చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఇంత వయస్సొచ్చిన తరువాత, వయస్సులో ఉన్నట్టుండమంటే కష్టమే కదూ! ఏదో మరీ మంచం పట్టకుండా, మన పన్లు మనం చేసికుంటూంటే, మనకీ, మన చుట్టుపక్కలవాళ్ళకీ సుఖం. ఏవో చిన్నా చితుకూ వస్తూనే ఉంటాయి. అలాటప్పుడే చిరాకులూ పరాకులూనూ. ఏం చేస్తాం ఏదోలా కాలక్షేపం చేసేయాలి. మనకైతే ఏ కాలినొప్పో, రొంపో, లైట్ గా జ్వరమో వస్తే, దగ్గరలో ఉన్న ఏడాక్టరు దగ్గరకో వెళ్ళడమో, కాదూ కూడదనుకుంటే, ఏవో OTC మందులేసికోవడమే. పనైపోతుంది. కానీ మరీ అలవాటు చేసేసికుంటే, ప్రాణం మీదకొస్తుంది. అప్పుడెలాగూ హాస్పిటలుండనే ఉంది.

కానీ, ఇంట్లో అలవాటైపోయిన వస్తువులున్నాయే, అవి మాత్రం పడకేశాయా, అయిందే మన పని! అవి లేకపోతే రోజెళ్ళదూ, అలాగని వాటిని రిపేరీ షాప్ కి తీసికెళ్ళాలేమూ, ఎవడికో ఫోను చేసి, వాడికి ఖాళీ దొరికి, మన అదృష్టం బాగుండి పాడైన వస్తువు బాగు చేస్తే, మన జీవితం ధన్యమైపోయినట్టే! వచ్చిన గొడవేమిటంటే, ఏదో పగ పట్టిన వాళ్ళలాగ, ఇంట్లో ఉండే ప్రతీ ముఖ్యమైన వస్తువూ, ఒకేసారి Tool down strike చేసేస్తాయి. మన ఖర్మకాలి ఇంట్లో ప్రతీదీ ముఖ్యమైనదే, అలా తగలడ్డాయి మన జీవితాలు! ఏం చేస్తాం? ఏ వస్తువు లేకపోయినా, మన రొటీన్ దెబ్బతినేస్తుంది. ఇదీ అదీ అని లేదు ఇంట్లో కుక్కర్ దగ్గరనుంచి ఇంటావిడ ఫ్లోర్ తుడిచే మాప్ దాకా ప్రతీదీ ముఖ్యమే మరి.
ఇదివరకటి రోజుల్లో కుక్కర్ కి ఉండే safety valve ఏదో పాడైపోయినప్పుడు ఓసారి కొత్తది వేయిస్తే సరిపోయేది. ఇప్పుడలా కాదే, ఏదో technological improvement అని పేరు పెట్టి, దానికి పైన ఓ బుల్లి వాషర్ ఓటి పెట్టాడు. దానిల్లుబంగారం గానూ, అదేమో నిలబడదూ, పైగా కడిగేటప్పుడు ఎక్కడో జారిపోతుంది, ఈ వాషర్ లేకపోతే, ఆ సేఫ్టీ వాల్వు ఉపయోగం లేదూ. దానికేమో జారిపోడం అలవాటూ, మనకి వంటిల్లూ, స్టొవ్ కిందా, వాష్ బేసిన్ లోనూ వెదుక్కోడం అలవాటూ. మన రోజు బాగోపోతే, ఇంటావిడ ” ఏమండీ, ఆ వాషర్ ఎక్కడైనా చూశారా..” అంటుంది. చీకట్లో కనిపించి చావదూ. ఇంత హింస పగవాడిక్కూడా వద్దురా బాబూ అనిపిస్తుంది.

ఈ రోజుల్లో కొత్తగా ఏదైనా  electronic  వస్తువు  ఏ  Amazon  ద్వారానో తెప్పించడం వలన కొన్ని డిస్కౌంట్లు దొరుకుతున్నాయి, దానితో అందరూ  online shopping  వైపే మొగ్గుచూపుతున్నారు. అక్కడివరకూ బాగానే ఉంది, కానీ ఆ కొనుక్కున్న వస్తువు ఎలా ఉపయోగించాలో  తెలియాలి కదా, దానికోసం మనం ఉన్న ఊళ్ళోఉండే ఆ  Brand  వాడు దయతలచినప్పుడు, వచ్చి అదేదో  demo  చేసి చూపిస్తే పరవాలేదు, కానీ కొన్ని కంపెనీలవాళ్ళు, అవేవో  CD  లు ఇచ్చి, దాంట్లో చూసి తెలుసుకోమంటారు.

ఇంక  Smart Phones  వ్యవహారాలకొస్తే, అంతా అగమ్యగోచరమే.  అదీ కొన్నికంపెనీలవైతేమ్ షాపుకి వెళ్ళి అడిగితేనే కానీ తెలియవు.  హాయిగా ఊళ్ళో ఉండే,  Brand Outlet  కి వెళ్ళి కొనుక్కుంటే పుణ్యమూ పురుషార్ధమూనూ.. సందేహాలన్నీ ఓపిగ్గా చెప్తారు… తరవాత ఎప్పుడైనా సందేహాలున్నా తీర్చుకోవచ్చు.

ఈ రోజుల్లో వచ్చిన సదుపాయాలతో, మన బతుకులు వాటిమీదే ఆధారపడే పరిస్థితి. ఏ కారణం చేతైనా, అది పనిచేయడం మానేసిందో, అస్తవ్యస్తం అయిపోతోంది. అది వంటగదిలో ఉండే, మైక్రోవేవ్ , గాస్ స్టవ్, మిక్సీ అయినా సరే, హాల్లో ఉండే టీవీ అయినాసరే, కాకపోతే బెడ్ రూమ్ములో ఉండే ఏసీ అయినాసరే.  చేతిలో 24 గంటలూ ఉండే  Smart Phone  అయినాసరే.  అందుకేకాబోలు ఈ రోజుల్లో, అన్నిటినీ  టోకుగా రిపేరీ చేసే ( అదీ ఇంటికొచ్చి మరీ ) ఏజన్సీలు పుట్టగొడుగుల్లా ప్రారంభం అయ్యాయి. అవేవో  Single Window  ల్లాగ.
ఇవే కాకుండా,  Carpenters, electricians, plumbers  కూడా ఒకే చోట దొరుకుతున్నారు. మరీ ఇదివరకటిరోజుల్లోలాగ కాకుండా, కాలు బయటపెట్టాల్సిన అవసరం లేకుండా పనులు అవుతున్నాయి

కానీ ఈ సదుపాయాలన్నిటితోనూ, మనుషుల్లో బధ్ధకంకూడా అదే నిష్పత్తిలో పెరిగిపోతోంది.. ఉండాల్సిన వ్యాయామం లేకపోవడంతో, రోగాలూ రొచ్చులూనూ.. బహుశా అన్ని రోగాలకీ వైద్యాలకీ సదుపాయంగా ఉంటుందనేమో Multi Speciality Hospitals  ఏమో….

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు