చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

పూర్వపు రోజుల్లో, సంఘంలోని పెద్దమనుషుల గురించీ, దేశనాయకుల గురించీ, సినిమా స్టార్లగురించీ, రాజకీయనాయకుల గురించీ, వారు చేసిన పనులమూలానో, లేదా అప్పుడప్పుడు పత్రికల్లో వచ్చిన వార్తల మూలానో, ఓ అభిప్రాయం ఏర్పరుచుకునేవాళ్ళం. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా కలిసామా ఏమిటీ ?  రమారమి 21 వ శతాబ్దం వచ్చేవరకూ అదే రంధి. చదివినదాన్నిబట్టి వారంటే ఓ ఆరాధనా భావమో, అసహ్యమో ఏర్పడుండేది. ఆరోజుల్లో, పైన చెప్పినప్రముఖులకి అంతగా పబ్లిసిటీ కూడా ఉండేది కాదు. వార్తాపత్రికల్లో వారి గురించి సాధారణంగా మంచి విషయాలే రాసేవారు… పత్రికలు కూడా ఓ రకమైన  ethics  పాటించేవారు. బహుశా అదో కారణమయుండొచ్చు, సదభిప్రాయానికి. అవేవో  Tabloids  అని ఉండేవి. వాటిలో ఒక్కోప్పుడు, కొన్ని  Gossips  రాసేవారు, కానీ అంత ప్రచారం ఉండేది కాదు..  అలాటి  Tabloids  బహిరంగంగా కొని చదవాలన్నా, సందేహించేవారు, ఇళ్ళల్లో పెద్దవారూ, స్కూళ్ళలో ఉపాధ్యాయులూ చెప్పడంవలన అయుండొచ్చు. ఏదో మొత్తానికి, ఎవరూ బయటపడాల్సిన అవసరం ఉండేది కాదు.

రోజులన్నీ ఒకేలా ఉండవుగా..  కాలంతోపాటు ప్రచారసాధనాలూ, మాధ్యమాలూ కూడా అభివృధ్ధి చెందాయి… దానికి సాయం, వీటిలో.. పైన చెప్పినవారి ప్రతీ అడుగూ ధ్యానంగా గమనించడానికి, ప్రత్యేక విలేఖర్లు వచ్చేసారు. వీళ్ళపని.. ఆ ప్రముఖుల ఆనుపానులు గమనించడమే పని. మళ్ళీ ఇందులోకూడా ఓ చిత్రం ఉంది. ఏ పెద్దమనిషికో, ఇలాటి విలేఖరితో పరిచయం ఉందనుకోండి, అతన్ని పిలిచి విందులాటిదిచ్చి, బహుమతులతో సత్కారాలు చేసి, యాదాలాపంగా అన్నట్టు, ఏదో ఓ సమాచారం చెవినేయడం--- మర్నాడు పొద్దుటే, వార్తాపత్రికల్లో పతాక శీర్షికలతో ఓ పేద్ద sensational వార్త. ఎవరికి వారే.. “ అలాగా … “ అని ముక్కుమీద వేలేసుకోవడం. సాధారణంగా అలాటి వార్తల్లో పెద్దగా నిజం ఉండదూ, కానీ పనిజరిగిపోతుంది. అసలు ఆ పెద్దమనిషి అన్ని తిప్పలు పడిందీ ఇందుకోసమేగా…  purpose served.
 ఈరోజుల్లో టీవీ ల్లో ఎక్కడచూసినా వార్తా చానళ్ళే. ఒక్కో చానెల్ కి ఒక్కో రాజకీయ పార్టీ అంటే అభిమానం.. దీనికి పెద్ద ప్రత్యేకకారణమేమీ ఉండక్కర్లేదు..ఆ చానెల్ యాజమాన్యానికీ, ఎడిటర్ కీ , ఆ పార్టీనుంది తాయిలాలు ముట్టినట్టే. ఏ పార్టీవాడు ఎక్కువ తాయిలాలిస్తే ఆ పార్టీ  mouth piece  గా ఉండడం. సాధారణంగా అదికార పార్టీనే సమర్ధిస్తూంటారు వీళ్ళు. లేకపోతే  వ్యాపారప్రకటనలు ఎండిపోతాయిగా.. అసలే ఆ చానెళ్ళ మనుగడంతా ఈ ప్రకటనల ధర్మమే కూడానూ.. బహుసా అందుకేనేమో, ఒకేవార్త, వివిధ చానెళ్ళలోనూ ఒక్కో రకంగా చూపిస్తారు.

ఇవన్నీ టీవీల్లో వచ్చే చానెళ్ళు. ఇవి కాకుండా, కొన్నేళ్ళుగా, అంతర్జాలంలో ఉండే  Youtube  చాలా ప్రసిధ్ధిలోకి వచ్చేసింది.  ఏదైనా వార్త దీంట్లో  upload  చేస్తే, మరీ లక్షల్లో కాకపోయినా, వేలల్లో ఎంతోమంది చూస్తారు. పైగా దీనికోసం ప్రత్యేకంగా, సమయం వ్యర్ధం చేయాల్సిన అవసరం లేకుండా, హాయిగా మనచేతుల్లో 24 గంటలూ ఉండే  Smart phone  లో. ఈ మధ్యన ఈ చానెళ్ళలో, అన్నీ sensational  వార్తలే.. ఇన్నాళ్ళూ ఏదో అభిమానం పెంచుకున్న ఓ వ్యక్తి గురించి, ఎన్నో రకాల వార్తలు, అవికూడా, వారి పూర్వాశ్రమ జీవితం గురించి మరీనూ..ఎవరో ఒకరితో ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళు చెప్పినవి శిలాక్షరాలుగా భావించి, జనాలమీదకి వదలడమూనూ.. ఆ ఇంటర్వ్యూ చేయబడినవాడు చెప్పిన విషయాల్లో నిజానిజాలు చెప్పడానికి కానీ, అభ్యంతరాలు వ్యక్తపరచడానికి కానీ, అసలు వ్యక్తి బతికుంటేనే కదా. వీటన్నిటినీ  verify  చేయడానికి కూడా కుదరదు. ఇష్టం ఉంటే వినడం/ చూడ్డం, అంతా తెలుసున్నట్టు నలుగురితో చెప్పడం.
ఈ ఇంటర్వ్యూలలో ఎవరినీ వదలరు.. ఎప్పుడో చరిత్రలో కలిసిపోయినవారి గురించి, అవాకులూ చవాకులూ పేలి, వీళ్ళు సాధించేదేమిటిట? సదభిప్రాయం మారడం తప్ప.

ఇవి కాకుండా, కొంతకాలంగా అంతర్జాలం లో  Amazon Prime,  Netflix  లాటివి మొదలయ్యాయి. థియేటర్లలో చూపించే వాటికి, సెన్సారు లాటిదుంటుంది కానీ, వీటికి అలాటివేమీ ఉండవు, భాషకి కానీ దృశ్యాలకి కానీ..  ప్రభుత్వాలు మాత్రం వీటిని పట్టించుకోరు… ఇలాటప్పుడు యువత తప్పుదారి పడిపోతోందో అని గొడవెందుకో ?

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు