ఉదయం లేచి టీవీ ఆన్ చేసి చూస్తే, మొదటగా వినబడే న్యూస్.. ఆరేళ్ల చిన్నారిపై అరవయ్యేళ్ల వృద్ధుడి లైంగిక దాడి, కాఫీ తాగుతూ పేపర్ ఓపెన్ చేస్తే, మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. ఇవీ వరుస న్యూస్. వినలేకపోతున్నామని టీవీ ఆఫ్ చేస్తాం. పేపర్ మూసేస్తాం.. కానీ, జరిగే అకృత్యాల్ని మాత్రం ఆపలేం. అభం శుభం తెలియని చిన్నారులపై దాడులు ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి. అత్యంత జుగుప్సాకరమైన విషయమేంటంటే, అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఈ లైంగిక దాడుల బాధితులవుతున్నారు. ఒకప్పుడు అమ్మాయిల హాస్టల్స్, అబ్బాయిల హాస్టల్స్ అని వేరు వేరుగా ఉండేవి. అమ్మాయి, అమ్మాయిల హాస్టల్స్‌లో ఉంటే, అబ్బాయి, అబ్బాయిల హాస్ట్‌ల్స్‌లో ఉంటే హమ్మయ్యా.. సేఫ్ అనుకునేవాళ్లం. కానీ మారిన పరిస్థితుల రీత్యా అక్కడే అసలు సమస్య దాగుంది. అబ్బాయిలు, అబ్బాయిలతోనూ బాధించబడుతున్నారు. అమ్మాయిలు అమ్మాయిలతోనూ బాధించబడుతున్నారు. లైంగికంగా. ఇదేం కర్మరా బాబూ.. అనుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.
అసలీ వైపరీత్యానికి కారణం ఏంటీ.? విపరీతమైన లైంగిక వాంఛ. ఈ విపరీతమే ఈ అకృత్యాలకు కారణంగా ప్రతీ కేసులోనూ నిర్ధారితమవుతోంది. లైంగిక వాంఛ అనేది సర్వసాధారణమైన విషయం. కానీ, ఈ విపరీతమైన లైంగిక వాంఛ ఉంది చూడండీ.. అది పశుత్వం, పైశాచిక ఆనందం. ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదగ్గవి కావు. అయితే, ఏదైనా ఘటన జరిగితే, జరిగిన ఓ రెండు, మూడు రోజులు ఆ ఘటనపై విపరీతమైన పబ్లిసిటీని క్యాష్ చేసుకుంటున్నారే తప్ప, నిందితుడికి తగిన శిక్ష పడడం లేదు. బాధితుడికి సరైన న్యాయం జరగడం లేదు. అసలంటూ నేరం తాలూకు మూలాల్ని వెతక్కుండా, సమస్యను పరిష్కరించాలనుకోవడం కూడా హాస్యాస్పదమే అవుతుంది.
అయితే, ఈ నేరానికి మూలం ఎక్కుడుంది.? అంటే, విచ్చలవిడిగా పెరిగిపోయిన స్మార్ట్ ఫోన్ వినియోగం. స్మార్ట్‌ఫోన్‌ల పుణ్యమా అని బూతు వీడియోలు వందలు, వేలు, లక్షలు, కోట్ల సంఖ్యలో ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. చదువుకున్నోడికీ, చదువు లేనోడికీ, చిన్నపిల్లలకూ, ముసలివారికీ అనే తేడా లేకుండా ఈ వీడియోలు సులభతరంగా అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడే సమస్య మొదలవుతోంది. వీడియోల్లో చూసిన వారు లైవ్ అనుభూతిని పొందాలనే కాంక్షతో చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. నోరు లేని అభం శుభం తెలీని అమాయకుల్ని అభాగ్యుల్ని ఈ చర్యలో బాధితుల్ని చేస్తున్నారు. ఈ సంబంధిత ఘటనల్లో పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా ఘటనలు చీకట్లోనే మగ్గిపోతున్నాయి. మరి ఈ దుశ్చర్యకు అడ్డుకట్ట వేసేవారే లేరా.? దేవుళ్లు, దేవతలు తిరుగాడే యుగం కాదాయే ఇది. ఈ కరడు కట్టిన లైంగిక నేరగాళ్లను శిక్షించేందుకు ఏ కృష్ణుడో, రాముడో రావడానికి. ఇది కలియుగమాయే. కలియుగంలో దేవుళ్లు, దేవతల రాకను ఎక్స్‌పెక్ట్ చేయగలమా.? రాక్షసులే రాజ్యమేలుతున్న యుగమిది. అయినా కానీ, యంగ్ తరంగ్ ఈ దుశ్చర్యను అడ్డుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తోంది.
స్కూల్ స్టేజ్ నుండే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తోంది. నేటి యువతరం ఈ తరహా అకృత్యాల్ని తీవ్రంగా ఖండిస్తూ, యువతలో చైతన్యం నింపేందుకు పలు అవేర్‌నెస్ కార్యక్రమాలు చేపడుతోంది. కానీ, ఈ తరంలో ఏ కొద్ది మంది యువతో తలచుకున్నంత మాత్రాన తీరే సమస్య కాదిది. ప్రభుత్వాలు కూడా తాము చేయాల్సిన పనిని సక్రమంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఇంటర్నెట్‌పై ఖచ్చితమైన నియంత్రణ ఉండాల్సిందే. పర్టిక్యులర్ పనులకు మాత్రమే ఇంటర్నెట్‌ని వినియోగించేలా చట్టాలు తీసుకురావాలి. ఉన్న చట్టాల్ని మరింత కట్టుదిట్టం చేయాలి. ప్రభుత్వ వర్గాల్లో ఈ ఆలోచన తలెత్తితేనే యువత చేపట్టిన ఈ అవగాహానా కార్యక్రమాలకు కొద్దో గొప్పో విలువుంటుంది.