టిక్కూ టాకూ ఆడి పాడి అలుసైపోమాకూ.! - ..

Tiktok

దశాబ్ధాల, శతాబ్ధాల చరిత్ర ఒక వైపు. గడిచిన పదేళ్లలో పుట్టుకొచ్చిన సాంకేతిక విప్లవం ఇంకో వైపు. స్మార్ట్‌ టెక్నాలజీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రపంచమంతా అరచేతిలో నిక్షిప్తమయ్యేలా చేసింది ఈ స్మార్ట్‌ టెక్నాలజీ. ఏదైనా చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు. ఎంతైనా చేయొచ్చు.. పరిమితుల్లేని ఈ సాంకేతిక విప్లవం మనిషిని స్మార్ట్‌గా మార్చేసింది కూడా. స్కూల్‌ పిల్లోడి దగ్గర  నుండి మొదలవుతోన్న ఈ టిక్‌ టాక్‌ పైత్యం, అరవయ్యేళ్ల ముసలోడి వరకూ వయసుతో సంబంధం లేకుండా కొనసాగుతోంది. ఇదో పైత్యం అనడం కన్నా, ఓ రోగంలా మారిపోయింది. నిన్న మొన్నటి వరకూ సెల్ఫీరోగం, ఇప్పుడీ టిక్‌ టాక్‌ రోగం. మొదట్లో సరదాగా మొదలైన ఈ పైత్యం నియంత్రణ లేని మహమ్మారిలా పాకేసింది. ఇదేమంత ఖర్చుతో కూడుకున్న పని కాదాయె. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. అందులో టిక్‌టాక్‌ యాప్‌ ఉంటే చాలు. అంతే. సినిమాలో వచ్చే పాటకీ, డైలాగులకీ, లైవ్‌ వీడియోలు జత చేసి ఈ టిక్‌టాక్‌ ద్వారా వదులుతున్నారు. చూసి సరదా పడేవారు కొందరైతే, దాన్నో వ్యసనంలా మార్చుకున్న వారు ఇంకొందరు. అలాంటి వీడియోల్ని తామూ ఇన్నోవేటివ్‌గా రూపొందించాలన్న తపనతో ఇంకొందరు ప్రాణాల్నే పణంగా పెట్టేస్తున్నారు.

సమాజానికి ఉపయోగపడే ఓ అద్భుతం కోసం ప్రాణం పణంగా పెడితే, అది మంచిదే. కానీ, ఈ టైం పాస్‌ కాదు కాదు, టైమ్‌నీ, ప్రాణాల్ని హరిస్తూ, సమాజానికి చెడు చేసే టిక్‌టాక్‌ కోసం వినియోగించడం పైనే సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ మహమ్మారిపై గతంలో కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయి. కానీ తర్వాత ఆ నిషేధం ఎత్తివేయబడింది. టిక్‌ టాక్‌ తిరిగి అందుబాటులోకి వచ్చేసింది. ఈ మధ్య ఈ పైత్యం మరింత ఎక్కువైపోయింది. పారే నదుల్లో దిగి టిక్‌ టాక్‌ వీడియోలు చేయడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఫీసుల్లో టిక్‌ టాక్‌ వీడియోలతో టైం పాస్‌ చేయడంతో చేస్తున్న వృత్తిని కోల్పోతున్నారు. విద్యార్ధులు, తమ తోటి విద్యార్ధినులతో చేస్తున్న సరదా సరదా అకృత్యాలను చిత్రీకరిస్తూ పేరెంట్స్‌కి తలనొప్పి తీసుకొస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి.. వందలు, వేలు, లక్షలు, కోట్ల వీడియోలు ఈ టిక్‌ టాక్‌ రూపంలో అందుబాటులోకి వచ్చేశాయిప్పుడు.

ఇలాంటి అప్లికేషన్స్‌ నుండి వ్యక్తిగత సమాచారం ఈజీగా దోపిడీకి గురవుతోంది. కేంద్రప్రభుత్వం ఇలాంటి యాప్స్‌ని నియంత్రించే దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా.? పెరుగుట విరుగుట కొరకే. కత్తిని కూరగాయలు తరగడానికీ, సాటి మనిషిని తెగ నరకడానికి వాడొచ్చు. వాడే వ్యక్తి విజ్ఞతను బట్టి కత్తి ఎలాగైతే పని చేస్తుందో, టెక్నాలజీ కూడా అంతే. తమలోని ప్రతిభని ప్రపంచానికి చాటి చెప్పేద్దామని తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచం ముందుంచేస్తున్నారు. నిండా మునిగిపోయినాక, లబో దిబోమన్నా ప్రయోజనం లేదు. కొన్ని బలవన్మరణాలు, ఇంకొన్ని దారుణమైన చావులు. మనిషి మనుగడ కోసం చాలా చాలా కనిపెట్టాడు. ఇప్పుడు మనుగడ కోల్పోవడానికి ప్రయత్నిస్తున్నాడా.? అందుకు స్మార్ట్‌ టెక్నాలజీ ఓ కారణమవుతోందా.? అంతే అనాలేమో.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు