ఈ వారం ( 21/6- 27/6 ) మహానుభావులు
జయంతులు
జూన్ 22
శ్రీ గణేశ్ పాత్రో : వీరు జూన్ 22, 1945 లో పార్వతీపురం లో జన్మించారు. విరు ప్రముఖ నాటక, సినీ రచయిత. వీరు రాసిన “ కొడుకు పుట్టాల “ అనే నాటకం, జాతీయ స్థాయిలో గొప్ప పేరు సంపాదించడమే కాకుండా , ఎన్నో భాషల్లోకి అనువదించబడింది. ఎన్నో విజయవంతమైన తెలుగు సినిమాలకు సంభాషణలు రాసారు.
జూన్ 23
శ్రీ దివాకర్ల వెంకటావధాని : వీరు జూన్ 23, 1923 న ఆకుతీగపాడు లో జన్మించారు. ప్రముఖ సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు గా పేరు తెచ్చుకున్నారు. వీరు నలభైకి మించి గ్రంథాలను రచించారు.. వాటిలో పద్యకృతులు, వచన రచనలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు ఉన్నాయి.. ఉపన్యాసాల ద్వారా . ఎన్నో మారుమూల గ్రామాల్లో తెలుగు సాహిత్య చైతన్యం తేగలిగారు. వీరి ఉపన్యాసాలు వినడానికి వేలకొద్దీ శ్రోతలు వచ్చేవారు.
జూన్ 24
శ్రీ గూడవల్లి రామబ్రహ్మం : వీరు, జూన్ 24, 1902 న నందమూరు లో జన్మించారు. ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు. హేతువాది. ఆయన మద్రాస్ నుంచి “ ప్రజామిత్ర “ అనే పత్రికను పది సంవత్సరాల పాటు విజయవంతంగా నడిపారు.
జూన్ 25
శ్రీ వఝుల సితారామ శాస్త్రి : వీరు జూన్ 25, 1878 న బొబ్బిలి లో జన్మించారు. ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. పలు శాస్త్రాలను అభ్యసించి ఎన్నో రంగాల్లో కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ద్రవిడ భాషల పరిశీలన, అధ్యయనం తదితర రంగాల్లో ఆయన విస్తృతమైన కృషిచేశారు. . తెలుగు వ్యాకరణాల తీరుతెన్నుల విషయంలో ఆయన తన లోతైన పరిశోధనలు వెలువరించారు. భాషాశాస్త్ర పరిశోధనల్లో భాగంగా ద్రావిడ భాషల్ని పరిశోధిస్తూ "ద్రావిడ భాషా పరిశీలనము", పలు ద్రావిడ భాషల్లోని పోలికలను, భేదాల్ని వెల్లడించే "ద్రావిడ భాషా సామ్యములు" గ్రంథాలను రచన చేశారు.
జూన్ 27
శ్రీ ముక్కామల అమరేశ్వర రావు: : వీరు జూన్ 27, 1917 న చోడవరం లో జన్మించారు. ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు మరియు నాటక సంస్థ నిర్వాహకుడు. వృత్తి రిత్యా వైద్యులు. కానీ నాటక రంగం అంటే ఎంతో ఇష్టం. ఎన్నో ప్రముఖ నాటకాల్లో నటించి ఎంతో పెద్ద పేరు సంపాదించారు. ఒక నాటక సంస్థ స్థాపించి, దానిద్వారా, ఎన్నో చారిత్రాత్మక నాటకాల్లో నటించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించారు..
వర్ధంతులు
జూన్ 21
1.శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి : “ కరుణశ్రీ “ ప్రసిధ్ధి చెందారు. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత … వారు రచించిన “ పుష్పవిలాపము “ “ కుంతి కుమారి “ ఎంతో పేరుతెచ్చుకున్నాయి. మృదుమధురమైన పద్యరచనా శైలి వీరి ప్రత్యేకత.
జూన్ 21, 1992 న వీరు స్వర్గస్థులయారు.
2.శ్రీ కొత్తపల్లి జయశంకర్ : వీరు తెలంగాణా సిధ్ధాంతకర్త గా పేరుపొందారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. తెలంగాణా రాష్ట్ర ఆవశ్యకత పై ఎన్నో పుస్తకాలు రచించారు.
వీరు జూన్ 21, 2011 న స్వర్గస్థులయారు.
జూన్ 23
శ్రీ కొంపెల్ల జనార్ధనరావు : ప్రముఖ భావ కవి , నాటక రచయిత.. మహాకవి శ్రీశ్రీ , తాను రాసిన “ మహాప్రస్థానం “ కవితా సంపుటాన్ని వీరికే అంకితమిచ్చారు. వీరు సంప్రదాయవాది. ప్రవర్తనలో పరమ సనాతనుడు. సాహిత్యం పట్ల అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తి.. ఆనాటి ప్రముఖ తెలుగు పత్రికలలో , దాదాపు 25 కవితాఖండికలను భావ కవితారీతిలో ప్రచురించారు.
వీరు జూన్ 23, 1937 న అతి పిన్నవయసు ( 30 ) లో స్వర్గస్థులయారు.
శ్రీ యలవర్తి నాయుడమ్మ : ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి.. అమెరికా లోని చర్మ పరిశుభ్రం చేసే పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అధ్భుత విజయాలను సాధించారు. శ్రీనాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డిహైడ్స్ మొదలైన వాటి కలయిక నిర్మాణ శైలి రంగాలలో కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్ళు పదును చేసే వినూత్న ఏజంట్స్ గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు.
వీరు జూన్ 23, 1985 న స్వర్గస్థులయారు.
జూన్ 24
శ్రీ తల్లాప్రగడ సుబ్బారావు : వీరు ఒక అఖండ మేధాశాలి. ఆధ్యాత్మిక, వేదాంతోపనిషత్తుల, తత్వజ్ఞాన సారాంశములను చేతివ్రేళ్ళమీద కలిగి ఉదహరించి బోధించగల బ్రహ్మజ్ఞాని సుబ్బారావుగారని దేశవిదేశాల్లోని ప్రముఖులు పొగిడారు.. వారు గొప్ప సంస్కృత విద్వాంసుడనీ, సనాతన, వేదాంత, ప్రాచీన నిఘూడ తత్వజ్ఞాన సారాంశాలపై అపార విజ్ఞానము కలవాడనీ మహా వక్తయనీయు, వారి సమకాలీకులు దైవజ్ఞాన సంస్ద సభ్యులే కాక దేశ విదేశాల నుండి వేదాంత సాహిత్య వేత్త ప్రముఖులు తమ తమ వ్యాసములలో నొక్కివక్కాణించి చెప్పిన అనే క మూలాధారాలు కనబడుతున్నాయి. .
వీరు జూన్ 24, 1890 న స్వర్గస్థులయారు.
2.శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు : రచయిత, అనువాదకుడు, సంస్కృత పండితుడు. సంస్కృత కావ్యాలు, నాటకాలు, శాస్త్రాలు వంటివి తెలుగులోకి అనువదించి వ్యాఖ్యానించారు.. వీరు తమ పదునాలుగవయేట నుండి రచనలు చేయడం ప్రారంభించారు. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో 200 లకు పైగా పుస్తకాలను వెలువరించారు.
వీరు జూన్ 24 , 2015 న స్వర్గస్థులయారు.