అద్దాలు –అందమైన అబద్ధాలు
పుట్టిన ప్రతి మనిషి హాయిగా నవ్వుతూ ఉండాలనుకుంటాడు. కానీ తమాషా ఏంటంటే పుట్టగానే ఏడుస్తాడు. ఈ ఏడుపు సహజంగా వచ్చిన ఏడుపు! దీనికి భిన్నమైన ఏడుపు మరోటుంది అది పక్కవాడు బాగుపడినప్పుడు బైటికోస్తుంటుంది.ఈ విషయం అందరికీ వర్తించక పోయినా ఏడ్చిన వాడి ఫేసు మనం కనిపెట్టగలం! ఎటొచ్చి వాడికి మాత్రం తెలీదు!కారణం ఏంటంటే ఎవడి హావభావాలు వాడికి తప్ప మిగతా అందరికి బాగా అర్ధం అవుతాయి ఎటొచ్చి మన గురించి మనకు తెలియాలి అంటే అవసరం – అద్దం!మన గురించి మనకి అర్ధం అవ్వాలన్నా ఎదుటి వాడికి అర్ధం కాకుండావుండాలన్నా అప్పుడప్పుడు మన మొహం అద్దం లో చూసుకోవటమే సొల్యుషన్ అని నిపుణులు సూచిస్తుంటారు
*** ****
అద్దం అనగానే అతివలు గుర్తుకురావటం సహజం!అందుకే వందన సిస్టర్స్ సుమాంజలి టైపు బట్టల షాపుల వాళ్ళు నిలువెత్తు అద్దాలు బిగించి అతివల్ని ఆకర్షిస్తారు! కానీ ఈ మధ్య కాలం లో కేసులు రివర్సు అయ్యాయని అంటున్నారు.పార్టీ కెల్తూ ఎంతకీ బెడ్ రూమ్ లోంచి బైట పడని తల్లిని పిల్లలు విసుక్కుంటూ ఇక ఆ మేకప్పు ఆపి బైటికి రా మమ్మీ!అని కేకవేస్తే ఆపాటికే కార్లో కూచుని వున్న మమ్మీ గారు నేను రెడీ అయ్యి అరగంట అయ్యింది బెడ్రూం లో వున్నది నేను కాదు మీ డాడి! చెప్తే పిల్లలు నిర్ఘాంత పోయి తలుపు తోసి చూస్తె సదరు డాడి గారు అద్దంలో తన నయనానందకర బట్ట తలని మురిపెంగాచూసుకుంటూ దువ్వెన తో అరగంట నుంచి అదే పనిగా దువ్వుతున్నారట.ఆఫ్ కోర్స్ ఈ విషయాన్ని ఖండిస్తూ మా కాలనీ గిరి గారు అసలావిడ అరగంట ముందే కార్లో కూచుని ఏం చేస్తోంది?చక్కగా మేకప్ కిట్ పట్టుకుని కార్లో అద్దం ముందు కూచుని అలంకరణ లో మునిగి వుంటుంది! ఆడవాళ్లు తెలివిగా మేకప్ రూo షిఫ్ట్ చేసారని గిగి గారి భాష్యం!అయ్యుండొచ్చు కూడా!
