ఇస్మార్ట్‌ అయిపోతే.. బొమ్మ రివర్స్‌ అయిపోద్ది.! - ..

If the iSmart is out .

జేబులో వంద నోటుకి గతి లేకపోయినా, స్మార్ట్‌ ఫోన్‌ మాత్రం ఉండాల్సిందే. అవును మరి, పచ్చ నోటుతో పని లేదు. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ ఉన్నాయి కాబట్టి, ఇక్కడంతా డిజిటల్‌ మనీతోనే పని. సో, వంద నోటుకు గతి లేకపోయినా.. అన్న మాటే అర్ధం లేనిది. 'నువ్వింకా ఎర్ర బటను, పచ్చ బటను బాపతేనా.?' అని ఎగతాళి చేసే వాళ్లు, ఒక్కోసారి తమ ఓవర్‌ ఇస్మార్ట్‌నెస్‌ కారణంగా బొక్క బోర్లాపడి, ఎవరినైతే ఎగతాళి చేశారో, వాళ్ల వద్దకే వెళ్లి తమ బాధను వెళ్లగక్కుకుంటారు.. తప్పదు, టెక్నాలజీతో పాటు పరిగెత్తాల్సిందే. కానీ, అలా పరిగెత్తే క్రమంలో అగాధాలూ చూసుకోవాలి మరి. డబ్బు పోతే, మళ్లీ సంపాదించుకోవచ్చేమో. అదే ప్రాణం పోతే, కష్టం కదా.. అవును, ఈ స్మార్ట్‌ టెక్నాలజీ ప్రాణాల్ని తోడేస్తోంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కారణంగానో, ఇంకో రకంగానో అనుకునేరు. ఇది పూర్తిగా మన స్యయంకృతాపరాధమే. 
ఇటీవల ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో ఓ వీడియో చూశారు. ఆ వీడియో ఎక్కడి నుండి వచ్చింది.? అంటూ తెగ ఇదైపోయాడు. అంతలా అతను ఆ వీడియో చూసి షాకవడానికి కారణం..

అది తన ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం కావడమే. తన భార్యతో శృంగార కార్యకలాపాల్లో పాల్గొంటోన్న వ్యవహారమంతా సోషల్‌ మీడియాకెక్కేసింది. ఎలా జరిగిందో అర్ధం కాలేదతనికి. ఆరా తీస్తే, తన ఇంట్లోని ఓ స్మార్ట్‌ గ్యాడ్జెట్‌ ఆ దారుణానికి కారణమని తెలిసింది. నమ్మశక్యంగా లేకున్నా, ఇది నిజం. ఈ ఎపిసోడ్‌లో అతన్ని అంతలా మనోవేదనకు గురి చేసింది ఓ స్మార్ట్‌ టీవీ. అందులో ఇన్‌ బిల్ట్‌ కెమెరా ఇంకెవరి చెప్పు చేతల్లోనో పని చేస్తోంది. అదీ అసలు కథ. మన మొబైల్‌ ఫోన్‌లో కూడా కెమెరా మనం చెప్పినట్లే వింటుందనుకుంటే పొరపాటు. కొన్ని యాప్స్‌ ద్వారా మన కెమెరాని వేరెవరో ఎక్కడి నుండో ఆపరేట్‌ చేయగలరు. ఇలాంటి దొంగతనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా కానీ, మార్పు రావడం లేదు. గ్యాడ్జెట్స్‌ పట్ల మనలో చాలా మందికి అవగాహనే లేదు. చదువు రాని వాళ్లు కూడా గ్యాడ్జెట్‌ని వినియోగిస్తారు తప్ప, దాని గురించి పూర్తిగా తెలుసుకునే పరిస్థితి ఉండదు. అదే అసలు సమస్య. ఇంకా దురదృష్టకరమేంటంటే, చదువుకున్న వారూ అడ్డగోలుగా యాప్స్‌ని వాడేస్తూంటారు. భయంకరంగా బుక్కయిపోతుంటారు.

ఒక్కసారి మన ప్రయివేట్‌ మూమెంట్స్‌ బయటికి వెళ్లాయంటే అంతే సంగతులు. ఆత్మహత్యే శరణ్యమంటూ ఎన్నో జీవితాలు అర్ధాంతరంగా కడతేరిపోతున్నాయి. ఒక్కటా, రెండా.. సోషల్‌ మీడియాలోకి ఎంటరైతే, వందలు, వేలు, లక్షలు, కోట్ల వీడియోలు దర్శనమిస్తాయి. స్కూల్‌ వయసు నుంచే, స్మార్ట్‌ అయిపోతున్నారు కాబట్టి, బాధితులు అక్కడి నుంచే మొదలవుతున్నారన్న మాట. ఓ అంచనా ప్రకారం, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఈ దౌర్భాగ్యం మన దేశంలోనే వెర్రితలలు వేస్తూ, వికటాట్టహాసం చేస్తోంది. మనది ఘన జన భారతం కదా! అందుకేనేమో అన్ని దరిద్రాలూ ఇక్కడే ఎక్కువ. స్మార్ట్‌గా ఉండడం మంచిదే. టెక్నాలజీతో పరుగులు పెట్టాల్సిందే. కానీ, ఆ టెక్నాలజీ తెచ్చిపెట్టే, అనర్ధాలపై అవగాహన కలిగి ఉండాలి. ఏం చేస్తున్నాం.? ఏ సమాజంలో ఉన్నాం.? అనే విషయాలపై ఖచ్చితమైన అవగాహన లేకుండా ప్రవర్తిస్తే మన జీవితాల్ని మనమే తెలిసో, తెలియకో రోడ్డున పడేసుకున్న వాళ్లమవుతాం.

మరిన్ని వ్యాసాలు