(అలెప్పి )
సాధారణంగా మనం ఆ ప్రదేశం యొక్క గొప్పతనం తెలుసుకొని ఆ ప్రదేశం సందర్శించాలని అనుకొని ముందుగా ప్రణాళిక వేసుకొని వెళతాం కాని మాకు చాలా సార్లు విహారయాత్రకని వెళ్లి స్థానికులను యేదైనా ప్రత్యేకత వున్న ప్రదేశం గురించి వాకబు చేస్తే తెలిసిన పురాతనమైన మందిరాలను సందర్శించే అవకాశం దొరికింది . అలాంటిదే యీ ‘ మన్నారుశాల నాగరాజు మందిరం ‘ .
అలెప్పి లో బాక్ వాటర్సమీద రెండురోజులు గడిపిన తరువాత బోరుకొట్టి యింకేమైనా దర్శనీయ స్థలాలు వున్నాయై ? అని వాకబు చేస్తే తెలిసింది మన్నారుశాల నాగరాజు మందిరం గురించి , వెంటనే టాక్సీ బుక్ చేసుకొని మన్నారు శాల బయలుదేరేం . కేరళలోని పల్లెలను దాటుతూ సాగింది ప్రయాణం , అకుపచ్చగా వున్న పంటపొలాలు , ఆకుపచ్చని పచ్చి మిరియపు గెలలు , ఆకుపచ్చని మొగ్గలతో నిండిన లవంగచెట్లు , పెద్దపెద్ద మందారపు చెట్లు నిండా యెర్రమందారాలతో కనువిందుచేస్తూ ప్రయాణం అహ్లాదకరంగా సాగింది .
ప్రతీ మందిరం లోను మనకి నాగ ప్రతిష్టలు కనబడుతూ వుంటాయిగాని ప్రత్యేకంగా నాగులకి మాత్రమే కోవెలలు వుండడం చాలా అరుదనే చెప్పుకోవాలి , అలాంటి అరుదయిన కోవెల చేరుకున్నాం .
కేరళరాష్ట్రంలోని కొచ్చిన్ కి సుమారు 115 కిలోమీటర్లదూరంలో , బేక్ వాటర్స మీద బోట్ హౌసులకి ప్రసిధ్ద చెందిన అలెప్పీ కి సుమారు 40 కిలో మీటర్ల దూరం లో వున్న ' హరిపాద ' రైల్వే స్టేషనుకి , బస్సాండుకి మూడు కిలో మీటర్ల దూరంలో వుంది యీ నాగరాజ మందిరం , ఈ మందిరం వున్న ప్రాంతాన్ని మన్నారుశాల అంటారు . బేక్ వాటర్స్ మీద బోట్ హౌస్ లో గడపడానికి వెళ్లిన మేము స్థానికులని చూడదగ్గ ప్రదేశాల గురించి వాకబు చేస్తే యీ మందిరం గురించి చెప్పేరు .
మరునాడు ప్రొద్దున్నే టాక్సీ తీసుకొని బయలు దేరేం . నాగరాజ మందిరం వున్న ప్రాంతాన్ని ' మన్నారు శాల ' అని ' అప్పోప్పన్ కావు ' అని అంటారు . కొబ్బరి తోటల మధ్యనుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించేక మన్నారుశాల చేరేం . కేరళ స్టైల్ లో కట్టబడ్డ పురాతనమైన మందిరం . చాలా భాగం చెక్కతో నిర్మింప బడింది . మందిర ప్రాంగణం లో ముప్పై వేలకు పైబడి నాగప్రతిష్టలు వున్నాయి . చిన్న పిల్లలను చక్కగా అలంకరించి తీసుకు వచ్చేరు . లోపల అయిదు తలల నాగేంద్రుడు పూజలందుకుంటున్నాడు . పెద్ద వసరా నిండుగా భక్తులు సమర్పించిన అరటిగెలల , కొబ్బరికాయలు , బెల్లం , వుప్పు , మిరియాలు గుట్టలుగా పోసి వున్నాయి , మరో పక్క తులాభారం వుంది ఇందులో పిల్లలను తూచి పసుపు వగైరాలతో నాగేంద్రుని కి మొక్కులు తీరుస్తున్నారు . ప్రసాదంగా పసుపు యిస్తున్నారు .
ఇక్కడ పిల్లలు లేని వారు వచ్చి మొక్కుకొని వెళ్లి సంతతి కలుగగానే వచ్చి మొక్కులు తీర్చుకుంటారని తెలిసింది . అక్కడకి వచ్చిన చాలా మంది భక్తులందరూ చంకలో పిల్లతోనో , కవలపిల్లలని తీసుకొనో రావడం చూస్తే నాగరాజు మందిరం యీ చుట్టుపక్కల యెంత పేరు పొందిందో అర్దమౌతుంది .
ఈ కోవెలలో నిజం పాములు కూడా తిరుగుతూ వుంటాయట , కాని యెవరికీ హాని చెయ్యవట .ఈ మందిరం గురించిన స్థలపురాణం చెప్తాను వినండి . ఇక్కడ స్థలపురాణం పరశురాముడితో ముడిపడి వుంది . పరశురాముడు చేసిన క్షత్రియసంహారం వల్ల అంటిన పాపం , అతనికి మాత్రమే సొంతమైన భూమిని బ్రాహ్మణులకు దానమిస్తే పరిహారమౌతుందని తెలుసుకొని తన ఆయుధమైన పరశు ని సముద్రం లోకి విసిరి వేయగా సముద్రం వెనుకకు నెట్టబడి బయటపడిన నేలను బ్రాహ్మణులకు దానమిస్తాడు . సముద్రం నుంచి బయటపడ్డ నేల కావడం వల్ల ఆ భూమి పంటలకు యోగ్యం కాకపోవడం , ఆ ప్రాంతం లో వున్న విషనాగుల భయం వల్ల బ్రాహ్మణులు వలసపోతూ వుండగా చింతాక్రాంతుడైన పరశురాముడు శివుని కొరకై తపస్సు చేసి అతనిని ప్రశన్నుని చేసికొని అతని సలహాప్రకారం నాగరాజుకొరకై తపస్సు చేసి నాగరాజును ప్రత్యక్షం చేసుకుంటాడు . వెయ్యి తలలతో , యవ్వనకాంతులీనుతున్న శరీరంతో , పద్మాలను పాదాలుగాకలిగియున్న నాగరాజు ప్రత్యక్షమై పరశురాముని కోరిక మేరకు అన్ని విషసర్పాలను పిలచి వారి విషంతోఆనేలను ప్రక్షాళన చేసి నేలను సశ్యశ్యామలంగా మారుస్తాడు .
పరశురాముడు బ్రహ్మ స్వరూపమైన నాగారాజుని , విష్ణుస్వరూపమైన అనంతుని , శివ రూపమైన వాసుకిని , సర్పయక్షి , నాగయక్షి , నాగఛాముండిలను యివే కాక అనేక నాగ దేవతలను వారివారి స్థానాలలో ప్రతిష్టించి సామవేద గానంతో నిత్యం అభిషేకం , అలంకారం , నైవేద్య సమర్పణం , నీరాజనం , సర్పబలి మొదలయిన అనేక ఉపచారాలతో పూజలు నిర్వహించి , దుర్గ మొదలయిన విగ్రహాలను ప్రతిష్టించి పూజకొరకై బ్రాహ్మణులను నియమించి పూజా విధులనాలను వారికి తెలియజేసి మహేంద్రగిరికి అవతారం చాలించడానికి వెళ్లిపోతాడు పరశురాముడు .
భూమి సస్యశ్యామలంగా మారిన తరువాత యీ ప్రాంతమంతా మందార చెట్లతో నిండిపోగా అందరూ యీ ప్రాంతాన్ని మందారశాల అనిపిలువ సాగేరు .
కాలగర్భంలో కొన్ని వేలసంవత్సరాలు కలిసిపోయి , కలియుగ ప్రవేశం జరిగిన తరువాత యీ మందిరంలో వాసుదేవ , శ్రీదేవి అనే పుణ్యదంపతులు పిల్లలు లేక యీమందిరంలో నాగరాజును సేవించుకుంటూ వుండగా ఒకనాడు అగ్ని రాజుకొని యీ ప్రాంతాన్ని దహించవేయసాగింది . ఆ అగ్ని ప్రభావాన యెన్నో పాములు కాలిపోతూ వుంటే వాసుదేవ దంపతులు అగ్నిని చల్లార్చి , సగం కాలిన పాములకు యెన్నో వుపచారాలుచేసి వాటిని బ్రతికించి , మరణించిన నాగులకు దహనసంస్కారాలు చేస్తారు . వారి సేవలకు సంతోషించిన నాగరాజు వారి కడుపున పుడతానని వరమిస్తాడు .కొంతకాలానికి నెలతప్పిన శ్రీదేవి , ఒక మగపిల్లవానికి , ఓ అయిదు తలల సర్పానికి జన్మనిస్తుంది . అయిదు తలల సర్పం తాను ఆ మందిరంలో సమాధిపొంది ఆచంద్రార్కం ప్రజలను కాపాడతానని మాటయిచ్చి గర్భ గుడిలో నుంచి పాతాళానికి వెళుతూ మాయమైపోతుంది . ఇప్పటికీ గర్భగుడిలో కిందన నాగరాజు తపస్సు చేసుకుంటూవున్నాడనే నమ్ముతారు భక్తులు , అతని తపస్సుకు భంగం కలగకుండా చాలా నిశ్శబ్దంగాదర్శనం చేసుకోమని చెప్తారు
వాసుదేవవంశస్థులు యీ మందిరాన్ని అప్పొప్పన్ కావు అంటే ముత్తాతగారి తోట అనే యిప్పటికీ పిలుస్తారు .
అయితే యిక్కడ మొక్కులుకూడా చాలా వింతగా అనిపించేయి , సంతతి కావాలనుకొనే వారు వెండితో గాని యిత్తడితో గాని చేసిన గోకర్ణం కానుకగా సమర్పిస్తారు , విష కీటకాల నుండి రక్షణగా పసుపును , అన్ని కోరికలు నెరవేరేందుకు కదళీ ఫలాలలను , రుగ్మతలనుండి రక్షణకు ఉప్పు మిరియాలు కానుకగా యిస్తారు .
అలాగే నాగరాజుకి పంచామృత అభిషేకం చేయించుకుంటే సర్వాపదలూ తొలగి సర్వసంపత్తులూ కలుగుతాయట .
యీ మందిరానికి దర్శనానికి వచ్చిన వారు నాగరాజుకు పూజచేసిన పసుపు ప్రసాదంగా యిళ్లకు తీసుకు వెళతారు , యీ ప్రసాదం యింట్లో వుంటే యింట్లోవారు యెటువంటి విష ప్రభావానికి లోను కారని స్థానికుల నమ్మకం . ఇదండీ నాగరాజమందిరం గురించిన వివరాలు . వచ్చేవారం కేరళాలోని గురువాయూరు కృష్టమందిరం గురించి తెలుసుకుందాం .
అంతవరకు శలవు .