విపరీతమైన ఊబకాయం తో బాధ పాడేవాళ్ళకి ఒక గొప్ప రిలీఫ్ కనిపెట్టాడు మా దోస్తు కన్నారావ్! ఎక్కడ్నించి తెచ్చాడో గాని ఒక అద్దం తెచ్చి హోటల్ లో బిగిచ్చాడు! హోటల్ కొచ్చిన లావుపాటి వాళ్ళంతా అద్దం లో చూసుకుంటే సన్నగా నాజుగ్గా కనిపిస్తారు. దాంతో 200 కిలోల భారీ శరీరం తో నడవలేక కదలలేక పోయే వాళ్ళంతా అద్దం గురించి విని హోటల్ కి పరుగెత్తు కొచ్చి అద్దం లో తమ సన్నని నాజుకైనా శరీరం చూసుకుని ముచ్చట పడుతూ ఫుల్ గా తింటూoడంతో వీడికి బోలెడు లాభాలు వస్తున్నాయి! ఇక పుట్టి బుద్దెరిగి అద్దం లో మొహం కూడా చూసుకోని మతిమరుపు ప్రొఫెసర్లూ ఉంటారని అంటారు. మా కాలనీ ప్రొఫెసర్ విశ్వం గారు ఆ టైపేనట! ఓ రోజు పొద్దున్నే వంటింట్లో వంట తో కుస్తీ పడుతున్న పెళ్ళాం దగ్గరికి హడావిడిగా పరిగెత్తి మన బెడ్రూం లోకెవడో దూరాడు చెప్పేసరికి పాపం ఆవిడ హడలిపోయి మన బెడ్రూం లోకా? అంటూ వెళ్లి చూస్తె వెనకనుంచి ప్రొఫెసరు గారు అదిగో చూడు ఆ బీరువా దగ్గర నిలబడ్డాడు అన్నాడట తన ప్రతిబింబాన్ని అద్దం లో చూపిస్తూ! విషయం అర్ధమైన భార్యామణి విసుగ్గా వీడెవడో కాస్త మీలా ఉన్నాడు సుమా! అందిట దాంతో ప్రొఫెసరు విశ్వంగారు మరింత హాచర్యపోయి అంతే కాదు వాడి పక్కన నిలబడ్డ ఆవిడా అచ్చు నీలా వుందే? అన్నాట్ట యమ సేరియస్సుగా గడ్డం పీక్కుంటూ!అయ్యో కర్మ! అందుకే ఏడాది కోసారైనా అద్దంలో మొహం చూసుకొమ్మని నేను పోరు పెట్టేది! నుదురుబాదుకుందట ఆవిడ! అప్పట్నించి ప్రొఫెసర్ గారు రోజూ అద్దం ముందు తిష్ట వేసి కూచోడమే కాక అద్దాల మీద పరిశోధనలు ప్రారంభించారట!
**** ******
అబద్దాలు ఎక్కువుగా ఆఫీసుల్లోనే దొర్లుతుంటాయి. లీవు శాంక్షన్ కోసం ప్రతిసారీ గ్రాండ్ మదర్ పోయింది అర్జెంట్ ఊరెళ్ళాలి అనే సాకే చెప్తుంటాం! నా దోస్తు నారాయణ యమాస్ట్రిక్టు, తెలివైన మేనేజర్ని అను కుంటాడు.ఎవరైనా గ్రాండ్ మదర్ పోయింది అనగానే వాళ్ళు ఎవరో కరెక్టు గా కనుక్కుని తెలుగులో నోట్ చేసి పెట్టుకుంటాడు. అయితే వాళ్ళ ఆఫీసులో పనిచేసే గుర్నాధం గురువుని ముంచిన శిష్యుడు! లీవు పెడుతూ గుర్నాధం పెద్దపెట్టున శోకాలు పెట్టి సార్ 10 రోజులు లీవు కావాలి.మా గ్రాండ్ మదర్ ఎక్స్ పైరెడ్ సార్! అంటే ఇంగ్లీషో ద్దు, గ్రాండ్ మదర్ అంటే నాయనమ్మా లేక అమ్మమ్మా క్లారిటీ, క్లారిటీ కావాలి!తెలుగు లో చెప్పు గుర్నాధం అని నారాయణ అడుగుతాడట ! నాయనమ్మే సార్ అంటూ ఇంకో విడత కన్నీళ్లు కార్చి మొత్తానికి లీవు శాంక్షన్ చేయించుకున్నాడు.మళ్ళీ ఆరునెలలయ్యాక మళ్ళీ ఏడుస్తూ వచ్చి సార్ మా గ్రాండ్ మదర్ బాల్చి తన్నేసింది సార్ అంటే గ్రాండ్ మదర్ అంటే నారాయణ అడిగేలోపలె అమ్మమ్మ సార్ అని ఆఫేసు ఎగిరిపోయేలా శోకాలు పెట్టాడట.సరేనని నారాయణ శాంక్షన్ చేసి చూడు గుర్నాధం మీ నానమ్మ అమ్మమ్మ ఇద్దరూ పుణ్య లోకాలకి వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ రారు నువ్వూ రాకు అని కూడా గుర్తుచేసాడట. ఐతే మళ్ళీ ఆరునెలలు అయ్యాక షరా మామూలుగానే గుర్నాధం గుండెలు బాదుకుంటూ ఏడిస్తే ఏంటి మళ్ళీ నానమ్మ పోయిందా వ్యంగ్యంగా అడిగాడట.అవును సార్!గుర్నాధం చెప్తే ‘చా! వూర్కొ వయ్యా చెప్పే అబద్దాలకి అంతు పొంతూ వుండాలి! నా రికార్డులో మీ నాయనమ్మా అమ్మమ్మ ఇద్దరూ బాల్చిలు తన్నేసారు. వాళ్ళు ఏ తేదీన పోయారో డేట్లు చెప్పనా రెట్టిస్తే సార్ పోయినసారి పోయింది నాన్నమ్మ అంటే మా ఆవిడా వాళ్ళ అమ్మమ్మ ఈసారి పోయింది మా నాన్న సొంత అమ్మ అన్నాట్ట. ఓర్ని ఈ రూటులో వచ్చావా అనుకుని తలగోక్కుని లీవు సాంక్షన్ చేసి నీకు ఇంకొక్క ఛాన్సే వుంది అన్నాట్ట! ఐతే గుర్నాధం ‘మా బామర్ది భార్య కి ఇద్దరు గ్రాండ్ మదర్లు ఆ లెక్కన నాకింకా బోలెడన్ని చాన్స్ లున్నాయి’ లోపలే నవ్వుకున్నాడట. గుర్నాధం నవ్వు చూసి నారాయణ పళ్ళు నూరుకున్నాడట! ‘అబద్దాలు’ ఈ లెవల్ లో తెలివి ప్రదర్శిస్తాయి!
**** ***** ****
ఎక్కువ అబద్దాలు చెప్పేది రాజకీయ నాయకులు అంటారు. అన్నిటికన్నా అందమైన అబద్ధాలు పాలిటిక్స్ లో వుంటాయి కానీ వాటికి మ్యానిఫెస్టో అనే పేరుంటుoది!అందులో- మమ్మల్ని గెలిపిస్తే పదవి లోకి వచ్చాక ఇదేళ్ళలో 10 లక్షల బాత్రూములు కట్టిస్తాం!పాతిక లక్షల మందికి ఆముదం రాసి తల దువ్వుతాం! కోటి మందిని దారిద్ర్య రేఖ దిగువనుండి పైకి లేపుతాం!ఇలా ఈ టైపు లో వుంటాయి! ఇవన్నీ చదివి కొండకచో చూసిన కొంతమంది వాళ్ళెవరో వస్తారు స్నానం చేయిస్తారు తల గొరిగి క్షవరం చేయిస్తారు గడ్డం గీకిస్తారు అనుకుని పెద్ద పెద్ద జుట్లు వేసుకుని బారెడు గడ్డం తో జిడ్దోడుతూ తిరుగుతుంటారు ఐతే అసలు విషయం ఏంటి అంటే మా కాలనీ సెక్రటరీ శంకరరావు చెప్తాడిలా -మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ అబద్దాలు కావు! అవునండి! రాజకీయ నాయకులెప్పుడూ అబద్దాలు ఆడరు! మనం వాళ్ళని తప్పు గా అర్ధం చేసుకుని నింద మోపుతాం అంతే!ఎట్లా అంటే తల గొరగడం అన్నా తిరుక్షవరం చేయించటం అన్నా ఆముదం రాయటమన్నా తెలుగు తెలిసిన ఎవరినైనా అడగండి -మోసం చేయ్యటమనే! ఇక తల జుట్టు తో బాటు గడ్డం బారెడు మీసాలు పెంచితే చక్కగా జనం ఎంతో ఖరీదు పలికే జుట్టు అమ్ముకొని డబ్బు చేసుకోవచ్చు! మన మంచి కోసమే అట్లా చెప్పారు అట్లాగే దారిద్ర్య రేఖ దగ్గరే నాయకులూ మీటింగ్ పెట్టి వీలైనంత మందిని పైకి లాగుదాం అని చూస్తే అసలు అక్కడ జనం కనిపిస్తేగా? జనం ఎప్పుడు చూసినా కల్లు సారాయి దుకాణాల క్యూ లో తప్ప ఎప్పుడైనా దారిద్ర్య రేఖ దగ్గర నిలబడ్డరా?ఇది సరిగ్గా అర్ధం చేసుకోక జనం నాయకుల మీద పడి ఏమీ చెయ్యట్లేదని ఏడుస్తారు!
**** ******
నేర పరిశోధనలో లై డిటెక్టర్ వాడతారు బానే వుంది కానీ అవి వాడేది నిజం చెప్పించడానికి, మరైతే దాని పేరు ట్రూత్ డిటెక్టర్ అని ఉండాలి కదా?!అంటే ఇక్కడే ఒక విషయం స్పష్టంగా అర్ధమవటం లేదూ-- ఇదెంత అబద్ధమో?! ఆ మధ్య కాలనీ ప్రొఫెసరు విశ్వంగారు కనిపిస్తే ఏంటి సార్ అద్దం మీద రిసెర్చ్ ఎంత వరకు వచ్చిందని అడిగితే స్పెషల్ అద్దం తయారీ కి ఎవడూ పెట్టుబడి పెట్టడానికి రెడీ గా లేరు అన్నారు. ఏంటి సార్ విషయం అంటే నేనొక కొత్త అద్దం తయారుచేసా!దాని ముందు మనిషిని నిలబెట్టి విషయం అడిగి ఒకవేళ అతను మనసులో నిజం అనుకుంటే అద్దం లో అతని ప్రతిబింబం కనిపిస్తుంది అబద్దం చెప్తే కనిపించదు అన్నాడు. మీరు భలేవాళ్ళు విశ్వం గారు! ఇప్పుడు ఉల్టా అద్దం తయారు చెయ్యండి! మనిషి మనసులో అబద్దం అనుకుంటే ప్రతిబింబం కనిపిoచేలా! అప్పుడు మీకు బోలేడంత మంది పెట్టిబడి పెట్టె వాళ్ళు వస్తారు చెప్తే నువ్వే భలేవాడివి బాసూ ఇప్పుడు మార్కెట్ లో దొరికే అద్దాలన్ని అవేకదా అన్నాడు నన్ను షాక్ కి గురి చేస్తూ!
*** ****
సాధారణ౦గా మగ ఆడ లో ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు అని ఒక సర్వే చేస్తే ఇద్దరూ సమయాను కూలంగా చేస్తారని తేలింది! మగవాడు ఐతే నేను చెప్పేది నిజం కాదు అంటాడట, ఆడవాళ్ళు ఐతే నేనెప్పుడూ అబద్దం చెప్పను అంటారట! తేడా అంతే! తాగిన వాడు అబద్దం చెప్పడని ప్రతీతి! మరలాంటప్పుడు తాగిన వాళ్ళని పట్టుకుని తాగేడో లేదో తెలుసుకోటానికి బ్రీథ్ అనాలిసిస్ టెస్టు చెయ్యటం ఎందుకో అర్ధం కాదు!హైడ్రా బ్యాడ్ లో ఆడవాళ్ళు ఎక్కువుగా తాగి యమా స్పీడు గా కార్లు నడుపుతారని ఫిర్యాదులు పెరిగాయి!దాంతో ఎక్కడికక్కడ పోలీసులు కారు నడిపే అమ్మణ్ణి ని ఆపి బ్రీథ్ అనాలిసిస్ టెస్టులనగానే వాళ్ళు తడి గొంతు తో పచ్చి బూతులు తిడుతున్నారు! అంచేత వాళ్ల చేత ‘అబద్ధం’ కక్కిoచటానికి కారు ఆపి ‘తాగిన వాళ్ళు ఎప్పుడూ అబద్దం చెప్పరు’ అంటే చాలు వాళ్ళే బుర్ర ఊపి నిజమే! మేము ఎప్పుడూ నిజమే చెప్తాం అంటారు!
***** ****
ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే జీవితంలో సుఖం దుఃఖం లాగే విచారం వినోదం, విమర్శ వితరణ అన్నీ ఉంటాయి.ఇవి బాగా అర్ధం కావాలంటే మాత్రం ప్రతి వాళ్ళకి అవసరం-అందమైన అద్దం!అలాగే ఇంకొరికి హాని కలుగుతోంది అన్నా లేక మనo నిజం చెప్పక పోవటం చేత మంచి జరుగుతుంది అనుకున్నా కావలిసింది కూడా అందమైన అబద్ధం! నేనయితే రోజూ అద్దం లో చూసుకోను అన్ని నిజాలే చెప్తాను అనే అబద్దం చొక్కా గుండీల మీద చెయ్యి వేసి చెప్తూ మీరూ అద్దం ముందు ఇటివల ఎప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నారో దాంతో బాటు రీసెంట్ గా అబద్దం ఎవరికి ఎందుకు చెప్పారో గుండెల మీద (దయచేసి గమనించండి గుండీల మీద కాదు) చెయ్యి వేసి చెప్పండి!