కేరళ అనుకోగానే మనకి గుర్తువచ్చే పట్టణం ‘ కొచ్చిన్ ‘ , అరేబియా సముద్రతీరం లో వున్న రేవు పట్టణం .
కేరళ ముఖ్యపట్టణం తర్వేండ్రమే అయినా కొచ్చిన్ కేరళకి వాణిజ్య , వ్యాపార ముఖ్యకేంద్రం . రాజుల కాలం నుంచి కూడా యీ పట్టణం సుగంధ ద్రవ్యాలపంటకు , ఎగుమచులకు పేరుపొందింది . సముద్రతీరాన వుండడంతో చేపల ఎగుమతులకు కూడా పేరుపొందింది . చాలా మంది పర్యాటకులు కొచ్చిన్ సముద్రపు ఆహారం తినడానికే వస్తారని అంటే అతిశయోక్తి కాదు . భరతదేశపు నౌకాదళ ముఖ్య కార్యాలయం వుండడం కూడా కొచ్చిన్ పట్టణ అభివృద్దికి దోహాదపడింది .
కొచ్చిన్ దగ్గర చాలా నదులు సముద్రం లో కలుస్తూ వుండడం తో కొచ్చన్ చుట్టుపక్కల నీటికాలువలు , బేక్ వాటర్స్ యెక్కువగా వుంటాయి , ఇటలీలోని వెన్నస్ నగరాన్ని తలపిస్తూవుంటుంది కొచ్చిన్ , నీటిపై కట్టిన యిళ్లు , కాలువలలో ప్రయాణిస్తున్న చిన్న చిన్న నావలు మనల్ని ఆకట్టుకుంటాయి .
ఎక్కువగా పాతకట్టడాలు కనిపిస్తాయి , కొచ్చిన్ లో మరో విశేషం యేమిటంటే లవంగాలు , ఏలకులు , మిరియాలు ప్రతీ యింటిముందు పెరట్లో పండుతూ వుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .
ఈ మధ్యకాలంలో బేక్ వాటర్స్ మీద బోట్ హౌసులు అద్దెకివ్వడం బాగా ప్రాచుర్యం పొందింది , కొన్ని సంవత్సరాల క్రిందట అందంగా కట్టిన బోట్లలో రోజంతా నీటిమీద తిప్పడం ఆరోజు భోజన ఫలహారాలు యేర్పాటు చెయ్యడం చేసేవారు , తరువాత తరువాత రాత్రి వుండడానికి వీలుగా పడకలు , ఏసిలు యేర్పాటు చేసి పగలంతా నీళ్లల్లో మెల్లగా కదులుతూ వుండి రాత్రికి లంగరు వేస్తారు , రెండురాత్రులు మూడు పగళ్లు , ఒక రాత్రి రెండు పగళ్లు యిలా లెక్క వుంటుంది , కాఫీటీ లతో మొదలుపెట్టి రాత్రి భోజనం వరకు అన్నీ వారే పెడతారు . పగలంతా కొంతసేపు సముద్రం పైనా కొంత సమయం నదీ జలాలలోనూ విహరించడం ఓ మరపురాని అనుభూతనే చెప్పొచ్చు . బోట్ హౌస్ ల అందం ( నగిషీలు చెక్కివుంటాయి) బయటనుంచి చూస్తూ వుంటేనే అందులో ఒక్కరోజైనా గడపాలనే కోరిక కలుగుతుంది . వారు పెట్టే తిండి బాగులేకపోయినా ఒకటిరెండురోజులు బోట్ హౌసులలో గడపాలి , నీటిమీద తేలియాడుతూ చేసే ప్రయాణం చాలా గమ్మత్తుగా వుంటుంది .
ఇక కొచ్చిన్ లో వున్న నేలమది ఆకర్షణల గురించి చెప్పుకుందాం .
కొచ్చిన్ లో స్పైస్ మార్కెట్ ఓ ఆకర్షణ , మేలురకమైన సుగంధ ద్రవ్యాలు కొనాలనుకొనేవారు ఓ సారి యిక్కడకు వెళ్లొచ్చు , కొనుక్కోవచ్చుకూడా , అన్నీ బస్తాలలో పోసి అమ్ముతూ వుంటారు . అలాగే వీలుంటే నర్సరీలను కూడా చూడొచ్చు . లవంగ మొక్కలు కొనుక్కోవచ్చు . ఒక రోజు టూరు బుక్చేసుకుంటే కొచ్చిన్ లోని ముఖ్య ఆకర్షణలు చూడొచ్చు .
కొచ్చిన్ లో తప్పకుండా చూడవలసినవి జూయిష్ విలేజ్ , మోన్యుమెంట్ ఫోర్టు , చైనీస్ ఫిషింగ్ , డచ్ మ్యూజియం , సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ , లేదా మనంతట మనమే బోటువారితో మాట్లాడుకొని మనకి కావలసిన ప్రదేశాలు చూసుకోవచ్చు . అయితే డాల్ఫిన్ వ్యూ మాత్రం మీ టూరులో కలపడం మరచిపోవద్దు , పెంపుడు డాల్ఫిన్స్ వాటి విన్యాసాలూ చూడ్డం వేరు , సముద్రంలో యధేఛ్చగా గుంపులుగా తిరిగే డాల్ఫిన్స్ ని చూడ్డం వేరు . డాల్ఫిన్స్ ని చూడ్డానికి స్థానిక బోటువారు మనకి రెండు ఆప్షన్వు యిస్తారు ఒకటి గంటకి యింత అని రెండవది డాల్ఫిన్ల్ ని కనిపించే వరకు బోటులో తిప్పాలని , వీటిలో డాల్ఫిన్స్ కనిపించేవరకు తిప్పాలనే ఆప్షనే మనం యెంచుకోవాలి. గంటలలెక్క అయితే యెన్ని గంటలు తిరిగినా డాల్ఫిన్స్ కనిపించవు . దీనికి మనం సూర్యోదయానికి ముందుగా బయలుదేరితే చాలా బాగుంటుంది . ఒకరోజు టూరు పేకేజీ తీసుకుంటే అన్నీ బోటులో తీసుకు వెళ్లి చూపిస్తారు , అంటే కొత్తగా జరిగిన నిర్మాణాలున్న ప్రదేశాన్ని న్యూ కొచ్చిన్ అని మనం చూడవలసినవన్నీ అవతల వొడ్డున వున్నాయి , దానిని పాత కొచ్చిన్ అని అంటారు , ఆ పక్కనుంచి యీ పక్కకి రావడానికి బోట్లనే వుపయోగిస్తున్నారు , కేరళ ప్రభుత్వమే యీ టూర్లను నిర్వహిస్తున్నాయి అలాగే ఆపక్కనుంచి యీ పక్కకి , యీ పక్కనుంచి ఆపక్కకి వెళ్లడానికి కూడూ రా ష్ట్ర ప్రభుత్వము వారిచే నడపబడుతున్న పడవలు వున్నాయి ( సిటీ బస్సు ల మాదిరి ) . మేం గవర్నమెంటు వారి టూరునే యెంచుకున్నాం కారణం భాష రాకపోవడం ఒకకారణమైతే , వారి ఖరీదులు కూడా చాలా యెక్కువగా వుండడం మరోకారణం .
సెయింటు ఫ్రాన్సిస్ చర్చ్ —— 1498 లో ‘ వాస్కో డా గామా ‘ మొదటి యూరోపియన్ నావికుడు భారత దేశానికి సముద్రపు మార్గం లో కాలికట్ తీరాని వచ్చేడు . ఇతను పోర్చుగీసు దేశానికి చెందినవాడు , అతని తరువాత పోర్చుగీసువారు అదే మార్గంలో కాలికట్ చేరి కోట నిర్మాణానికి గాను కొచ్చిన్ రాజు అనుమతితో ‘ ఫోర్ట్ యెమ్మాన్యూలు ‘ నిర్మాణం చేసేరు . కోటలోపల కర్రతో చర్చ నిర్మాణంచేసి దానిని ‘ బ్రథొలోమ్యూ ‘ కి అంకిత మిచ్చేరు . 1516 లో అప్పటి పోర్చుగీసు వైస్రాయ్ రాజుగారి అనుమతితో చర్చని ఇటుక నిప్మాణంగా మార్చేరు , యీ కొత్త నిర్మాణాన్ని సెయింట్ ఆంథోనికి అంకిత మిచ్చేరు . తరవాత యీ చర్చ్ సెయింట్ ప్రాన్సిస్ భక్తుల ఆధీనంలో వుండేది , 1663 లో డచ్చ వారు యీ కోటను స్వీధీనం చేసుకుంటారు . పోర్చుగీసువారు రోమన్ కథలిక్ లు , డచ్ వారు ప్రొటస్టెంట్లు కావడంతో చర్చ్ ని నేలమట్టం చేసి కొత్త చర్చిని కట్టుకున్నారు . 1804 లో కొచ్చిన్ ఆంగ్లేయులపాలనలోకి వచ్చింది , అప్పడు దీనిని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ గా పిలువబడసాగింది . 1904 లో దీనిని సంరక్షిత కట్టడంగా ఆర్కియలజీ వారిచే గుర్తించబడింది .
ఈ చర్చ్ ని 1500 సంవత్సరంలో నిర్మితమైన యురోపియన్ చర్చ్ , చూడగానే పురాతనమైనదని తెలుస్తూనే వుంటుంది , అన్ని చర్చ్ ల్లాగే ప్రార్ధన చేసుకోడానికి వీలుగా వరుస బెంచీలు ఓ పక్కగా కన్ఫెషన్ బాక్స్ వుంటాయి , ప్రత్యేకంగా చూడాలి అనేంత గొప్పగా వుండదు కాని పురాతనమైనదనే ఆకర్షణ తప్ప , యీ చర్చిలో పోర్చుగీసు నావికుడు ‘ వాస్కో డా గామా ‘ యొక్క సమాధివుంది .
వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర దారిన చేరుకున్న మొదటి యురోపియన్ నావికుడు . ఇతను తన జీవితం లో మూడు మార్లు మనదేశానికి వచ్చేడట , మూడవమారు వచ్చినపుడు అంటే 1524 లో వచ్చినపుడు కొచ్చిన్ లో మరణించేడు . అప్పుడు అతనిని యీ చర్చ్ లోనే సమాధిచేసేరు , పద్నాలుగు సంవత్సరాల తరువాత అతని అవశేషాలను తీసి వారి దేశానికి పంపించేరు , చర్చ్ లోని ఆ ప్రదేశం యిప్పటికీ వాస్కో డా గామా సమాధిగానే గుర్తిస్తారు . చర్చిలో చాలా చల్లగా ప్రశాంతంగా వుంది .
జూయిష్ ప్రార్ధనా స్థలం ( పరదేశి సినాగోగ్ )———-
కొచ్చిన్ మరో చూడదగ్గ ప్రదేశం పరదేశి సినాగోగ్ ఒకటి . ‘ సినాగోగ్ ‘ అనేది స్పానిష్ భాషలో ప్రార్థనా స్థలం అని అర్దం వుంది , సిరియాలో స్పానిష్ మాట్లాడే కొన్ని కుటుంబాలు సుగంధ ద్రవ్యాల యెగుమతి వ్యాపారం చేస్తూ యిక్కడే స్థిరపడిపోవడంతో ప్రార్ధనా మందిరాన్ని నిర్మించుకొన్నారు . ప్రస్తుతం ప్రపంచమొత్తంమ్మీద మిగిలిన అతికొద్ది మంది జ్యూ లలో వీరు కూడా వున్నారు . 1568 లో యీ ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకున్నారు , మన దేశంలో యిలాంటి ప్రార్ధనా మందిరాలు మరో ఆరువున్నాయి , మొదటి ప్రార్థనా మందిరం నాలుగో శతాబ్దంలో నిర్మించినచ్లుగా చరిత్రలో వ్రాయబడింది . మందిరంలో అద్దాల పనితనం , షాండిలీర్లు చూడ ముచ్చటగా వుంటాయి , చాలా మటుకు గోడలకు , నేలపైన పరచిన పలకలు , లోపల అలంకరణ సామానులూ సిరియానుంచి తెచ్చినవి యిప్పటికీ కొత్తగా కనబడుతూ వుంటాయి . జ్యూస్ తయారుచేసిన చేతి పనులు చాలా బాగుంటాయి , మనదేశంలో వున్న చిన్న యురోపియన్ గ్రామం అనడంలో అతిశయోక్తిలేదు , ఈ ఆధునిక యుగం లో కూడా వారు వారి ఆచారవ్యవహారాలను అనుసరించడం మనకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కూడా కలుగజేస్తుంది .
మట్టాన్ ఛెర్రి రాజభవనం —
జ్యూయిష్ ప్రార్థనా మందిరానికి ఆనుకొని వున్న భవనం , 1550వ సంవత్సరంలో పోర్చుగీసు వారు నిర్మించి అప్పటి కొచ్చిన్ రాజుకి కానుగా యిచ్చిన భవనం యిది . డచ్ వారి పరిపాలనలో యీ భవనానికి మార్పులు చేర్పులు చెయ్యబడ్డాయి , అప్పటినుండి దీనిని డచ్ పేలస్ అని పిలువ సాగేరు , తరువాత కర్నాటక ని పరిపాలించిన హైదరాలి పరిపాలనలో వుండి ఆంగ్లేయుల చేతిలోకి వెళ్లింది .
ప్రస్తుతం యిది కొచ్చిన్ రాజుల చిత్రపటాల గేలరీగా వ్యవహరిస్తున్నారు . ఇందులో కొచ్చిన్ రాజ వంశస్థుల చిత్రపటాలతో పాటు హిందూ దేవుళ్ల చిత్రాలు కూడా వున్నాయి , ఈ భవనం పూర్తిగా కేరళ స్టైల్ లో నిర్మింపబడింది . వెడల్పయిన వాకిలి మధ్యలో భగవతి మాత మందిరం వుంటుంది , భవనానికి యిరువైపులా రెండు మందిరాలు ఒకటి కృష్ణునికి మరొకటి ఈశ్వరునికి కట్టబడ్డాయి . ఈ భవనంలో అక్కడక్కడ యురోపియన్ స్టైల్ కూడా కనబడుతూ వుంటుంది .
వచ్చేవారం కొచ్చిన్ లోని మరికొన్ని వివరాలతో వస్తాను , అంత వరకు శలవు .