దీపావళి సమయం - విఎస్ఎన్ మూర్తి

deepaavali time

హిందువులకు దేవుళ్లు ఎక్కువ.. పండగులూ ఎక్కువే అని ఎకసెక్కం చేసేవారు చాలా మందే వుంటారు. దేవుళ్ల సంగతి పక్కన పెడితే, ప్రతి పండుగ వెనకు ఓ పరమార్థం దాగి వుంది. ఏనాడో మహానుభావులు, ఎంతదూరమో ఆలోచించి వాటిని ఏర్పాటు చేసిన తీరును చూస్తే ముచ్చటేస్తుంది. సుదూరమైన వారి ఆలోచన చూస్తే అమోఘమనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ. భూత దయ, కాల మాన పరిస్థితులు, సామాజిక జీవనం ఇన్ని విషయాలను దృష్టిలో వుంచుకుని రూపొందించిన పండులను ఖచ్చితంగా జరుపుకోవాలన్న ఆనందం ఏర్పడుతుంది వాటి వైనాలు తెలుసుకుంటే. మనకు అంటే మన తెలుగువారికి సంబంధించినంత వరకు పండుగలన్నీ ఎక్కవగా దక్షిణాయానంలో వస్తాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, వర్షాలు ప్రారంభమైన నాటి నుంచి చెట్లు చేమలు చిగిర్చే వసంత రుతువు వరకు. అంటే, మనిషి, మనసు ఆహ్లాదంగా వుండే సమయాలన్నమాట. ఎండ చికాకు పెట్టే చిరాకు వేళ కాదు. ఆ వేళ వచ్చేవి కూడా వున్నాయి కానీ తక్కువ.

బొజ్జగణపతితో మన పండగుల హడావుడి ప్రారంభమవుతుంది. మట్టి గణపతిని చేసి పూజించడంతో మొదలవుతుంది. పత్రి పూజ. వాటి వ్యవహారం ఓషిథి విలువలు జనాలకు అనేకసార్లు చెప్పేసినవే. కానీ మట్టివిగ్రహాలు పూడికతీత కోసమే అన్నది కొంతమందికే తెలిసి వుంటుంది.  ఊరి మంచి నీటి చెరువులు సామూహికంగా బాగు చేయడం కోసం, వర్షాల ముందు పూడిక తీయడం కోసం, మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించారన్నది వాస్తవం. పైగా వర్షాల ముందు పాత ఆకులు దూచేస్తే, కొత్త చిగుళ్లు వచ్చి, చెట్లు బలంగా తయారవుతాయి. ఇలా అమ్మవారి కొడుకు పండగ అవ్వగానే, తల్లి లక్ష్మీదేవి కొలువు మొదలవుతుంది శ్రావణ మాసంలో, ఆపై అమ్మలగన్నయమ్మలు దుర్గమ్మ, సరస్వతమ్మ పూజలు ఆశ్వీయుజంలో. మళ్లీ దీపావళి. ఆపై అయ్యవారు .. జంగందేవర వ్యవహారం కార్తీకంలో, పెద్దయ్యవారు, పెరుమాళ్లు, విష్ణుమూర్తుల వారి పూజులు ధనుర్మాసంలో. ఆపై అసలు సిసలైన పెద్ద(ల)పండుగ.

సరే, ఈ లైన్ ఆప్ ఆర్డర్ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు, ఈ నెలలో మన ముందుకు వస్తున్నది దీపావళి. చిన్న పెద్ద, అందరికీ మహా ఆనందాన్నిచ్చే పండుగ. దీనితో పాటు ప్రారంభమయ్యేది కార్తీకం. కార్తీకం ప్రారంభంలో నాగుల చవితి. ఆపై సోమవారాల ఉపవాసాలు.. చన్నీళ్ల స్నానాలు.. ఎందుకివన్నీ.. వీటి వెనుక వైనమేమిటి.. ఆ సంగతి ఇప్పుడు చూద్దాం.

దీపావళి ఎలాంటి సమయంలో వస్తుంది? వర్షాలు పడి, పంట చేలన్నీ ఎదుగుతున్నవేళ వస్తుంది. వాగులు, కుంటలు, చెరువులు అన్నీ నిండుగా వున్నవేళ వస్తుంది. చిన్న చిన్న పురుగులు పుట్టుకొచ్చేవేళ వస్తుందీ పండుగ. వీటి వల్ల పంటలకు కూడా చీడపీడలు. అందుకే దీపావళి బాణాసంచా. గంధకం కాల్చడం ద్వారా వచ్చే పొగ చాలా మంచి క్రిమి సంహారిణి. మతాబులు, చిచ్చుబుడ్లు అందుకోసమే. రాను రాను మరిన్ని రకాలు, వ్యవహారాలు పుట్టుకొచ్చాయి తప్ప, అసలు ప్రధానమైనవి ఇవే. ఇంటి చుట్టూ మతాబులు కాల్చడం మంచింది.

