విత్తన బంతి - ఆర్.సి. కృష్ణస్వామి రాజు

vittanabanti

“వృక్షో  రక్షతి రక్షితః”  అని విశ్వసించే  నంద వంశ  రాజు తన  తాళ్ళపాక రాజ్యంలో  విరివిగా చెట్ల  పెంపకం ప్రారంబించాడు. అయితే జనావాసాల మధ్య  చెట్లు  పెంచడం తో  చిన్న చిన్న అవసరాలకు  ప్రజలు వాటిని  నరికివేయ సాగారు. సమస్యని  ఎలా పరిష్కరించాలోనని రాజు ఆలోచనలలో పడినాడు.  ఒకరోజు రాజు పొరుగు  రాజ్యంలో పెళ్లి కని  గుర్రంపై వెళ్తున్నాడు. రాజు  వెళ్లే దారిలో  పొరుగు  రాజ్యం పొలిమేరల్లో అవానాక్షమ్మ గుట్ట  మీద రైతులు గుంపులు గుంపులుగా నిలబడి  వున్నారు. వారు    గోతాలలో వేరుశెనగ  విత్తనాలు పోసుకొని గుట్ట మీది పెద్ద బండలపైన  నిలబడి వేరుశెనగ  విత్తనాలను చల్లుతున్నారు. వారికి  సహాయకంగా  వున్న మహిళలు శుభ్రంగా వేరుశెనగ  గింజలను విత్తన శుద్ధి  చేసి  మగవారికి   అందిస్తున్నారు

“మీరు  ఎందుకిలా చేస్తున్నారు”  అని రాజు పొరుగు రాజ్యం ప్రజలను  ప్రశ్నించాడు. “మాకు స్వంత  భూములు లేవు. వర్షా  కాల సమయాలలో   మరియు పంటకు  అనువైన కాలంలో   గుట్టలెక్కి వేరుశెనగ  విత్తనాలు  చల్లుతాము. మంచి  వర్షాలు కురిసి  పంట పండితే  సంతోష పడుతాము. పండితే  అదృష్టం, పండకపోతే  దురదృష్టం  అనుకొంటాము. పెట్టుబడి తక్కువ  కాబట్టి  ఫలితం బాగొస్తే పండుగ చేసుకొంటాము.  అందరమూ లాభాలు  పంచుకొంటాము. అంటే  కొండకి చేంతాడు   చుట్టినట్లు ... వస్తే  కొండ వస్తుంది  లేకుంటే చేంతాడు  పోతుంది”  అని చెప్పారు. వారి మాటలు  విన్న రాజుకి  మెరుపులాంటి  ఆలోచన  వచ్చింది. విత్తనంలో  లేనిది విశ్వంలో  లేదు   కదా అన్న  సామెత  గుర్తు తెచ్చుకొని     విత్తన బంతి  ప్రణాళికను రచించాడు.

తమ   రాజ్యానికి  వెళ్లి  మంత్రివర్గంతో   విత్తన బంతి  గురించి  చర్చించాడు. పెద్ద  రైతులు  వ్యవసాయ రంగ  నిపుణులతో సాధ్యాసాధ్యాలు  పరిశీలించాడు .అందరూ పూర్తిగా ఏకీభవించకపోయినా  పచ్చటి  చెట్లు వుంటేనే ప్రజలు   పచ్చగా వుంటారని  రాజు   భావించాడు.
“రాదన్న  పని రాజు పని,  వస్తుందన్న పని తొత్తుల  పని  కదా” అనుకొని సైనికులు  బదులు  చెప్పక   రాజు  చెప్పినట్లు చేయడం ప్రారంభించారు.

“మట్టి, పేడ, గోమూత్రం,  ఉలవపిండి  మొదలగునవి కలిపి అందులో  పది  రకాల   మొక్కల విత్తనాలు   ఉంచాలి. వాటిని ఉండలుగా  చేసి ఆరబెడుతారు. వర్షం  పడే  సూచనలు  వున్నప్పుడు  సైనికులు  అటవీ ప్రాంతాలకు, కొండ  గుట్టల  పైకి  వెళ్లి ప్రతి  పది అడుగులకు  ఒక బంతి  లెక్కన పెట్టాలి.  వర్షం వచ్చినప్పుడు  విత్తన  బంతులకున్న మట్టి  కరిగిపోయి మొక్కలు మొలకెత్తుతాయి.

విత్తన  బంతులలోని కొన్ని  పప్పు  ధాన్యాలు  మొలకెత్తి ఎండలకు  చనిపోతాయి. చనిపోయిన  ఆ మొక్కలు పెద్ద చెట్లకు  సేంద్రీయ ఎరువుగా  ఉపయోగపడ తాయి”  అని రాజు  ప్రణాళిక రచించాడు

రెండు  మూడేళ్లకు విత్తన బంతి పథకం  ఫలించి  తాళ్ళపాక  రాజ్యమంతా వేలాది మొక్కల పచ్చదనంతో  కళకళ లాడింది. మర్రి విత్తనం చిన్నదైనా  భూమిలో పాతిన  తర్వాత  అది శాఖోపశాఖలై విస్తరిస్తుంది.ఎన్నో  పక్షులకు  ఆశ్రయాన్ని ఇస్తుంది. అలాగే  రాజుగారి  చిన్న ఆలోచన అద్భుతాలు  సృష్టిస్తోంది కదా  అని పొరుగు  రాజులు పొగిడారు.

పచ్చటి చెట్లను చూసిన ప్రజలు రాజుకు జేజేలు పలికారు. చెట్లను  మనం కాపాడితే  చెట్లు  మనల్ని కాపాడతాయని  ప్రజలు అర్థం చేసుకున్నారు. మొక్కలు పెరిగి వర్షాలు సకాలంలో  పడటంతో పర్యావరణ  పరిరక్షణ జరిగింది. వృక్ష జాతులతో పాటు పక్షి జాతులు కూడా పెరిగాయి. జలవనరుల  విషయంలో దూరదృష్టి కలిగిన రాజు  వర్షపు నీరు వృధా గా సముద్రాలలో కలవకుండా  అక్కడక్కడ చిన్న చిన్న ఆనకట్టలు  కట్టించాడు.దీనితో చెరువుల   కింది  నేల  ఆయకట్టు   పెరగడంతో రైతులు లబ్ధి   పొందారు.  తాళ్ల పాక  రాజ్యం సశ్య శ్యామలమయ్యింది. ప్రజలు  సుఖసంతోషాలతో జీవనం  సాగించసాగారు.

మరిన్ని వ్యాసాలు