నా దేశ సంపద
కాలనీలకు డ్రైనేజీలు ఏర్పాటు చెయ్యాలనో, రోడ్ డివైడర్ల కోసమో ప్రభుత్వం.కంకర, ఇసుక, పైపులు ఇత్యాదివి ఇళ్ల మధ్యలోనో, రోడ్ల పక్కనో ఉంచుతుంది. ప్రభుత్వం చేపట్టే పనులు తాము పన్నులుగా కట్టించిన డబ్బుతోనే అని, తమ సౌలభ్యం కోసమే అని తెలుసుకోక, వాటిని దొంగచాటుగా తమ ఇళ్లకు తరళించుకుపోతుంటారు. ఊరనే ఇంటికి ప్రభుత్వం పెద్ద. మన బాగు కోసం ఎన్నో కట్టడాలు చేపడుతుంది, ఇలా ఎవరికి దొరికింది వారు పట్టుకుపోతే ఎలా? సరైన సామాగ్రీ లేక కాంట్రాక్టర్లు పనులు నాసిరకంగా చేస్తే నష్టం ఎవరికి. ఒక్కోపని శాంక్షన్ అవడానికి ముందు ఎన్ని రిక్వెజిషన్స్ వెళతాయో, ఎంత హోంవర్క్ జరుగుతుందో వాళ్లకసలు తెలుస్తుందా?
ఇదే ఏ ప్రైవేటు సంస్థకు చెందినదైతే ఇలా చేతివాటం ప్రదర్శిస్తారా?
‘ప్రభుత్వం అంటే మనమే’ అన్న భావన మనలో కలగనంత వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయి.
ఆ స్పృహ కలగనంత వరకు “ఈ బస్సు మీది దీనిని పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మీదే’ అని చిలక్కి చెప్పినట్టు చెప్పాలి. ఇళ్లలో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగేప్పుడు తీగలపై నుంచి దొంగ కరెంటు తీసుకోకుండా ఓ కన్నేసి ఉంచాలి.
మన ఇంటికి మనమే ఎసరు పెట్టుకోవడమేంటో నాకు అర్థం కాదు.
ఇహ ప్రభుత్వ పార్కులు, రైళ్లూ, బస్సులు, స్టేషన్లు. ప్రభుత్వ కార్యాలయాల విషయానికి వస్తే ఉమ్ముల మరకలతో, చెత్తతో అసహ్యంగా ఉంటాయి. మెట్రో రైళ్లలాంటివి కొత్తగా పరిచయం చేసినప్పుడు వాటి అందం కొంతకాలమే. ఆ తర్వాత సీట్లు చిరిగిపోయి, విరిగిపోయి, పేరుకుపోయిన చెత్తతో ఇహ ఇలా చెప్పుకుంటూ పోతే అంతుండదు. మన నిర్లక్ష్య వైఖరి, నైజం ఇలా ఉంటే, ప్రధాని చంటి పిల్లలకు చెప్పినట్టుగా ఎన్నిసార్లు చెప్పినా స్వచ్ఛ్ భారత్ ఎలా సాధ్యమవుతుంది?
ఓటేసి నాయకుణ్ని ఎన్నుకుని ఐదేళ్లూ తిట్టడమూ లేదా మెచ్చుకోవడమూ చేస్తే సరిపోదు. సమాజం పట్ల మనకూ బాధ్యత ఉంది.
మనముండే వీధి నుంచి దేశం దాకా అంతటినీ జాగ్రత్తగా చూసుకోవాలి.
అప్పుడు నా దేశం అని గర్వంగా చెప్పుకోవాలనిపించేంత ముచ్చటేస్తుంది. మనదేశాన్ని సందర్శించే విదేశీయులకి మన కల్చర్ గొప్పగా అనిపిస్తుంది. రోడ్డు పక్కన ఉచ్ఛ పోసే వాళ్ల గురించి వాళ్లు మాత్రం తమ దేశంలో గొప్పగా ఎలా చెప్పగలరు?
బయటి దేశాల గురించి మనం పొంగిపోతూ చెప్పుకోవడం కాదు. మన దేశం గురించి అక్కడా అలాగే చెప్పుకోవాలి. అలా జరగాలంటే మనకున్న కక్కూర్తిని పాతరేయాలి. దొంగ బుద్ధులను తుదముట్టించాలి.
నా దేశ సంపదకు నేనే రక్షకుణ్ని అన్నట్టుగా వ్యవహరించాలి.
మనదేశం ఆధ్యాత్మికతకు, చక్కని సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. పై పై మెరుగులు కాకుండా మన దేశానికి గట్టి పునాది ఉంది. దాని వారసులుగా చక్కని నైతిక విలువలు ప్రదర్శించాల్సిన అవసరం మనపై ఉంది. అదే మనం ఈ దేశం పౌరులమని చెప్పుకునే హక్కును పరిపూర్ణంగా ఇస్తుంది.
***