ఇక దీపావళికి నాలుగో రోజు నాగుల చవితి వస్తుంది. పాముల పండుగ. మానవుడి భూతదయకు నికార్సయిన ఉదాహరణ. అనగానే మనవాళ్లు.. ఆ పాములు పాలు తాగుతాయా.. చిమ్మిలి, గుడ్లు తింటాయా అని అడగడం కామన్. నిజంగా అది నిజం కూడా. ఇవన్నీ పాముల కోసం కానే కాదు. అవును, నిజమే ఈ దినుసులు వేసేది పాముల కోసం కాదు. అసలు పాముల వ్యవహార శైలి చిత్రంగా వుంటుంది. వర్షాకాలం అవి తెగ వేటాడేసి, శీతాకాలం వచ్చేసరికి భూమి పొరల్లో వెచ్చగా పడుకుంటాయి. ఎక్కడో ఒకటి అర తప్ప శీతాకాలంలో భూమిపై పాములు పెద్దగా కనిపించవు. సుమారు ఈ యోగనిద్ర అన్నది మూడు నుంచి ఆరు నెలలు వుంటుంది. మరి అలాంటపుడు పాపం వాటికి ఆహారం ఎలా? అందుకే చిమ్మిలి.. పాలు..  మళ్లీ ఇదేమిటి.. తినవని ఇందాకనే చెప్పారు కదా అని గాభరా పడద్దు. ఈ చిమ్మిలి వాసన అద్భుతంగా వుంటుంది. భూమి పొరల్లోకి చేరిన దీని వాసన, అలా అలా వ్యాపిస్తుంది. దీంతో ఆ చిమ్మిలి వాసనకు ఎలుకలు గబగబా అక్కడకు వస్తాయి. అక్కడే బద్దకంగా సేదతీరే పాములు, తమను వెదుక్కుంటూ వచ్చిన ఆహారాన్ని హాయిగా స్వీకరిస్తాయి. అంటే పాములకు తిండి పెట్టడానికి మనిషి వేసే ఎర ‘చిమ్మిలి’.

సరే బాగానే వుంది. మరి దీపావళి మర్నాటి నుంచి ప్రారంభమయ్యే ‘కార్తీకం’ సంగతేమిటి? కార్తీకం వర్షాకాలం ముగిసి, శీతాకాలం ప్రారంభమయ్యే వేళ వస్తుంది. కాలం మారుతుంది. పగలు తగ్గి, రాత్రి పెరగడం ప్రారంభమవుతుంది. దాంతో జీర్ణకోశ వ్యవహారంలో తేడా వస్తుంది. అందుకే నాలుగైదు ఉపవాసాలు ఈ నెలలో చేసేస్తే, సెట్ అయిపోతుంది వ్యవహారం. పైగా చలి ముంచుకొచ్చేవేళ, చన్నీళ్ల స్నానానికి శరీరాన్ని అలవాటు చేస్తే, అది ఆ చలికి అలవాటు పడుతుంది. మరి పుణ్యం పురుషార్థం సంగతి ఏమిటంటే, మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుకోవడం కన్నా కావాల్సింది ఏముంది? అన్నట్లు కార్తీకం అంటే మరో వ్యవహారం వుంది. కార్తీక దీపం. చచ్చి ఏలోకానో వున్న పెద్దలకు దారి చూపే ఆకాశ దీపం అని కొందరంటారు. కానీ అసలు కిటుకు ఇక్కడా వుంది. ముందే అనుకున్నాం కదా.. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు నిండి, చిన్న చిన్న పురుగులు పెరుగుతాయని. సాయంత్రం కావడం భయం ఈ పురుగులన్నీ ఇళ్లలోకి వస్తాయి. అందుకే చాలా మంది నూనె కాగితం ఇంటి ముందు దీపం దగ్గర పెడతుంటారు. దానికి అంటుకుంటాయని. ఈ కార్తీక దీపం కూడా అలాంటిదే. ఎత్తయిన చోట, ఇంటికి ముందు దీపం పెడితే, లోపలికి వచ్చే పురుగులన్నీ అక్కడే చేరి, ఆగిపోతాయి.

మన పెద్దవాళ్లు మహా మేధావులు. అద్భుతమైన ఆలోచనలు చేసి ఆచారాలు, వ్యవహారాలు రూపొందించారు. కానీ ఎటొచ్చీ జనం వీటిని ఆచరించాలంటే, ఏదో ఒక భయం వుండాలని, ప్రతి దానికి దేవుడితో ముడిపెట్టారు. అలా అంటే ఇంకేమి అడగరని పాపం. కానీ రాను రాను దేవుడ్ని వదిలేస్తున్న వేళ, వీటినీ వదిలేస్తున్నారు. అయితే ఆనాడే ఇది సైన్సు.. ఇది ఇలా చేస్తే మంచిది అని చెప్పి వుంటే బాగుండేదేమో? కనీసం మెలమెల్లగా అలవాటై, ఇప్పటికీ నిలిచి వుండేవి కాలానికి. కానీ సైన్సు అంటే నమ్మరని, భూమి గుండ్రంగా వుందంటే రాళ్లు పుచ్చుకు కొట్టినట్లే వుంటుందని, ముందుజాగ్రత్తగా దేవుడికి ముడిపెట్టి వుంటారు.  అదీ సంగతి.

మరిన్ని పండుగులు, మరిన్ని ఆచారాలు వున్నాయి.వాటి సంగతి మరోసారి ముచ్చటిద్దాం.




విఎస్ఎన్ మూర్తి

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు