మనుషులు, పక్షులతో సమాచారం కాస్తా, ఉత్తరాలు, టెలిగ్రాముల వరకూ వచ్చింది. ఆ తర్వాత 'టెలిఫోన్' అందుబాటులోకి వచ్చింది. ఈ టెలిఫోన్ ఎన్ని రకాలుగా రూపొంతరం చెందిందో తెలిసిందే. ల్యాండ్ లైన్‌తో ఉన్న చోటే కదలకుండా మాట్లాడడం దగ్గర నుండి మొదలుకొని, చేతిలో మొబైల్ ఎక్కడి నుండైనా మాట్లాడే వరకూ వచ్చింది. ఇక ఈ మొబైల్ ఫోన్‌లో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఇక స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రపంచం ఎంత చిన్నదైపోయిందో దేశాలూ, ఖండాలూ ఎంత దగ్గరైపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదైనా అవసరం ఉన్నంత వరకూ వాడితే బాగానే ఉంటుంది. ఆ అవసరం కాస్తా శృతి మించితేనే అమృతమైనా విషమైపోతుంది. అలాంటి వాడకం గురించే ఇప్పుడు చర్చించుకుందాం.
సర్వరోగాలకూ ఒకటే కారణం అన్నట్లుగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రపంచం దగ్గరైపోయింది. కానీ, దగ్గరే ఉన్న జనం మాత్రం దూరమైపోయారు. ఖాళీ సమయం దొరికితే, చక్కగా నలుగురూ కూర్చొని పిచ్చా పాటీ మాట్లాడుకోవడం మానేసి, నిమిషం ఖాళీ దొరికినా ఆ టైంలో మొబైల్ ఫోన్ చెక్ చేసుకోవడంతోనే సరిపోతుంది. వాట్స్ యాప్, దాని డాష్ కా బాప్.. అంటూ రకరకాల యాప్స్ మతులు పోగొట్టేస్తున్నాయి. అదే భ్రమలో మనుషుల్ని మభ్యపెట్టేస్తున్నాయి. రిలేషన్‌షిప్స్‌ని ఎప్పుడో మరిపించేశాయి ఈ వాట్సాప్‌లు ఇతరత్రా మొబైల్ యాప్‌లు. ఇక కొత్తగా ఇప్పుడు చిన్నా, పెద్దా, యువత, ముసలి అనే తేడా లేకుండా జనాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్న యాప్ 'టిక్‌టాక్'. ఈ టిక్‌టాక్ ప్రపంచంలో పడితే, ఇక మన పక్కన నాగుపాములొచ్చి బుసలు కొట్టినా తెలియని పరిస్థితి. మన ఒంట్లోంచి బొట్టు బొట్టుగా రక్తాన్ని లాగేసుకున్నా అస్సలు తెలియని పరిస్థితి. అంతలా ఈ టిక్‌టాక్ వీడియోలు మెదడుపై ప్రభావం చూపిస్తున్నాయి.
అసలీ టిక్‌టాక్ అంటే ఏంటీ.? అదో మొబైల్ యాప్. పైసా ఖర్చు లేదు. పైగా బోలెడంత పాపులారిటీ. చేతిలో ఉన్న మొబైల్‌తో మనకు నచ్చిన వీడియోలు తీసి ఈ యాప్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. మంచి వీడియోలు, ఇన్‌స్పైరింగ్ వీడియోలు పోస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. అయితే ఈ పిచ్చ పీక్స్‌కి చేరిపోయింది. యువత చేతిలో స్మార్ట్ ఫోనుంది కదా.. అని ప్రైవేట్ వీడియోలు కూడా పోస్ట్ చేసేస్తున్నారు. పర్సనల్‌గా కొన్ని తయారు చేస్తున్నారు. మరికొన్ని బెడ్రూమ్‌లు, బాత్రూమ్‌లలో ఇతరుల వీడియోల్ని కూడా రహస్యంగా తీసి పెడుతున్నారు. దాంతో ఈ మధ్య అనేక ఆత్మహత్యలకు ఈ టిక్‌టాక్ వీడియోలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. టిక్‌టాక్ వీడియోల్లో మునిగి తేలితే అదేదో డ్రగ్ అడిక్ట్ అయిపోయిన ఫీలింగ్. ఆ మత్తు అంత తేలిగ్గా వదలడం లేదు. పాలిచ్చే తల్లులు చంటిపిల్లల్ని పట్టించుకోవడం లేదు. స్కూలుకెళ్లే పిల్లలు చదువుల్ని పట్టించుకోవడం లేదు. ఇక యువత సంగతి చెప్పనే అక్కర్లేదు.
టిక్‌టాక్ వీడియోల్లో పడి, బిడ్డను నిర్లక్ష్యం చేసిందన్న కారణానికి భర్త మందలించాడని టిక్‌టాక్‌లోనే వీడియో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్న ఓ మహిళ ఉదంతం ఈ మధ్య కలకలం రేపింది. నాన్న టిక్‌టాక్ చూడొద్దన్నాడని ఓ పదకొండేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో దుర్ఘటనలు ఈ మధ్య టిక్‌టాక్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చాయి. అంతలా ఈ టిక్ టాక్ పిచ్చ పాకిపోయింది. రోగానికైతే మందు వేయచ్చు. కానీ, ఈ టిక్‌టాక్ పిచ్చకి మాత్రం మందే లేదు మరి ఏం చేయాలి.?
పిల్లల్ని తల్లితండ్రులు ఆదిలోనే కంట్రోల్ చేయగలగాలి. ఓ వయసుకి వచ్చిన వారికైతే, అర్ధమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించాలి. వీలైతే నిపుణుల వద్ద కౌన్సిలింగ్ ఇప్పించాలి.