కను విప్పు - కందర్ప మూర్తి

kanuvippu

ఊరి బయట అదో పెద్ద మర్రి చెట్టు. విశాలంగా కొమ్మలు విస్తరించి  పచ్చని ఆకులు , కిందకు దిగిన పెద్ద ఊడలతో దట్టంగా కనబడుతుంది. సాయంకాలమైందంటే రకరకాల పక్షులు , చిన్న జంతువులు మర్రిచెట్టు మీదకు  చేరుకుని విశ్రమిస్తాయి.  ఒక పెద్ద కొమ్మ మీద కాకుల  గుంపు , మరొకవైపు గోరింకలు ఇంకొక కొమ్మ మీద తెల్లని కొంగలు అలాగే పచ్చని రామ చిలుకల సమూహం, గెద్దల గుంపులు, అప్పుడప్పుడు రంగురంగుల పింఛాలతో నెమళ్లు వచ్చి సేద తీరుతూంటాయి. మర్రిచెట్టుకు దగ్గరలో నీటి వనరులు , ఆహార సౌలబ్యం ఉండటం వల్ల  వివిధ జాతుల పక్షులు వచ్చి నివాసాలు ఏర్పరచుకున్నాయి. ఒక వృద్ధ వానరం చాలా కాలంగా ఆ చెట్టు కొమ్మ మీద కాలం గడుపుతోంది. కోతి ఉండే స్థావరానికి సమీపంలో పెద్ద కొమ్మ మీద కాకి మూక ఉంటోంది . తెల్లవారి ఉదయం తిండికెళ్లేటప్పుడు సాయంకాలం గూటికి చేరినప్పుడు అవన్నీ ఒకచోట చేరి బోలెడు కబుర్లు చెప్పుకుంటూ ఆట.

పాటలతో రోజులు గడుపుతున్నాయి.  ఆ కాకుల గుంపులో ఒక నల్ల కాకి ఒంటరిగా  కొమ్మ చివర్న ఉంటోంది. దానితో ఎవరు ఆడరు పలకరించరు. తన శరీర రంగును తలుచుకుని సిగ్గుతో దిగులుగా ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న ముసలి కోతి ఒంటరిగా దిగులుగా కూర్చున్న నల్ల కాకి దగ్గరకు వచ్చి " ఏమైంది మిత్రమా ! ఎప్పుడూ విచారంగా కనబడుతున్నావు , ఎవరితోను కలియకుండా ఏకాకిగా ఉంటున్నావు. ఆరోగ్యం బాగా లేదా ఏంటి ? " అని అనునయంగా అడిగింది.

ఆప్యాయంగా దగ్గరికొచ్చి మాట్లాడుతున్న వానరాన్ని చూసిన నల్ల కాకికి ఆనందమైంది. " ఏం చెప్పేది నేస్తమా, భగవంతుడు నాకు అన్యాయం చేసాడు.  ప్రకృతిలో అన్ని పక్షుల్ని అందంగా సృష్టించి రంగురంగుల ఈకలతో పాటు శ్రావ్యమైన కంఠాన్ని ప్రసాదించాడు. ఈ చెట్టు మీద ఎన్ని రకాల పక్షులున్నాయో చూడు, కొంగలు తెల్లగా సుందరంగా ,రామచిలుకలు పచ్చగా ఎర్రని మూతి, ఇంకా గోరింకలు , పిచుకలు ఎన్నో రంగులతో ఉంటే నెమళ్లు పెద్ద పింఛాలు పంచరంగులతో అందంగా కనబడతున్నాయి. నన్ను చూడు , నా దురదృష్టం కొద్దీ నల్లని కురూపి రూపం , బండ గొంతుక వచ్చింది." తన మనోవేదన చెప్పుకుంది మాలకాకి. నల్లకాకి మనోవేదన విన్న ముసలి కోతి ఓదారుస్తూ " ఇదా, నీ ఒంటరితనానికి కారణం. ఇది ప్రకృతి ధర్మం మిత్రమా ! సృష్టిలో ప్రతి ప్రాణికీ దాని శరీర రంగు ఆహార సంపాదనకు , శత్రువుల నుంచి ప్రాణ రక్షణకు కవచంలా పనిచేస్తుంది. పర్యావరణ పరిస్థితుల కనుగుణంగా వాటి జీవన మనుగడ సాగుతుంది. సృష్టిలో ప్రతి ప్రాణి ఒకదాని మీద మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రకృతిలో అన్ని ప్రాణులు ఒకేలా ఉంటే వాటి మనుగడ సాగదు. కొన్ని జలచరాలు నీటిలో జీవిస్తే మరికొన్ని భూమ్మీద నివశిస్తాయి. గబ్బిలం వంటి కొన్ని తలకిందులుగా ఉండి రాత్రిళ్లు ఆహారం కోసం సంచరిస్తే మరికొన్ని పగటి వెలుగులో  ఆహారాని కెల్తాయి. ఒక్కొక్కసారి వాటి శరీర రంగులే వాటికి ప్రాణహాని కల్గిస్తాయి. అందమైన నెమలి రంగుల ఈకల కోసం ,చర్మం కోసం జింకలు పులులు జిరాఫీలు వేటగాళ్ల బారిన పడతాయి. రాత్రిలో చీకటి లేకపోతే పగటి వెలుగు విలువ తెలియదు. వసంత కోకిల నీలాగే నల్లగా ఉన్నా చక్కనైన కంఠం ఉంది కానీ ఆ తీయని గొంతు ఎప్పుడూ వినిపించదు.వసంత కాలానికే పరిమితం.

అందువల్ల నీ శరీర రంగు గొంతుక తలుచుకుని ఆత్మన్యూనతతో కుంగిపోకు. ఆత్మస్తైర్యంతో ముందుకు సాగితేనే జీవితం ఆనందంగా సాగుతుంది " హితబోధ చేసింది వానరం. " అర్థమైంది నేస్తమా, ఇన్నాళ్లూ ఆత్మ న్యూనతతో ఎదుటివారితో పోల్చుకుని కాలం వెళ్లబుచ్చాను. ఇటుపైన సహచర మిత్రులతో సంతోషంగా గడుపుతాను. నాకు కనువిప్పు కలిగించావు. ధన్యవాదాలు" అంది  నల్లకాకి.                   


           

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు