని ‘ననే తెల్గు లో మటడి నను నెను నిర్ ..పిచ్చ .. కంటాను. అవ్వ కసం ఇవ్వ అండి ‘ అoటుంది. నంగిరి నంగిరి గా మాట్లాడుతూ పదాలు వొత్తి వొత్తి పలుకుతూ భాష మొత్తం ఖూనీ చేస్తుంది. ప్రేక్షకులు కనుల విందుతో ఉబ్బితబ్బి అవుతారు గానీ వీనుల విందు మాట మర్చిపోతారు!ఇక ఆడియో ఫంక్షన్లప్పుడు చూడాలి వీళ్ళ భాష-
“ఆంధర ప్రేచ్చకలకు నా నమస్ కరం! (హీరొయిన్ చెప్పగానే ఈలలు కేకలువినిపిస్తాయి)
ఈ పిచ్చర్ బగా ఆడి నిర్ మత గరికి బగా మనీ రవలీ! ఇది పిచ్చేర్ లో హీరో గరు ఎంతో కోపరేటు చెసరు! అయ్ న దగ్గర నెను ఎంతో నేరు..చు.. కు.. నను! డైరెట్టర్ గరు నచెత మంచి ఆక్షన్ చేయించరు! మల్లి నెస్టు పిచ్చర్ లో నన్నె హీరొయిన్ గా తిసు..కునన్.. దుకు దన్యవదలు! ఈ సరి నెను తెల్గు లో మంచిగ మాట.. లాడ.. తను అని మికు హమి ఇస్తు ..నను!’” చెప్పేసి సొట్ట నడకలతో వేదిక దిగిపోతుంది! ఈవిడ సంగతి సరే తెలుగు భాష లో మహా జ్ఞాని నటన లో నిష్ణాతులు విశ్వ విఖ్యాతుడు అయిన మహానటుడు ‘అజ్ఞానం’ అని మాత్రం పాపం పలకలేక ‘అగ్నానం’ అనే అంటారు.ఇక తన మొహం లో ఎన్నో గొప్ప గొప్ప భావాలు పలికించగల సహజనటి వొత్తులు నొక్కేసి తప్పుల తడకల సంభాషణలు పలుకుతుంది. ఇదంతాఎందుకు ఏంటి అంటే భాష సమస్య లు అనే చెప్పాల్సి ఉంటుంది!
**** ******
ఇంగ్లీష్ దగ్గర కొచ్చేసరికి తెలుగోడి భాష- సమస్యలు విచిత్రంగా ఉంటాయి. తెలుగోడు ఏది అనుకుంటాడో అదే పలుకుతాడు. ఏది పలికాడో అదే రాస్తాడు. భాషలో తగినన్నిఅక్షరాలూ వున్నాయి కానీ ఇంగ్లోషోడి కత అట్లా కాదు.ఒకటి చెప్తాడు ఇంకోటి రాస్తాడు.ఉదాహరణకి సైకాలజీ అంటాడు.కానీ రాసేటప్పుడు పి తో మొదలెడతాడు.అదేంటి పి ఎందుకు అంటే ష్! గప్ చిప్!అది సైలెంట్ అక్షరం అంటాడు!మాకాలనీ తెలుగుపంతులమ్మ పంతం పద్మజగారు తెలుగుభాషా షెవినిస్ట్టు!అబ్బో!ఎవరైనా ఒక్కఅక్షరం తప్పు పలికినా,రాసినాతోలు తీసేస్తుంది! మొదట్లో ఈవిడ సంగతి తెలీక స్కూల్ లో ఇంగ్లిష్ టీచర్ రాకపోతే ఆ క్లాసు తీసుకొమ్మని పంతం పద్మజ గారిని వెళ్ళమన్నారట. అప్పుడు సైకాలజీ ని పిస్కాలజీ అనే పిల్లలకి చెప్తుంటే ప్రిన్సిపాల్ చూసి పి సైలెంట్ లెటరమ్మా అంటే పంతం పద్మగారు వైలెంట్ అయ్యి ‘ఏంటoడీ?! ఆంగ్లం లో సైకాలజీ అని రాసేప్పుడు పి రాయాలీ? కానీ పలికేటప్పుడు పి పలక్కుడదా? సైలేంటా? భాష అంటే వెటకారమా?! చస్తే సైకాలజీ అనను పిస్కాలజీ నే కరెట్టు! లేదూ సైకాలజీనే కరెట్టు అయితే ఎస్ తో స్టార్ట్ చేస్తా పిస్కాలజీ పీక పిస్కుతా అందిట రెచ్చిపోయి!పైగా చిన్నపిల్లలకి PUT - పుట్:BUT- బుట్ అని నేర్పిస్తుంది. ఎవరైనా నోరెత్తితే రాసిందే పలుకుతా! పలికిందే రాస్తా! చెప్పిందే చేస్తా,తెలుగుపంతులమ్మని! పంతంపద్మజని!భాష దగ్గర ఊరుకోను అంటుంది గుడ్లేర్రజేసి! దెబ్బకి స్కూల్లో ఈవిడని కేవలం తెలుగు చెప్పే వరకే పరిమితం చేసారట!
*** ***** ******
ప్రేమ పెళ్ళిళ్ళతో తెలుగు లోగిళ్ళలో తెలుగు భాష యాసల సొబగు బహు పసందుగా మురిపిస్తుoటుంది! కృష్ణా జిల్లా అమ్మాయి ని రాయలసీమ పిల్లోడుప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సీమమామకి ఓ రోజు బెజవాడ కోడలు జామకాయ ముక్కలుతినటానికి పెడితే ‘ఒద్దులేమ్మా’ అన్నాడు మామగారు! ‘తినండి కాసినే.. కాసినే’ అన్నది కోడలు. అప్పుడు సీమమామ ‘కాసినా?’ఓహో ఊళ్ళో వాళ్ళ తోటలో కాసిన జామ కాయలు పెడుతోంది కాబోలు అనుకుని తృప్తిగా తినేసి బావున్నయమ్మా మీ తోటజామకాయలు! రుచి జాస్తి వున్నకాయలు అన్నాట్ట! కోడలు తెల్లబోయి ‘మా తోటా? అబ్బే!ఇక్కడే వీధిలో కొస్తే కొన్నా’అందిట! మరి’కాసిన’కాయలన్నావు సీమమామ బుర్ర గోక్కుంటే కొడుకు కల్పించుకుని’ అయ్యో పిచ్చి తండ్రి! కాసిన కాదు కాసినే! అంటే కొంచమే పెట్టాను తినండి అని’ నవ్వి చెప్పాడట ‘కాసిని’ మర్మo విప్పి!
*** ***** *****
ఇక ఈమధ్య టీవీ ల్లో యాంకరమ్మలు తెగ రెచ్చిపోతూ తెలుగుభాషని ఖూనీ చేస్తున్నారు. దీనికి తోడూ పాపం వాళ్లకి స్ట్రిక్ట్ గా చెప్తారు కామోసు ఒక నిమిషం లో చెప్పాల్సిన వార్తని కనీసం ఎనిమిదిగంటలసేపు లాగి చెప్పాలని! దాంతో వీళ్ళు కొత్త కొత్త పద ప్రయోగాలు, పదబంధాలు సృష్టి స్తూ వార్త ని వక్రీకరిస్తారు! పూల పూల షర్టు ప్యాంటు వేసుకుని యాంకరమ్మ అటు ఇటు నడుస్తూ గొంతు లో లేని గాంభీర్యం తెచ్చి పెట్టుకుంటూ
‘పట్ట పగలు చిమ్మ చీకటి అప్పుడే జరిగిందో హత్య! రోడ్డు మీద శవం! ఎవరు చేసారు ఈ హత్య? ఇది రాజకీయ హత్యా లేక అక్రమ సంబంధాలు వల్ల జరిగిన హత్యా? ఎవరు?ఎవరు? ఎవరు చేసారు? అంటూ మనవైపు చూసి గుడ్లు తిప్పితే నాకేం తెలీదు తల్లోయ్! అని మనం ఛానల్ తిప్పెస్తాం!
**** ***** ****
రాజకీయ నేతలు కొందరుంటారు వాళ్ళు ప్రసంగాల్లో గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తుంటే పచ్చి బూతులు అటు ఇటు అవుతుంటాయి. దూడలు అనేకo దొర్లుతుంటాయి.
వాక్యం ప్రారంభంలో” ఏదైతే” అని మొదలెడితే గానీ కొందరికి నోరు పెగలదు. మచ్చుకి వాళ్ళ ప్రసంగం ....”ఇవాళ మనం ఏదైతే ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామో దానిగురించి ఏదైతే నాలుగు ముక్కలు చెప్పాలి! ఏదైతే మన సమస్యలు వున్నాయో అవన్నీ మంత్రి గారి దృష్టికి ఏదైతే తీసుకుకు పోతామో వాటిని ఆయన పరిష్కరిస్తారని ఏదైతే మనం ...”
ఈ టైపు లో ‘ఏదైతే’ నడుస్తుంది! ఇంకొందరున్నారు వాళ్లకి “పోతే” అంటే గానీ బుర్ర పనిచెయ్యదు! వీళ్ళ ప్రసంగం ఎట్లా ఉంటుందీ అంటే ...
“నేడు స్వాత్రంత్య దినం! పోతే- మన దేశనాయకులూ గాంధీ నెహ్రు లు...(అంటూ నిమిషం పాటు మౌనం వహించి, ఆనక ) పోతే .. వాళ్ళు ఎనలేని సేవ చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ( మళ్ళీ మౌనం) పోతే ఈనాటి యువతరం నాటి మహా నేతల స్ప్పూర్తి తో
( మళ్ళీ మౌనం)పోతే, ముందుకు పోవాలని పిలుపు ఇస్తున్నాను.(ఈసారిగట్టిగానిట్టూర్పు) పోతే... “ అలా ఆ టైపులో అయన ప్రసంగం పోతుంటుంది. ఇక చంద్రబాబు గారికి ప్రతీది ‘మనవి’ చేసుకుంటున్నాను అన్న భాషా ప్రయోగం చేస్తేగానీ తృప్తి ఉండదు. మచ్చుకి ఆయన మాటల్లో – “దావోస్ వెళ్ళాను కొన్ని వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చానని మీకు మనవి చేసుకుంటున్నాను. అమెరికా వెళ్ళాను. బిల్ గేట్స్ తో మాట్లాడి ఐటీ రంగం అభివృద్ధి చేసి వందల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతి చేశామని మనవి చేసుకుంటున్నాను-ఇవాళ హైడ్ర బ్యాడ్ లో జరిగిన అభివృద్ధి అంతా నా వల్లే నని మనవి చేసుకుంటున్నాను “
ఇలా ‘మనవి’ తో ఉంటుంది ప్రసంగం! అయితే ప్రత్యర్ధి పార్టీ నాయకులు ఆయన ప్రతీది ‘మనవి మనవి’ అంటూన్నాడు అంటే లోతుగా అర్ధం చేసుకోవాలి! అన్నిట్లో ‘మనవి’(అంటే తనవి) చేసుకుoటాడని ‘మనవి’చేసుకుంటున్నాం అనీ అంటారు.
**** **** *****
ఒక వ్యక్తి సీ ఎం అయినప్పుడు అతని పదవీ ప్రమాణ స్వీకారోత్సవం అయ్యాక అభినందించటానికి అందరికీ భాష కావాలి కానీ ఆ వ్యక్తి తల్లికి మాత్రం ‘భాష’ అవసరం లేదు, ఉండదు! అదొక తియ్యటి భాష! కమ్మటి అనుభవం! సుపుత్రుడు సీఎం అయ్యాక అభినందించాలంటే భాష అందక పెదవులు పలకక మాటలు పెగలక అనిర్విచనీయ భాష ఉప్పొంగే ఉత్కృష్ట ఘట్టమది! అమ్మ మనసు అత్యద్భుతంగా అభినందనలు తెలియచేస్తుందిలా ... రెండుచేతులతో గట్టిగా తనయుడుని పెనవేసి ఆత్మీయ బిగికౌగిలి లోబంధించి కనులు కలవరించగా మనసు పలవరించగా మేను పులకరించగా హృదయం ద్రవించేలాపదేపదే కొడుకుని హత్తుకుని కన్నీటిచెలమతో అభినందనభాషా ప్రసారంచేస్తుంది! ప్రసారమాధ్యమాల ‘సాక్షి’ గా 2019 మే 30 నాడుజగన్ గారు సిఎం గా ప్రమాణంచేసినపుడు ఈ భాషావేడుక జరిగింది! ఇది ప్రకృతి భాష! ఈ భాషకి ఏ సమస్యలు లేవు, ఉండవు, అడ్డo కావు!!